4, అక్టోబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 74



       SLE అని తెలియక ముందు నన్ను చూసే డాక్టర్ గోపాళం శివన్నారాయణ గారికి నాకు SLE అని చెప్తే ఆయన, ఇక్కడి రిపోర్ట్స్ అన్నీ తప్పులు వస్తాయి. రాయవేలూరు వెళ్ళిరండన్న సలహా ప్రకారం రాయవేలూరు హాస్పిటల్ కి కూడా రెండుసార్లు వెళ్ళివచ్చాను. వాళ్ళూ ఇదేనని చెప్పారు. జూనియర్ డాక్టర్స్ చూసి సీనియర్ డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ రాశారు. హడావిడిలో కనీసం మన రిపోర్ట్స్ కూడా సరిగా చూడలేదు. కొన్ని నేనే చెప్పాను. పొరపాటున చూడలేదని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు. మణిపాల్ హాస్పిటల్ లో కూడా చూపించాను. ఆవిడయితే మీకు కరక్ట్ ట్రీట్మెంట్ జరుగుతోంది డాక్టర్ ని మార్చకండి అని చెప్పారు. ఇవన్నీ నేను మా డాక్టర్ పి వి ప్రసన్న గారికి చెప్పే చేసాను. ఈరోజిలా బతికున్నానంటే ఆవిడే కారణం. 

         మనకు తెలిసిన హాస్పిటల్ అని టెస్ట్ చేయించినా, టెస్ట్ చేయకుండా చేసామని చెప్పిన డాక్టర్లు, రిపోర్ట్స్ నలుగురు డాక్టర్లుచూసి కూడా కనీసం రిపోర్ట్స్ లో ఉన్నది పట్టించుకోకపోవడం, మనం చెప్తే తప్ప రిపోర్ట్స్ లో ఉన్నది చూడని డాక్టర్లు,ఇలాంటి పెద్ద పేరున్న కార్పోరేట్ హాస్పిటల్స్ మనకున్నందుకు గర్వపడదాం. మరో డాక్టర్ అంటాడు..నేనింత డబ్బు పెట్టి హాస్పిటల్ కట్టాను. రోజుకి నేనింతమంది పేషంట్స్ ని చూస్తే కాని నాకు బ్రేక్ ఈవెన్ రాదు అని ఓపెన్ గా చెప్పారు. ఇలాంటి అనుభవాలు బోలెడు. 

                   నా రెండో పుస్తకం ప్రింట్ వేయడానికి ఇచ్చినప్పుడు అనుకుంటా, నా రాతలు తెలిసిన కలిమిశ్రీ గారు నవ మల్లెతీగలో నెలకి ఒక వ్యాసం రాయమన్నారు. నాకు రాయడం రాదన్నా వినలేదు. సాగర్ అంకుల్, కలిమిశ్రీ గారి ప్రోద్బలంతో గత మూడేళ్ళుగా నవ మల్లెతీగలో జీవన 'మంజూ'ష ఆర్టికల్ వస్తోంది. టైటిల్ సెలక్షన్ కలిమిశ్రీ గారిదే.గోదావరి దినపత్రికలో బోలెడు పుస్తక సమీక్షలు, కవుల గురించి రాశాను. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు, గోదావరి యాజమాన్యం చాలా చాలా  సహకారమందించారు. మనం దినపత్రికలో యజ్ఞమూర్తి గారి ద్వారా కొన్ని వ్యాసాలు,ఆంధ్రప్రభలో తెలుగు గురించి వ్యాసం, గో తెలుగు డాట్ కాం, గోదావరి రాత పత్రిక, వార్త పవర్ పేపర్, విశాఖ సంస్కృతి, శిరా కదంబం ఇలా పలు పత్రికలలో వ్యాసాలు, కవితలు, సమీక్షలు ప్రచురితమయ్యాయి. 

         ముఖపుస్తక సమూహాలలో ఎందరో సాహితీ మిత్రులు పరిచయమయ్యారు. ఏదో మనసుకు అనిపించింది రాయడంతో మెుదలైన ఈ రాతలు ఎందరో సన్నిహితులను, సాహితీ మిత్రులను పరిచయం చేసాయి. కొన్ని ఎదుటి వారికి నచ్చని రాతలు రాసినప్పుడు అవమానించి సన్మానాలూ చేసారు. మరి కొందరు వారి అవసరాల కోసం మనతో స్నేహం నటించి, మెాసాలూ చేసారు. రాజకీయ విమర్శలకు మంచి బహుమతులే దక్కాయి పేటియం బాచ్ తో. పోలీసులకు కంప్లయింట్ చేస్తే, మనం సాక్ష్యాలన్నీ ఇచ్చినా, దొరక లేదని ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ చెత్తబుట్టలో వేసిన ఘనులు. సైబర్ క్రైమ్ వాళ్ళయితే పట్టుకున్నాం రమ్మని చెప్తే, వెళ్ళి అడిగితే వాళ్ళని పట్టుకోవాలంటే ఎఫ్ ఐ ఆర్ కావాలని, అది చేయడానికి వెళితే ముందురోజు గంటు గంటలు నిలబెట్టి, రచయిత్రి అంటా అని తేలికగా మాట్లాడిన సి ఐ, మరురోజు మాడం అంటూ మర్యాదిచ్చి, ఇంగ్లీష్ లో EASE చదవడం రాక, అర్థం కూడ తెలియక, మెుత్తానికి ఎంత విసిగించినా వదలనని ఎట్టకేలకు కంప్లయింట్ తీసుకుని, రాత్రి పదకొండు గంటలకు 8 కాపీలు మాతోనే తీయించి, వాటిలో ఒకటి మాకిచ్చి, ఇంకేముంది పట్టేసుకుంటామని చెప్పి, చెత్తబుట్టలో వేసిన ఘనత మన పోలీసువారిది. చెప్పాలంటే చాలావుంది కాని ఇంతటితో వారిని వదిలేస్తున్నా. రికమండేషన్, లంచం లేనిదే ఏ పనీ జరగదన్న దానికి ఇదో సాక్ష్యంగా మీకు చూపాలని రాశాను. 

            " వ్యవస్థలో న్యాయం సామాన్యుడికి అందుబాటులో ఉండదు. వ్యక్తిత్వం మంచిదై ఉండాలి. అది కావాలంటే పెంపకంలో సంస్కారం, సద్బుద్ధి ఉండాలి. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner