నేస్తం,
జవాబుదారీతనం అనేది మనిషిలో వుండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. దాదాపుగా ఇప్పటి రోజుల్లో మనలో చాలామందికి ఈ పదమే తెలియదు. పదమే తెలియనప్పుడు ఇక ఆ లక్షణం గురించి మనం మన తరువాత తరాలకు ఏం చెప్పగలం? అన్నట్టు మనకు తెలియని విషయాల గురించే కదా మనం బాగా ఇతరులకు చెప్పగలం! ఇది ఈనాటి మనిషి ప్రత్యేక లక్షణం కూడానూ.
పుట్టడం, చావడం ఏ మహానుభావుడో అన్నట్టుగా అది నిరంతర ప్రక్రియే. కాకపోతే మన పుట్టుకకు, చావుకు మధ్యన జీవితమే మనమేంటన్నది నలుగురికి కాకపోయినా కనీసం మనకయినా తెలియాలి. ఇప్పుడు పుట్టుక నుండి చావు వరకు అన్నీ కొనుక్కోవడమే. ప్రతిదానికి ఓ ప్యాకేజ్ అంటూ మనకు అందుబాటులోనే అన్ని “పిండి కొద్దీ రొట్టె” అన్నట్టన్నమాట.
చూడటానికి ఉప్పు, కర్పూరం ఒకేలా వున్నా రెండూ వేరువేరని రుచి చూసినప్పుడు తెలుస్తుంది. మనిషిని చూడగలం కాని ఆ మనిషిలోని మనసుని అంచనా వేయడం అసాధ్యం. ఎవరు ఏమిటన్నది కాలక్రమేణా పరిచయం పెరిగినప్పుడు తెలుస్తుంది. మంచి జరిగినప్పుడు సంతోషం, చెడు జరిగినప్పుడు అదో పాఠంలా తీసుకోవడంలోనే మన విజ్ఞత బయటబడుతుంది. పెద్దలన్నట్టు “ఏ పుట్టలో ఏ పాముందో” అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
సరిహద్దు కావలి, వ్యవస్థ మారాలంటూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నామనుకునే కొందరు పోరాటవాదులు ఒకటి కాదని మనకూ తెలుసు. నాకయితే మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థే భక్షక వ్యవస్థగా మారడం గుర్తుకొస్తుంది. మన శరీరంలోని యాంటిబాడీస్ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి శరీరానికి రక్షణ కవచంగా నిలిచి, రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అదే యాంటిబాడీస్ తాము చేయాల్సిన పనికి వ్యతిరేకంగా మారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి, శరీరాన్ని రోగాల మయం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. దీనిని “ఆటో ఇమ్యూన్ డిజార్డర్” అంటారు. దీనిని సమూలంగా నిర్మూలించడానికి సరైన మందు కూడా లేదు. మన వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇది గుర్తుకువచ్చింది.
సమాజంలో మార్పు రావాలంటే ముందు వ్యక్తి ఆలోచనల్లో మార్పు మెుదలవ్వాలి. ఆ మార్పు ఒకరిలో కాకుండా అందరి ఆలోచనల్లో చోటు చేసుకోవాలి. గత కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా జనం కోసం ఉద్యమాలు చేస్తున్నా, ఆ జనం ఆలోచనల్లో మార్పు మెుదలవలేదంటే అది ఉద్యమ లోపమా లేక మంచిని అందుకోలేని ప్రజల లోపమా! ఎవరేమనుకున్నా మన వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటున్నామన్న ఆలోచన మనకుండాలి. మంచి మార్పు అందరికి ఆమోదయోగ్యమే..!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి