21, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 59

       మెుత్తానికి ఎలాగైతేనేం అమెరికా నుండి ఇండియా రావడం, హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో తెల్లవారు ఝామున దిగడం, లగేజ్ అంతా తెచ్చుకోవడానికి ఓ 20 డాలర్లు లంచం ఇవ్వడం, మరో 20 డాలర్లు బయటకు తీసుకువచ్చినందుకు ఇచ్చేయడం జరిగింది. బయటకు రాగానే అమ్మా, రమణ, సుధ అన్నయ్య,  కనిపించారు. శౌర్యగాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది వాళ్ళని చూసేసరికి. అప్పటికే బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో ఉన్న రంగ వదినను చూడటానికి ఆ టైమ్ లో వెళ్లి, జ్యోతి అన్నయ్యను, వదినను చూసి కాసేపు అక్కడ ఉండి, విజయవాడ బయలుదేరాము. దారిలో ఓ చోట పేరు గుర్తు లేదు,  మంచి కాఫీ తాగి, విజయవాడ చేరాము. మా చిన్నాడపడుచుకి రెండో పెళ్లి కూడా నేను ఇండియా వచ్చిన వెంటనే చేసారు కాని నన్ను పిలవలేదు వారెవరూ. అవన్నీ డబ్బు అవసర అనుబంధాలే కదా..నేనూ పట్టించుకోలేదు వాళ్ళ గురించి. 
           ఇంటికి రాగానే మా చిన్నదాని దర్శనం. నేను వచ్చేసరికి మా నాన్న లేరు. ఎక్కడికో ఊరు వెళ్ళారు. తర్వాత ఎప్పటికో ఓ వారానికి వచ్చినట్టున్నారు. నేను ఇండియా వచ్చే ముందే మా నాయనమ్మ అన్నయ్య భార్య, మా రెండో పెద్దమ్మ అమ్మ అయిన శేషారత్నం మామ్మ కాలం చేసింది. దశదిన కర్మకి మా ఊరు నరసింహపురం వెళ్ళాము. అక్కడ అందరు కనిపించారు. నా పెళ్లి అయిన తర్వాత చాలా సంవత్సరాలుగా పలకరింతలు లేని చుట్టాలు కొందరు పలకరించారప్పుడు. చాలామందిని నేనే పలకరించాను. మా రంగన్నయ్యను, శాంతి వదినను, మా పెద్ద పెదనాన్న పిచ్చయ్య గారిని కూడా నేనే పలకరించాను. భోజనాలయ్యాక రంగన్నయ్య కొడుకు నాని బండి మీద ఇంటి దగ్గర దించాడు. నేను నడిచి వెళతానన్నా వినలేదు. వాడు మాత్రం ఇంట్లోకి రమ్మని పిలిచినా రాలేదప్పుడు. 
     చిన్నప్పటి నుండి రెండవ పెదనాన్న రెండో కొడుకు జ్యోతి అన్నయ్యతో నాకు అనుబంధం కాస్త ఎక్కువే. నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా తనతో దగ్గరగానే ఉండేదాన్ని. నా పెళ్లి తర్వాత మా వాళ్ళందరు రానప్పుడు కూడా అన్నయ్య విషయం తెలిసిన వెంటనే నా దగ్గరకి వచ్చాడు. మౌర్య పుట్టినప్పుడు కూడా అన్నయ్య, వదిన ఇద్దరు బాబుని, నన్ను చూడటానికి వచ్చారు. నా పుట్టినరోజు ఎవరికి గుర్తున్నా లేకున్నా ఇప్పటికి మా అన్నయ్యకు గుర్తే. మేము విజయనగరంలో ఉన్నప్పుడు కూడా నా పుట్టినరోజుకి భోపాల్ నుండి వచ్చేవాడు. తను అక్కడ జాబ్ చేసేవాడు అప్పుడు. ఉత్తరాలు నా ఫ్రెండ్స్ తో పాటుగా అన్నయ్యకు కూడా రాస్తుండేదాన్ని. తర్వాత మా రంగ వదిన చెప్తుండేది అమ్ములూ నీ పుట్టినరోజుకి నెల ముందే గ్రీటింగ్ కొని పెట్టేవాడు మీ అన్నయ్య. కొత్తలో పోట్లాడేదాన్ని తెలియక అని చెప్పేది. మా రంగ వదినకు కల్లాకపటం తెలియదు. మనసులో అనుకున్నది చెప్పేసేది. అన్నయ్య నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా తనే ఫోన్ చేసేవాడు. నేను చేస్తానన్నా కూడా వద్దని, తనకే తక్కువ డబ్బులు అవుతాయని తనే చేసేవాడు. వదినకు బాలేదని ఇండియా రాక ముందే తెలుసు. అందుకే ఫ్లైట్ దిగిన వెంటనే వదినను చూడటానికి వెళ్ళాను. 
        ఆగస్టు లో ఇండియా రాగానే శౌర్య పుట్టినరోజు, తర్వాత వినాయక చవితి, దసరా అయ్యాక హైదరాబాదు AMSOL లో జాయిన్ అవుదామని అలా అలా డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఈలోపల విజయనగరంలో మా హిందీ టీచర్ గారికి బాలేదని తెలిసి ఆవిడని చూడటానికి అటు వెళ్ళాను. చిన్ననాటి నేస్తాలను కలిసిన కబుర్లు, ఆ ముచ్చట్లు మరోసారి. 

     " డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కాని అనుబంధాలు తెగిపోతే అతకవు. "

 వచ్చే వారం మరిన్ని కబుర్లతో..            

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner