12, మే 2023, శుక్రవారం

శతకోటి వందనాలు..!!

నేస్తం,

         మన భారతీయులలో ముఖ్యంగా మన తెలుగువారికి ఉన్నంత విదేశీ మమకారం( వ్యామోహం సరైన పదం కాని మన మనోభావాలు దెబ్బ తింటాయి కదా) మరెవరికి ఉండదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికంగా ఎంతగా వెనుకబడి ఉన్నా, మన రూపాయితో మారకం వేస్తే అమెరికా డాలర్ రోజు రోజూ పైపైకే పోతోంది తప్ప క్రిందికి దిగడమన్న మాటే కనుచూపు మేరలో లేదు. ఉండదు కూడా.

         పై చదువుల కోసం నలుగురూ పంపుతుంటే మనకూ పంపక తప్పడం లేదు. ఒకప్పుడు అమెరికా చదువుల కోసం వెళ్ళాలంటే సరైన గైడెన్స్ దొరికేది కాదు. ఇప్పుడు పుట్టలు పుట్టలుగా కన్సల్టెన్సీలు పుట్టుకొస్తున్నాయి ప్రతిరోజూ. ఇంకేముంది నాలుగు రోజులలో I 20 తెప్పించేస్తాము అంటే నమ్మేస్తాం. కొందరు మనకు తెలిసిన వాళ్ళని వెళితే కనీసం కాలేజ్ లకు అప్లికేషన్ పెట్టడం కాదు కదా, కట్టిన ఫీజ్ కూడా కాలేజ్ కి సబ్మిట్ చేయడం రాని మహా మహా కన్సల్టెన్సీలు బోలెడు. ఇలా వేలకు వేలు నష్టపోయినవారు బోలెడుమంది.

        సరే I 20 ఎట్టకేలకు వచ్చినా, వీసా స్లాట్ కోసం, వీసాల కోసం, బ్యాంక్ లోన్ల కోసం ఇలా రకరకాల తిప్పలు. బాలారిష్టాలన్నీ దాటుకుని, టికెట్ కొనుక్కుని అమెరికా వెళితే..!

ఇక్కడేమో వీసా ఇచ్చినట్టు ఇచ్చి, అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పెద్ద ప్రహసనం. ఇక్కడ వీసా ఇచ్చి మన డబ్బులు ఖర్చు పెట్టించి, అక్కడ I 94 ఇవ్వడానికి.నాటకాలు వేస్తారు. రాత్రిపూట ఎక్కడైనా కాలేజ్ లు కాని, కంపెనీలు కాని ఫోన్లకి, మెయిల్స్ కి రెస్పాండ్ అవుతాయా లేదా అన్న కనీస కామన్సెన్స్ లేకుండా(మెదడు ఉండేది అరికాలులో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు), ఇండియాలో అమెరికా వీసా వచ్చిందన్న ఆనందంతో, కొత్తగా కోటి ఆశలతో అమెరికా ఎయిర్పోర్ట్ లలో దిగే చాలామందికి జరిగే చేదు అనుభవాలు వీసా కాన్సిల్ చేసి, డిపోర్టేషన్ చేసి తిరిగి ఇండియా పంపేయడం అన్నది అతి పైశాచికత్వం. ఇదో పెద్ద స్కామ్ కూడా.

           అమెరికాలో మన తెలుగు సంస్థలు, సంస్థానాలు చాలా ఉన్నాయి కాని ఎవరికి వారు, వారి వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం చూసుకోవడం తప్పించి, ఇలా కొత్తగా వచ్చి, ఇమ్మిగ్రేషన్ లో పలు ఇబ్బందులు పడేవారికి లాయరు కాని, సంస్థలు కాని మాట సాయం కూడా చేయరు. మీ మీ ఓట్ల కోసం, మీ గెలుపు కోసం పరితపిస్తారు కాని నిజమైన సాయం చేయడానికి ముందుకు రారు. దయచేసి మీరు చేసే సాయాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకండి. యుట్యూబులు ఉన్నాయని మీ మీ తేనేపూతల మాటలు పెట్టకండి. అమెరికా నీ సంస్కారానికి శతకోటి వందనాలు..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner