నేస్తం,
పిల్లలను కనగానే మనం “అమ్మానాన్నలం” అయిపోము. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ పిలుపుకు న్యాయం చేసినవారం అవుతాము. పెద్దరికం తీసుకోగానే మనకు పెద్దరికం రాదు కదా. ఆ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించినప్పుడే దానికి గుర్తింపు. బంధాలు మనం కలుపుకుంటే సంబంధాలుగా మారతాయి కాని అనుబంధాలుగా బలపడాలంటే ఆయా విలువలు పాటించడం తప్పనిసరి.
అమ్మలకో రోజు, నాన్నలకో రోజు, స్నేహితులకో రోజు, ప్రేమికులకో రోజు, ఇలా ప్రతిరోజూ ఏదోకరోజు అనుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటూ బతికేయడం కాదు. ఆ బంధాలకు, బాధ్యతలకు మనం ఇచ్చే విలువ, గౌరవం వాటిని నిలుపుకోవడంలో కూడా చూపించాలి. పెద్దరికమంటే విభజించి పాలించడం కాదు, అందరిని కలిపి వుంచాలన్న ఇంగితం ఎప్పుడు వస్తుందో! అహం అందలం ఎక్కించదు, అధఃపాతాళానికి తోసేస్తుంది. ఈ సత్యం తెలిసినా మనం ఏకాకుల్లా బతకడానికి మెుగ్గు చూపుతాం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మనకు లేదు కనుక.
పదవులు, హోదాలు రాగానే సరికాదు. వాటి బాధ్యతలను ఏ అధికారానికి లొంగకుండా నిర్వర్తించినప్పుడే మన పదవి గురించి చెప్పుకుంటే బావుంటుంది. కొందరు పాత్రికేయులమని చెప్పుకుంటూ నిజాలను వక్రీకరించి తమకు అనుకూల పార్టీలకు తగ్గట్టుగా జరిగిన సంఘటనలను విచిత్రంగా చిత్రీకరించి రాయడం, అసలు నిజాలను దాయడం వారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
తప్పు చేసినప్పుడు అధికారమయినా, అనధికారమయినా ఒకటిగా చూడగలిగిన వాడే నిజమయిన పాత్రికేయుడు. ఈరోజుల్లో ఈ పాత్రికేయత ఎంత హీనంగా మారిందో, ఈ వర్చువల్ ప్రపంచంలో అందరికి తెలుసు. పుంఖానుపుంఖాలుగా రాయడం కాదు, మనం ఏం రాస్తున్నామన్న స్పృహ వుండాలి. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంటే తట్టుకోవడం కష్టమనుకుంటే ఎలా? మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అని మర్చిపోకూడదు కదా!
ఇక “భజన” మాటకు వస్తే మనం చేస్తేనేమో నిజాయితీగా మాట్లాడినట్టు, పక్కవాడు చేస్తేనేమో “భజన” చేసినట్టు కాదు కదా. సమన్యాయం మర్చిపోతే ఎలా మాస్టారు? కొందరికి విలువ ఇచ్చినా తీసుకోవడం రాదు, అలా అని ఎదుటివారికి ఆ గౌరవం ఇస్తారా అంటే అదీ లేదు. ఏదయినా మనం మర్చిపోకూడని మాట, మన పెద్దల మాట ”తాతకు పెట్టిన ముంత తల వైపునే వుంటుంది”. ఈ మాట మర్చిపోకండి మాస్టారు. మనకు వ్యక్తిత్వం లేదని అందరిని ఒకే గాటిన కట్టేయకూడదు. తప్పొప్పుల తక్కెడ సరిజూడబడుతుంది కాలానుగుణంగా.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి