31, డిసెంబర్ 2025, బుధవారం
తార - సితార
శుభాకాంక్షలు 2026
“కాలానికి తెలిసిన మనం, మనకు తెలియని కాలాన్ని ఆశగా ఆహ్వానిస్తూ సంతోషాలను అందించాలని కోరుకుంటాం. విలువ దేనికి ఇవ్వాలో తెలిసి మసలుకుంటే, మనసులో దిగులుకు చోటుండదు”.
నా ప్రియమైన శత్రువులకు, మిత్రులకు మరియు ఆత్మీయులకు అందరికి కొత్త ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
29, డిసెంబర్ 2025, సోమవారం
ీ యూనియన్ 27/12/2025
నేస్తాలు,
కాలం మనతో స్నేహం చేస్తూనే వుంటుంది. మంచిని, చెడుని కూడా మనకు పరిచయం చేస్తుంది. మనం ఎలా బతకాలో, ఎలా వుండకూడదో కూడా సోదాహరణంగా వివరిస్తుంది. తన మానాన తను కదిలిపోయే కాలంలో, మనకంటూ కొన్ని క్షణాలు ఎప్పటికీ మిగిలే వుంటాయి. అవి మనతోనే ఎప్పుడూ వుండాలన్న కోరిక ఎలాగూ తీరదు. అందుకే ఆ అపురూపమైన క్షణాలను గుప్పెట్లో(గుండె) దాచేయడానికి మనకు అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు దొరుకుతాయి. వాటిని అలానే అందిపుచ్చుకుని, గతాన్ని, వాస్తవాన్ని వర్తమానానికి బట్వాడా చేయడానికి, మరి కొన్నేళ్లు మన ఆయుష్షును పెంచుకోవడానికి మన నేస్తాలు కొందరు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నమే మన VEC89 ఆత్మీయ కలయిక.
సాయంకాలపు అందమైన స్వాగతాలను, ఆత్మీయ అనుబంధాల పలకరింపుల సమ్మేళనాన్ని, అల్లరి చతురోక్తులతో చక్కని హుషారైన పాటలతో, ఆటలతో, యాభైల్లో కూడా ఇరవైల్లా తమ తమ నాట్య విన్యాసాలను ప్రదర్శించి అందరిని ఆహ్లాదపరిచిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన శరత్, బసివిరెడ్డి, అరబింద్, నాగరాజు, శారద..ఇంకా మరికొందరు, పరోక్షంగా తమ సహకారాన్ని అందించిన రామన్, వెంకటస్వామి..ఇలా అందరికి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చిన నీరజ,
శ్రీనివాస్ దంపతులకు, కాసేపు తమ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించిన టి జి విశ్వప్రసాద్, వందన దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీలిమ, హెచ్ ఎం టి బాబాయికి ప్రత్యేక కృతజ్ఞతలు.
దూరాభారం అనుకోకుండా అభిమానంగా వచ్చిన ప్రతివొక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఓపికగా చాలా సమయాన్ని మన అందరి కోసం కేటాయించిన శ్రీకాకుళం ఎం ఎల్ ఏ “కూన రవికుమార్” గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
2025 వెళ్లిపోతా కూడా ఎంత గొప్ప కానుకను మనకు అందించిందో చూసారా! అన్నట్టు చెప్పడం మర్చిపోయా మన చంద్రమోహన్ కూరపాటి గారు అందుబాటులో లేకున్నా “పంచెకట్టు” స్పెషల్ ని అందరం చాలా ఇష్టంగా ఆస్వాదించాం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
తలుపులు మూసి మరీ వినిపించినా పారిపోయిన కొందరు ప్రత్యేక అతిథుల కోసం నా కవిత మరోసారి…
మీ అందరి కోసం..
అల్లరి ఆకతాయితనంతో
ఏదో సాధించేయాలన్న
ఉత్సాహం అప్పుడు
అనుభవాల అనుబంధాలతో
జీవితపు లోతుపాతులను
చవి చూసిన స్థితప్రజ్ఞుత ఇప్పుడు
ఆడే ప్రతి ఆటలో
ఓటమి దరిజేరని
గెలుపు తమదే కావాలన్న
కాంక్షే అందరిది
కాని విజేతలు కొందరే
క్షణం తీరిక లేని ఈ ఉరుకుల పరుగుల్లో
విరామం కోరే మనసు ఆశ్రయించేది
కాలం గవాక్షపు వెనుక
ఆహ్లాదాన్ని పంచే అనుభూతులను కొన్నింటిని
ఆ జ్ఞాపకాల జడివానలోతడవడానికి
(వానలో తడవని చిన్నతనం ఎవరికి లేదు కదా
అలానే జ్ఞాపకాలు లేని మనిషి కూడా బహు అరుదే)
తడబడిన అడుగులకు ఆసరానిచ్చే
ఆత్మీయత కోసం వచ్చిన మీ అందరికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.
నా తెలుగు అర్థం కాని వారి కోసం
సరదాగా మరో నాలుగు లైన్లు
టీ కొట్టెటీసినోళ్ళందరూ
పియంలు కాలేరు
ఎర్రబస్సు ఎక్కినోళ్ళందరు
ఎయిర్ బస్ ఎక్కలేరు
సంతకాలెట్టించేసుకున్నోళ్ళందరూ
సియంలైపోలేరు
ఇదేరా జీవితం అబ్బాయ్..
18, డిసెంబర్ 2025, గురువారం
జీవన మంజూష డిసెంబరు 25
నేస్తం,
“బతకడమంటే చావడానికి కారణాలు వెతుక్కోవడం కాదు” అన్న గొప్ప మాట వినడం కాకతాళీయంగా జరిగింది. మంచి విన్నప్పుడు కాని, చూసినప్పుడు కాని వెంటనే నలుగురితో పంచుకోవడం అందరు చేయలేరు. అదే ఎవరికైనా కష్టమో, నష్టమో కలిగినప్పుడు అందరికి అడగకుండానే చాటింపు వేస్తారు. ఇది మనిషిలోని సహజగుణం. ప్రతిదానిలో లోపాలు చూడటానికే తమ జన్మ అన్నట్టుగా కొందరు బతికేస్తుంటారు. అలాగే మరికొందరికి వారు చేసే అన్నింటిని సమర్థించుకోవడానికి కారణాలు భలేగా దొరికేస్తాయి.
వయసు పైబడుతున్నా కొందరికి మానసిక పరిపక్వత రాదు. రాలేదు అనుకోవడం కంటే అది వారి అహంకారం అనుకోవడం సబబేమో. ఎదుటివారి మాటల్లో, చేతల్లో దొర్లే చిన్న పొరబాట్లను కూడా అందరికి భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేయడం, వారి మానసిక జాడ్యాన్ని వారికి వారే బయటేసుకోవడం మనం చాలామందిలో చూస్తున్నాం. వారి తప్పులను ఒప్పులుగా సమర్థించుకునే ప్రయత్నంలో ఎదుటివారిని కించపరచే మాటలు, చేతలు ఎంత వరకు సమంజసం అన్నది వారి విజ్ఞతకు వదిలేయడమే.
అసహనం అందరికి వుంటుంది. సహనం మాత్రం కొందరికే వుంటుంది. దానిని చేతగానితనమని మనం సంబరపడితే, నలుగురిలో నవ్వులపాలయ్యేది మనమే అన్న విషయం కనీసం ఓసారయినా మనకు నెనుపుకు రావాలి. అసహనమేమి ఆభరణం కాదు. అది మనలోని అపరిపక్వతకు గుర్తు. మనం నటించినంత మాత్రాన ఇతరులు దానిని గుర్తించలేదని అనుకుంటే, అది మన భ్రమ. మనది నటన అని తెలిసినా వారు మనల్ని భరిస్తున్నారు అంటే, బంధాలను గౌరవిస్తున్నారని అర్థం. అది మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
ఇప్పుడున్నది మనం కార్పొరేట్ వ్యవస్థలో అని అనుకుంటే అది పొరబాటే. మనమే కార్పొరేట్ వ్యక్తులుగా మారినప్పుడు వ్యవస్థ సహజంగా ఎలా వుంటుంది? “అన్న అడుగేస్తే మాస్” అన్నట్టు కొందరు అడుగు వేసినా, చేయి కదిపినా డబ్బే అంటుంటే వ్యవస్థ కార్పొరేట్ అవడంలో వింతేమీ లేదనిపిస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ లానే కార్పొరేట్ సంస్థలు ప్రతి పనిలోనూ కనబడుతున్నాయి. వ్యక్తే కార్పొరేట్ వ్యక్తిగా రూపాంతరం చెందడం మన మానవజాతి పురోభివృద్ధే! ఈ మార్పు ఎక్కడికి పోతుందో ఆ భగవంతుడికే తెలియాలి.
అమ్మ బొజ్జ లో వున్న పాపాయి ఒకప్పుడు హాయిగా వుండేది. ఇప్పుడు ఈ కార్పొరేట్ యుగంలో ప్రతి క్షణానికి విలువ డబ్బుతో కడుతున్నారు. తల్లికి బిడ్డకు మధ్యన కూడా డబ్బే అనుసంధానం అవుతోంది. ఓ పని పూర్తయ్యాక మెుత్తానికి తీసుకునే డబ్బులు, ఇప్పటి రోజుల్లో.. రాసినందుకు ఇంత, చెరిపినందుకు ఇంత, మరోదానికి ఇంత అంటూ ప్రతిదానికి డబ్బులు గుంజడం ఓ అలవాటుగా మారిపోయింది. మనం చేసిన సాయాన్ని మరిచి, వారి వారి పనులకు మాత్రం ఖరీదు కట్టడం నేటి మనిషి నైజమయ్యింది. ఈ ప్రారబ్ధం ఎటువైపుకు మానవజాతి మనుగడను తీసుకువెళుతుందో మరి?
16, డిసెంబర్ 2025, మంగళవారం
గాలివాటం ఆవిష్కరణ
నవంబరు 22, 23 తేదీల్లో జరిగిన నవమల్లెతీగ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 2025 లో నా రెక్కల పుస్తకం “గాలివాటం” ఆవిష్కరణ మా దివిసీమ గాంధీ “డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్” గారి చేతుల మీదుగా జరిగింది.
కలిమిశ్రీ గారికి మిగతా పెద్దలు అందరికి మనఃపూర్వక కృతజ్ఞతలు.






