30, జనవరి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదిహేడవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణం తెలుగు సాహిత్యపు కవి యుగాలతో పాటు ఛందస్సు లోని కొన్ని పద్య లక్షణాలను తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం కవిత్రయంలో మూడవ వారైన ఎఱ్ఱన గారి  వివరాలతో పాటు సీస పద్య లక్షణాలు చూద్దాము....

1320 - 1400 : ఎఱ్ఱన యుగము 

 1320నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాధునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.
తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.

తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాధ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాధునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాధునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."

రాజకీయ, సామాజిక నేపధ్యం

1323లో ఢిల్లీ సుల్తాను చేత పరాజితుడై ప్రతాపరుద్రుడు మరణించడంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. అయితే కాకతీయులకు విధేయులైన నాయకులు తిరిగి ఢిల్లీ సులతాను సేనలను ఓడించి ఆంధ్రాపధాన్ని హస్తగతం చేసుకోగలిగారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఆంధ్రదేశం చిన్న చిన్న భాగాలుగా నాయకుల పాలనలోకి వచ్చింది. కృష్ణానదికు ఉత్తరాన ముసునూరు నాయకులు, రేచెర్ల వెలమ నాయకులు, కృష్ణకు దక్షిణాన రెడ్డి రాజులు రాజ్యం చేశారు. అనంతరం బీజాపూరు బహమనీ రాజులతో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.

ముఖ్య కవులు, రచనలు

యుగకర్తయైన ఎఱ్ఱాప్రగడ హరివంశమును, భారత అరణ్య పర్వ శేషమును, నృసింహ పురాణమును వ్రాసాడు. రామాయణం కూడా వ్రాశాడు కాని అది లభించడంలేదు. భాస్కరుడు భాస్కర రామాయణమును, నాచన సోన ఉత్తర హరివంశమును వ్రాసారు. రావిపాటి త్రిపురాంతకుడు వ్రాసిన రచనలలో "త్రిపురాంతకోదాహరణము" మాత్రం లభిస్తున్నది. చిమ్మపూడి అమరేశ్వరుడనే మహాకవి "విక్రమసేనము" అనే మహాగ్రంధాన్ని వ్రాశాడట గాని అది లభించడంలేదు.

ఇక ఈ వారం సీస పద్య లక్షణాల వివరణ... 

సీస పద్యం

సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది.

ఉదాహరణ 1:

కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు;
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే
బడిన సాధుల కడ్దపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు;
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

లక్షణములు

క.
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !
  • పాదముల సంఖ్య = 4
  • ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.
  • ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
  • ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
  • ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
  • ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
  • రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
  • మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
  • ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

యతి

  • యతి
    • 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
    • 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
  • ప్రాసయతి ఉండ వచ్చు.
    • అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
    • ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక

ప్రాస

ప్రాస నియమం లేదు.

ఉదాహరణ 2:

వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
రానందవార్ది మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుందు?

ఉదాహరణ 3:

సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు

సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.
  1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
  2. ప్రాస నియమం లేదు.
  3. యతి: 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
  4. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే)
ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్ఠం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.
ఉదాహరణ
సీసము
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?
ఆటవెలది
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు
 సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner