25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఆదిత్యాయనమః..!!

వెలుతురు వాకిలికి

దారి చూపే నిర్దేశకుడు

గతి గమనాలను

తన కనుసన్నలతో శాసించేవాడు

సమయాసమయాలకు

ఆధారభూతుడు

మనిషి మనుగడకు

మార్గం చూపేవాడు

సమస్త జీవకోటికి

అత్యంత ఆప్తుడు

విరామమెరుగని 

శ్రమజీవి

అలసటనెరుగని

నిరంతరాన్వేషి

ప్రపంచ పర్యావరణ

పోషకుడు

కాలచక్రానికి

మూలకారకుడు

చీకటివెలుగుల సంథానకర్త

గ్రహాలను తన చుట్టూ తిప్పుకునే

దినాధిపతి ఆదిత్యునికి

వందనం అభివందనం..!!


24, ఫిబ్రవరి 2022, గురువారం

ఓ మాట..!!


22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ప్రయోజనం..!!

నేస్తం,

          నీ పుస్తకాల వలన ప్రయోజనం ఎవరికి?

ఎందుకు పుస్తకాలు,రాతలు

దీనికి సమాధానం ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని అడగవద్దు. పని చేసామంటే దానికి తగిన ఫలితం వుండాలి. అది రకంగా అన్నది మన సమాధానం

         ముందుగా నా రాతలు నా కోసమే. నా మనసు తృప్తి కోసం. వాటిని ఎవరెలా తీసుకుంటారన్నది వారిష్టం. దానితో నాకు సంబంధం లేదు. దేవుడే అందరికి మంచివాడు కాదు. అలాంటప్పుడు నేనెంత చెప్పండి. రాయడం తప్పు కాదు. తప్పుడు పని అంతకన్నా కాదు. రచన చేయడం మీరు ఎద్దేవా చేసినంత సుళువు కాదు. నాలుగు వాక్యాలు రాసి చూడండి తెలుస్తుంది కష్టం ఏమిటో, దానిలోనున్న ఇష్టమేమిటో. మనిషికి విలువ తాను వేసుకునే దుస్తులు, పెట్టుకునే ఆభరణాలు, అధికారం, డబ్బు వగైరా వాటి వలన వస్తుందనుకుంటే అది పొరబాటు. వీటి వలన మనకు విలువనిచ్చినట్టు నటిస్తారు తప్ప నిజంగా మనకు విలువనివ్వరు. ఓసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. అక్షరానికున్న గౌరవం ఏంటన్నది తెలుస్తుంది. సొమ్ముండగానే సరి కాదు. దానిని సక్రమంగా వినియోగించినప్పుడే దానికి, మీకు విలువ, గౌరవం. రాతలను, రాసేవారిని చులకనగా చూడకండి. దాని విలువ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి


18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

​మళ్లీ చిన్నతనం గుర్తు వచ్చేసిందోచ్..!!

      అందరు నా “ కాలం వెంబడి కలం “ గురించి చెప్తుంటే చెప్పలేని సంతోషంగా వుంది. మా జొన్నవలస హైస్కూల్ హింది టీచర్ రత్నకుమారి గారు ఫోన్ చేసి చాలా బాగా రాశావు అందుకు చాలా చాలా సంతోషం. కాని ఒకింత మనసుకి కష్టంగా కూడా అనిపించింది. నాకయితే “ ఓ జీవితం…ఎర్రబస్ టు ఎయిర్ బస్ “ చాలా బాగా నచ్చేసింది. లెక్కల మాస్టారు విశ్వేశ్వర రావు గారు కూడా చాలా మెచ్చుకున్నారు నిన్ను. ఎంత బాగా రాసిందండి. ఇంత టాలెంట్ వుందని అనుకోలేదెప్పుడూ అని చెప్తుంటే..నాకయితే చిన్నప్పుడు క్లాస్ లో ఫస్టో, సెకండో వచ్చినంత ఆనందం వేసేసింది. ఎంతయినా మరి నా ఎర్రబస్ ని పొగిడారు కదా అందుకన్న మాట..😊

17, ఫిబ్రవరి 2022, గురువారం

అసలు విషయం..!!

నేస్తం,

      మనకి  మనం చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా వుంటున్నామని. మంచైనా, చెడైనా మనకి మనమనుకుంటే సరిపోదు. నలుగురు చెప్పాలి మన మంచి చెడుల గురించి. విమర్శకి, వ్యక్తిగత అభిప్రాయానికి తేడా తెలియని స్థితిలో మనముండి ఎదుటివారికి సూక్తిసుధలు వల్లిస్తే సరికాదు.

      ఎవరి విషయమో ఎందుకు, నా విషయానికే వద్దాం . నేనెప్పుడు ఎవరి గోడల మీదైనా వారు రాసిన పోస్టులకు ప్రతిస్పందనగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పుంఖానుపుంఖాలుగా వివరించలేదు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం అన్న దానికన్నా వ్యక్తుల భజన అంటే సరిపోతుందేమో. నాకు నచ్చని పోస్టులకు వారి అభిప్రాయానికి విలువనిచ్చి చూసి ఊరుకుంటాను తప్పించి, ఏ విమర్శలు కాని, అభిప్రాయాలు కాని అక్కడ వివరించను. నా అభిప్రాయాలు నా గోడ మీద రాసుకుంటాను. అది రాజకీయమైన, సామాజికమైనా, కులమత పరమైనా. 

          నాకు నచ్చిన, నా మనసుకి తోచిన ఏదైనా నా గోడ మీద రాసుకుంటాను. నా రాతలు అందరికి నచ్చాలన్న నియమమేమి లేదు. నా ప్రతి రాతను అందరూ పొగడాలని నేను అనుకోను. మనం రాసే స్పందనబట్టే మన సంస్కారం ఏమిటన్నది నలుగురికి తెలుస్తుంది. మనం చెప్పనక్కర్లేదు. నా స్పందనలు కూడా అంతే వుంటాయి. అంతేకానీ ఎవరి గోడల మీదకో వెళ్లి అక్కడ వారి అభిప్రాయాన్ని అవహేళన చేయడమో, విమర్శించడమో చేయను. ముఖ్యంగా సూక్తిసుధలు వల్లించను. ఉచిత సలహాలు అస్సలివ్వను. కులమతాలను హేళన చేసే కుసంస్కారులను అస్సలు వదలను.

           నేనేంటన్నది నా అనుకున్న వాళ్ళకు తెలుసు. కొందరి పొగడ్తలు నాకు అవసరం లేదు. ఎవడు మీకు నచ్చితే వాడిని పొగుడుకోండి. ఏ రాజకీయ నాయకుడినైనా, సినిమా నటుడినైనా, మతాన్ని, కులాన్ని ఇలా ఏదేనా అది మీ వ్యక్తిగతం. దాన్ని నామీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయకండి. వాక్యానికి, వ్యాఖ్యానానికి తేడా తెలుసుకుంటూ..విమర్శకు అభిప్రాయానికి కూడా తేడా తెలుసుకోండి. 

మరోసారి చెప్తున్నా..నేను, నా రాతలు నచ్చని వారు నిరభ్యంతరంగా నా ఫ్రెండ్ లిస్ట్ నుండి వెళిపొండి లేదా బ్లాక్ చేసుకోండి. ఛాయిస్ మీకే వదిలేసా. ఇంకెప్పుడు నా కోపాన్ని కాని, నన్ను కాని వ్యక్తిగతంగా విమర్శించే పని పెట్టుకోకండి. 

ఇదండి అసలు విషయం…!!  

16, ఫిబ్రవరి 2022, బుధవారం

జీవన మంజూష ఏప్రిల్ 2022

నేస్తం,

          కష్టం మనది కానప్పుడు మనమంతగా దాని గురించి పట్టించుకోము. అదే బాధ మనదైనప్పుడు ఎవరో రావాలి, సాయమందించాలని ఎదురుచూస్తాం. ఎదుటివాడి కష్టం మనకు చేరనప్పుడు మన బాధ వారెవరైనా తీర్చాలని అనుకోవడం సబబు కాదు కదా! రోజులెప్పుడూ ఒకేలా వుండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతూ వుంటాయి. మన పెద్దలు ఎప్పుడో చెప్పనే చెప్పారు కదా లక్ష్మీదేవి చంచల స్వభావురాలని. అందుకనే ఆవిడ చోట స్థిరంగా వుండదు ఎప్పుడూ. ఈరోజు మనింట్లో వుంటే రేపటి రోజున మరొకరింట్లో వుంటుంది. ఇప్పుడు మనతో లక్ష్మీదేవి వుంది కదా అని మనం మనిషితనాన్ని మర్చిపోతున్నాం

          పొదుపు, దుబారా వలన కొంతమంది మనుష్యులకు విలువనిస్తూ వుంటారు. నువ్వేదో పొదుపరివని, ఇతరులు ఖర్చుదారులని అనుకుంటే పొరబాటది. ఎవరి అవసరాల ప్రాముఖ్యత వారిది. నీకు నీ వరకు నీ కుటుంబం బావుంటే చాలనుకుంటే సరిపోదు. కుటుంబమంటే భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. వారితో అనుబంధమున్న పెద్దలు కూడా మన కుటుంబమే అని గుర్తుండాలి. ఈరోజు మనం సంపాదిస్తున్నామని అహం ప్రదర్శిస్తే, సంపాదన వెనుక మన అమ్మానాన్నల కష్టం ఎంతుందో గుర్తుకే రాదు. పిల్లలను పెద్దవారిని చేయడంలో అమ్మానాన్నల బాధ్యతెంతుందో, అపరవయసులో వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు అంతే వుంటుంది. రక్త సంబంధాలు కూడా అవసరాకు మాత్రమే అనుబంధాలుగా మారిపోయాయి ఈనాడు

             కొన్ని రోజులు అందలాలెక్కామని సంతోష పడితే సరపోదు. ఆనందం కలకాలం అలాగే వుండదని గుర్తెరగాలి. చాలామంది అనుకుంటారు తమ పెంపకం చాలా గొప్పదని. తల్లీదండ్రి తమ పిల్లలు తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవాలని కాని, ఇంటి నుండి పిల్లలు వెళిపోవాలని కోరుకోరు(ఇది తలిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది). విషయంలో ఎవరూ చెడ్డవాడు కాదు. వారి వారి చుట్టూ వున్న పరిస్థితుల ప్రభావం. సంఘటనలలో ఇతరులు తామేదో గొప్పవారన్నట్టుగా అనుకుంటూ, వీరిని హేళన చేస్తుంటారు. ఈరోజు ఇంటి సంఘటన రేపు మన ఇంటిదే కావచ్చునేమోనన్న ఆలోచన క్షణ మాత్రమైనా రాదు. ఉద్యోగాలు చేయండి. ఊళ్లు ఏలండి కాని కనీసం మనిషిగా ఆలోచించండి. నోరుంది కదాని మాట తూలకూడదు. మనకి పిల్లలున్నారుగా. అదే బాధ రేపు మన ఇంటి తలుపు తడితే మన స్థితి ఏమిటన్నది కాస్తయినా ఆలోచించాలి కదా. మనం పిల్లల్ని మాత్రమే కనగలం వారి నుదుటిరాతను రాయలేం

            తెలివిగలవారు తమ పిల్లలు తప్పు చేసినా సమర్థించుకోగలరు. కొందరు ఏమి లేకపోయినా కుటుంబాన్ని అల్లరి చేసుకుని, తామే అందరికి చులకన అయిపోతారు. మన అనుకున్నవారే హేళన చేయడంలో ముందుంటే, మనసు బాధను పంచుకోవడానికెవరు లేక మానసికంగా కుంగిపోతూ, శారీరక అనారోగ్యాల పాలౌతున్నారు ఎందరో. ()హింసావాదులూ, మానవతామూర్తులు మీకో విన్నపం. ఎదుటివారి కష్టంలో మీరు పాలుపంచుకొనకపోయినా పర్లేదు కాని వారిని మీ మాటలతో, చేతలతో మానసికంగా హింసించి బతికున్న శవాలుగా మార్చకండి. మీ బంధం డబ్బుతోనే ముడిబడిన వుందని అందరు అలానే వుండరు. డబుతోనే అన్నీ దొరుకుతాయన్న భ్రమను వీడండి. కాస్తయినా మనిషిగా ఆలోచించండి. !

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

జీవన పోరాటం పుస్తక సమీక్ష..!!

అభినందనలు గుడిమెట్ల చెన్నయ్య గారు.

మనఃపూర్వక ధన్యవాదాలు నవ మల్లెతీగ సాహితీ సంపాదక వర్గానికి, యాజమాన్యానికి…

  సమాజం బావుండాలంటే మార్పు మనిషిలో రావాలి..!!    

     సమాజంలో మనం బతుకుతున్నామంటే కనీసం మన పక్కవారిని పట్టించుకునే మానవత్వం కాస్తయినా ఉండాలి. ఈనాడు ఒకే ఇంటి కప్పు కింద బతుకుతున్న అపరిచితులెందరో మన సమాజంలో వున్నారు. తాను నివసించేది పరాయి రాష్ట్రమైనా తెనుగు భాష తీయదనాన్ని ఆస్వాదించడమే కాకుండా పదిమందికి ఆ ఆస్వాదన రుచి చూపిస్తున్న మానవీయులు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. 

     తన చుట్టు జరుగుతున్న సమస్యలను, చూసిన అనుభవాలను కవితా వస్తువులుగా తీసుకుని చక్కని వచన కవితలు “ జీవన పోరాటం “ కవితా సంపుటిగా మలిచారు. వాడుక వచన భాషల్లోనే ఈ కవితలన్ని మనకు కనిపిస్తాయి. మనతో చెప్తున్నట్లే అనిపిస్తాయి చదువుతుంటే. ఆది గురువు అమ్మతో మెుదలుబెట్టి అనంతమైన జీవితపు లోతుపాతులను, సాధారణ మనిషి నుండి అసాధారణ వ్యక్తిత్వాల వరకు మనకు పరిచయం చేసారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. తోటి మనుష్యుల మనసుల్లోని రకరకాల ఆలోచనలను, లోపాలను ఎత్తి చూపారు. అనుబంధాల విలువలను, మనకుండాల్సిన మానవత్వపు మనిషి లక్షణాలను చాలా సోదాహరణంగా వివరించారు. బాల్యాన్ని, కౌమారాన్ని, యుక్త వయసు, వృద్ధాప్యాన్ని వివరిస్తూ,  ఆ వయసులలో మెలగాల్సిన పద్ధతులను, తెలుకోవాల్సిన విషయాలను చెప్తూ, మానసిక సమస్యలను కూడా చక్కగా వివరించారు. రాజకీయ నాయకుల నుండి తెలుగు భాషాకోవిదులందరిని తన కవితల్లో గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ కాకుండా సాహిత్య సభల్లో తెర వెనుక జరిగే చర్యలను వివరించారు. కవికి/రచయితకు ఉండాల్సి లక్షణాలను చెప్పారు. అన్ని వెరసి మనిషిగా ఎలా బతకాలో, బతకకూడదో సుస్పష్టంగా చెప్పారు. ఈ “ జీవన పోరాటం “ కవితా సంపుటి పూర్తిగా వచనమైనప్పటికి, శైలి కొత్తగా అనిపించింది. ఈ తరహా వ్యావహారిక వచనా శైలి  పాఠకులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది నా అభిప్రాయం. 

     సమాజానికి, సామాన్యునికి పనికివచ్చే ఎన్నో విషయాలను చక్కగా తేట తెనుగులో వచన కవిత్వంగా చేసి “ జీవన పోరాటం “ కవితా సంపుటిని అందించిన శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారికి హృదయపూర్వక అభినందనలు.

3, ఫిబ్రవరి 2022, గురువారం

వెలకట్టలేని సంతోషాలివి..!!

కొన్ని సంతోషాలను పంచుకోకపోవడమూ తప్పే…బాబాయ్ థాంక్యూ సోమచ్

మీ పర్మిషన్ తీసుకోకుండా మీ మాటలను యథాతథంగా..🙏

నా పుస్తకం “ కాలం వెంబడి కలం “ పిడిఎఫ్ పంపించిన తర్వాత డాక్టర్ డి ప్రసాద్ గారి మాటలు..


వుండమ్మా డిస్టర్బ్ చేయకు...ఇప్పుడే మొదటి 24 పేజీలు చదివేశాను.

ఇంతలో నీ మెసేజ్ వచ్చింది.

     ఎంత బాగా రాసారో.  ...నీ గురించి....

చాలా చాలా ఆనందంగా ఉంది... మoజమ్మాయి...


లోగడ ఎపిసోడ్స్ గా వచ్చినప్పుడు తరువాత వచ్చేదానికోసం ఆతృతగా ఎదురు చూసే వాళ్ళం.

          ఇప్పుడు ఒకే బిగిని చదివించేస్తోంది...అంత మాగ్నేటిక్ ఫోర్స్ ఉంది ...కధా కథనంలో.... చెప్పే విధానంలో...

నిజాయితీ  ,ముక్కుసూటితనం అలవోకగా రాసే నైపుణ్యం ,....హృదయానికి సూటిగా తాకే అక్షరతూణీరాలు

మంజూ స్వంతం....

Proud of You Manju


ఒక జీవితంలో పది జీవితాలను అనుభవించావు.

          గాంధీ గారి    " సత్య శోధన "  పుస్తకం తరువాత అంతటి స్థాయిలో సత్యశోధన కనిపించిన పుస్తకం ఇదే.... నా దృష్టిలో.....

       చిన్నదానివైనా. ..  ...(.మా అబ్బాయి వయసే

నీకు) పాదాభివందనం ...చేయాలని పిస్తోంది...మంజమ్మా..


ఇంతకన్నా ఇంకేం కావాలి..


విజయలక్ష్మి పోతేపల్లి మాటలు…


👍😊❣️ మీ రాతలు చదివి మారుతున్న వారిలో మారాలనుకొనేవారిలో నేను ముందుంటాను మంజూమేడం. ఇప్పటికీ అనుకొనేది ఒకటే మీ పరిచయం ఇంకొన్ని సంవత్సరాల ముందు జరిగిఉంటే నా జీవితం నిజంగా ఇలా మాత్రం ఉండిఉండేది కాదు.ఎంతో మార్పు జరిగేది సరైన మార్గంలో.వేరేవాళ్ళ గురించి నాకు తెలియదు నా వరకూ మంజూమేడం అంటే మంజూమేడమే.ఒక నమ్మకం ఒక ఓదార్పు ఒక ఆరాధన ఒక ఆదర్శం.వెరసి నా గురువుణిగారు.నేను ఈ పీడీఎఫ్ ఏమీ చదవలేదు.మీ మాట ఒక్కటే చదివా.అది చూసే రాశా ఇలా.🙏🙏🙏


చదివి మొత్తం పోస్ట్ పెడతా.తర్వాత.


థాంక్యూ సోమచ్ విజయా

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner