12, జులై 2023, బుధవారం

సగటు మనిషి..!!


గూడొదిలి పోదాము 

గడ్డొదిలి పోదాము

ఊరొదిలి పోదాము

వలసెల్లి పోదాము కొడుకో


కాయకష్టం కాయానికెరుక

మాయామర్మం మదికి దెల్వదు

రంగురూపు కంటికెరుక

కన్నీటిగోడు గుండెగూటికి చేరూ


వారాలు మాసాలు వచ్చిపోతున్నాయి

మారని బతుకులు మారాడుతున్నాయి

నేతల తేనెలు నిండుకుండలౌతున్నాయి

చెరిగిన తలరాతలు చెదురుమదురయ్యాయి


నమ్ముకున్న భూమాత నగుబాటు చేస్తోంది

కమ్ముకొచ్చే మేఘాలు కడగండ్లపాలు చేస్తున్నాయి

సక్కంగ సదువుకుంటే కొలువు లేదు 

నోటుకి ఓటేసిన ఉచితాలు ఊతమివ్వడం లేదు


కాలభైరవుడు కన్నెర్రజేసినా

పాపాల చిట్టాలు పండిపోతున్నా

అధికార దాహానికి అంతేలేదు

సగటు మనిషి తీరెప్పుడూ జీవచ్ఛవమే..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner