3, మే 2023, బుధవారం

పసి పాదాలు పలకరించిన వేళ..!!

నేస్తం,

         మనం ఊహించనివి జరగడమే జీవితం. అది మంచైనా చెడైనా మనం దానికి తల వంచక తప్పదు. ప్రతి మనిషికి సంతోషం, బాధ వస్తూ పోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు రోజూ జరిగే అనుభవాలే. రోజూ రోజులలో నిన్న   రెండు గంటలు నాకు చాలా ప్రత్యేకమైనవి. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, ఓదార్పులు లభించాయి

          నేను అన్నం తింటున్నప్పుడు ఫోన్ మోగింది. అమ్మ చూసి మీ పెదనాన్న అని అంది. మెున్న పేరు అడిగాను కదా..దాని కోసం చేసివుంటారు, అన్నం తినేసి చేస్తానులే అని తింటున్నా. లోపల మా రాజూలు అరుపులు. పక్కింటికి ఎవరో వచ్చుంటారులే అని నా పని మీద నేనున్నా. అమ్మ చూసి మీ పెదనాన్న వచ్చారు, అని ఇంటి తలుపు తీసింది. అప్పటికి నా అన్నం తినడం కూడా అయ్యింది. పెదనాన్నను చూసి చాలా సంతోషం వేసింది. పసిపిల్లాడిలా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వచ్చారు

            వాళ్ళ అక్కాయి(మా అమ్మమ్మ)ని ఆప్యాయంగా చేతులు వేసి పలకరించారు. ఇక కబుర్లు మెుదలయ్యాయి. అందరి క్షేమ సమాచారాలు అడుగుతూనే, ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆయన చెబుతున్నంతసేపూ మనకి మాటలు రావు. వినడం మాత్రమే తెలుస్తుంది. భగవద్గీతలోని విషయాలు అనర్గళంగా చెబుతారు. మా మాటల్లో దొర్లిన మామూలు వాడుక పదాలకు కూడా అర్థాలను ఎంత బాగా చెప్పారో

            వాటిలో కొన్ని అవసరం, అనవసరం. తెలుసు,తెలియదు, వ్యక్తం, అవ్యక్తం ఇలాంటి పదాలను సంపూర్ణంగా వివరించి ఉదాహరణలు కూడా చెప్పి ఆత్మబంధానికి, అనుబంధానికి, ఆత్మీయతకు ఉన్న విలువను కూలంకషంగా చూపించారు. అన్నీ మన గొప్పదనమేనని విర్రవీగే మనకు పరమాత్మ పరమార్థాన్ని వినిపించి, మనం నిమిత్తమాత్రులమేనని మరోసారి గుర్తుచేసారు. తనకు ఆత్మానుబంధం ఎవరితో ఉన్నదో చెప్పి, దేని మీదా మమకారం కాని, మరేదైనా కాని లేదని చెప్తూ, ఇద్దరి మీద మాత్రం ఆత్మీయత మిగిలుందని చెప్తూ, అది ఎందుకన్నదానికి తన దగ్గర సమాధానం లేదని, గతజన్మ బంధమేమోనని అన్నారు. ఆత్మీయతను పంచుకున్న నేను, మా నాన్న ఎంత అదృష్టవంతులమన్నది మాటలకందదు కదా

           మా పెదనాన్న మా వంశంలో తొలి వైద్యులు. చాలా గొప్ప వైద్యులు రోజులలోనే. నాడి చూసి వ్యాధిని చెప్పేవారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా తన వైద్యాన్ని, సాయాన్ని అందించారు. అతి సాదాసీదాగా ఉండే మా పెదనాన్న విద్వత్తుకు ప్రణామం. అడుగులు తడబడుతున్నా, ఆత్మీయంగా వచ్చిన ఆయన ప్రేమకు ఎంత సంతోషమో అక్షరాలకు కూడా అర్థమయిపోయింది. ఇంతకీ మా పెదనాన్న పేరు చెప్పలేదు కదూ.. ఒకప్పుడు దివితాలూకా అవనిగడ్డలో డాక్టర్ యనమదల రాధాకృష్ణమూర్తి అంటే తెలియనివారు బహు అరుదు. అదీ మా పెదనాన్న అంటే..!   

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner