31, డిసెంబర్ 2025, బుధవారం
తార - సితార
మది సవ్వడిని వినిపించే "తార - సితార "
" వాక్యం రసాత్మకం కావ్యం " అన్న పెద్దల మాట అక్షరాలా నిజం అని గరిష్టంగా 28 అక్షరాలతో రెండు వాక్యాలను కలుపుతూ రాసే ఏక్ తారలను చదివితే పై మాట అక్షరాలా నిజం అని అనకుండా ఉండలేము. దానికి ఉదాహరణే ఈ క్రింది ఏక్ తార.
" ఓ స్వప్నం కరిగి పోయింది..
వాస్తవంలో ఇమడలేనంటూ..!! "
బాధను కూడా ఇంత అందంగా చెప్పడంలో ఉన్న నేర్పు కొందరికే సొంతం. ఆ కొందరిలో పద్మజ సబ్బినేని ఉన్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. తన మనసుకు అనిపించిన భావాలను చక్కని సరళమైన తెనుగు భాషలో, చదువరులకు ఇబ్బంది కలిగించని విధంగా రాయడంలో పద్మజ పలువురి ప్రశంసలు పొందారు. " హృదయ విపంచి " తొలి కవితా సంపుటితో తెలుగు సాహిత్యంలో తొలి అడుగు వేసి బోలెడుమంది అభిమానులను సంపాదించుకున్నారు.
మధ్య తరగతి రైతు కుటుంబపు వారసురాలిగా తన చుట్టూ జరుగుతున్న కథనాలనే కవితలుగా రాయడమే కాకుండా....కొండంత భావాన్ని అర్థవంతంగా అలతి పదాలతో ఏక్ తారలు, రెక్కలు వంటి లఘు కవిత్వం రాయడంలో కూడా చక్కని ప్రతిభ కనబర్చారు. ఈవిడ ఏక్ తారలన్నీ అక్షరాలు భావాలతో పెనవేసుకుని..బంధాలను, అనుబంధాలను, ప్రేమాభిమానాలను, కష్టాలను, కన్నీళ్ళను కలుపుకుంటూ ప్రకృతి సౌందర్యాలతోనూ నిండి ఉంటాయి.
" మైకం ఏదో ఒంపేశావు నాలో_
నేనే నువ్వయ్యేలా..!! " ప్రేమలోని తాథాత్మ్యం ఎంత అద్భుతంగా చెప్పారో చూసారా.
" మనసుకి ఓదార్పు అయ్యింది అక్షరం_
భారాన్నంతా భావంగా ఆవిష్కరిస్తూ..!! "
బాధ నుండే అసలైన కవిత్వం జనిస్తుందని పెద్దలు ఆనాడే చెప్పారు. ఆ మాటను ఈ ఏక్ తార నిజం చేసింది. ఇలా రెండు వందల తారలకు పైగా ఏక్ తారా సంపుటి " తార - సితార " ను తీసుకు వస్తున్న పద్మజ సబ్బినేని గారికి హృదయపూర్వక అభినందనలు.
" తార - సితార " ఏక్ తారా సంపుటికి నాలుగు మాటలు రాసే అవకాశాన్నిచ్చినందుకు అత్మీయ నేస్తం పద్మజకు ధన్యవాదాలు. మరిన్ని ప్రక్రియలలో తెలుగు సాహితీ వనంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానముండాలని కోరుకుంటూ... శుభాభినందనలతో
మంజు యనమదల
విజయవాడ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి