25, జులై 2025, శుక్రవారం

రెక్కలు

 1.  కొన్ని 

జీవితాలింతే

ఎవరికి 

కాకుండా పోతూ


విధాత చేవ్రాలు

వి’చిత్రమైనది..!!

2.  విడివడలేని

ముడులు

విప్పుకోలేని

పాశాలు


చేజారుతున్న

అనుబంధాలు..!!

3.  చేసాం చేసాం

అంటాం

చేయించుకున్నది

మర్చిపోతాం


మని’షి

సహజ లక్షణం..!!

4.  బాధను

పంచుకోలేరు

బాధ్యతలను

భరించలేరు


గాలివాటపు

జీవితాలు..!!

5.  కొత్తగా పెరిగే

దూరమేముంది?

దగ్గరితనమసలే

లేనప్పుడు 


కావాలనుకున్నా

దొరకనివి కొన్ని..!!

6.  కోల్పోయిన 

కాలం 

ఎప్పుడూ

విలువైనదే


చేజార్చుకుంటున్న

అనుబంధాలు..!!

7.  అసలు

నకలు

నిజాయితీ

నటన


అన్నీ

ఒకే గాటిన..!!

8.  అదృష్టానికి 

ఆయువు తక్కువ

దురదృష్టానికి

ఊపిరెక్కువ


ఫలితం

మనది మాత్రమే..!!

9.  నెపం

వేయడం

నేరం

మోపడం


ఖర్చేం

అవదు..!!

10.  విషయసూచిక

ముందే తెలిసినా

విషాద

సంచికలే


కొన్ని 

జీవిత పుస్తకాలెప్పుడూ..!!

11.  తిరస్కారం 

అలవాటే

పురస్కారం 

పలకరించనప్పుడు


రాజకీయ 

చతురత..!!

12.  తీసివేతలు

రావడం లేదు

కూడికలు

ఎక్కువయ్యాయని కాబోలు


లెక్కలు

నేర్చుకోవడం అవసరమే..!!

13.  నీతులు 

చెప్పడానికి ఏముంది

పెద్దబాలశిక్ష

చదివితే చాలదూ


ఆచరణే

రావాలి..!!

14.  స్వప్న సౌధాలలో

విహారం

కలలకు సమయమే లేని

జీవితాలు 


సాకారానికి

ఆకారం తోడ్పాటు..!!

15.  విరామం

అవసరమే

తీరం తెలియని

దూరాలకు


వారధి

విరిగిపోయింది..!!

16.  మరలిరాని

క్షణాలు

దగ్గరవలేని

దూరాలు


మనసు

మమకార’మది..!!

17.  సాయం

చేయము

ఉపయోగించుకోవడం

వెన్నతో పెట్టిన విద్య


స్వభావం

సహజసిద్ధం..!!

18.  నమ్మితేనేగా

మోసపోయేది

మనిషైనా

మనసైనా


కాలాతీత

వ్యక్తులు..!!

19.  వాచకం

మరిచిపోయాం

వాచాలత్వం

పెరిగి


తూకం

అటుదిటు..!!

20.  మనలో

లేనిది

కొందరిలో 

ఉన్నది


మెచ్చుకునే

గుణం..!!

21.  మాట

మనిషి

ముందు

వెనుక


వ్యక్తిత్వం 

బట్టబయలు..!!

22.  విస్తరిది 

ఏముంది 

వడ్డించేవారు

మనవారైనప్పుడు


ధనసంబంధాలకు

విలువెక్కువ ..!!

23.  చేసేది

ఆత్మదానం

అవుతోంది

అపాత్రదానం


అక్షరాలకంటని

మాలిన్యం..!!

24.  సఖ్యత 

చిరునామా

ప్రపంచమంతా 

అరచేతిలోనే


వెతుకుతూనే

ఉండాలి..!!

25.  బొమ్మకు ప్రాణం పోసిన

బ్రహ్మ 

బతుకునే ఆటగా మార్చిన

కర్మ


రాతను మించినది లేదన్నది

సత్యం..!!

26.  మనసు

చదవగలిగితే

మౌనాన్ని 

వినగలం


మనిషి

మరో దృష్టికోణం..!!

27.  భోంచేయడానికి

బంధువులు 

బాధ్యతలక్కర్లేని

అనుబంధాలు


అయోమయంలో

బంధాలు..!!

28.  ఆదుకున్న

రోజులు

ఆదమరిచిన

కాలము


గుర్తే లేని

గతమైంది..!!


29.  బాధలు

కొన్ని

బరువులు

ఇంకొన్ని


మోసేవాళ్ళకు

అలవాటే..!!


30.  జీవించడంలో 

అర్థం 

చెప్పాల్సినవి 

చేయాల్సినవి


ఒక మంచి

ప్రేమ కథ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner