3, జనవరి 2025, శుక్రవారం

జీవన మంజూష జనవరి25


 ష్..! గప్ చుప్..!

ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్..!

ఇది మనం ఎప్పుడో విన్న పాటే కదా అని తీసిపారేయకండి. వ్యవస్థలో చూసినా మోసమే. ఎవరిని నమ్మలేని పరిస్థితి. రానురాను మనిషి ఇంతగా దిగజారి పోవడానికి కారణం డబ్బు. మరి డబ్బు జబ్బుకు సరైన వైద్యం చేసే వైద్యులు ఎక్కడున్నారో, ఎప్పుడు వస్తారో తెలియదు

       సేవా కార్యక్రమాల కోసం నిధుల సేకరణ, సంస్థల ఏర్పాటు మంచిదే. కాని వాటిని సద్వినియోగం చేయగల సమర్థత ఎందరికుంది? ఎవరికి వారు వారి గొప్పల కోసం పదవులను అలంకరించడం, పదవి కోసం మిలియన్లు ఖర్చు పెట్టడం మినహా ఆపదలోనున్న వారికి కాని, అవసరమైన వారికి కాని సహాయ సహకారాలు అందించడం చూస్తున్న దాఖలాలు లేవు. పేరు కోసం, పదవుల కోసం ప్రాకులాటలు మాత్రం మహా బాగా చేస్తుంటారు కొందరు పెద్దలు. పత్రికల్లో, వార్తల్లో తాము చేసిన సేవాకార్యక్రమాలు ఎంత వరకు కవరయ్యాయో చూసుకోవడంలో వున్న శ్రద్ధ, ఆయా సేవలు అందించడంలో చూపించడం లేదన్నది వాస్తవ సత్యం.

        సంస్థలో ఉన్నతస్థాయిలో వున్నవారే, సేవాకార్యక్రమాలకు వినియోగించాల్సిన సొమ్మును తమ స్వంతానికి వాడుకుంటే, అదీ కోట్లలో సంస్థ సొమ్మును తీసుకుంటే ఎవరికి తెలియలేదట. మోసం తర్వాత రెండు, మూడు సంవత్సరాలకు బయటపడితే, ఎవరికివారు తమదేం లేదు, తాము ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరులమని చెప్పుకుంటూ, అసలు విషయాన్ని దాటవేయడం ఎంత బావుందో. చాకచక్యం మిగతా సేవా కార్యక్రమాల్లో వుంటే ఎంత బావుండు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు

          ఇంటి పెద్దకు ఇంట్లో విషయాలు తెలియక పోవడం ఎంత హాస్యాస్పదం! ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, సంవత్సరాలుగా జరిగిన నగదు బట్వాడా గురించి సంస్థ పెద్దలకు, అధికార బృందానికి, యాజమాన్యానికి తెలియక పోవడం అన్నది నమ్మదగిన విషయమేనా! తప్పు జరుగుతుందని తెలిసినా, దానిపై చర్యలు తీసుకోనప్పుడు తప్పు జరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులు ఎవరు? ఎవరికి వారు కర్ర విరగకుండా, పాము చావకుండా తమ మాటల చాకచక్యాన్ని చూపిస్తే నమ్మేయడానికి వున్నారందరు అనుకుంటున్నారు

        విషయమైనా నాలుగు రోజులు వార్తల్లో వుంటుంది. ఇప్పుడున్న వర్చ్యువల్ ప్రపంచంలో క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేయడం, మరుక్షణంలో మరిచిపోవడం మనకు మామూలే. విషయం తేలే వరకు వదలను అన్న న్యూస్ ఛానల్ ఏమయ్యిందో మరి. కొందరు రాజకీయ నాయకులు, నటులు మాత్రమే జీవించేస్తారు అనుకుంటే, అది మన పొరపాటని ఇలా కొన్ని సంస్థలు, వ్యవస్థలు మనకు నిరూపిస్తున్నాయి. సేవ చేయకపోయినా పర్లేదు. ముసుగులో మీ మీ నిజస్వరూపాలను బయటేసుకుని మీ పరువే కాకుండా జాతి పరువు కూడా తీయకండి.


      

     


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner