25, జులై 2025, శుక్రవారం

రెక్కలు

 1.  కొన్ని 

జీవితాలింతే

ఎవరికి 

కాకుండా పోతూ


విధాత చేవ్రాలు

వి’చిత్రమైనది..!!

2.  విడివడలేని

ముడులు

విప్పుకోలేని

పాశాలు


చేజారుతున్న

అనుబంధాలు..!!

3.  చేసాం చేసాం

అంటాం

చేయించుకున్నది

మర్చిపోతాం


మని’షి

సహజ లక్షణం..!!

4.  బాధను

పంచుకోలేరు

బాధ్యతలను

భరించలేరు


గాలివాటపు

జీవితాలు..!!

5.  కొత్తగా పెరిగే

దూరమేముంది?

దగ్గరితనమసలే

లేనప్పుడు 


కావాలనుకున్నా

దొరకనివి కొన్ని..!!

6.  కోల్పోయిన 

కాలం 

ఎప్పుడూ

విలువైనదే


చేజార్చుకుంటున్న

అనుబంధాలు..!!

7.  అసలు

నకలు

నిజాయితీ

నటన


అన్నీ

ఒకే గాటిన..!!

8.  అదృష్టానికి 

ఆయువు తక్కువ

దురదృష్టానికి

ఊపిరెక్కువ


ఫలితం

మనది మాత్రమే..!!

9.  నెపం

వేయడం

నేరం

మోపడం


ఖర్చేం

అవదు..!!

10.  విషయసూచిక

ముందే తెలిసినా

విషాద

సంచికలే


కొన్ని 

జీవిత పుస్తకాలెప్పుడూ..!!

11.  తిరస్కారం 

అలవాటే

పురస్కారం 

పలకరించనప్పుడు


రాజకీయ 

చతురత..!!

12.  తీసివేతలు

రావడం లేదు

కూడికలు

ఎక్కువయ్యాయని కాబోలు


లెక్కలు

నేర్చుకోవడం అవసరమే..!!

13.  నీతులు 

చెప్పడానికి ఏముంది

పెద్దబాలశిక్ష

చదివితే చాలదూ


ఆచరణే

రావాలి..!!

14.  స్వప్న సౌధాలలో

విహారం

కలలకు సమయమే లేని

జీవితాలు 


సాకారానికి

ఆకారం తోడ్పాటు..!!

15.  విరామం

అవసరమే

తీరం తెలియని

దూరాలకు


వారధి

విరిగిపోయింది..!!

16.  మరలిరాని

క్షణాలు

దగ్గరవలేని

దూరాలు


మనసు

మమకార’మది..!!

17.  సాయం

చేయము

ఉపయోగించుకోవడం

వెన్నతో పెట్టిన విద్య


స్వభావం

సహజసిద్ధం..!!

18.  నమ్మితేనేగా

మోసపోయేది

మనిషైనా

మనసైనా


కాలాతీత

వ్యక్తులు..!!

19.  వాచకం

మరిచిపోయాం

వాచాలత్వం

పెరిగి


తూకం

అటుదిటు..!!

20.  మనలో

లేనిది

కొందరిలో 

ఉన్నది


మెచ్చుకునే

గుణం..!!

21.  మాట

మనిషి

ముందు

వెనుక


వ్యక్తిత్వం 

బట్టబయలు..!!

22.  విస్తరిది 

ఏముంది 

వడ్డించేవారు

మనవారైనప్పుడు


ధనసంబంధాలకు

విలువెక్కువ ..!!

23.  చేసేది

ఆత్మదానం

అవుతోంది

అపాత్రదానం


అక్షరాలకంటని

మాలిన్యం..!!

24.  సఖ్యత 

చిరునామా

ప్రపంచమంతా 

అరచేతిలోనే


వెతుకుతూనే

ఉండాలి..!!

25.  బొమ్మకు ప్రాణం పోసిన

బ్రహ్మ 

బతుకునే ఆటగా మార్చిన

కర్మ


రాతను మించినది లేదన్నది

సత్యం..!!

26.  మనసు

చదవగలిగితే

మౌనాన్ని 

వినగలం


మనిషి

మరో దృష్టికోణం..!!

27.  భోంచేయడానికి

బంధువులు 

బాధ్యతలక్కర్లేని

అనుబంధాలు


అయోమయంలో

బంధాలు..!!

28.  ఆదుకున్న

రోజులు

ఆదమరిచిన

కాలము


గుర్తే లేని

గతమైంది..!!


29.  బాధలు

కొన్ని

బరువులు

ఇంకొన్ని


మోసేవాళ్ళకు

అలవాటే..!!


30.  జీవించడంలో 

అర్థం 

చెప్పాల్సినవి 

చేయాల్సినవి


ఒక మంచి

ప్రేమ కథ..!!

7, జులై 2025, సోమవారం

అరుదైన ఆత్మీయ కలయిక..!!

 






        “మన కోసం మన ప్రపంచం” ముఖపుస్తకంలో ఇప్పుడు ఎన్నో సమూహాలు వున్నాయి. కాని ఈ “మన కోసం మన ప్రపంచం” సమూహం చాలా ప్రత్యేకమైనది. కొన్ని నెలల క్రిందట శిరీష కొసరాజు నన్ను ఈ సమూహంలో జత చేయడానికి అడిగినప్పుడు..నేను రాయడం తక్కువేనమ్మా, గ్రూపుల్లో పోస్టులు పెట్టడం లేదు అని అన్నప్పుడు, మీరు మా గ్రూపులో వుండండి చాలు, మీకు వీలున్నప్పుడల్లా చూసి స్పందించండి అన్నారు. సరేనని ఈ గ్రూపులో జాయిన్ అయ్యాను. అడపాదడపా కొందరి పోస్టులకు, పుట్టినరోజులకు నా స్పందనలు పెడుతున్నాను. 

        నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ఉగాది పురస్కారం లభించిన తర్వాత, నా మెుదటి పుస్తకం “అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు” ఆవిష్కరణకు వచ్చి అప్పటి నుండి ఆత్మీయురాలుగా మారిన పద్మజ కోగంటి నుండి ఫోన్ వచ్చింది. వై వి రావు గారు మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. తర్వాత ఇంటికి కూడా వచ్చి వారి ఆత్మీయ సత్కారాన్ని అందించారు. ఈ గ్రూప్ మీట్ కి రమ్మని చెప్పారు.

       నా అనారోగ్య కారణం దృష్ట్యా రావద్దని అనుకున్నా కాని మా తమ్ముడు గుడిసేవ విష్ణుప్రసాద్ మాస్టారు కొద్దిసేపు వుండి వెళిపోదురు రండి అని అంటే, ఓ గంట వుండి వెళిపోదామనుకున్నా. పెద్దలందరికో నన్నూ అతిథిగా ఆహ్వానించి, ఆత్మీయ సత్కారాన్ని అందించారు.

         పెద్దలందరు చక్కని జీవితానుభవాలను, మనం ఎలా జీవించాలన్న ఎన్నో విషయాలను చెప్పారు. తాత్వికత,చెమక్కులు, చురకలు, హాస్యపుజల్లులు ఆద్యంతమూ వెల్లివిరిసాయు. 

కొందరు సభ్యులు చేసిన అవయువ, శరీర దానాలతో మరణానంతరమూ ఎలా జీవించాలో కూడా తెలియజేసారు. వారికి హృదయపూర్వక అభినందనలు.  

              ఇంతగొప్ప కలయికలో నాకూ భాగమిచ్చినందుకు వై వి రావు గారికి, గ్రూపులోని ప్రతిఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు.

3, జులై 2025, గురువారం

జీవన మంజూష జులై25


 నేస్తం,

        పిల్లలను కనగానే మనంఅమ్మానాన్నలంఅయిపోము. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే పిలుపుకు న్యాయం చేసినవారం అవుతాము. పెద్దరికం తీసుకోగానే మనకు పెద్దరికం రాదు కదా. బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించినప్పుడే దానికి గుర్తింపు. బంధాలు మనం కలుపుకుంటే సంబంధాలుగా మారతాయి కాని అనుబంధాలుగా బలపడాలంటే ఆయా విలువలు పాటించడం తప్పనిసరి

       అమ్మలకో రోజు, నాన్నలకో రోజు, స్నేహితులకో రోజు, ప్రేమికులకో రోజు, ఇలా ప్రతిరోజూ ఏదోకరోజు అనుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటూ బతికేయడం కాదు. బంధాలకు, బాధ్యతలకు మనం ఇచ్చే విలువ, గౌరవం వాటిని నిలుపుకోవడంలో కూడా చూపించాలి. పెద్దరికమంటే విభజించి పాలించడం కాదు, అందరిని కలిపి వుంచాలన్న ఇంగితం ఎప్పుడు వస్తుందో! అహం అందలం ఎక్కించదు, అధఃపాతాళానికి తోసేస్తుంది. సత్యం తెలిసినా మనం ఏకాకుల్లా బతకడానికి మెుగ్గు చూపుతాం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మనకు లేదు కనుక.

       పదవులు, హోదాలు రాగానే సరికాదు. వాటి బాధ్యతలను అధికారానికి లొంగకుండా నిర్వర్తించినప్పుడే మన పదవి గురించి చెప్పుకుంటే బావుంటుంది. కొందరు పాత్రికేయులమని చెప్పుకుంటూ నిజాలను వక్రీకరించి తమకు అనుకూల పార్టీలకు తగ్గట్టుగా జరిగిన సంఘటనలను విచిత్రంగా చిత్రీకరించి రాయడం, అసలు నిజాలను దాయడం వారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

        తప్పు చేసినప్పుడు అధికారమయినా, అనధికారమయినా ఒకటిగా చూడగలిగిన వాడే నిజమయిన పాత్రికేయుడు. ఈరోజుల్లో పాత్రికేయత ఎంత హీనంగా మారిందో, వర్చువల్ ప్రపంచంలో అందరికి తెలుసు. పుంఖానుపుంఖాలుగా రాయడం కాదు, మనం ఏం రాస్తున్నామన్న స్పృహ వుండాలి. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంటే తట్టుకోవడం కష్టమనుకుంటే ఎలా? మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని మర్చిపోకూడదు కదా!

          ఇకభజనమాటకు వస్తే మనం చేస్తేనేమో నిజాయితీగా మాట్లాడినట్టు, పక్కవాడు చేస్తేనేమోభజనచేసినట్టు కాదు కదా. సమన్యాయం మర్చిపోతే ఎలా మాస్టారు? కొందరికి విలువ ఇచ్చినా తీసుకోవడం రాదు, అలా అని ఎదుటివారికి గౌరవం ఇస్తారా అంటే అదీ లేదు. ఏదయినా మనం మర్చిపోకూడని మాట, మన పెద్దల మాటతాతకు పెట్టిన ముంత తల వైపునే వుంటుంది”. మాట మర్చిపోకండి మాస్టారు. మనకు వ్యక్తిత్వం లేదని అందరిని ఒకే గాటిన కట్టేయకూడదు. తప్పొప్పుల తక్కెడ సరిజూడబడుతుంది కాలానుగుణంగా.

         

           


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner