31, మే 2010, సోమవారం

అశ్రునివాళి....

వేటూరి ఇక లేరు అన్న నిజం ఒప్పుకోడానికి మనసు రావడం లేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా....ఉప్పొంగెలే గోదావరి...అని గోదారి అందాలను అచ్చ తెనుగులో మనకు వినిపించిన మహాకవి. తెలుగు జాతి సగర్వంగా తల ఎత్తుకోగలిగిన రోజు... జాతీయ అవార్డుని తెలుగుకి ప్రాచీన హోదా కల్పించలేదని తృణప్రాయంగా త్యజించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
వేణువై భువనానికి వచ్చి తేట తెలుగు తియదనాన్ని మనకు రుచి చూపించి మలయమారుతపు చల్లదనపు స్పర్శ ని మనకందించి గాలిలానే గగనానికి ఎగిరి పోయిన వేటూరి సుందరరామమూర్తి గారి దివ్య స్మృతికి అశ్రునివాళి....
పుట్టిన ప్రతివారు మరణించక తప్పదని తెలిసినా ఎందుకో రాయలేక పోయాను ఇన్ని రోజులు.. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ.....

19, మే 2010, బుధవారం

కధ కాని కధ - పార్ట్ 8

చెప్పాను గా మేము ఆరు ఐనంక విజయనగరం వచ్చేశామని, అప్పటి నుంచి నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ అరుణ,ఉదయలక్ష్మి, రాధ లకి లెటర్స్ రాయడం అలవాటయింది.
నా చిన్నప్పటి నుంచి మా నాన్న నా మొదటి పుట్టిన రోజు నుండి చాలా గ్రాండ్ గా చేసే వారు. నాకు మాత్రం ఆ రోజు బాగా జ్వరం వచ్చేది. పొద్దున చుట్టాలకి భోజనాలు, కేకు కటింగ్ సాయంత్రం నాన్న ఫ్రెండ్స్ కి పార్టీలు ఉండేవి. అప్పట్లోనే కార్డ్స్ ప్రింట్ చేయించి ఇన్విటేషన్స్ ఇచ్చేవారంట. నాన్న నన్ను కింద నిల్చోబెట్టడానికి కుడా చేతితో తుడిచి అప్పుడు నిల్చోబెట్టేవారంట. నాకు వోణిలు ఇచ్చేటప్పుడు నాన్న ఇంట్లో లేరు ఊరు వెళ్లారు, అమ్మ వాళ్ళు ఫంక్షన్ చెయ్యోద్దులే అనుకుంటే నేనేమో పోస్ట్ కార్డ్స్ కొని రూపక్క వాళ్ళ ఇంట్లో అక్కని అడ్రస్ ఎలా రాయాలో అడిగి పెద్దమ్మలకు, అమ్మమ్మలకు రమ్మని ఉత్తరాలు రాసి ముందు రోజు అమ్మ వాళ్లకు చెప్పాను. అప్పటికప్పుడు ఇంక అన్ని రడి చేసి చేసారు నాన్న కుడా ఆ రోజుకి వచ్చేసారు అనుకోండి...అంతకు ముందు ఒక సారి పుట్టిన రోజుకి అవనిగడ్డలో పాకెట్స్ తీసుకు వెళ్ళడానికి పిలవమంటే అందరిని భోజనానికి పిల్చాను....వచ్చే వాళ్లకు వండటం పెట్టడం సరిపోయింది ఇంట్లో వాళ్లకు...ఇలాంటి అల్లరి పనులు బాగా చేసేదాన్ని.

పువ్వులంటే ఇష్టం లేని వాళ్ళు వుండరు కదా!! మా పక్కింటి జయంతి వాళ్ళ తాతగారి పొలం లో మల్లెపూలు వున్నాయని అంటే నేను మా అక్క కూతుళ్ళు అజాత, అపర్ణలని తీసుకుకుని వెళ్ళా బోల్డు దూరం వెళ్ళాము ఇంకా ఎక్కడ అంటే అది మట్లాడదు. ఈ లోపల నాన్న, వాళ్ళ తాత వాళ్ళ గేద పొతే వెదుకుతూ మాకు కనిపించారు, నేనే పిల్చాను ఎందుకొచ్చారు అంటే మల్లెపూల కోసమని చెప్పా. ఇక ఇంటికి వచ్చాక నాన్న ఒకప్పుడు గవర్నమెంట్ మాస్టర్ లెండి అందుకని కర్ర పట్టుకుని రెండు దెబ్బలు వేసారు ముగ్గురిని. గట్టిగా కొట్టలేదు కాని కొట్టారని కోపం తో మూడు రోజులు మాట్లాడలేదు. మళ్ళి లంచాలు ఇస్తే గాని మాట్లాడలేదు. వాళ్ళ కైతే చాలా రోజులు నాన్న అంటే భయం పోలేదు. నాన్న జాబు మానేసి నేను పుట్టక ముందే వూళ్ళో ట్యుషన్స్ చెప్పేవారు ఫ్రెండ్ తో కలిసి. అందరికి చాలా భయం ఆ రోజుల్లో నాన్న అంటే. సినిమాకి కుడా గుర్రపు బండి లో తీసుకు వెళ్ళేవారు.
మళ్ళి కలుద్దాము...ఇప్పటికే చాలా చెప్పేసాను...బోర్ కొడుతోందేమో మరి...

15, మే 2010, శనివారం

కధ కాని కధ - పార్ట్ 7

మీకు ఇంకో విష్యం చెప్పడం మర్చిపోయాను...నేను ఆరు చదివేటప్పుడే ఒక కధ రాసాను....అది దొరికితే మీతో కుడా చదివిస్తాను....ఇక కధలోకి...

నైంత్ చదివేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము వాళ్ళు పరీక్ష పెడితే దానిలో థర్డ్ వచ్చింది మా స్కూల్ లో. సముద్రాల జూనియర్ గారి సంతకం తో సర్టిఫికెట్ ఇప్పటికి నా దగ్గర వుంది. క్లాసులు వినకుండా రాసిన ఎగ్జామ్ అది.
అంతకు ముందు స్కూల్ సెలవల్లో దసరా , సంక్రాంతి కి కొన్ని సార్లు కోనాడ కొబ్బరి తోటల్లోకి వెళ్ళేవాళ్ళం మేము, నాన్న ఫ్రెండ్ పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలు....అందరమూ ఒకటే ఆటలు, సముద్రం లో స్నానాలు జీడిమామిడికాయలు ,రేగ్గాయలు కోసుకోడం, కొండలు ఎక్కడం ఇలా బోల్డు చేసేవాళ్ళము.

ఇంటర్లో విజయనగరం లో ఇల్లు తీసుకుని అమ్మమ్మ మాతో వుండేది. అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు.
వుండేది అద్దె ఇల్లు అయినా చాలా బాగుండేవాళ్ళు ఇంటివాళ్ళు. కింద మూడు, పైన రెండు కుటుంబాలు ఉండేవి. కింద ఒక దానిలో మేము వుండే వాళ్లము. మా పక్కన ఇల్లు చాగంటి సోమయాజులు గారిది. పంచవటి అని ముద్దుగా పిల్చుకునే వాళ్లము అప్పట్లో ఏదో టి.వి. సీరియల్ వచ్చేది. అమ్మమ్మ గారు, ఆంటి, విజ్జి అక్క, మణి అక్క, మురళి అన్నయ్య వీళ్ళు ఇంటి వాళ్ళు. మేము , మా పక్కన అంకుల్ వాళ్ళు వాళ్ళ పిల్లలు శ్రావణి, చైతు, పైన చిట్టిబాబు అంకుల్ వాళ్ళు వాళ్ళ పిల్లలు రవి, చిన్న...వేరే దానిలో రమ, జయ, శ్రీను, ఇంకా వాళ్ళ అన్నలు,సీతక్క అందరమూ సెకండ్ షో లకి వెళ్ళడము, బాగా అల్లరి చేయడం...అరకు పిక్నిక్ కి కుడా వెళ్ళాము. అమ్మమ్మ గారు నాకు రోజు జడ వేసేవారు.

అప్పటివరకు ట్యూషన్ అంటే తెలెయని నేను పొద్దున్నే లెక్కలు, సాయంత్రం ఒక రోజు ఫిజిక్స్, ఒక రోజు కెమిస్ట్రీ కి వెళ్ళేదాన్ని. నా ఫ్రెండ్ వరలక్ష్మి,నేను, పద్మ కలిసి కాలేజికి వెళ్ళెవాళ్ళము. మాది వుమెన్స్ కాలేజి. ఎం.పి.సి కి బై.పి.సి కి కలిపి కొన్ని క్లాసులు జరిగేవి. ముందు బెంచ్ లో కూర్చోడానికి పిరియడ్ పిరియడ్ కి వేరే వేరే రూమ్స్ కి పరుగులు, ప్లేసులు పెట్టుకోడాలు, రమామణి, ప్రసన్న, రజని, లత, అచ్యుతవల్లి , వల్లిదేవసేన, ఇందు, హేమనళిని, ఇంకా చాలా మంది వున్నారు రాస్తే చాలా అవుతాయి. ఇంగీష్ రమాదేవి గారు, ఫిజిక్స్ శశి గారు, కెమిస్ట్రీ సూర్యకాంతి గారు,విజయలక్ష్మి గారు, లెక్కలు సరళాదేవి,అంబారమణ గార్లు...తెలుగు ఇద్దరు చెప్పేవాళ్ళు. ప్రాక్టికల్స్ అప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళము. బాచెస్ చేసి డెమో మా బాచ్ దగ్గర ఇచ్చేవాళ్ళు. మేము లాస్ట్ లో మొదలు పెట్టి అందరికన్నా ముందు కంప్లీట్ చేసేవాళ్ళము.

నాకు ఎన్.ఎస్. బొమ్మలు వేయడం బాగా వచ్చు చిన్నప్పటి నుంచి బాగానే వేసేదాన్ని, ఆ ఇష్టం తో ఫ్రెండ్స్ కి రికార్డ్స్ వేసి పెట్టేదాన్ని....అలా నా ఇష్టాన్ని తీర్చుకున్నాను. అస్సలు విష్యం చెప్పలేదు కదూ ...నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అనుకునేదాన్ని.టెన్త్ అయిపోగానే ఒక రోజు నాన్న "నేను బై.పి.సి తీసుకుని పాడయి పోయాను నువ్వు అది తీసుకోవద్దు ఎం.పి.సి అయితేనే చదువు" అన్నారు. ముందు బై.పి లో జాయిన్ ఐయ్యి ఎం.పి కి మారానన్నమాట. అమ్మకు ఎం.పి.సి ఇష్టం లేదు. కాలేజి ఎలక్షన్స్ కి బోల్డ్ హడావిడి చేసాము సైన్సు కి, ఆర్ట్స్ కి పోటి మరి. మేము ఓడిపోయామనుకోండి అది వేరే సంగతి. ఇలా చాలా జాలీగా మూడు అల్లర్లు ఆరు సినిమాలుగా.....
మళ్ళి కలుద్దాము.....

14, మే 2010, శుక్రవారం

కధ కాని కధ - పార్ట్ 6

పినవేమలి లో వున్న రోజులు నిజం గా మర్చిపోలేని రోజులు...మాకు ఊహా తెలిసిన తరువాత పినవేమలి, విజయనగరం లో వున్న రోజులు మర్చిపోలేనివి...ఊరిలో కుడా అందరు చాలా బాగా చూసేవారు. కాస్త వెనుకబడిన ఊరు కదా డబ్బులు చూసి కాకుండా మనుష్యులకి విలువ ఇచ్చేవారు. మా నాన్న అంటే చాలా గౌరవం, భయం ఉండేవి. పొలానికి కట్టిన డబ్బులు పోను మిగిలినవి అన్ని పొలం కోసం ఖర్చుపెట్టారు. ఆ ఊరిలో నాన్న స్నేహితునికి ఇచ్చే విలువ కన్నా నాన్నకు ఇచ్చే విలువ ఎక్కువై ఆయనకు అసూయ పెరిగిపోయింది. నాన్న తో పాటు అమ్మ కుడా పినవేమలి లో చాలా కష్టపడింది.

ఊరికి పొలం రెండు, మూడు కిలోమీటర్లు వుంటుంది. గేదలు ఎక్కువ ఉండి పాలకోసం రెండు పూటలా పొలం వెళ్ళాల్సి వచ్చేది. నాన్న ఐతే కాళ్ళలో పది పది ముళ్ళు విరిగిన తరువాత ఒక్కసారే తియిన్చుకునేవారు. కొబ్బరి మొక్కలు, సరుగుడు మొక్కలు, చెరుకు, కూరగాయలు,వేరుసెనగ, ఇలా అన్ని పండేవి. నీళ్ళు మాత్రం వర్షం పడితేనే ఉండేవి. మాకు మాత్రం వాగు వుండేది, నుయ్యి నాన్న తవ్వించారు. చెరువు పక్కనే వుండేది. మోటర్ తో నీళ్ళు తోడి పైపుల ద్వారా పొలానికి వెళ్ళేవి. వీటికి వున్న డబ్బులు మొత్తం ఖర్చ్చు ఐపోయాయి మేము టెన్త్ కి వచ్చేసరికి....

అప్పటి వరకు ఎప్పుడూ కొత్త పుస్తకాలు కొనుక్కునే మేము... పాత పుస్తకాలు నాకు, మామయ్యకు కొత్తవి కొనుక్కున్నాము. ఆడపిల్లలు బాగా చదివే వాళ్ళు కాదు అక్కడ అప్పట్లో.. నన్ను అందరు పాప అనే వాళ్ళు...అలా ఇంట్లో ముద్దు పేరు లేకపోయినా వూళ్ళో , స్కూల్ లో పాప అని పిల్చేవాళ్ళు హెడ్ మాస్టర్ గారితో సహా...

వూళ్ళో లక్ష్మి,రమ, సువర్ణ,సుగుణ, శివ,రవి, నరసింగరావు,ముత్యాలు, శేఖర్, బాబి....ఇంకా చాలా మందిమి కలిసి వేసవిలోఒంటిపూట బడికి పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. కుమారక్క,ఇందు, రమ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా రాణిఅక్క .....వీళ్ళు కోవా చేస్తే నాకు ఇవ్వకుండా వుండే వాళ్ళు కాదు. ఇందు సినిమా కధలు బాగా చెప్పేది.కుమారక్క,ఇందు పుస్తకాలు కుడా ఇచ్చేవాళ్ళు. ఇది నా సామ్రాజ్యం అక్కడ.....

కధ కాని కధ - పార్ట్ 5

ఓ ఏడేళ్ళు విజయనగరం లో వున్నాము. మేము వున్న ఊరు విజయనగరానికి ఆరు మైళ్ళ దూరంలో వుండేది. ఏడు నుంచి స్కూల్కి మా ఊరికి రెండు మైళ్ళ దూరం లో వున్న జొన్నవలస వెళ్లి చదుకునే వాళ్లము.రెండు ప్రైవేట్ బస్సులు తిగిగేవి విజయనగరానికి.మా మామయ్యకు సైకిల్ కొన్నారు స్కూల్ కి వెళ్ళడానికి,నేను బస్లో వెళ్ళేదాన్ని.అప్పుడప్పుడు నడిచి వెళ్ళెవాళ్ళము కుడా.


అంతకు ముందు మేము చదివినది గురుకులపాఠశాల, ఇదేమో మామూలు గవర్నమెంట్ హైస్కూల్.. సెవెంత్లో ఒక్క హింది, తెలుగు తప్పించి ఏదీ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు.మొత్తానికి సెవెంత్ సెకండ్ క్లాసు లో పాస్ ఐయ్యాము. మా మామయ్యను ఎవరు ఏమి అనలేదు గానీ నన్ను మాత్రం చాలామంది తిట్టారు.బాగా చదవలేదని…అయినా అప్పట్లో మనం పట్టించుకునే రకం కాదు కదా!! ఎంతసేపు ఆటలు, పుస్తకాలు గోలలోనే ఉండేదాన్ని. ఒక బాబాయి మాత్రం బాగా తిట్టారు, నాన్న సినిమాకి తీసుకువెళ్తే సెకండ్ క్లాసు వచ్చింది అని సినిమా చూడటానికి వచ్చావా అని.


తరువాత ఎనిమిది నుంచి పర్వాలేదు అన్ని బానే చెప్పే వాళ్ళు ఒక్క సైన్సు తప్ప. కాని ఆ మాస్టర్ గారు కుడా బాగా అభిమానించేవారు. మీకో విష్యం తెలుసా!! నేను పుస్తకాలు బాగా చదువుతానని అందరికి తెలుసు, మా చిన్న తెలుగు మాస్టర్ గారి భార్య నాకు డిటెక్టివ్ పుస్తకాలు కుడా ఇచ్చేవారు.మా హింది టీచర్ గారు ఆంధ్రజ్యోతి ఇచ్చేవారు, మేము ఆంధ్రభూమి ఇలా మార్చుకునేవాళ్ళము.ఇంకో విష్యమండోయ్ నాకు సెవెంత్లో స్కూల్ సెకండ్ వచ్చింది.మా పెద్ద తెలుగు మాస్టర్ గారి అబ్బాయికి ఫస్ట్ వచ్చింది.అంతకు ముందు కుడా ఎక్కువగా సెకండ్ వచ్చేదాన్ని.కాకపొతే మార్కులు ఎక్కువ వచ్చేవి అంతే తేడా. మా పాత స్కూల్ హెడ్మాస్టర్ గారు నాన్న మా టి.సి కోసం వెళితే మీరు పిల్లల చదువులు పాడుచేస్తున్నారు అని కుడా అన్నారంట.


జొన్నవలస స్కూల్లో వున్నప్పుడు కార్తికమాసంలో తోటల్లో పిక్నిక్లు, పొద్దున్నే విజయనగరం వెళ్లి రెందు సినిమాలు చూడటం..కొట్లాటలు, ఆటలు, తోటల్లో కాయలు కోసుకు తినడం, దమయంతి వాళ్ళ ఇంటి దగ్గర దొరువులో ఈతలు కొట్టడం,శివరాత్రికి రమణి,దేవి,లక్షి,వాసు,వినోద్,ప్రదీప్….ఇలా చాలా మందితో ఆరోజు ఆటలు అవి ఉండేవి. సెలవు వస్తే చాలు సైకిల్ తో ఇష్టం వచ్చినట్లు రమణి వాళ్ళ ఊరు, దమయంతి ఇంటికి, తోటల్లో ఆటలు….భలే బాగుండేవి ఆ రోజులు.


అలా అలా నైంత్ ఐపోయింది. అప్పుడు నాన్న ఒక రోజు టెన్త్ లో నాలుగు వందలు రాకపోతే కాలేజ్ లో సీటు రాదు అని చెప్పారు. సరే మన టార్గెట్ 400 రావడం అంతే. నాకు బాగా విని రాయడం అలవాటు, చదవడం తక్కువ. పాపం మా మామయ్య తెగ కస్టపడి చదివేవాడు పరీక్షల టైం లో..నాకు ఫస్ట్ క్లాసు తనకి సెకండ్ క్లాసు వచ్చింది. మళ్ళి స్కూల్ సెకండేనండోయ్….ఫస్ట్ మా తెలుగు మాస్టర్ గారి అబ్బాయి వాసుకి..చాలా ఎక్కువే చెప్పేసినట్లు వున్న కదా మరి మళ్ళి కలుద్దాము…….

7, మే 2010, శుక్రవారం

అమ్మ

అమ్మ ప్రేమ కన్నా స్వచ్చమైన ప్రేమ
అమ్మ వంట కన్నా అద్బుతమైన కమ్మని వంట
అమ్మ లాలిపాట కన్నా మధురమైన సంగీతస్వరం
ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు...
అందరికి రెండురోజుల్లో రాబోయే అమ్మల రోజు శుభాకాంక్షలు...

కధ కాని కధ - పార్ట్ 4

ఇంతకి నేనెవరో చెప్పలేదు కదూ...మా నాన్న కూతుర్ని. ఇలా ఎందుకన్నానంటే...మీకు కోపం రావచ్చు అయినా చెప్తాను ఏ తండ్రి పెంచనంత ప్రేమగా ఏదైనా అడగకుండానే ఇచ్చి నేనే తన ప్రపంచంగా చేసుకున్న మా నాన్న కధ..నాకద ఇది.

నేను పుట్టగానే ఇంక ఎవరు వద్దని నేనే చాలని ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెంచారు. మరీ బాగా వున్న కుటుంబం కాక పోయినా దేనికి లోటులేని సంసారం. చెప్పానుగా అమ్మమ్మ వాళ్ళు మేము అందరం కలిసే వుండే వాళ్లము. నేను మా మామయ్యా ఒకటే క్లాసు కాకపొతే నేను కొద్దిగా మొండిదాన్ని.తన చేతిలోది ఏదైనా కావాలి అంటే పాపం వెంటనే ఇచ్చేసేవాడు.ఒకటి ఒక్కటే మా ఊళ్లో చదివాము రెండు నుంచి వేరే ఊరిలో..అమ్మమ్మ మాతో వుండేది అమ్మమ్మ వాళ్ళ చెల్లెలి కూతురి కోసం అని మమ్మల్ని కుడా అక్కడ చదివించారు. ఆ టైం లో మా నాన్న రొయ్యల వ్యాపారం, వ్యవసాయం చేసే వాళ్ళు. అలా దేనికి ఇబ్బంది లేకుండా ఆరు వరకు అక్కడ చదివాము. మద్యలో పిన్ని వేరే వెళిపోయింది . మేము కొన్ని రోజులు వుండి అమ్మకు ఆరోగ్యం బాలేకపోతే మా ఊరు నుంచి బస్సు లో స్కూల్ కి వెళ్ళెవాళ్ళము. అప్పట్లో కాలేజీ కి కుడా ఎక్కువమంది వెళ్ళే వాళ్ళు కాదు. ఉప్పెన వచ్చి వ్యాపారం లో నష్టం తో అది ఆపేశారు. మొత్తం పొలాలు అమ్మి అందరమూ వేరే వూరు వెళ్ళాము. నాన్న స్నేహితుడి పొలాలు కొన్నారు. డబ్బులు ఇచ్చేసారు కాని రాయించుకోలేదు.

మా నాన్నకు నాటకాలు రాయడం, వేయడం, వేయించడం, పుస్తకాలు చదవడం బాగా అలవాటు. వాటిలో పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచే నాకు వచ్చింది. నేను మామామయ్య ఇద్దరమూ ఎవరు ఏ పుస్తకం ముందు చదవాలి అనేది కుడా ముందే పంచుకునేవాళ్ళము. మా ఇంట్లో ఏది వున్నా ఇద్దరికీ చెరిసగం అన్నమాట అది చెట్టు అయినా కాయ అయినా ఏదైనా సరే…నా చిన్నప్పుడు బహుశా మీరు నమ్మరేమో కాని రెండో క్లాసులో అనుకుంటా యద్దనపూడి గారి రాధాకృష్ణ సీరియల్ గా ఆంధ్రజ్యోతిలో వచ్చేది అప్పటి నుంచి ఇప్పటివరకు దొరికిన ప్రతి పుస్తకాన్ని చదువుతూనే వున్నాను. అంతకు ముందు విష్ణుమాయ అమ్మతో చదివించుకుని బడికి వెళ్ళేదాన్ని ఎందుకంటే అప్పుడు చదువుకోడం రాదుగా!! బాలజ్యోతి,చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాబు బొమ్మల పుస్తకాలు, ఆంధ్రజ్యోతి,ఆంధ్రభూమి, పీపుల్స్ ఎన్కౌంటర్, చిన్నయసూరి కధలు, ఇలా దొరికినవి అన్ని చదివేస్తూ ఉండేదాన్ని. నాన్న ఎంత ఇబ్బందిలో వున్నా నాకు పుస్తకం కొని ఇవ్వడం మానలేదు ఇప్పటికి కుడా...

మళ్ళి కలుద్దాం...

మనసు కవి


మనసు కవి మన కవి శ్రీ ఆచార్య ఆత్రేయ గారి జన్మదినం సందర్భం గా... మనసున్నంత కాలం మనందరికీ మర్చిపోలేని మహనీయుడు....మనసున్నమనిషి కి సుఖం లేదన్నా...ఇలా మనసు మాటలు పాటలుగా మనకందించిన మనసు కవికివే... నా మనఃపూర్వక ప్రణామాలు....

6, మే 2010, గురువారం

కధ కాని కధ - పార్ట్ 3

మూల కధ...ముత్తాతలు ఐదుగురు, తాతలు ఇద్దరు. మా తాత పెద్దాయన, ఈయనకు ఏడుగురు పిల్లలు, నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు. ఒకాయన చనిపోయారు. చిన్న తాతకు ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు. ఎక్కువ మంది ఒక ఊరిలోనే వుండే వారు. మా తాతకు కోపం ఎక్కువ కల్లాకపటం తెలియదు. మా నాయనమ్మకు చాలా ఓర్పు ఎక్కువ.తనకు ఒక అక్క ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. వాళ్ళు బాగా ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళను కుడా చాలా వరకు ఈవిడే చూసేది. ఇద్దరు అన్నలు వున్నారు నాయనమ్మకు. ఒక అన్నకు ఇద్దరు కూతుళ్ళు, కొడుకులు లేక తమ్ముడి కొడుకుని చాలా బాగా పెంచుకుని ఆస్తి కుడా ఇచ్చి అక్క కూతురిని ఇచ్చి పెళ్లి చేసారు. వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక ఆయన వేరే అమ్మాయిని చేసుకుని వీళ్ళను పట్టించుకోడం మానేసాడు. పెద్ద కూతురిని చెల్లెలి రెండో కొడుక్కి చేసాడు. చిన్న కూతురిని కుడా చుట్టాలలోనే ఇచ్చాడు. పెద్దకూతురు దగ్గరే వుండేవాళ్ళు ఆఖరి వరకు. చనిపోతే మా పెద్దమ్మే తలకొరివి పెట్ట్టింది ఆయనకు. చాలా బాగా చూసింది వాళ్ళ ఆఖరి సమయంలో. ఇది మా నాయనమ్మ వాళ్ళ అన్న కుటుంబం గురించి. వీళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మా అమ్మమ్మ, అమ్మ వాళ్ళు కలిసి ఉన్నట్లే మా పెదనాన్న పెద్దమ్మ వాళ్లతో వీళ్ళు కుడా కలిసే వున్నారు. ఇక మా నాయనమ్మ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు వేరే వూరు వెళ్లి పోయారు మాకు తెలిసేసరికి. అప్పుడప్పుడు కలిసే వాళ్ళు పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళకి. ఇక మా తాత తమ్ముడి కుటుంబం కుడా అదే వూళ్ళో వుండే వాళ్ళు. ఆడపిల్లలు పెద్దగా చదువుకోలేదు కాని కొడుకు మాత్రం డాక్టర్ చదివి మంచి పేరు తెచ్చుకున్నాడు. మా నాన్న మూడోవాడు మాతాతకు. మా నాన్న డిగ్రీ పూర్తీ చేసారు. డాక్టర్ పెదనాన్న మా నాన్న ఒకటే స్కూల్, కాలేజీ కాకపొతే ముందు పెదనాన్న వెనుక నాన్న అంతే. మా నాన్న కాలేజీ లో బాగా అల్లరి చేసేవారంట. గొడవల్లో కుడా బాగా వుండేవారంట. ఇద్దరు నాటకాలు, ఆటలు(పేకాట) అన్నింట్లో కలిసే వుండేవారంట. మా తాత అంటే అందరికి చాలా భయం ఇంట్లోను వూళ్ళోను కుడా...మా నాన్న గవర్నమెంట్ స్కూల్ లో ఉద్యోగంలో చేరి అక్క కూతుర్ని చేసుకున్నారు. అప్పటికే మిగిలిన అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా నాయనమ్మ అఆరోగ్యం బాగా దెబ్బతింది అప్పటికి. పెద్ద పెదనాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారంట. ఈవిడ బాగా బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకుంది. చిన్న పెదనాన్న అన్ని చూసుకునేవాళ్ళు అక్క చెల్లెళ్ళు, తమ్ముడు అంటే చాలా ప్రేమగా వుండే వారు. అక్క అంటే మా అమ్మమ్మ వాళ్ళు పక్క ఊరిలో వుండేవాళ్ళు. ఏ అవసరమైనా వెళ్ళి వస్తు వుండే వాళ్ళు. అమ్మమ్మకు ఇష్టమైన పుట్టగొడుగులు తీసుకువెళ్ళడం , కోతలు కుప్పలప్పుడు ఆ పనులు చేసి చేయించి రావడం ఇలా అన్ని విషయాలలో చాలా దగ్గరగా ఆప్యాయంగా వుండేవారు అందరు. నాయనమ్మ చనిపోయిన ఆరునెలలకు తాత కుడా కాలం చేసారు. ఇక ఎవరి సంసారాలు వాళ్లకు ఐపోయాయి. మా అమ్మమ్మ, మిగిలిన ఇద్దరు చెల్లెళ్లకి చెప్పి పెద్దతమ్ముడు దేశాలు తిరిగి డబ్బు పాడు చేసాడు, మూడో తమ్ముడు చదువుకున్నాడు , అమ్మ వైద్యానికి ఇంటి బరువు బాధ్యతలకు అండగా వున్నాడు రేపు ఆడపిల్లలకు అవసరాలకు అన్ని చూస్తాడు అని కొంత పొలం రెండో పెదనాన్నకు రాసిఇచ్చారు . దానికి పెద్దాయనకు కోపం వచ్చింది. అమ్మమ్మ చెల్లెళ్ళ అవసరాలకు అక్కడినుంచి ఇక్కడికి రావడం పచ్చళ్ళ పనులు, పిండివంటల పనులు,వాళ్ళ పిల్లల్ని తన దగ్గర ఉంచుకోడం ఇలా... అమ్మ లేదని ఈవిడే అన్నిచాలా రోజుల వరకు చూసేది. పెద్ద పెదనాన్నకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి. రెండో పెదనాన్నకు ముగ్గురు అబ్బాయిలే. మా నాన్నకు నేనే. ఇక అమ్మమ్మకు అమ్మ, మామయ్య. రెండో అమ్మమ్మకు ముగ్గురు అమ్మాయిలు. మూడో అమ్మమ్మకు ఇద్దరు అబ్బాయిలే. ఇవి కుటుంబ వివరాలు క్లుప్తం గా ....
ఇక అస్సలు కధలోకి ... మళ్ళి చెప్తాను....

5, మే 2010, బుధవారం

కధ కాని కధ - పార్ట్ 2

ఉపోద్ఘాతం...ఇంతకుముందు చెప్పాను కదా ముచ్చటైన కుటుంబం గురించి...దానికి కొద్దిగా ...
పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ చదువుల కోసం కాకుండా చెల్లెలి పిల్లల చదువుల కోసం వేరే ఊరిలో పెద్దావిడ వుండి అందరిని చదివించారు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాలేక పిల్లలు రోజు వెళ్లి వచ్చే వారు. తరువాత పొలాలు అమ్ముకుని అందరికి దూరంగా వేరే వూరు వెళ్ళిపోయారు. అల్లుడు ఒక స్నేహితుడిని నమ్మి వాళ్ళ పొలాలు కొని మొత్తం డబ్బులు ఇచ్చి వ్యవసాయం చేసారు. కొన్ని రోజులు పాడిపంటలతో ఆ ఇల్లు కళకళలాడింది. పిల్లలు పై చదువులకు వచ్చేసరికి అంతా ఐపోయి బాగా ఇబ్బందులు పడ్డారు. పొలం అమ్ముదామంటే డబ్బులయితే ఇచ్చారు కాని సాక్ష్యం లేదు, ఆ స్నేహితుడి స్థితి బాలేనప్పుడు వీళ్ళు వీళ్ళ పంట అమ్మి తనకు సాయం చేసారు, చదువుకునేటప్పుడు కుడా చాలా ఆదుకున్నారు. కాని ఆ స్నేహితుడు స్వార్ధంతో చేసిన సాయాన్ని మరచి ఒక్క పైసా కుడా ఇవ్వలేదు...కట్టుబట్టలతో మళ్ళి సొంత ఊరికి వచ్చారు. ఇల్లు మాత్రమే వుంది ఏదో కొద్ది డబ్బులతో కొద్దిగా పొలం కొని రొయ్యల చెరువులు వేసారు. పూర్వం రొయ్యల వ్యాపారం కుడా చేసేవారు మళ్ళి స్నేహితులతో కలిసి ఆ వ్యాపారం మొదలు పెట్టారు. మెల్లగా కాస్త సంపాదించుకుంటున్నారులే అనేసరికి ఈ స్నేహితులలో కుడా ఈర్ష్య కలిగి వీళ్ళ దగ్గర వ్యాపారంలో డబ్బులు లేక బంగారం పెడితే అది తీసుకున్నారు. వేరేగా వ్యాపారం చేస్తే కంపెనీ వాడు డబ్బులు ఎగ్గొడితే వున్న పొలాలు అన్ని అమ్మి మళ్ళి మనష్యులు మాత్రమే నిలబడ్డారు. ఇలా మూడు నాలుగూ సార్లు మోసపోయారు. బతుకు పోరాటంలో ఇవి అన్ని తప్పవు అనుకుని మళ్ళి రొయ్యల చెరువు కౌలుకి వేసి అలా అలా కొద్ది కొద్దిగా సంపాదించారు. పిల్లలు చదువులు బానే చదివారు. చెప్తువుంటే ఇంతేగా అనిపిస్తుంది కాని ఇన్ని ఒడిదుడుకులను తట్టుకోవడం ఆ వుమ్మడి కుటుంబానికి సాధ్యమైంది. కష్టంలో ఎవరు నీ దరి చేరరు కాని నీ దగ్గర డబ్బులు వుంటే నీ చుట్టూనే వుంటారు ఈ విష్యం అందరికి తెలుసు.
మిగతా కధ మళ్ళి చెప్తాను...అంతవరకూ....

నీ చిరునవ్వు

నీ చిరునవ్వు సడిలో  
వేకువ పొద్దులో పక్షుల కువకువలు విన్నా
నీ
చిరునగవులో  
రాలిపడిన ముత్యాల సరాగాల మాలలకై వెదికా
నీ చిలిపి సిరుల సింగారమోలికే చిరునవ్వు హొయలు
ఒంపులు తిరుగుతు ఒయ్యారంగా సాగే  
కృష్ణాగోదారి అందాల్లా నాలో అలజడి రేపే  
నీ జ్ఞాపకమే నాకెంతో అపురూపం.... !!

4, మే 2010, మంగళవారం

ఎదురుచూపులు....!!!

నాతొ నీవుంటే క్షణాల్లా దొర్లిపోతుంది కాలం....
నీవు లేని ప్రతిక్షణం ఒక యుగం నాకు.....
ఆ యుగాలు క్షణాలుగా మారాలంటే...
నీ ఊహల ఊసులతో మైమరవాలి నా మది
నా తలపులన్ని నిండాలి నీ స్మృతులతో...!!

కొన్ని మధుర స్వరాల మచ్చుతునకలు....

స్నేహానికన్న మిన్న...లోకాన లేదురా...కడదాకా నీడలాగా... నిను వీడిపోదురా....
ఈ పాట నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి. ప్రాణస్నేహితులు చిత్రంలోనిది.
చిన్నారి స్నేహమా... చిరునామా తీసుకో...గతమైన జ్ఞాపకం కధగానే మార్చుకో...
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం...
తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట...చిన్నారిపొన్నారి చిలకల్ల జంట...
నీ చెలిమి నేడే కోరితిని....ఈ క్షణమే ఆశ వీడితిని....
నీవులేక వీణ పలుకలేనన్నది .....
ఆకులో ఆకునై....పువ్వులో పువ్వునై ....
వుసులాడే ఒక జాబిలట.....సిరిమువ్వలుగా నను తాకెనటా...
ఇలా ఎన్నో ఎన్నో మంచి మంచి పాటలు ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి మధురమైన పాటల స్వరాలు వినిపిస్తాయి.....

3, మే 2010, సోమవారం

కధ కాని కధ - పార్ట్ 1

కధ చెప్పాలని వుంది....కాని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తే....!!!
చాలా పెద్ద కధ ఇది....ముందు మొదలు పెడదాం....ఏమి అవుతుందో చూద్దాము...
సరే మరి కధ చెప్పేస్తున్నా......అందరు సిద్దంగా వున్నారా వినడానికి ...కాదు కాదు చదవడానికి...
ఓ అందమైన చిన్నది పెద్దది కాని పల్లెటూరు..అందులో ఓ ముచ్చటైన కుటుంబం గురించి చెప్తాను. ఆ జంటకు లేక లేక ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆదిలక్ష్మిలాంటి అందమైన ఆడపిల్ల. అల్లారుముద్దుగా పెంచారు మేనమామకు ఇచ్చి పెళ్లి చేసి అందరు కలిసి వుండే వాళ్ళు. చాలా ఏళ్ళ తరువాత వాళ్ళకు మళ్ళి అబ్బాయి పుట్టాడు. కూతురికి అమ్మాయి పుట్టింది. అందరు కలిసే వుండే వాళ్ళు . పిల్లల చదువులు అవి ఐయ్యి పెళ్ళిళ్ళు ఐయ్యి వాళ్ళకు పిల్లలు......ఇలా ఇప్పుడు ఆ ఇల్లు కళకళలాడుతూ వుంది...కధ అంతా సుఖాంతమే ఐతే నేను మీకు ఈ కధ చెప్పాల్సిన అవసరం వుండేది కాదు..జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురై ఇప్పటికి తేరుకున్న ఆ కుటుంబం గురించి చెప్తే మనకు స్పూర్తి (ఇన్స్పిరేషన్) అవుతుంది అని అనిపించింది...చెప్పనా మరి....మళ్ళి కలుద్దాం...
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner