4, జూన్ 2021, శుక్రవారం

రెక్కలు

1.   వెక్కిరింతలకు
వెరవదు
ఓటమికి
క్రుంగిపోదు

అక్షరాల ఆటతో
అనంతానందం..!!

2.   విన్యాసం 
విధాత చేతిరాతది
అక్షరాల ఝల్లు 
అమ్మ నేర్పించినది

మనదేముంది
నిమిత్తమాత్రులం...!!

3.  ఆనవాళ్ళు
వెదుక్కుంటూ వస్తాయట
అనుబంధాలను
వదులుకోలేక

ఎవరిదే పాత్రయినా
గతజన్మ వాసనలే ఇవన్నీ...!!

4.   భావాలని
అనుకోలేము
మనసు మౌనాలని
సరిపెట్టుకోనూలేము

కాలం విసిరిన
పరీక్షలకు సమాధానాలంతే...!!

5.   కాలానికి
ఎవరితోనూ పని లేదు
కలానికి 
విరామమూ తెలియడం లేదు

గెలుపోటముల 
చరిత్ర లిఖించేయాలిగా..!!

6.   ఛాయకు
ప్రత్యామ్నాయాన్నే
వెలుగు
ఉన్నంత వరకు

ప్రయత్నం 
మన నైజం...!!

7.  మనిషి
మనుగడ
గతమెా
గుణపాఠం 

కాలం చెప్పే
నిత్యసత్యం...!!

8.   అర్థం 
చేసుకోవడానికి
కొత్తగా
ఏముందని

మనసు పుస్తకం
మూయనిదేగా...!!

9.   అహం
అడ్డుపడుతుంది
అంతరంగం
అవగతమయినా

అడ్డుతెరల
అభిజాత్యం మరి...!!

10.   అవసరం
బ్రతకడం నేర్పుతుంది
అనుభవం
ఓ పాఠంగా మారుతుంది

అనుబంధాల్లో 
నిజానిజాలు తేటతెల్లమౌతాయి...!!

11.  పుట్టడం
పూర్వజన్మ సుకృతం 
పోవడం
చేసిన కర్మల ఫలితం

నడుమ ఈ నాటకం
విధి విలా(ప)సం...!!

12.  కొన్ని
అక్షరాలంతే
వాతలు
వేస్తాయలా

బిడ్డను 
మందలించే తల్లిలా...!!

13.  కలత పడిన
మది
కలం విదిల్చిన
అక్షరాలు

గతం మిగిల్చిన
ఆనవాళ్ళు...!!

14.   గారం
ఎక్కువైనా
నయగారం 
తక్కువైనా

దెబ్బలకు
వెన్న రాయాలి తప్పదు మరి...!!

15.   గతాలన్నీ
మరువలేనివే
జ్ఞాపకాల
చిత్తరువులుగా

ఘడియకో రూపం మార్చే
ఈ మనుష్యుల మధ్యన...!!

16.  పుటలెక్కువే
పుస్తకంలో
వచ్చి
పోయే వారితో

మూసే సమయమే
చిక్కడం లేదు మరి...!!

17.   సమయ 
పాలన
సర్దుకుపోవడంలో
నేర్పు

నేర్పుతుంది
జీవితం...!!

18.  పరాన్న జీవుల
పాలబడుతున్నాయి
నిషిద్దమని తెలియని
నిత్య ప్రసాదాలు

మమకారం మరిచిన
బతుకులైపోయాయిప్పుడన్నీ..!!

19.   గాయాన్ని
జ్ఞాపకంగా మలచడం
గతాన్ని
మనసాక్షరాలుగా మార్చడం

గమనానికి
గమ్యాన్ని అనుకరించమనడమే...!!

20.   బలమూ
బలహీనతా
రెండూ
నువ్వే

బంధాలు 
కొందరికి ఇంతేననుకుంటా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner