నేస్తం,
జీవితంలో గెలవడమే మన విజయమని అందరు అనుకుంటారు. కాని జీవితాన్ని గెలవడమే అసలైన విజయమని మనలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ గెలుపంటే ఏమిటి? మనమున్నా లేకున్నా మనకంటూ నలుగురిని సంపాదించుకోవడమే గెలుపు. ఆటలో గెలుపోటములు సహజం. అదే జీవితపు ఆటలో జయాపజయాలు మనమేంటో నలుగురికి తెలియజెప్తాయి. మనమేంటో మనకీ గుర్తు చేస్తాయి.
మాటలు పొదుపుగా వాడటం మనకు ఎంత బాగా వస్తే అంత బాగా అనుబంధాలు బలపడతాయి. అలాగే అక్షరాలను కూడా అంతే పొదుపుగా వాడాలి. మన మాట కానివ్వండి, అక్షరాలు కానివ్వండి వాటి వాడుకను బట్టే మన వ్యక్తిత్వం తెలుస్తుంది. రాతలు ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కాని ఓ మనిషినయినా మార్చగలిగితే ఆ రాతకు సార్థకత లభించినట్లే. ఏ అవార్డులు, రివార్డులు దానికి సాటి రావు. సాహిత్యం, సాహితీకారులు సంక్లిష్టంగా మారకూడదు.
డబ్బుకు లోకం దాసోహమిప్పుడు. ఏ బంధమయినా డబ్బుతోనే ముడిబడిపోయిందిప్పుడు. సమాజం సహజ స్థితిని కోల్పోయి అసహజతతో కప్పబడి వుంది. మన చుట్టూ వున్న ఏ రంగమూ దీనికి మినహాయింపు కాదు. నైతికత అనేది నశించి పోతూ, నాగరికత ముసుగులో మనలో కొంతమంది అష్టావక్రులుగా తయారౌతున్నారు. ఆ వంకరలను బయట పడనీయకుండా ముసుగులను వేసుకుని వంచనను ఇంటిపేరుగా మార్చుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రేపటి తరాలకు అందించాల్సిన విలువలను కాలరాసేస్తున్నారు.
ఏ వేదికనయినా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే వాడుకుంటూ, తమని ఎందుకు పిలిచారో అన్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. సూక్తులు వల్లించడం అందరికి చాతనౌతుంది. ఆచరణలో చూపడం ఏ కొందరికో మాత్రమే సాధ్యం. సంస్కారం గురించి మాట్లాడే ముందు మన సంస్కారం ఏపాటిదో ఎరిగితే నలుగురిలో నవ్వులపాలు కాకుండా వుంటాము. నలుగురిలో మాట్లాడాలంటే విషయ పరిజ్ఞానం చాలా అవసరం. మన మాటలు నలుగురికి చేరాలంటే భాష మీద పట్టు, మన చుట్టూ జరుగుతున్న సఘటనలపై అవగాహన చాలా ముఖ్యం. రాతయినా, మాటయినా నిజాయితీగా వుంటే నాలుగు కాలాలు నిలిచి వుంటుంది. సమాజమూ బావుంటుంది.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి