27, జులై 2024, శనివారం

సోషల్ మీడియా మితిమీరి వ్యవహరిస్తోందా..?

              మితిమీరి వ్యవహరిస్తోంది సోషల్ మీడియానో, మరో మీడియానో కాదు. యా మీడియాలకు బానిసలమైన మనమే. ఏదైనా అతిగా వుండకూడదని మన పెద్దలు ఊరికినే చెప్పలేదు. దేనిని ఎంత వరకు ఉపయోగించుకోవాలో తెలిసినవారు తెలివిగలవారు. గోప్యత, బహిర్గతం అన్న పదాలు మరిచిపోయి మన ఇష్టానుసారం ఇప్పటి టెక్నాలజీని వాడుకోవడం స్టేటస్ సింబల్ గా అనుకుంటున్నారు కొందరు

            ఒకప్పటి రాతియుగం నుండి ఇప్పటి అంతరిక్షయానం వరకు మానవ మేధస్సు ఎంత పరిణితిని సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. అప్పుడు తినడానికి, తలదాచుకోవడానికి తన తెలివిని ఉపయోగించడం మెుదలు పెట్టిన మానవుడు, ఈనాడు విశ్వాంతరాళంలో వింతలను వెలికి తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాగే ఉత్తరాల నుండి ఈమెయిల్స్, వాట్సప్, మెసెంజర్, టెలిగ్రామ్ ఇలా పలురకాలైన ఆధునిక వసతులు అందుబాటులోనికి వచ్చాయి. ముఖ్యంగా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టే విజ్ఞానం మన సొంతమైందిప్పుడు. అది మంచికా చెడుకా అన్నది మన విచక్షణకు వదిలేసారు.

             ఇంటి విషయాల నుండి ప్రపంచ రాజకీయాల వరకు అన్నీ క్షణాల్లోనే మనకు అందుబాటులో వుంటున్నాయి. విషయం ఏదైనా మనకు అనిపించింది వెనువెంటనే యా సోషల్ నెట్ వర్క్ లలో పోస్ట్ చేయడం క్షణాల్లో పని. ఎదుటివాడు బాధ పడుతుంటే దానిని కూడా వీడియో తీసి, పోస్ట్ చేసి మనకు ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయో చూసుకుని సంతోషపడే మనస్తత్వాలు మనవై పోయాయిప్పుడు. విచక్షణ లేని మాటలు, అర్థంపర్థం లేని విషయాలను కూడా పెట్టడం అటుంచితే, ఎవరికి వారు తమ ఆనందాన్ని పంచుకుంటుంటే, వాటికి విపరీతార్థాలు తీయడం, వ్యంగ్యంగానే కాకుండా, చాలా అసభ్యంగా కామెంట్లు చేయడం గొప్పగా ఫీల్ అవుతున్నారు కొందరు

               సోషల్ మీడియాలో కొందరి ప్రవర్తన చూస్తుంటే, వీళ్లు మనిషి అన్న సంగతే మరిచిపోయారనిపిస్తోంది. పక్షి తన పిల్లలు వానలో తడిచిపోకుండా తన రెక్కల కింద దాచి కాపాడటం చూసి, అది వీడియో తీసి, దానికి మహా మానవత్వమున్న మనుష్యులుగా ఫీల్ అయిపోతూ, వీడియోకి గొప్ప క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద ఘనకార్యం చేసినట్లు ఫీల్ కావడం, ఎవరో ఒకావిడని వాళ్ళాయన తన పుట్టినరోజుకి బయటకు తీసుకు వెళుతుంటే, విషయాన్ని ఆవిడ సంతోషంతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే, దానికి వాళ్లని కన్న అమ్మాబాబు కూడ సిగ్గుపడే విధంగా కామెంట్లు పెట్టిన వెధవలు, కొందరేమో మనకి ఎలాగూ రాదు, ఎదుటివాళ్లు చేసినా చూసి సంతోషించడం రాని పేటియం వెధవలు పనికిమాలిన కామెంట్లు పెట్టడం..ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు

                 విపరీతాలు చూస్తూ మనం ఏమి చేయలేక చూసి చూడనట్టు చేతులు దులిపేసుకు పోవడం. మీడియా అయినా మితిమీరి వ్యవహరించదుమనల్ని కూడా అలా ప్రవర్తించమని చెప్పదు. మితిమీరిన వ్యవహారాలు నడిపేది వాటిని ఉపయోగించుకుంటున్న మనమే. బతికుండగానే అమ్మాబాబు సంపాదించిన ఆస్తులు కావాలి కాని, మనల్ని పెంచి పోషించిన బాధ్యతలు మనకి అవసరం లేదు. రక్త సంబంధాలను కూడా అవసరాలకు వాడుకునే మనకి మీడియా వ్యవహారాలు లెక్కలోనివి కావు. వ్యవహారమైనా మితిమీరడం అన్నది మనం పెరిగిన పెంపకం మీద ఆధారపడి వుంటుంది. సామాజిక మాధ్యమాల మీద కాదు. తప్పొప్పులు సామాజిక మాధ్యమాలను ఎలాబడితే అలా వాడుతున్న మనవే


 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner