3, అక్టోబర్ 2021, ఆదివారం

రెక్కలు

 1.   మాటలు

మనసు నుండి వెలువడాలి

చేతలు

హృదయం నుండి రావాలి


అరువు నగలు

బరువుచేటు..!!


2.   మనోసంద్రంలో

సుడిగుండాలు

నీటి మీద రాతలుగా

కారాదు


అక్షర ప్రవాహం

అనంతమైనది..!!


3.   అసహనం 

ఇంటిపేరు

చేతగానితనాన్ని

కప్పెట్టుకోవడాన్కి


అబద్ధపు బతుకులు

నిజాయితీ విలువెరగవు...!! 


4.   రాత

మారదు

గీత

చెరగదు


విధాత

గొప్ప రచయిత...!!


5.   చమత్కారం

చురుక్కుమంటుంది

ఛీత్కారం గురించి 

చెప్పేదేముంది


ఏ కారమయినా

మమకారం ముందు దిగదుడుపే...!!


6.   అక్షరాలకు

తెలియని విద్యలేమున్నాయి

మనిషికి

అంతుబట్టని మాయలే అన్నీ


ప్రకృతి 

ఎరుగని వింతలేమున్నాయని..?


7.   ఆధిపత్యం 

అనాది నుండి ఉన్నదే

అమ్మదనం

అంగడి సరుకుగా మారడమిప్పుడే


కాలాతీతమైపోయాయి

అనుబంధాలు..!!


8.  వెలుగు రెక్కలు

అందుకోవాలి

చీకటి చుక్కల

కలల ప్రయాణంలో


అనంతాన్ని ఆకళింపు చేసుకోవాలి

గమ్యాన్ని చేరడానికి..!!.   


9.  పయనం

అనివార్యం

ఆటంకాలెన్ని

ఎదురైనా


విజ్ఞుని లక్షణం

గమ్యం చేరుకోవడం..!! 


10.    కొరత పడేసింది

కదిలిపోతున్న కాలం

వలస పోతున్న

క్షణాలను వడిసి పట్టలేక


కోత పడింది గుండెకు

కన్నీటి రూపంలో..!!


11.   కాంతిపుంజం నుండి

వెలుతురు మదిలోనికి

అక్షరంతో ఆకర్షింపబడి

సాంత్వన ఇస్తోంది


ఎన్నో ప్రశ్నలకు

సమాధానాలు ఇక్కడే..!!


12.   కష్టానికి

మాట సాయం దూరం

తినడానికి

ఏ మొహమాటం లేదు


పై పై ప్రేమలు

నీటి మీది రాతలే మరి..!!0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner