ఆలంబనై ఆదుకున్నాయి నీ అనునయాలు
అనురాగమై కురిసాయి నీ జ్ఞాపకాలు
చిన్ననాటి చెలిమిని తడిమాయి
మనసంత నిండి మౌనంలో మురిసాయి
'కల'వరమై కలలా కను'మాయ'మయ్యాయి
ఆరాధనకు అందమైన భాష్యంలా
కలంలో చేరి కాలంతో జత కలిపిన అక్షరంలా
గుప్పెడు గుండెకు ఉప్పెనలై ఉరికిన నీ నవ్వుల మువ్వలుగా
విరిసిన పారిజాతాలు మనసు పడిన స్థావరం నీదై
అలుకలు మరచిన ఆత్మీయతకు అద్దం పట్టిన ముంగిలై
నడయాడిన అంతరాల అంతర్యుద్దానికి తెరలేసిన బందానివై
రెమ్మ చాటున దాగిన లేలేత చివురు మొగ్గల్లో
దాచుకున్న ముగ్ధత్వాన్ని అందుకున్న తలపుల్లో
మైమరచిన ఓ మరీచిక ... తాదాత్మ్యం చెందే ఆడపిల్ల వెన్నెల్లో .....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి