నేస్తాలు,
కాలం మనతో స్నేహం చేస్తూనే వుంటుంది. మంచిని, చెడుని కూడా మనకు పరిచయం చేస్తుంది. మనం ఎలా బతకాలో, ఎలా వుండకూడదో కూడా సోదాహరణంగా వివరిస్తుంది. తన మానాన తను కదిలిపోయే కాలంలో, మనకంటూ కొన్ని క్షణాలు ఎప్పటికీ మిగిలే వుంటాయి. అవి మనతోనే ఎప్పుడూ వుండాలన్న కోరిక ఎలాగూ తీరదు. అందుకే ఆ అపురూపమైన క్షణాలను గుప్పెట్లో(గుండె) దాచేయడానికి మనకు అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు దొరుకుతాయి. వాటిని అలానే అందిపుచ్చుకుని, గతాన్ని, వాస్తవాన్ని వర్తమానానికి బట్వాడా చేయడానికి, మరి కొన్నేళ్లు మన ఆయుష్షును పెంచుకోవడానికి మన నేస్తాలు కొందరు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నమే మన VEC89 ఆత్మీయ కలయిక.
సాయంకాలపు అందమైన స్వాగతాలను, ఆత్మీయ అనుబంధాల పలకరింపుల సమ్మేళనాన్ని, అల్లరి చతురోక్తులతో చక్కని హుషారైన పాటలతో, ఆటలతో, యాభైల్లో కూడా ఇరవైల్లా తమ తమ నాట్య విన్యాసాలను ప్రదర్శించి అందరిని ఆహ్లాదపరిచిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన శరత్, బసివిరెడ్డి, అరబింద్, నాగరాజు, శారద..ఇంకా మరికొందరు, పరోక్షంగా తమ సహకారాన్ని అందించిన రామన్, వెంకటస్వామి..ఇలా అందరికి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చిన నీరజ,
శ్రీనివాస్ దంపతులకు, కాసేపు తమ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించిన టి జి విశ్వప్రసాద్, వందన దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీలిమ, హెచ్ ఎం టి బాబాయికి ప్రత్యేక కృతజ్ఞతలు.
దూరాభారం అనుకోకుండా అభిమానంగా వచ్చిన ప్రతివొక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఓపికగా చాలా సమయాన్ని మన అందరి కోసం కేటాయించిన శ్రీకాకుళం ఎం ఎల్ ఏ “కూన రవికుమార్” గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
2025 వెళ్లిపోతా కూడా ఎంత గొప్ప కానుకను మనకు అందించిందో చూసారా! అన్నట్టు చెప్పడం మర్చిపోయా మన చంద్రమోహన్ కూరపాటి గారు అందుబాటులో లేకున్నా “పంచెకట్టు” స్పెషల్ ని అందరం చాలా ఇష్టంగా ఆస్వాదించాం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
తలుపులు మూసి మరీ వినిపించినా పారిపోయిన కొందరు ప్రత్యేక అతిథుల కోసం నా కవిత మరోసారి…
మీ అందరి కోసం..
అల్లరి ఆకతాయితనంతో
ఏదో సాధించేయాలన్న
ఉత్సాహం అప్పుడు
అనుభవాల అనుబంధాలతో
జీవితపు లోతుపాతులను
చవి చూసిన స్థితప్రజ్ఞుత ఇప్పుడు
ఆడే ప్రతి ఆటలో
ఓటమి దరిజేరని
గెలుపు తమదే కావాలన్న
కాంక్షే అందరిది
కాని విజేతలు కొందరే
క్షణం తీరిక లేని ఈ ఉరుకుల పరుగుల్లో
విరామం కోరే మనసు ఆశ్రయించేది
కాలం గవాక్షపు వెనుక
ఆహ్లాదాన్ని పంచే అనుభూతులను కొన్నింటిని
ఆ జ్ఞాపకాల జడివానలోతడవడానికి
(వానలో తడవని చిన్నతనం ఎవరికి లేదు కదా
అలానే జ్ఞాపకాలు లేని మనిషి కూడా బహు అరుదే)
తడబడిన అడుగులకు ఆసరానిచ్చే
ఆత్మీయత కోసం వచ్చిన మీ అందరికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.
నా తెలుగు అర్థం కాని వారి కోసం
సరదాగా మరో నాలుగు లైన్లు
టీ కొట్టెటీసినోళ్ళందరూ
పియంలు కాలేరు
ఎర్రబస్సు ఎక్కినోళ్ళందరు
ఎయిర్ బస్ ఎక్కలేరు
సంతకాలెట్టించేసుకున్నోళ్ళందరూ
సియంలైపోలేరు
ఇదేరా జీవితం అబ్బాయ్..





0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి