నేస్తం,
బంధాన్ని కొనసాగించాలంటే బోలెడు సర్దుబాట్లు, మరెన్నో దిద్దుబాట్లు వుంటాయి. అదే బంధాన్ని వదిలించుకోవాలంటే మనకు సవాలక్ష కారణాలు భూతద్దంలో ఏంటి..మామూలు అద్దంలోనే కనిపించేస్తాయి. రక్త సంబంధమైనా, మరేదైనా అనుబంధమయినా పెంచుకోవాలంటే కష్టం కాని తుంచుకోవడం ఎంతసేపు ఈరోజుల్లో. బాధ్యతల నుండి తప్పుకోవడానికి కారణాలు వెదకడం మనిషితనమని అనిపించుకోదు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన జన్మకు సార్థకత.
అమ్మ, ఆలిలో ఎవరు ముఖ్యమని కాదు, మనం ఎవరి విలువ వారికి ఇస్తున్నామో లేదో మన మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది. ఎంతసేపూ మనమే నిజాయితీపరులమని చెప్పుకుంటే సరిపోదు. మన నిజాయితీ ఏపాటిదో నలుగురు చెప్పుకుంటే అప్పుడు దానికి విలువ. ఎదుటివారి మీద నెపం వేసే ముందు మన ప్రవర్తన ఎలావుందని మనం ఓ క్షణం ఆలోచిస్తే మాట తూలడం అన్న పొరపాటు జరగకుండా వుంటుంది.
కోపం, ఆవేశం మనిషన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రేమాభిమానాలు కొందరికే వుంటాయి. మనం ఏమన్నా ఎదుటివారు ఊరుకుంటున్నారంటే అది వారి చేతగానితనం కాదు. బంధాలను కొనసాగించడానికి వారు తమను తాము తగ్గించుకుంటున్నారని అర్థం. దూరం రెండిళ్ల మధ్యనా సమానమే. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. మనమిచ్చినదే ఎదుటివారు మనకిస్తుంటే తీసుకోవడానికి కష్టంగా వుందనుకుంటే ఎలా? ఏ మనిషికయినా ఒక స్థాయి వరకే ఓర్పు, సహనం వుంటాయి. అవి దాటితే మనసు సముద్రానికి ఆనకట్ట వేయగలమా..!
ఎదుటివారి నుండి ఏదైనా మనం ఆశించడానికి, మనకి ఏపాటి అర్హత వుందో చూసుకోవాలి. మన అవసరాలు తీర్చుకుని, “ఏరు దాటి తెప్ప తగలేయడం” కాదు. ఒకప్పుడు మనిషి చనిపోయిన తరువాత ఆస్తుల పంపకాలు జరిగేవి. ఇప్పుడు మనిషి బతికుండగానే పం(అం)పకాలు జరుగుతున్నాయి. డబ్బుల బంధాలు తప్ప అనుబంధాలు అవసరం లేని మనుష్యులుగా మారిపోతున్నాం.అవసరానికి నటించడమే మన తక్షణ కర్తవ్యమన్నట్టుగా మనం మసలుతున్నాం. ఋణపాశాలు అక్కర్లేని ధనపాశాల చుట్టూ మనం తిరుగుతున్నాం. రక్త సంబంధాలు కూడా రోతగా మారిపోతున్న ఈరోజులను చూస్తూ బాధపడటం మినహా ఏమి చేయలేక పోతున్నాం..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి