చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
మన అందరికి సుపరిచితమైన పద్యంలో నీటి కోసం తపించే జనం కోసం శ్రీనాధ కవి ఎంత చమత్కారంగా పరమశివుని అడుగుతారో... గంగను విడుము పార్వతి చాలున్ అని....
మీ కోసం ఆ సన్నివేశం పద్యం
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..
నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.
ఆయనదే మరో పద్యం..
పూజారి వారి కోడలు
తాజారగబిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడిసిన
బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్…
ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు..
రాజాశ్రయం
శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించినాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్ధాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.ఘనత - బిరుదులు
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి కవిసార్వభౌముడ ను బిరుదము కలదు.రచనలు
ఇతను ఎన్నో కావ్యాలు రచించినాడు. వాటిలో కొన్ని: భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.- మరుత్తరాట్చరిత్ర
- శాలివాహన సప్తశతి
- శృంగార నైషధము
- భీమేశ్వర పురాణము
- ధనుంజయ విజయము
- కాశీ ఖండము
- హర విలాసము
- శివరాత్రి మాహాత్యము
- పండితారాధ్య చరిత్రము
- నందనందన చరిత్రము
- మానసోల్లాసము
- పల్నాటి వీరచరిత్రము
- క్రీడాభిరామము
- రామాయణము పాటలు
రచియించితి మరుత్తరాట్చరిత్ర.
నూనుగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
శ్రీనాథుని జీవిత విశేషాలు తెలిపే కొన్ని పద్యాలు
దక్క్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!
కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
శ్రీనాథుని చాటువులు
శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .
కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!
నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
… అహహ
పోయె నా గోరు తన చేతి పోరు మాని
ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -
సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?
రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభయైన నేకులె వడకున్
వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కపివరుండు కసవు నేడు
గుంపు గాగ నిచట గురజాల సీమలో
నోగులెల్ల గూడి రొక్క చోట.
గరళము మ్రింగితి ననుచుం బురహర గర్వింపబోకు పో పో పో నీ
బిరుదింక గానవచ్చెడి మెరసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ.
కాశికా విశ్వేశ్వరు గలిసె వీరారెడ్డి
రత్నాంబరము లే రాయడిచ్చు
రంభ గూడె దెనుంగు రాయరాహుత్తుండు
కస్తూరి కే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్థుడయ్యె విస్సన్న మంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలార విభుడేగె
దినవెచ్చ మే రాజు దీర్పగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
గలియుగంబున నిక నుండ గష్టమనుచు
దివిజకవివరు గుండియల్ డిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
సమకాలీకులు
ఈయన పోతన కు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.చరమాంకం
శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాధును ప్రభ మసకబారింది. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా ఊరేగించారని ఆయన చరమ పద్యం ద్వారా తెలుస్తుంది.శ్రీనాథుని వ్యక్తిత్వం
శ్రీనాథ కర్తృత్వంతో ఎన్నో చాటుపద్యాలు మనకిప్పుడు దొరుకుతున్నాయి. వీటిలో ఎన్ని శ్రీనాథుడు స్వయంగా చెప్పినవో, అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.ఇక్కడ “వ్యక్తిత్వం” అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, కవుల కవితాశక్తి కోసమే ఐతే వాళ్ళు రాసిన (లేదా చెప్పిన) గ్రంథాలు చదువుకోవచ్చు, అవి చాలు. అంతటితో ఆగకుండా, ఆ కవుల వ్యక్తిగత విషయాలు కూడ తెలుసుకోవాలన్న కుతూహలం పాఠకుల్లో కలిగినప్పుడు చాటు పద్యాలు ఆ అవసరాన్ని భర్తీ చేస్తాయి. (”A poem at the right moment” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షుల్మన్ వివిధ భారతీయ భాషల చాటువుల గురించి సాధికారిక విశ్లేషణ చేశారు.) కవితాస్వాదనా తత్పరులైన రసిక పాఠకులు తమకు అంతటి ఆనందాన్ని అందిస్తున్న కవుల వ్యక్తిగత ప్రపంచాన్ని గురించి తయారు చేసుకున్న ఊహాచిత్రాల్ని ప్రతిబింబించేవి చాటుపద్యాలు. ఇప్పుడు సినీ తారల, ఆటగాళ్ళ, ఇతర ప్రముఖుల, వ్యక్తిగత విషయాల గురించి జనసామాన్యంలో ఎంతటి కుతూహలం ఉన్నదో చెప్పనక్కరలేదు. ఒకప్పుడు కవులు కూడ ఇలాటి జాబితాలో ఉండేవారనటానికి ప్రబలసాక్ష్యాలు చాటుపద్యాలు. అలాగే, వాళ్ళని ఆరాధించిన పాఠక-శ్రోతలు ఎంతటి సాహితీభక్తులో ఉన్నతస్థాయి కవులో కూడ చూపిస్తాయి.
పై పుస్తకంలో చెప్పినట్లు, ఓ కవి జనబాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయాడో చెప్పటానికి కొలమానాలు చాటుపద్యాలు. ఐతే ఇక్కడ మనం కవిని, అతని రచనల్ని విడదీసి చూడాలి. ఉదాహరణకు ఒక రచనకి ఎంతో జనాదరణ దొరికినా ఆ కవికి సంబంధించిన చాటువులు ఏమీ లేకపోవచ్చు. అలాటి పరిస్థితుల్లో పాఠకుల దృష్టి ఆ కవి మీద కన్నా రచన మీదే ఉందన్నమాట. లేకపోతే, ఆ కవి వ్యక్తిగత జీవితంలో కుతూహల కారకాలైన అంశాలేవీ లేకపోవచ్చు. ఉదాహరణకు నన్నయ గారిని తీసుకుంటే, ఆయన ఎలాటివాడు?
జపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది,
నానాపురాణ విజ్ఞాననిరతు
బాత్రు నాపస్తంబ సూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతావదాత చరితు
లోకజ్ఞు నుభయభాషా కావ్యరచనాభి
శోభితు సత్ప్రతిభాభియోగ్యు
నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యు..”
విశ్వనాధ అభిప్రాయం
ఇటీవలి కాలంలో విశ్వనాథ కూడ ఆయన గురించి “ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి” అన్నారు. అలాటి వ్యక్తి జీవితంలో జనసామాన్యానికి కుతూహలం కలిగించే సంఘటనలుండటం అరుదు. ఐనప్పటికీ ఆయన చివరి పద్యంజారుతరంబులయ్యె వికసన్నవకైరవ గంధబంధురో
దార సమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచి పూరములంబరపూరితంబులై
అదే వేములవాడ భీమకవి విషయంలో ఐతే, చాటువుల్లో ఆయనది ప్రముఖ స్థానమైనా ఆయన రాసినవి ఏవీ ఇప్పుడు దొరకటం లేదు. అంటే, రసవత్తరమైన ఆయన వ్యక్తిగత విషయాలతో పోలిస్తే ఆయన గ్రంథాలు వెలవెల బోయానన్న మాట. ఇంకా చాలామంది కవుల విషయంలో కూడ ఇలా జరిగింది.
ఐతే శ్రీనాథుడి విషయంలో ఒకరకమైన సమతుల్యత సమకూరిందని చెప్పుకోవచ్చు. ఆయన రచనలు, ముఖ్యంగా ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటిగా భూషించబడ్డ శృంగార నైషథం, అవశ్యపఠనీయాలయ్యాయి; అలాగే, ఆయన వ్యక్తిగత అనుభవాలను ప్రతిపాదించే చాటువులు ఆబాలగోపాలానికీ జిహ్వాగ్రాల మీద నిలిచాయి. ఈ చాటువుల్లో కనిపించే శ్రీనాథుడి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందాకనే అనుకున్నట్లు, నిజంగా శ్రీనాథుడు ఇలా ప్రవర్తించాడా అనే ప్రశ్నకి ఇక్కడ తావులేదు - ఔనో కాదో చెప్పటం అసాధ్యం కనుక. ఇవి చెప్పేది తర్వాతి తరాల వాళ్ళ ఊహలో శ్రీనాథుని జీవితం ఎలాటిది అని మాత్రమే.
కాలం గడిచే కొద్ది ఏ విషయమైనా సరళీకృతం కావటం సాధారణం. అంటే మొదల్లో ఉన్న క్లిష్టతలు, అస్పష్టతలు బయటకు వెళ్ళిపోయి ఆ విషయానికి కొట్టొచ్చేట్టు కనిపించే గుణాలు మాత్రం బహుగుణీకరించబడతాయి. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే “మైనర్ పాయింట్స్” మరుగున పడిపోయి “కోర్ వాల్యూస్” అనుకున్నవి ఎంతగానో “యాంప్లిఫై” ఔతాయి. శ్రీనాథుడి వ్యక్తిగత చిత్రీకరణ విషయంలోనూ చాటు పద్యాలు మనకు అదే నిరూపిస్తాయి. వీటిలో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది -
- ఆయన విశాల లోక సంచారి, ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులేమిటో తొలిగా చూపిన వాడు (వెల్చేరు ప్రతిపాదన ప్రకారం)
- సౌందర్యారాధకుడు, మహా రసికుడు, సరసుడు
- భోజనప్రియుడు
- సర్వ స్వతంత్రుడు, దేవుణ్ణైనా లెక్కచెయ్యని వాడు
- విలాసి, జీవితాన్ని విపరీతంగా ప్రేమించి అనుభవించిన వాడు
- బాహ్యప్రేరణలకు వెంటనే స్పందించే వాడు
- అసౌకర్యాలను భరించలేని వాడు
- కులమత విభేదాలు లేనివాడు
- సున్నిత మనస్కుడు
- గొప్ప చమత్కారి
శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్టుడయాడో చాటువుల ద్వారా కూడ అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు.
ఇక శ్రీనాధ కవి యుగం గురించిన వివరణ చూద్దాము..
శ్రీనాధ యుగము :
తెలుగు సాహిత్యంలో 1400 నుండి 1500 వరకు శ్రీనాధ యుగము అంటారు. ఈ యుగాన్ని తెలుగు సాహిత్యంలో ఒక సంధి యుగంగా భావింపవచ్చును. ఈ కాలంలో పురాణ కవుల కావ్యానువాద విధానం కొనసాగింది. మరియు తరువాత వచ్చిన ప్రబంధ యుగానికి నేపధ్యంగా నిలిచింది. కొంత వాఙ్మయము అనువాదాలుగానూ, కొంత స్వతంత్ర కావ్యాలుగాను, కొంత నానావిధ వైచిత్ర్యంతోను ఆవిర్భవించింది. పురాణ కావ్యాలలో ప్రబంధ రీతులు గోచరమయ్యాయి. రచనలలో అక్షర రమ్యత, అర్ధగౌరవమూ కూడా భాసించాయి. లోకంలో ఉబుసుపోకకు చెప్పుకొనే కథలవంటివి కావ్యరూపం దాల్చాయి.
రాజకీయ, సామాజిక నేపధ్యం
శ్రీనాధుడు 1365 (లేదా 1385)-1470 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చును. ఈ సమయానికి రెడ్డి రాజ్యాలు స్థిరపడ్డాయి. ప్రోలయ వేమారెడ్డి (1323-1350) రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. ప్రోలయవేమారెడ్డి తరువాత అతని తమ్ముడు అనవేమారెడ్డి, అనంతరం కుమారగిరి రాజ్యాన్ని పాలించారు. కుమారగిరి బావమరది కాటయవేముడు రాజమండ్రిలో రెడ్డి రాజ్యాన్ని దాదాపు స్వతంత్రంగా పాలించసాగాడు. కుమారగిరికి సంతానం లేనందున అతని తరువాత అతని పినతాత కొడుకు పెదకోమటివేముడు 1400-1420 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. ఈ పెదకోమటి వేముని ఆస్థానకవి శ్రీనాధుడు. మంత్రి సింగనామాత్యుడు. రాజమండ్రిలో కాటయవేముడు, అతని వారసులు కూడా సాహిత్యాభిమానులు. స్వయంగా కవులు.ముఖ్య కవులు, రచనలు
యుగకర్త అయిన శ్రీనాధుడు మహాపండితుడు, విద్యాధికారి, వ్యవహర్త, కార్యనిర్వాహక నిపుణుడు. మూడుమార్లు దేశాటనము చేసి శాస్త్ర జ్ఞానమునకు లోకజ్ఞతను జోడించాడు. ఇతడు నైషధము, భీమ పురాణము, కాశీఖండము, పల్నాటి వీరచరిత్ర, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము వంటి గ్రంధములను రచించాడు. ఇదే కాలానికి చెందిన పోతన శ్రీనాధునికంటె షుమారు 15 సంవత్సరములు చిన్నవాడని సాహితీ చారిత్రికులు భావిస్తున్నారు. ఆంధ్ర మహాభాగవతంలో 8 స్కంధాలను పోతన తెనిగింపగా, తక్కిన నాలిగింటిని గంగన, ఏర్చూరి సింగన, వెలిగందల నారయ రచించారు. తెలుగునాట కృష్ణతత్వానికి, భక్తి భావానికి ఆంధ్ర భాగవతం చిరునామాగా నిలిచింది. ఇంతేగాక కవితా మాధుర్యానికి పోతన పెట్టింది పేరు.ఇదే కాలానికి చెందిన మరొక కవి మడికి సింగన ద్విపద భాగవతాన్ని, వాసిష్ఠ రామాయణాన్ని రచించాడు. సకల నీతి సమ్మతము అనే సంకలన గ్రంధాన్ని కూడా వ్రాశాడు. ఇది తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంధము. జక్కన విక్రమార్క చరితము వ్రాశాడు. అనంతామాత్యుని రచనలు - భోజరాజీయము, ఛందోదర్పణము, రసాభరణము. గౌరన మంత్రి ద్విపద హరిశ్చంద్ర కావ్యమును, నవనాధ చరిత్ర అనే శైవసిద్ధుల చరిత్రాన్ని వ్రాశాడు. శ్రీనాధుని యుగంలోనే అనంతామాత్యుడు భోజరాజీయమనే కథాకావ్యం వ్రాసాడు. సున్నితమైన హాస్యరసపోషణలో అనంతుడు సిద్ధహస్తుడు.
శ్రీనాధుని శిష్యుడు దగ్గుపల్లి దుగ్గన కాంచీమహాత్మ్యము, నాచికేతూపాఖ్యానము అనే కావ్యాలు వ్రాశాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు వ్రాశాడని భావిస్తున్న అనేక గ్రంధాలలో జైమిని భారతము, శాకుంతలము మాత్రం లభిస్తున్నాయి. దూబగుంట నారాయణ కవి పంచతంత్రం వ్రాశాడు. బైచరాజు వేంకటనాధుడు అనే కవి కూడా పంచతంత్రాన్ని ప్రౌఢబాషలో వ్రాశాడు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణాన్ని తెలిగించాడు. పిడుపర్తి సోమన అనే శివకవి పాల్కురికి సోమనాధుని బసవపురాణాన్ని చంపూకావ్యంగా వ్రాసి పాల్కురికి సోమనాధునికే అంకితం ఇచ్చాడు.
విజయనగర రాజ్యంలో నంది మల్లయ, ఘంట సింగన అనే జంటకవులు వరాహపురాణమును రచించారు. వీరిదే ప్రబోధ చంద్రోదయము అనే సమగ్ర ఆధ్యాత్మిక కావ్యాన్ని (కృష్ణమిశ్రుడు వ్రాసిన సంస్కృత కావ్యం) సంస్కృతంనుండి యధాతధంగా తెలుగులో వ్రాశారు. ఈ యుగంలో దాదాఫు చివరివాడైన కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక వ్రాశారు .
ఇలా చెప్పుకుంటూ పొతే శ్రీనాధుల వారి గురించి చాలా ఉంది... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....
సేకరణ : వికీపీడియా నుండి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి