నేస్తం,
“ తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు “ అని వేమన చెప్పిన మాట నిజమని మనకు తెలుసు. అయినా మన లోపాలు మనకి తెలిసినా వాటిని దాయాలని యత్నిస్తూ, ఎదుటివారి తప్పులను ఎంచడానికి భలే సరదా పడతాం. మనిషి నైజం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణాలు సవాలక్ష. “ మనం ” అన్న పదం మనం మర్చిపోయి రెండు తరాలు కావచ్చిందనుకుంటా. గూడు ఒకటే అయినా ఆ గూటిలో గువ్వలు బోలెడు రకాలు. కష్టం నాది కానప్పుడు ఎవరెలా పోతే నాకేంటి? అన్న మనస్తత్వాలు మన చుట్టూనే ఎన్నో తిరుగాడుతున్నాయి. కలికాలం ఇంతేననుకుంటూ సరిపెట్టేసుకు బతికేస్తున్నామిప్పుడు.
ఎదుటివారిలో లోపాలు ఎత్తి చూపినంత త్వరగా మన తప్పును మాత్రం ఒప్పుకోలేం. మన చూపు ఎంత తీక్షణమంటే తెల్ల కాగితంలో ఓ చిన్న నల్ల చుక్కను చూసినంత బాగా కాగితంలో తెలుపు కనబడదు మరి. మనిషన్నాక లోపాలు సహజమే. అసలు లోపం లేకపోతే మనిషే కాడు. మనం చేస్తే ఒప్పు, ఎదుటివాడు అదే పని చేస్తే తప్పు కాదు కాదు భరించరాని నేరమని మనం భావించడంలో అస్సలు మన తప్పే లేదు గాక లేదు. సమస్య తలుపు తట్టని గుమ్మం ఈ భూప్రపంచంలోనే ఉండదు. కాకపోతే కాస్త సమయమటూ ఇటూ అవుతుందంతే. ఆ కాస్త సమయానికే మన మిడిసిపాటును మనం బయటేసేసుకుంటాం.
ధనమయినా, పేరయినా మనకు చెప్పి రాదు. చెప్పి పోదు. కర్మానుసారం జరిగే మంచి చెడులకు మనం గొప్పలు చెప్పుకోవడం ఎందుకో! మూలాలను మరిచిపోతున్న మనకు, మన పేక మేడలు కూలిపోవడానికెంత సమయం కావాలో తెలుకోలేక పోవడం విచారకరం. వస్తూ ఏమి తీసుకురాని మనకు పోతూ కూడా ఏమి తీసుకుపోలేమనీ తెలుసు. అయినా మన నైజాలను కాస్తయినా మార్చుకోలేం. ఇది మన బలహీనత కావచ్చు. బంధాలు బలహీనమవడానికి మన ప్రవర్తనే ముఖ్య కారణం. మనం సరిగా ఉంటేనే కదా మన తరువాత తరాలకు మంచేదో, చెడేదో చెప్పగలం. అలా చెప్ప గలిగిన అర్హత మనకు ఉందా! ఆ చెప్పాల్సిన అవసరం లేదని మనం వదిలేసినప్పుడు మనమెలా వున్నా తప్పు లేదు. ఎవరెలా పోయినా మనకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉండవు.
ఓ బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. అదే ఓ బంధాన్ని దూరం చేసుకోవడం చిటికెలో అయిపోతుంది. మన అవసరాలకు అనుబంధాలను కలుపుకుంటూ, అవసరం తీరాక అనుబంధమంటే ఏమిటో ఎరగని జీవాలు కోకొల్లలు ఇప్పుడు. వారికి గురుతులంటూ ఏమి ఉండవు, జ్ఞాపకాలసలే ఉండవు. దీనిలో వారిని తప్పు పట్టడానికి కూడా ఏమి లేదు. పాపం వారి సహజ లక్షణమది అని సరిపెట్టేసుకుని మన దారిలో మన ప్రయాణం సాగించడమే నేటి రోజుల్లో మంచి పని.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి