23, జూన్ 2025, సోమవారం

‘మని’షి..!!

 ఆశల 

ఆకాశంలో విహరిస్తున్నాడు

మనిషి


తానుండాల్సింది

అవనిపైనని

మరిచి..!!

22, జూన్ 2025, ఆదివారం

కనీస విలువలు..!!

   2008 నుండి ఇప్పటి వరకు అంటే గత 18 సంవత్సరాలుగా మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుండి మాకు చాతనయినంత ప్రతి సంవత్సరం దాదాపుగా 60/70 వేలకు ఒక్కోసారి లక్ష ఆపైన కూడా  చదువుకునే పిల్లలకు ఇస్తూనే వున్నాము. చాలామంది పిల్లలు చదువు అయిపోయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. 

    మనం ఇచ్చే 5/10 వేలతో వారి చదువులు అయిపోలేదు. ఇలాగే మరికొందరు వారికి సాయం చేసారు. గతాన్ని మర్చిపోతే మనం మానవత్వమున్న మనుష్యులం అనిపించుకోము. మనం పొందిన సాయం గుర్తుంచుకుని, మనం కూడా మరొకరికి సాయపడాలని అనుకోకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. 

       మేము అందరిలానే రూపాయి దాచుకుని మా అవసరాలకు ఖర్చుపెట్టుకోగలం. మాకు జీవితాన్ని ఎంజాయ్ చేయడం వచ్చు. పదిమందికి సాయం చేసే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చినప్పుడు కనీసం ఒక్కరికైనా చేయకపోవడం అన్నది ఎవరి విజ్ఞతకు వారికే వదిలేస్తున్నా. 

        మీరు సంపాదించుకుని బావుండటం మంచిదే. పొందిన సాయాన్ని కాస్తయినా తిరిగి మరొకరికి చేయాలన్న మంచిమనసు ఈ 18 సంవత్సరాలలో సాయం పొందిన వారిలో ఒక్కరికి కూడా లేనందుకు చాలా బాధపడుతున్నాను. మన పెంపకాలు ఎంత బావున్నాయన్నది ఇలాంటి సంఘటనలను బట్టే తెలుస్తుంది. 

  “తీసుకోవడం మాత్రమే తెలిస్తే సరిపోదు, కాస్తయినా తిరిగివ్వడం కూడా తెలియాలి. చదువుకుంటే సరిపోదు, కనీస విలువలు కాస్తయినా నేర్చుకోండి”.

9, జూన్ 2025, సోమవారం

రెక్కలు

 1.  శుభాలకు అక్కర్లేని 

చుట్టరికం

అశుభాలకు

అవసరమా..!


లెక్కలు

సరిజేయబడును..!!

2.  జీవితమంటే

పోరాటమే

బంధాలన్నీ

బహుదూరమే 


అలల

కలలే అన్నీ..!!

3.  పున్నమి

వెన్నెల

జామాకుల

సోయగాలు


చీకటి

చిత్రాలు..!!

4.  పదులు

వేలు

సమానం

కాదు


లెక్కలు

నేర్చుకోవాలి..!!

5.  బతుకుతున్నది

అబద్ధంలో

అభద్రతా భావంలో

మనసు


వెలుతురు చూడలేని

చీకటి..!!

6.  మనం

చేసిందే

మనకి

తిరిగి వస్తుంది 


కాలానికి

గుర్తెక్కువ..!!

7.  మనకు

ఇవ్వడమూ చేతకాదు

ఇచ్చినా 

తీసుకునే సుగుణమూ లేదు


అర్హత

కాలం నిర్ణయిస్తుంది..!!

8.  భజన చేసేది

మనమే

భోక్తలమూ

మనమే


భుక్తి కోసమే

కుయుక్తులు..!!

9.  రికార్డుల వేట

ఒకరిది

ఆకలి ఆట

మరొకరిది


కళా నైపుణ్యం 

అద్భుతమే..!!

10.  స్వచ్ఛమైన 

మనసులా

సేదదీరిన

పచ్చదనమిలా


ప్రకృతి 

వైచిత్ర్యం..!!

11.  ఎదగొంతు

చేజారింది

వ్యథశిలగా

తాను మారింది


అమ్మదనం

అంతేనేమో..!!

12.  ఉన్నా

లేనట్లే

లేకున్నా

ఉన్నట్లే


కొందరంతే

గాలిలా..!!

13.  విలువ

గౌరవం

ప్రవర్తన 

పరివర్తన


గోడక్కొట్టిన

బంతి..!!

14.  మెుక్కుబడి

జీవితాలు

పెట్టుబడి 

వ్యాపారాలు 


కాలం వినిపించే

కథలు..!!

15.  రాత

లోతు

మనసు

పుటలు


అక్షరాల

చతురత..!!

16.  ఘనమైన రాతలు

మనవి

గడ్డిపోచ బతుకులు

ఎదుటివారివి


కాలం

న్యాయాధిపతి..!!

17.  కొందరికే

తెలుసు ఒకప్పుడు

ఇప్పుడు

అందరికి ప్రేమే


కాలాతీతం

“స్వేచ్ఛ”..!!

18.  ఆటేదైనా

ఒకటే

గుర్తింపు

ముఖ్యం


గెలవడమే

లక్ష్యం..!!

19.  దొరికినంత

దోచుకోవడమే

తిరిగివ్వడం 

తెలియదు


పరాన్నజీవులు 

బహుముఖాలు..!!

20.  అంటరానిదనం

మనది

ఆకర్షించే గొప్పదనం 

వారిది


అత్తకు అమ్మకు

వ్యత్యాసం..!!

21.  ఆశయం

మనిషిది

సంకల్పం 

మనసుది


నమ్మకం

బలమైన పునాది..!!

22.  అన్నదమ్ముల 

అనుబంధం 

అక్కచెల్లెళ్ల 

అభిమానం 


ఏ బంధంలో

ఏముందో..!!

23.  చీకటి 

సర్దుబాటులే అన్నీ

వెలుతురు చూడలేని

బతుకులు


నటనా కౌశలానిదే

చాకచక్యం..!!

24.  అద్దకపు రంగుల

అంకాలు

తేనెచినుకుల

పలుకులు


అంతరంగాన్ని అంటని

చేతలు..!!

25.  మాట

మౌనం

మనసు

శూన్యం


వాటమెరిగిన

అక్షర విన్యాసం..!!


8, జూన్ 2025, ఆదివారం

రాత..!!

 చేతిరాత

అందమైనదే

చెదిరిన

నుదుటిరాతే

ఎగతాళిగా

నవ్వుతోంది

కొన్ని జీవితాలింతే

చావుకి 

బతుకుకి మధ్యలో..!!

అప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు..!!

 https://youtu.be/rQDoDOHvX_Q?si=nmRkiwlQf6fZ-7vc

       అప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అయిన అమరావతి మహిళలు ఇప్పుడు “వేశ్య”లు అయ్యారు. దీనిలో వింతేమీ లేదు లెండి. అదెలా అంటే పవిత్రమైన వృత్తిలో వున్న ఇద్దరు మహానుభావులు సాక్షి న్యూస్ ఛానల్ ఆస్థాన పండితులు “కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు తమ చక్కని హావభావాలతో అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణిస్తూ చాలా విలువలతో కూడిన డిబేట్ ను అందించారు. చాలా సంతోషం వారి విజ్ఞతకు, మేధావితనానికి.


       గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా యావత్ ప్రపంచానికి తేటతెల్లమైన వారి “రాజభాష” ఇంటాబయటా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ నికృష్టుల భాషకు, వంకర, సంకర నవ్వులు రువ్విన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు ఇంకా మారలేదనడానికి వారి ప్రతిష్టాత్మకమైన సాక్షి ఛానల్ లో జరిగిన ఈ డిబేట్ ప్రత్యక్ష సాక్ష్యం. చట్టం ఎవరికి చుట్టం కాదన్న ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుగారు మెున్నీమధ్య జరిగిన సంఘటనలో అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ “ఎవరు మహిళలను కించ పరిచినా ఊరుకోము” అన్నారు కదా. మరి ఇప్పుడు ఏమయ్యాయి ఆ మాటలు? సాక్ష్యాలు వున్నా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారా!


        ఐదేళ్లనాడు కాస్త అటూఇటూగా దాదాపు ఇదే సమయంలో నాకు, నాతోపాటు మరికొందరికి ఎంత అవమానం, వికృతమైన ట్రోలింగ్ జరిగిందో చాలామందికి తెలుసు. ఆ నికృష్టమైన, నీచమైన ట్రోలింగ్ చేయించడంలో ప్రముఖపాత్ర కూడా సదరు ఈ పాత్రికేయవంశమే(జర్నలిస్టు సంఘం). ఆ జర్నలిస్టు సోదరుడు కూడా మా ప్రాంతం వాడే అని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది. నన్నే కాకుండా నా స్నేహితురాలిని కూడా ట్రోలింగ్ చేయించిన విధానంలో పాపం దొరికిపోయాడు. వారికి కులపిచ్చి వుండొచ్చు కాని ఎదుటివారికి లేకున్నా ఆ పిచ్చిని అంటగట్టేస్తారు సదరు జర్నలిస్టు సోదరులు. 


         పాత్రికేయ వృత్తి పవిత్రమైనది. మీరన్న ఆ వేశ్యలు చాలా విలువలతో బతుకుతున్నారు. కనీసం మీరు వారి కాలి గోటికి కూడా సరిపోరు. మీ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారో, ద్రోహం చేస్తున్నారో మీ మన”స్సాక్షి”ని అడగండి. మహిళను, పిల్లలను అంగడి సరుకులుగా మార్చిన మీవంటి వెధవలను అనడానికి కూడా ఏ పదమూ సరిపోదు. ఇప్పుడున్నది చేతగాని, చావచచ్చిన ప్రభుత్వమైతే మీ ఆటలు సాగుతాయి. ఏదోకరోజు మీ లెక్కలు సరిజేయబడతాయని బలంగా నమ్ముతున్నాను.

5, జూన్ 2025, గురువారం

తెలివి..!!



కరంట్ ఛార్జీల

పెంపు లేదు

ఇంధనపు ఖర్చుల 

బాదుడే బాదుడు

వాడకానికి 

వాడని దానికి 

కలిపి మోపెడు

సమయం మించకుండా 

చెల్లించినా

ఆలస్యానికి సర్ఛార్జీలు

అన్నీ కలిపి

సంవత్సరాంతానికి

అదనపు భారాలు

పెరిగిన గాస్

నిత్యావసర సరుకుల 

కూరగాయల ధరలు

తరగని రైతుల వెతలు

కొలువులు లేని చదువులు

మోయలేని అనారోగ్యాలు 

సొమ్ము చేసుకుంటున్న

కార్పొరేట్ సంస్థలు

విజన్ అవసరమే

ముందుచూపు ముఖ్యమే

అంతకుమునుపు

సామాన్య జీవితాలు

మనగలగడమన్నది అత్యావశ్యకం 

మూలధనం కోసం

అదనపు సుంకాలు వేయడం

సబబు కాదు

సంపద పెంచడం 

ఇలా కాదేమో పెద్దాయనా..!!

3, జూన్ 2025, మంగళవారం

జీవన మంజూష జూన్25


 నేస్తం,

         జవాబుదారీతనం అనేది మనిషిలో వుండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. దాదాపుగా ఇప్పటి రోజుల్లో మనలో చాలామందికి పదమే తెలియదు. పదమే తెలియనప్పుడు ఇక లక్షణం గురించి మనం మన తరువాత తరాలకు ఏం చెప్పగలం? అన్నట్టు మనకు తెలియని విషయాల గురించే కదా మనం బాగా ఇతరులకు చెప్పగలం! ఇది ఈనాటి మనిషి ప్రత్యేక లక్షణం కూడానూ

          పుట్టడం, చావడం మహానుభావుడో అన్నట్టుగా అది నిరంతర ప్రక్రియే. కాకపోతే మన పుట్టుకకు, చావుకు మధ్యన జీవితమే మనమేంటన్నది నలుగురికి కాకపోయినా కనీసం మనకయినా తెలియాలి. ఇప్పుడు పుట్టుక నుండి చావు వరకు అన్నీ కొనుక్కోవడమే. ప్రతిదానికి ప్యాకేజ్ అంటూ మనకు అందుబాటులోనే అన్నిపిండి కొద్దీ రొట్టెఅన్నట్టన్నమాట.

          చూడటానికి ఉప్పు, కర్పూరం ఒకేలా వున్నా రెండూ వేరువేరని రుచి చూసినప్పుడు తెలుస్తుంది. మనిషిని చూడగలం కాని మనిషిలోని మనసుని అంచనా వేయడం అసాధ్యం. ఎవరు ఏమిటన్నది కాలక్రమేణా పరిచయం పెరిగినప్పుడు తెలుస్తుంది. మంచి జరిగినప్పుడు సంతోషం, చెడు జరిగినప్పుడు అదో పాఠంలా తీసుకోవడంలోనే మన విజ్ఞత బయటబడుతుంది. పెద్దలన్నట్టు పుట్టలో పాముందోఅనుభవపూర్వకంగా తెలుస్తుంది.

            సరిహద్దు కావలి, వ్యవస్థ మారాలంటూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నామనుకునే కొందరు పోరాటవాదులు ఒకటి కాదని మనకూ తెలుసు. నాకయితే మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థే భక్షక వ్యవస్థగా మారడం గుర్తుకొస్తుంది. మన శరీరంలోని యాంటిబాడీస్ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి శరీరానికి రక్షణ కవచంగా నిలిచి, రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అదే యాంటిబాడీస్ తాము చేయాల్సిన పనికి వ్యతిరేకంగా మారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి, శరీరాన్ని రోగాల మయం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. దీనినిఆటో ఇమ్యూన్ డిజార్డర్అంటారు. దీనిని సమూలంగా నిర్మూలించడానికి సరైన మందు కూడా లేదు. మన వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇది గుర్తుకువచ్చింది

            సమాజంలో మార్పు రావాలంటే ముందు వ్యక్తి ఆలోచనల్లో మార్పు మెుదలవ్వాలి. మార్పు ఒకరిలో కాకుండా అందరి ఆలోచనల్లో చోటు చేసుకోవాలి. గత కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా జనం కోసం ఉద్యమాలు చేస్తున్నా, జనం ఆలోచనల్లో మార్పు మెుదలవలేదంటే అది ఉద్యమ లోపమా లేక మంచిని అందుకోలేని ప్రజల లోపమా! ఎవరేమనుకున్నా మన వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటున్నామన్న ఆలోచన మనకుండాలి. మంచి మార్పు అందరికి ఆమోదయోగ్యమే..!



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner