నేస్తం,
మనకేమో కులం కార్డు, దానితో వచ్చే పథకాలు, ఉపయోగాలు అన్నీ కావాలి. మన కులం ఇదని ఎలుగెత్తి ఆవేశంగా అరిస్తే, మన చుట్టూ వున్న నలుగురు మేతావులు అబ్బో! చేతులు ఎర్రబడిపోయేంతగా చప్పట్లు కొట్టేస్తారు. అది చూసి మనం ఉప్పొంగిపోతాం. నాకు తెలియకడుగుతున్నా.. మనం చంకలు గుద్దుకుంటూ చెప్పుకునే కులం మన పక్కనోడు చెప్పుకుంటే తప్పేంటి? రిజర్వేషన్లకు పనికొచ్చిన ట్రంప్ కార్డ్ గొప్పదనం మనది కాదా! దాని ఉపయోగాలు మనం అనుభవించడంలేదా!
సరే ఇవన్నీ పక్కనెడదాం. అక్షరాలకు కులం, మతం ఆపాదించి అవార్డులు, రివార్డులు కొట్టేస్తున్న ఘన చరిత్ర ఎవరికుందంటావ్? మనం రాత రాసే ముందు ఓఁ పాలి ఎనక్కి సూసుకుంటే చరిత్ర కాస్తయినా తెలుస్తుంది కదా! మనకి తెలియని గతమూ కాదది. అయినా మనమేదంటే అదే నిజం. మనమేది రాస్తే అదే చరిత్ర అని మనమనుకుంటే ఎలా! ఎవరికెవరి రాతలు నచ్చుతాయో ఎవరికెరుక. ఒకరి రాతను విమర్శించే సంస్కారం మనదైనప్పుడు అదే సంస్కారం ఎదుటివాడికి ఉంటుందని మరిస్తే ఎలా!
మనకు తెలిసిన అతి సాధారణ విషయమే అయినా మనం ఒప్పుకోలేని నిజాలను దాచేయాలని చూడటం సబబు కాదు. మన పుట్టుక మన చేతిలో ఉండదన్నది జగమెరిగిన సత్యం. అందాలకు, ఒయ్యారాలకు, వగలుకు పట్టం కడుతున్నారని అనుకోవడం కంటే వారి అవసరాలకు పనికివచ్చే వారిని అందలాలు ఎక్కిస్తున్నారనడం కరక్ట్. మీ కులపు పురస్కారాలు మీకే ఇవ్వాలి. అన్య కుల పురస్కారాలు మీకే రావాలి అని అనుకుంటే సరిపోతుందా! మన కులపోడి పేరు మీద అవార్డ్ వేరే కులపోడికి ఇవ్వడమేంటని ప్రశ్నించే మీరు వేరే కులపోడు ఇచ్చే అవార్డులకు అర్హులెలా అవుతారు? ప్రతిభకు సరైన గుర్తింపు లభించడం లేదని గగ్గోలు పెట్టే మీరే మీ అసలు రూపాలను బయటేసుకుంటే ఎవరైనా ఏం చేయగలరు?
ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడు ప్రజా వేదికల మీద ప్రస్తావించని కులాన్ని ప్రస్తావించిన ఘనత మన నాయకులదైనప్పుడు సామాన్యులం మనమెంత? “ యథా రాజా తథా ప్రజా “ అన్న పాత సామెతను గుర్తు చేసుకుంటూ, వీలైతే మనమూ కులమత రాతలు రాసేసుకుంటూ, కుల సాహిత్యాలకు, కుల పురస్కారాలకు జై కొడుతూ, జేజేలు పలికేద్దాం..ఏమంటారూ..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి