5, అక్టోబర్ 2021, మంగళవారం
జీవన 'మంజూ'ష అక్టోబర్
నేస్తం,
విమర్శకు, విశ్లేషణకు తేడా తెలియని స్థితిలో కొందరు పెద్దలున్నారని చెప్పడం బాధాకరం. విమర్శ, విశ్లేషణ అన్నవి వ్యక్తిగత, సామాజిక, రాజకీయ, సాహిత్యం వగైరాలలో ఏదైనా కావచ్చు. ఎదుటివారిని విమర్శించే ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి. అసలు విమర్శించే అర్హత, స్థాయి మనకుందో లేదో గమనించాలి. మనం చేస్తే గొప్ప పని. అదే పని ఎదుటివారు చేస్తే డబ్బు కోసమెా, పేరు కోసమెా చేసారనడం హాస్యాస్పదం.
ముందుగా మనం తెలుసుకోవాల్సింది మనం విమర్శిస్తున్నామా, విశ్లేషిస్తున్నామా అన్న దానిలో క్లారిటి. మనకు నచ్చిన వారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయడంలో ఎలాంటి ఆక్షేపణా లేదు. అది మనిష్టం. కాని మరో వ్యక్తిని కాని, వ్యవస్థను కాని తప్పు పట్టేటప్పుడు, మనకు నచ్చిన వ్యక్తికి వ్యతిరేకం అన్న చిన్న కారణంతో కళ్ళ ముందు జరిగిన వాస్తవాలను విస్మరిస్తే, మన లోపం మనకు తెలియకున్నా ప్రపంచానికి తేటతెల్లమవుతుంది.
మనలో చాలామందికి వాక్యానికి, వ్యాఖ్యానానికి తేడా తెలియనట్లే విమర్శకు, విశ్లేషణకు తేడా తెలియకుండా పోతోంది. మనం రాసేది అచ్చమైన కవిత్వం అనుకుంటూ, మరొకరు రాసేది కవిత్వమే కాదు వచనమంటే, అది ఎంత నిజమెా మనకు తెలుసు. కాని ఆ నిజాన్ని అంగీకరించే మనస్సాక్షి మనకు లేకపోవడమే మన కొరత. పేరు కోసమెా, ప్రతిష్ఠ కోసమెా దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదు.
సాహిత్యంలోనూ సన్మానాలు, పురస్కారాలు ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. విలువైన సాహిత్యం అట్టడుగునే ఉండిపోతోంది. ఎవరైనా ధైర్యం చేసి గుర్తింపునిచ్చినా, పలువురు సాహితీ పెద్దలు నందిని పంది అంటే, మనమూ ఆ పెద్దలతో జేరి నందిని పంది అనే స్థితిలో ఉన్నందుకు గర్వపడదాం. మనమూ, మన రాతలు, మన భజన బృందాలు మన వెంట ఉన్నంత వరకు మనకు తిరుగులేదని మురిసిపోదాం. జయహో అంటూ మనమే చప్పట్లు కొట్టుకుంటూ బతికేద్దాం.
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి