11, అక్టోబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...75

 


      అమెరికా నుండి వచ్చిన ఈ 15 ఏళ్ళలో అటు ఉద్యోగ పరంగా మెాసం చేసిన కంపెనీ, ఇటు బంధువులు, స్నేహితుల మూలంగా జరిగిన నష్టాల కారణంగా ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయాం నేను, పిల్లలు, మా కుటుంబం. పిల్లల చదువుల అవసరాలకు కాని, నా అనారోగ్య అవసరానికి కాని ఆదుకున్న బంధువులను, స్నేహితులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. కనీసం మాట అడగడానికి కూడా గొంతు పెగలని వారే అధికం. గత 45 ఏళ్ళ నుండి అందరి గురించి తెలిసినా అంతగా పట్టించుకోలేదు. కాని నా పెళ్లైన పాతికేళ్ళుగా జరిగిన అనుభవాలు, ఈ ఐదారేళ్ళ నుండి చూసిన డబ్బు జబ్బు మనస్తత్వాలు అనుబంధాల మీద చాలా విరక్తి కలిగించాయి. నా అవసరాలకు ఆదుకున్న ఆత్మీయులు అతి కొద్దిమందే. మేమున్నాం అని నోటి మాట కాకుండా మనసు మాటైతే, ఎవరి నుండైనా చాలా సంతోషం.            

           జీవితం ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంత ప్లాన్ ప్రకారం బతికేద్దామన్నా మన చేతిలో ఏదీ ఉండదు. సమస్య లేని జీవితమూ లేదూ అలా అని ప్రతి సమస్యా పెద్దదీ కాదు. సమస్యకు భయపడకుండా బతకడం మనం అలవాటు చేసుకోవాలంతే. ఏ సమస్యా లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంటే కూడా బావుండదు కదా. పెద్దలన్నట్టు జీవితం సప్త సాగర గీతం. గెలుపోటముల సంగమం. భయపెట్టే సునామీలూ ఉంటాయి. ఆహ్లాదపరిచే అలల ఆనందాలూ ఉంటాయి. చీకటి వెలుగుల సయ్యాటే జీవితం. జీవితంలో ప్రతి పరిచయం ఓ అనుభవ పాఠమే మనం నేర్చుకోవాలంతే. మంచి చెడుల సమతూకం మనకు తెలియాలంతే. కాదూ కూడదంటే మనం ఏకాకుల్లా ఎడారి జీవితాలకు అలవాటు పడిపోవాలంతే. 

             

          ఈ ముఖపుస్తకంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. కొన్ని పరిచయాలు సంతోషాన్నిస్తే, మరి కొన్ని పరిచయాలు భయాన్ని, అసహ్యాన్ని, విరక్తిని పంచాయి. మన రాతలు మనసు నుండి వచ్చినప్పుడే అవి నలుగురికి చేరతాయి. ఎదుటివారిని ఎద్దేవా చేద్దామనుకుంటే మనమే నవ్వులపాలైపోతామని గుర్తెరగాలి. ముఖ పుస్తక స్నేహ పరిధిలో స్వేచ్ఛకు, విశృంఖలతకు తేడా తెలియడం అవసరం. నాలుగు రోజులు అవసరం కోసం రాసుకు పూసుకుని, తర్వాత మన మీదే అవాకులు చవాకులు వాగే మహామహులు చాలామందే ఉన్నారిక్కడ. మన జాగ్రత్తలో మనముండటం మంచిది. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడంలోనే మర్యాద ఉంటుంది. డబ్బులతోనో, నటించడంతోనో అందరిని ఆకట్టుకోగలమనుకుంటే మనంత మూర్ఖులు ఈ ప్రపంచంలో మరొకరుండరు. లేని ప్రేమలు నటించకుండా మనం మనలా ఉంటే మనకంటూ నలుగురుంటారు. ఏదున్నా లేకున్నా మన వ్యక్తిత్వం మనకుంటే అదే మనకు వెలకట్టలేని ఆస్తి. దానిని తాకట్టు పెట్టి బతకడం అంటే మనం బతికున్న శవంతో సమానం. 

        రాయడం రాదన్నా వినకుండా నాతో 75 వారాలు కవితాలయంలో రాయించిన తమ్ముడు పవన్ కు, చెల్లి అంజుకు, అమెరికా విశేషాలను రాయించిన ఆంంధ్రాప్రవాసి డాట్ కాం రాజశేఖర్ చప్పిడి గారికి, మీ ఇంటి మనిషిగా ఆదరించిన ప్రత్యక్ష, పరోక్ష ఆత్మీయులందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. 


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner