5, అక్టోబర్ 2021, మంగళవారం

అనీడ పుస్తక సమీక్ష..!!

             " ప్రశ్నలకు సమాధానాలు కాదు, దారులు వెదకడం సరైన పని " అంటున్న " అనీడ "


         కవిత్వానిదో ప్రత్యేక లోకం. నిజమే ఆ కవిత్వ ప్రపంచంలో మనసు సంవేదనలు, మౌనం నింపుకున్న మాటలు, శబ్దం లేని నిశ్శబ్దాలు, శూన్యం చెప్పే సంగతులు, వెన్నెల ఒంపే జ్ఞాపకాలు, చీకటి కార్చిన కన్నీళ్ళు ఇలా ఎన్నో రకాల భావాలను తన మనసుతో " అనీడ" గా అందంగా అక్షరీకరించారు మన అందరికి సుపరిచితురాలు రూపరుక్మిణి కె. 

       " మనసు ముంగిటిలో 

         మంచుతెరలా ఏవో జ్ఞాపకాల దొంతరలు రంగురంగుల సీతాకోకచిలుకలై విహరిస్తున్నాయి. "

ఈ చిన్న మాటల్లోనే పుస్తకంలో ఏముందో, తను ఏం చెప్పాలనుకుందో చెప్పకనే చెప్పేసారు. ఎక్కువగా మహిళల మనోగతాలు, మౌన వేదనలు, కన్నీటి కతలు, రైతుల ఈతిబాధలు ఈ కవిత్వ సంపుటిలో కనిపిస్తాయి. సైనికుని మరణానంతరం అతని బిడ్డ మనోగతాన్ని బొమ్మ కావాలి కవితలో చాలా బాగా రాశారు. అందరు తప్పక చదవాల్సిన కవిత ఇది. 

 " మౌనం మాటైన క్షణం

   గాయాలు గాలివాటుగా తేలిపోతాయి. "  నిజమే కదా. ఎంత సుళువుగా బాధను తేల్చేసారో రంగుల గాయం కవితలో మీరే చూడండి. 

       వెలుతురుతో నీడకున్న అనుబంధాన్ని చీకటి లేకుండా చేయడాన్ని " అనీడ " గా మార్చేసి అదే ఈ కవితా సంపుటి పేరుగా స్థిరపరచి, ఆ నీడల వెనుక నిజాలను ప్రశ్నిస్తూ, సమాజ అసమానతలను ఎత్తిచూపుతూ, ఎందరో " ఆమె " లకు వారసురాలిగా తన అక్షర భావాలతో వకాల్తా పుచ్చుకున్న రూపరుక్మిణి అభినందనీయురాలు. ప్రశ్నలకు సమాధానాలు వెదకడం కంటే దారులు వెదకడమే సరైన పని అంటారీవిడ. సంకల్పం మంచిదనుకుంటే మార్పు మనతోనే మెుదలు కావాలంటారు. అమ్మతనం గురించి, అమ్మానాన్నల గురించి, పసితనం, బాల్యం, జ్ఞాపకాలు, ఎదురుచూపులు, ఎడద చప్పుళ్ళు, ప్రేమ, విరహం, నిరీక్షణ ఇలా జీవితంలోని అన్ని పార్శ్వాలను చాలా హృద్యంగా మన ముందుకు తెచ్చారు. వీటిలో తాయిలాల పెట్టె, ఒలికి పోతున్న కాలం, అర్ధ నగ్న సత్యం, తీరం చేరలేని మౌనం, జీవితకాల సంతకం వంటి కవితలు మచ్చుకు కొన్ని. 

        " మనసు పరదాలలో 

   ముసుగేసుకు కూర్చోనూ లేక

   అలాగని వెలుగు దుప్పట్లను చీల్చుకురాలేక 

   స్వగతంలో కూరుకున్న మనోమందిరాలెన్నో. "

అంటూ తన మనసు అలజడిని, ఆవేదనను చక్కని పదజాలంతో, ఆకట్టుకునే శైలితో "అనీడ " గా సాహితీ లోకానికి అందించిన రూపరుక్మిణి కె కి హృదయపూర్వక శుభాభినందనలు.   

మంజు యనమదల
విజయవాడ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner