15, జూన్ 2014, ఆదివారం
మళ్ళి మళ్ళి రాని.....!!
చూశారా అప్పుడే ఎర్ర బస్ ఎక్కి ఓనామాలు రాని భాషతో కుస్తీలు పట్టి వచ్చి రాని ఆంగ్లాన్ని చదవడం రాయడం మొదలు పెట్టి పాతిక ఏళ్ళు అయ్యాయని మా సన్నిహిత మిత్రులు చాలా రోజుల తరువాత కాదు కాదు సంవత్సరాల తరువాత అందరు మాట్లాడితే భలే సంతోషం వేసింది... అర్ధం కాలేదా.... అదే అండి అప్పటి వరకు తెలుగులో చదివి కన్నడ దేశంలో ఇంగ్లీష్ లో ఇంజనీరింగ్ ప్రస్థానం మొదలు పెట్టి పాతిక వసంతాలు (1989-1990) అయ్యింది...ఏమి తెలియని నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిన ఈ 25 ఏళ్ళ జీవితంలో ఆ రోజులు ఎప్పటికి మరపురావు....నన్ను బాగా చూసుకున్న అలానే ఏడిపించిన సరదాకే లెండి....ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు....ఈ పల్లెటూరి అమ్మాయి ఎయిర్ బస్ ఎక్కి అమెరికా వెళ్ళడానికి అక్కడ అమెరికాలో కూడా ఎంతో బాగా అభిమానంగా పలకరించి ఆప్యాయతను పంచిన....కొన్ని చేదు అనుభవాలు మిగిల్చిన ప్రతి ఒక్కరికి నమస్సులు... మొత్తానికి జీవితాన్ని మొత్తంగా చూసిన ఈ 25 ఏళ్ళ కాలంలో ఆ ఇంజనీరింగ్ నాలుగు ఏళ్ళు నా ప్రతి సంతోషానికి ఆనవాళ్ళే...సివిల్ ప్రాక్టికల్స్ లో జామకాయలు కొనుక్కుని సర్ తో తిట్లు తిన్నా... ఎలక్ట్రికల్ లాబ్ లో మెయిన్ వేయమంటే పక్కనే ఉండి కూడా వేయకుండా.....తరువాత పక్కనే ఉన్నావుగా ఎందుకు వేయలేదు అంటే మా అమ్మకు నేను ఒక్కదాన్నే అని చెప్తే కాసేపటికి కాని వాళ్లకు అర్ధం కాలేదు...కార్పెంటరి ఫిట్టింగ్ లాబ్ లో అష్ట కష్టాలు....మొదటి పరీక్ష రోజు నేను మూడు గంటలు ఇంగ్లీష్ లో రాయగలనా అని అనుకున్న క్షణాలు....రెండో సంవత్సరంలో మొదట్లోనే సార్లకు నా ప్రమేయం లేకుండా తెప్పించిన కోపాలు చెప్పిన క్షమాపణలు తరువాత వాళ్ళే మంచి ఆత్మీయిలు అనుకోండి వేరే సంగతి....ఇక లాబ్ లలో ఏది ముట్టుకోకుండా చక్కగా రీడింగ్స్ వేసుకుని ముందుగా పెట్టించుకున్న సంతకాలు... కన్నడ వాళ్ళు కూడా ఎంతో బాగా మాట్లాడేవాళ్ళు.... అదేంటో కాని ఎప్పుడు లాబ్ లలో ఒక్కదాన్నే అమ్మాయిని ఉండేదాన్ని మిగిలిన అందరు అబ్బాయిలే .... రేకుల షేడ్ మా క్లాసు రూములు కనీసం అప్పటిలో ఫాన్ లు కూడా ఉండేవి కాదు వాటి కోసం చేసిన బంద్.... ఇక మూడో సంవత్సరంలో సరిగా రాని సర్ లు వచ్చినా చెప్పని వారు... వెళ్ళిన సరదా విహార యాత్ర హంపి...మా సీనియర్స్ కి ఇచ్చిన వీడ్కోలు పార్టీ.. అనుకోకుండా కొన్ని కొన్ని అపార్ధాలు మొత్తానికి అలా అలా గడచి ఆఖరి సంవత్సరంలో వెళ్ళిన టూరు చేసిన అల్లరి లాబ్ లో సార్ అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని నవ్వుతుంటే నవ్వుతారేంటండి చెప్పండి అని ప్రోగ్రాములు రాయించిన 3 వ సంవత్సరం లోని బద్దకిస్టు సర్...చూసిన సినిమాలు....ఇలా ఎన్నో అన్నింటికన్నా ముఖ్యంగా రాయించుకున్న ఆటోగ్రాఫ్ లు... ఎవరు లేరని మొదలు పెట్టి చెప్పిన సెమినార్ నిండిన రూము వణికిన చేతులు నవ్వేసిన నేను.... తరువాత మామూలే విడి పోవడాలు వీడ్కోలులు రాసుకున్న ఉత్తరాలు చెప్పుకున్న పుట్టినరోజు శుభాకాంక్షలు.... ఇంటి నుంచి తెచ్చిన పంచుకున్న తాయిలాలు ... ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుభూతుల ఆనందాల అందాలు అనుభవించిన ఆ రోజులు మళ్ళి మళ్ళి రాని మధురానుభూతులు.....!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
జ్ఞాపకాలే మధురం ! నిజాలెప్పుడూ చెడు గుళికలే!
చాలా బావున్నాయి మీ జ్ఞాపకాలు . అలాగే మీ ఆంగ్ల మాధ్యమ ఇబ్బందులు కూడా .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి