పాత సామాన్ల గదిలో
భోషాణం పెట్టె మీద
మనసయ్యిందెందుకో
ఊతంగా గోడ పట్టుకుంటూ
డాబా మెట్లు ఎక్కలేకున్నా
మదిని తడిమిన జ్ఞాపకాలు నిలువనీయలేదు
వయసుడిగిన శరీరానికి
వచ్చి చేరిన వార్ధక్యపు వాసనలానే
మంజూషానికీి అవే పాతకాలపు సువాసనలు
చీదరింపులు చీత్కారాల నడుమ
చమత్కారాల నవ్వుల కోసం మెుదలైన
ఈ వెదుకులాట మనోలోకపు రహదారిగా మారింది
రెండు పసితనాల మధ్యన
మిగిలిన అనుబంధాల ఆనవాళ్ళలో
జీవిత పుటలన్నీ మళ్ళీ చదవాలనే ఈ పయనం
*******
అమ్మ బొజ్జలో హాయిగా ఉందని
ఓ నెల ఎక్కువే ఉన్నా విసుక్కోకుండా
పదిలంగా పాపాయిని హత్తుకుంది
పట్టుకోవడానికి సన్నగా ఉండి చేతికి అమరకున్నా
అపురూపంగా చూసుకుంటూ
కాకిపిల్ల కాకికి ముద్దంటూ ముద్దు చేసింది
అమ్మ చేతి మహిమనుకుంటా
గొంగళిపురుగును సీతాకోకచిలుకలా మలచడంలో
విధాతకే సవాలు విసిరింది
ఆకలిని తెలియనీయలేదు
అల్లరినీ భరించింది ఆనందాన్ని పంచింది
ఆటలన్నీ ఆడిస్తూ జోలపాటలు పాడి నిదురపుచ్చింది
కలలో కలత భయపెడితే
దగ్గరకు తీసుకుని ధైర్యానిచ్చి
ఆదమరిపించే అమ్మ చేయి నాదయ్యింది
అక్షరాలు దిద్దిస్తూ పుస్తకాలు తాను చదువుతూ
కథలన్నీ వినిపిస్తూనే కమ్మని తాయిలాలందించి
బడికి సాగనంపి బంగరుబాట పరిచింది
బిడ్డ మీద ఈగ వాలనీయదు తల్లి
బతుకు పయనంలో బాసటగా నిలుస్తూ
నా జీవితమే తానైంది అమ్మ
ఎంత చెప్పినా
ఇంకా ఏదో మిగిలిపోయినట్లున్న
మహా కావ్యమే అమ్మంటే
******
తల్లే బిడ్డగా తన దరికి చేరిందని
ఆడపిల్లయినా ఒక్కటే చాలంటూ
అంతులేని సంతోషంతో అక్కున చేర్చుకున్న నాన్న
పాపాయి పాదాలకు మన్నంటుతుందని
తన చేతులతో తుడిచి నిలబెట్టే నాన్న
ఎందరికుంటారీ ప్రపంచంలో
ఏదీ అడగకుండానే అన్నీ ఇచ్చే నాన్న
స్నేహమంటే తెలిపిన తొలి స్నేహితుడు
అరమరికలు లేకుండా అన్నీ పంచుకున్న ఆత్మీయ నేస్తం
ఆంక్షలు తన బిడ్డకు ఉండకూడదని
ఆటపాటల్లో అన్నింట్లో అందరితో సమానమేనంటూ
స్వేచ్ఛగా పెంచిన పెంపకం ఎందరికి సొంతం
మూడేళ్ళకే విమానాశ్రయంలో విమానం వద్దకు తీసుకెళ్ళినా
పుట్టినరోజుకని కంచిపట్టులంగా తెచ్చి నిదురలేపి చూపించినా
ఆ రోజుల్లోనే కేక్ కట్ చేయించి సంబరాలు చేసిందీ నాన్నే
పుట్టినరోజు ఊరందరి పండగలా చేసి
ఇప్పటికి పదుగురు గుర్తుంచుకునేలా
ఆ జ్ఞాపకాల సందడిని అందించిన నాన్న మీకున్నారా
ఊరిలో మెుదటి టివి తెచ్చినా
డిష్ పెట్టించినా, ఇన్వర్టర్ బిగించినా
నాటకాల నుండి క్రికెట్ వరకు అన్నీ బోలెడు జ్ఞాపకాలే
నా ఇష్టమే తనదైనా
తన ఇష్టమే నాదైనా
విధిరాతలో ఇద్దరం పావులమయ్యాము
సున్నితంగా చేతుల్లోకి తీసుకుని
సుకుమారంగా చూసుకునే
మమకారపు ప్రేమలాలసుడు నాన్నంటే
*******
అమ్మమ్మ తాతయ్యల ఆత్మీయతల మధ్యన
మేనమామతో కలిసి పెరిగి
బంధవుల ప్రేమాభిమానాలు చవిచూసిన బంగరు బాల్యమిది
వచ్చీరాని నడకలతో చెరువులో మునిగిపోవడం
వానచినుకుల్లో తప్పటడుగులతో పడిపోవడం
అమ్మానాన్న, టీచరాటలు ఆడని బాల్యమరుదే మరి
చుట్టపక్కాల పలకరింపుల సందడితో
చందమామ కథల సాహచర్యంతో
బొమ్మరిళ్ళ బొమ్మలాటల కల్మషమెరుగని పసితనమిది
అమ్మకొంగు చాటున చేరి దొంగలా తొంగిచూస్తూ
టీకాలు తప్పించుకోవాలన్న తాపత్రయం
ఆటల్లో తగిలిన దెబ్బలకు అమ్మ బుజ్జగింపుల పసిడి పసి వయసిది
చదువుల స్నేహాలతో చిలిపి తగవులతో
నెమలీకల దాపరింతల కాకెంగిలి తాయిలాల పంపకాల
ఆటపాటల ఇష్టాయిష్టాల అరుదైనదీ చిన్నతనం
మార్కుల పోటిలో ముందుండాలంటూనే
ఆటలు పాటలు అస్సలు వదలకూడదంటూ
అందమైన బొమ్మలు గీసే అల్లరి ఆకతాయితనం
ఏదైనా రాదంటే వచ్చే వరకు వదలని మెుండితనం
మాటలు నేర్చి చదవడం మెుదలు పెట్టినప్పటి నుండి
దొరికిన పుస్తకమల్లా చదివేసే పుస్తకాల పిచ్చిది
పాటలు శ్లోకాలు భగవద్గీత హనుమాన్ చాలీసా
పెద్దబాలశిక్ష సుమతి వేమన దాశరథి కృష్ణ శతకాలు
పంచతంత్రము వంటి మరెన్నో నీతి కథలు వల్లె వేయించిన మాస్టారు
సముద్ర స్నానాలు, గుళ్ళు గోపురాలు పూజలంటూ ప్రదక్షిణాలు
నవరాత్రుల నాటక నాట్యాల సందళ్ళు
తిరునాళ్ళలో కొన్న బొమ్మలు చూసిన ప్రభలు డాన్సులు
విత్తనాలు నానబెట్టేటప్పుడు ఎదురు రావడం
పొలంలో మెుదటి నాటు వేయడం
వడ్ల కంకులు(పరిగె) ఏరి అమ్మి ఆ డబ్బులు దాయడం
కార్తీక మాసపు వన భోజనాల హడావిడి
కాలవల్లో చెరువు దొరువుల్లో కొట్టిన వచ్చీరాని ఈతల జలకాలు
తోటల్లో తెంపుకున్న జామ మామిడికాయలు వాక్కాయలు మరెన్నో చిరుతిండ్లు
పుస్తకాల్లో దాచుకుని తిన్న తాటిచాప, జీడిలు
గడ్డిలో పండేసుకున్న ఈతకాయలు, నేరేడు, రేగు పండ్లు
నేలలో తవ్వుకున్న తేగలు, తిన్న పుల్ల ఐస్ లు
మల్లెపూల జడల సంబరాల్లో వయ్యారాలు
లేత చేతుల్లో గోరింటాకు ఎర్రదనాలు
పెద్ద చెట్టుకు వేసిన ఊయల్లో కేరింతలు
మల్లెపూలపై ఇష్టంతో
పొలంలో ఉన్నాయంటే నమ్మేసి వెళ్ళి
నాన్నతో మెుదటి దెబ్బ తిన్న అమాయకత్వపు కోపం
పుట్టినరోజని పళ్ళు తీసుకు వెళడానికి
రమ్మని పిలవమంటే
భోజనానికి రమ్మని చెప్పడం
ఓణి ఎవరిని పిలవకుండా కట్టబెట్టేద్దామనుకుంటే
చుట్టాలందరికి నా దగ్గరున్న చిల్లరతో
పోస్ట్ కార్డ్లు కొని ఉత్తరాలు రాసి ఆరోజు అమ్మకు చెప్పడం
వేసవి సెలవల్లో ఆరుబయట వెన్నెల్లో
పిల్లలందరమూ చెప్పుకున్న కతల కబుర్లు
ఉపవాసంతో శివరాత్రి జాగరణాల అంత్యాక్షరీలు
ఇంట్లో పెంచుకున్న బుజ్జాయిలు, చిలుక రాక్షసి
అమ్మ నాకు ఇచ్చిన పాలను పంచుకున్న
కుక్క, పిల్లి పిల్లల అరుదైన సహవాస సహజీవనం
కాయల కోసం చెట్లెక్కి చేసిన విన్యాసాలు
చిలిపి చేష్టలతో మాస్టారితో తిన్న తిట్లు
ఆడపిల్లని తక్కువ చేస్తే కోపంతో తగవులాటలు
ముగ్గుల ముచ్చట్లలో గొబ్బెమ్మల అలంకారాలు
అబ్బాయిలతో గోళీలు, కర్రాబిళ్ళా వగైరా ఆటలు
రేడియెాలో నేర్చుకున్న లలిత, బృంద గేయాలు
ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉప్పెన ఉగ్రరూపమింకా గుర్తే
బిడ్డను గుండెల్లో పొదుపుకున్న ఓ తల్లి రూపంతో సహా
ఇప్పటికి తడియారని జ్ఞాపకమది
పాటల డాన్సుల హడావిడితో
వీధి వీధంతా చేసిన సందడి
పిల్లలు కాదు పిడుగులన్న పెద్దల మెచ్చుకోళ్ళు
సైకిల్ తొక్కుతూ తిన్న దెబ్బలు
ఓ రోజు చైన్ వేయడం రాక సీనియర్ని అడిగితే
ముందు చైన్ వేయడం నేర్చుకుని సైకిల్ తొక్కమని చెప్పడం
తేడా తెలియని పసితనపు ప్రేమ
ఇష్టమైన నేస్తాలతో అరమరికలు లేని నెయ్యం
అలుకలను కూడ అరక్షణంలోనే మరిచిపోయే అమాయకత్వం
ఇలాంటి అందమైన బాల్యం కొందరిదే
ఆ కొందరిలో నేనున్నానన్న సంతోషం
ఇప్పటికి నా బాల్య స్నేహితులు నాతో ఉన్నారన్న గర్వమిది
మరెన్నో మరపురాని మధురానుభూతుల
మలయ సమీరాల దొంతర్ల
మానస విహారమీ బాల్య జ్ఞాపకాలు
బతుకు భయం తెలియని
ఆంక్షల ఆధిపత్యపు పోరులేని
అమ్మ చీర చాటున దాచుకున్న సొంపైన జ్ఞాపకమే బాల్యమంటే
************
బాల్యాన్ని వదలలేని చిన్నతనం
అప్పుడప్పుడే మెుదలౌతున్న పెద్దరికంతో
రాజీ పడటంలో తెలియని సందిగ్ధం
అమ్మ ఆసరాతో ఇబ్బందులు లేకుండా గడిపేస్తూ
పెద్దగా మార్పులు చేర్పులు లేకున్నా
చిన్న చిన్న ఆంక్షలు కూడా నచ్చని ఏదో తెలియని చిరాకు
చిన్ననాటి నేస్తాలను వదలలేక
ఉత్తరాల పలకరింపులతో మెుదలైన రాతలు
దగ్గర చేసిన అనుబంధాల కలం స్నేహాలు నాకు ఎరుకే
వయసు పెరుగుతున్నా విడువలేని బొమ్మలాటలు
పండుగల్లో సెలవల్లో పేకాట సందడులు
పొలాల్లో వాగుల్లో ఆటల హడావిడి
వర్షంలో తడిచిపోతున్న కాకులను
లోనికి పిలవమని అమ్మతో మారామూ
కుక్క నోట్లో నుండి చిలుకను కాపాడిన ధైర్యము
గూండా సినిమా షూటింగని
జనాల్ని పోగేసి స్కూల్ ఎగొట్టి మరీ వెళ్ళి
మరురోజు అసెంబ్లీలో నేను మాత్రమే తిన్న తిట్లు
మామిడి కొబ్బరి తోటలలో ఆటల అల్లరి
సముద్రంలో ఇష్టం వచ్చినట్టు మునకలు
కొండ పైన ఏముందోనన్న ఉబలాటంతో కష్టపడి నిట్టనిలువుగా కొండెక్కిన విజయగర్వం
మా ఆకతాయితనాన్ని భరించి
అల్లరిని సహించి ఇష్టంగా అక్కున చేర్చుకుని
చదువుతోపాటు లోకజ్ఞానం నేర్పిన గురువులు
మెుదటిసారి చీర కట్టుకోవడంలో సతమతమౌతున్న అక్కకు చేసిన సాయం
వచ్చిన బోలెడు సందేహాలు
ఇద్దరం కలిసి మెుత్తానికి చీరకట్టు పూర్తిచేస్తూ నవ్వుకోవడం
పంచవటిలో అందరి మధ్యనా గారాబం
రెండోఆట సినిమాల్లో చేసిన అల్లరిగోల
పక్కింటి చా సో గారితో తిన్న తిట్లు
నిద్ర పోనీయకుండా తెల్లవారు ఝామునే మెుదలయ్యే చదువుల అగచాట్లు
ట్యూషన్లు కాలేజీలంటూ ఉరుకుల పరుగులు
నూట పద్దెనిమిది మందిని పేర్లు రోల్ నెంబర్లతో సహా
గుర్తుంచుకున్న జ్ఞాపకశక్తి అప్పుడు
క్రికెట్ స్కోర్ అడిగితే స్టాఫ్ రూమ్లో చూసి చెప్పిన రోజులు
అమ్మాయిల కాలేజ్లో మాదే రాజ్యమన్నట్టు
మహా సంతోషంతో చేసిన కాన్వాసింగ్
ఎలక్షన్ల పోటిలు ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల మధ్యన
అక్క పెళ్ళిలో మెుదటిసారి సినిమా పాటల సందడి చూడటం
కొందరి డబ్బు అహాన్ని గమనించి కూడా తల వంచకపోవడం
నా కోపాన్ని మరిపించిన అక్క దగ్గరతనం మర్చిపోలేని జ్ఞాపకాలే ఇప్పటికి
కట్టిన సన్నజాజి మాలలు
చెట్లెక్కి కోసిన జామకాయలు
తిన్న బత్తాయిలు ఇలా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు
రోజూ జడ వేసే అమ్మమ్మ గారి మీద అక్క మీద అలక
జనవరి ఫస్ట్ కి వాకిట్లో పెద్ద ముగ్గు వేయలేదని
నాకోసం అర్ధరాత్రి అందమైన ముగ్గేసి అలక తీర్చిన అక్క
అక్క పెళ్ళికి అడిగి మరీ కుట్టించుకున్న
వెంకటగిరి పొడవులంగా
పిల్లల దగ్గర నేర్చుకున్న చదరంగం గుఱ్ఱంతో ఆట నేర్పిన అంకుల్
బంధువులు కాకున్నా ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న
ఆ పంచవటి మిగిల్చిన మరిచిపోలేని
చేదు గురుతు ఆత్మీయులైన వారి మరణం
తొలి ఓటమి నేర్పిన పాఠం
చెడు జరిగినా మన మంచికే అని చెప్పి
ఓదార్చిన మా హింది టీచర్
చేతిలో రూపాయి లేనప్పుడు
బయటబడ్డ బంధుజనాల బుద్దులు
అప్పుడే పరిచయమైన మనుషుల మరో రూపాలు
నాన్నకు స్నేహంలో మెాసం నేర్పిన పాఠం
కోల్పోయిన ఆస్తులు, ఆప్తులనుకున్న వారి
అసలు నైజాలు చూపిన పరిస్థితులు
రాజకీయపు రాక్షసక్రీడలో పావులుగా మారిన
ఉన్మాదుల కులపిచ్చి దుర్మార్గానికి బలైన జీవితాలను
జరిగిన దహనకాండను చూసిన ప్రత్యక్ష సాక్షిని
బాల్య స్నేహితుల పలకరింపుల పరామర్శలు
గుర్తింపుల జ్ఞాపకాల చిలిపి చేష్టలతో
మళ్ళీ చిగురించిన చిన్ననాటి స్నేహాలు
మొదటిసారి వండిన అరటికాయ ఇగురు
ఇంటి చుట్టుపక్కల ఆత్మీయుల పరాచికాలు
వీధి అరుగుల మీద పంచుకున్న అనుబంధపు ఆనవాళ్ళు
ఆరునెలల చిన్నదానితో అల్లుకున్న బంధం
నన్ను అనుకరించిన అల్లరి చేష్టలు
దూరంగా వెళితే కలిగిన బాధ
చదువు కోసం మరో రాష్ట్ర ప్రయాణంతో
జీవితంలో మరో అధ్యాయం మెుదలై
కొత్త భాష పరిచయమైన క్షణాలు
చీకు చింతలు లేని చిన్నతనం
పలు సందేహలతో పరుగులు పెట్టే మనసు
మనిషి వ్యక్తిత్వానికి పునాదివేసేదే చిరుప్రాయం
***************
మెుదటిరోజు నాన్న వెంట ఇంజనీరింగ్ కాలేజి లో అడుగు పెట్టడం
మెుదటి మీటింగ్ క్లాస్ లో పక్కమ్మాయిని తెలుగులో పలకరిస్తే...
తను వింతగా చూసిన చూపు ఇప్పటికి జ్ఞాపకమే
పాపం తనకదే మెుదటిసారి తెలుగు వినడమట
ఆ మాట తర్వాత నాకు ఆత్మీయ నేస్తమయ్యాక
నేను ఆరోజు నువ్వు నన్నలా చూసావంటూ
మేము పంచుకున్న కబుర్లలో బయట పడింది
రెండోరోజు నాన్న నాతో వచ్చి ఇద్దరిని పలకరించి
వాళ్ళతో నన్ను వదిలి వెళ్ళడం
నా సెక్షన్ వాళ్ళ సెక్షన్ వేరు కావడము
నాతో ఉన్న నలుగురిలో ఒక్కమ్మాయికే కాస్త తెలుగు రావడము
మిగతావారు నాతో దూరంగా ఉండటం
నేను మరో భాష నేర్చుకోవడానికి కుదిరింది
అయెామయంగా మెుదటి డ్రాయింగ్ క్లాస్
ఇంట్లో పుస్తకాలు ముందేసుకుని కుస్తీపట్లు
కాాలేజ్ లో చిన్న చిన్న సరదా రాగింగ్ ముచ్చట్లు
అనుకోకుండా హాస్టల్ జీవితం..
మెుదటిసారి ఇంట్లోవాళ్ళను వదలి ఉండటంతో
హాస్టల్లో కొత్త జీవితం ప్రారంభం
ఇంగ్లీష్, కన్నడ భాషలతో సిగపట్లు
హాస్టల్ నుండి కాలేజ్ కి వెళ్ళి వస్తూ
బస్సులో చేసే అల్లరి, పాడిన అంత్యాక్షరీలు
కాలేజ్ క్యాంటిన్ లో మిరపకాయ్ బజ్జీల రుచి
సైకిల్ స్టాండ్ లో జనాల చిలిపి సరదా కామెంట్లు
హాస్టల్ బస్ మిస్సయితే ఓపిడి వరకు
నడిచి దుర్గమ్మ గుడి దగ్గర దిగడాలు
అమృతలో తిన్న ఐస్క్రీమ్, బేల్పూరి
అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు
మెకానికల్, కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫిజిక్స్ లాబ్ లలో సరదాలు
కెమిస్ట్రీ లాబ్ లో జీనియస్ కి లిక్విడ్
తీయడం రాకపోతే నే తీస్తూ బ్యూరెట్, పిపెట్ లతో ఆటలు
సివిల్ ప్రాక్టికల్స్ లో ఫీల్డ్ లో
జామకాయలు కొనుక్కుని తింటూ
సార్ లతో తిన్న తిట్లు
ఎలక్ట్రికల్ లాబ్ లో ఏదీ అంటుకోకుండా
గబగబా రీడింగ్స్ వేసుకుని సంతకం చేయించుకోవడం
కొద్దిమందే ఉండే మాథ్స్ క్లాస్ లో
వెనుక బెంచ్ లో కూర్చోవడం
మెకానికల్ సర్ సో అని ఎన్నిసార్లు అంటారో లెక్కలేయడం
కెమిస్ట్రీ క్లాస్ లో నిద్ర పోకుండా ఉండటానికి తంటాలు
పుట్టినరోజుల వేడుకల కోలాహలాలు
మెుదటి సంవత్పరపు పరీక్షల ముందు
రికార్డులు, డ్రాయింగ్ షీట్ల సబ్మిషన్లు
మూడు గంటలు ఇంగ్లీష్ లో
పరీక్ష రాయగలనా అన్న సందేహం మనసులో
రాసేసిన ఆనందంలో చూసేసిన సినిమాలు
సంతోషాల సంబరాల మధ్యన
ఇంటికి ప్రయాణం...
పరిసరాల మార్పులతో కొత్త పరిచయాల పలకరింపులతో జ్ఞాపకాల అల్లికల పునాది
***********
రెండవ సంవత్సరం మెుదట్లోనే
నేస్తాల అల్లరికి నవ్విన నవ్వుతో
అపార్థం చేసుకున్న గురువులు
లాబ్లలో సంతకాలు పెట్టకుండా
ఆట పట్టించి ఆడుకున్న వైనాలు
కంప్యూటర్ మీద చేయి వేసిన మెుదటి క్షణాలు
రేకుల షెడ్ క్లాస్ రూమ్లో గాలి లేదని
ఫాన్ల కోసం చేసిన బంద్
జూనియర్స్ ని రాగింగ్ చేయకపోయినా
నేనంటే భయపడిన క్షణాలను
తర్వాత చెప్పి నవ్విన సంఘటనలు
నన్ను ఏడిపించడం మెుదలెట్టిన కొందరు
విసుగుతో తిట్టుకున్న తిట్లు
చిన్నప్పుడు కలిసిన తమ్ముళ్ళు
మళ్ళీ కాలేజ్ లో కనబడటం
అనారోగ్యం పలకరించడం
మరపురాని జ్ఞాపకాల పరిమళాలు...
*********
క్లాసులో పోట్లాటల పలకరింపుల నడుమన
హంపి, తుంగభద్ర డామ్ పిక్నిక్ కి అందరం వెళ్ళడం
సీనియర్స్ కి సెండాఫ్ పార్టీ ఇవ్వడం
మెుదటిసారి నేను రాసిన పేరడి పాట
చిన్న చిన్న అలకల మధ్యన
హాయిగా సాగిన మూడవ సంవత్సరం...
************
అనేకానేక కారణాలతో
ఆగిన నాలుగవ సంవత్సరం
ఇండ్రస్టియల్ టూర్ సరదాలు
అనుకోకుండా ఆత్మీయురాలైన
గోల్డ్ మెడలిస్ట్ సీనియర్ షర్మిల
ఫైనలియర్ జూనియర్స్ తో కలవడం
క్లాస్ లు ఎగ్గొట్టి చూసిన సినిమాలు
కాలేజ్ డే ఫంక్షన్ కి ఆడి ఓడిపోయిన టెన్నీకాయిట్
జూనియర్స్ ఇచ్చిన సెండాఫ్ పార్టీ
రాయించుకున్న ఆటోగ్రాఫ్లు
అబ్బో ఎన్నెన్ని సరదా సంతోషాలో
చదువులమ్మ ఒడిలో సేద దీరిన సంతోష ఘడియలు
అల్లరి ఆనందాలు అందించిన ఆప్యాయతలు
వీడ్కోలు కన్నీళ్ళతో బరువెక్కిన మనసులు
మరో జీవితానికి బాటలు వేసిన వైనం
ఇప్పటికి అరుదైనవే ఆ జ్ఞాపకాలు
గురుశిష్యుల అనుబంధాలకు
నేస్తాల సహచర్యానికి సహకారానికి
గురుతులుగా మిగిలిన గుత్తుల గుత్తుల
గుండె నిండుగా నిండిన సజీవ ఆనవాళ్ళివి...
పసితనం వదలలేని బాల్యం
బాల్యపు వాసనలనొదలని కౌమారం
ఈ మూడింటిని కలిపేసిన అందమైన కాలం ఇది...
********
పై చదువుల కోసం ఆశతో
పోటీ పరీక్షలు రాయడం
ధనావసరాల అడ్డంకులతో అంతరాయం
అనుకోని పరిస్థితుల మానసిక దండయాత్ర
పెళ్లి విషయంలో సందిగ్ధం
నాన్నతో వాదులాట సంవత్సరం పైమాటే
ఇంటి నుండి బయటకు పంపేయడం
బరువు బాధ్యతలు తీసుకున్నానని
పెళ్లి చేసి చేతులు దులుపుకుని
నలుగురి మెప్పు కోసం
మంచితనం ముసుగులో వంచన
మనిషిలో మరో రూపాన్ని చూసిన క్షణాలు
రెండు నాల్కల ధోరణుల పరిచయాలు
జీవితాన్కి మరో కోణాన్ని చూపించిన తీరు
కన్నీళ్ళు, కడగండ్ల మధ్యన అమ్మ ఆసరాతో
అమ్మతనం అందుకున్న క్షణాలు
పసిబిడ్డతో నడి రోడ్డున నిలిచిన క్షణాలు
బాధ్యతలు పంచుకోని అనుబంధాలు
గాలివాటపు జీవితాలుగా మిగలబోయి
తండ్రి స్నేహితుని ఆసరాతో
ఓ గాడిన పడిన వైనం
బతుకు పోరాటంలో
బంధాలను వదులుకోలేక
బాధ్యతలకు బంధీగా సాగిన
వైవిధ్య భరితమైన పోరాటంలో
రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి
చేసిన ఉద్యోగాలు ఎన్నో
తెలుసుకున్న జీవిత సత్యాలు
పడిన అగచాట్లు, నష్టపోయిన ధనము
మెాసంగించిన స్నేహితులు, బంధువులు
ఇలా రకరకాల అనుభవాల నడుమన
మానసిక శారీరక వేదనల రోదనలెన్నో
పాతికేళ్ళు సంతోషాలు ప్రేమలతో మురిసి
మరో పాతికేళ్ళు కన్నీళ్ళతో కలకలిసిన
అనుకోని అక్షర ప్రయాణమే
మీ ముందున్న ఈ సగటు మగువ జీవితం
ఓ మహిళ సంపూర్ణ జీవితంలో
రెప్పల చాటున దాగిన కలతల కల'వరాలు
మనసులోని మౌన వేదనకు
సాక్ష్యాలుగా నిలిచే మనసాక్షరాలివి
ఎన్నో ఆటుపోట్లు మరెన్నో కన్నీళ్ళు
కలబోసుకున్న కాసిన్ని సంతోషాలు కలిసిన
చావుబతుకుల సయ్యాటలో
గుప్పెడు అక్షరాలతో
గంపెడు ప్రేమాభిమానాలను పంచుకుంటూ
గెలుపోటముల గోదారిలో విరిగి పడి
తీరం చేరిన కెరటమే ఈ సజీవ చైతన్యం...!!
పసితనం నుండి పండుతనం వరకు
మనిషితనానికి మనసుతనానికి మధ్యన
ముసుగేసుకున్న మానవత్వాన్ని, మనసులను
వెలికి తీయడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఇది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి