28, మార్చి 2017, మంగళవారం

ఉగాది ఊరడింపులు..!!

ఎక్కడో పగిలిన అద్దం శబ్దంలో
భళ్ళున తెల్లారిన జీవితచక్రంలో
మరో ఉషోదయపు వేకువ తొంగి చూస్తూ

అన్యాక్రాంతమౌతున్న బిరుదుల
పంపిణీల ఆక్రందనల్లో వినిపిస్తున్న
కోయిల స్వరాల కంఠధ్వని కీచుగా

రాలిన మామిడి పిందెల ముక్కల్లో
దొరకని వేపపూతను వెదుకుతూ
కన్నెర్ర చేసిన ప్రకృతికి తలను వంచుతూ

వేదికలపై వినిపించే హోరులో
నలిగిపోతున్న సహజత్వపు కవిత్వం
మూగబోయి మిగిలింది దిగాలుగా

రెపలాడుతున్న కొత్త శాలువాలు
అమ్ముడుబోయిన అధికారానికి తలొగ్గి
ఊరడింపులు మరో ఉగాది కోసం ఎదురుచూస్తూ...!!

అందరికి ఉగాది శుభాకాంక్షలు

21, మార్చి 2017, మంగళవారం

మారని నేతల తీరు...!!

నేస్తం,
        మనం ఎన్ని చెప్పినా, ఏమి చేసినా మనం ఎన్నుకున్న ప్రజా నాయకుల తీరు మారబోదని మరోమారు ఋజువు అవుతోంది. అధికార పక్షమా, ప్రతి పక్షమా అని లేకుండా ప్రజల తీర్పుతో గెలిచామని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న నేటి రాజకీయ ప్రముఖులు మనకి అవసరమా... ఒకప్పుడు ప్రచార మాధ్యమాలు లేవు. ఇప్పుడు ప్రపంచం యావత్తు చూస్తుందన్న ఇంగిత జ్ఞానంలేని ఈ నాయకులనా మనం ఎన్నుకున్నది అని ప్రతి ఒక్క ఓటరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసెంబ్లీ / పార్లమెంట్  అంటే ప్రజల సమస్యలను, అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కలిగిన ప్రజానాయకులు ఉండాల్సిన చోటు. నోటుకు ఓటు అమ్ముడు పోయినంత కాలం ఇలానే ఉంటుంది. ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు మాత్రమే అసెంబ్లీ / పార్లమెంట్లో అడుగుపెట్టే రోజు ఎప్పుడు వస్తుందో...!!

శి(థి)లాక్షరాలు...!!

అంతుపట్టని మనసు మధనానికి
అక్షర రూపమివ్వడానికి ఆత్రపడే
కలానికి సాయంగా మిగిలిన
తెల్ల కాగితం చిన్నబోతోంది

కాలంతో పోటీగా పరుగులెత్తే మది
అలసట తెలియక అడుగులేస్తునే
అసంతృప్తిగా అడ్డు పడుతున్న
భావాలను నిలువరించాలని చూస్తోంది

గత జన్మాల ఖర్మ ఫలితాలకు
సాక్ష్యంగా నుదుటిరాతల గీతలు
చేతిలోని రాతలుగా మారుతూ
వెలుగు చూస్తున్న తరుణమిది

మనుష్యులతో అల్లుకున్న బంధాలు
మానసాన్ని వీడలేక వెలువరించే
శి(థి)లాక్షరాలు చీకటికి చుట్టాలుగా చేరక
చెదరని శిల్పాలై వెన్నెలకాంతులు వెలువరిస్తాయి...!!

ప్రపంచ కవితా పండుగ రోజు శుభాకాంక్షలు అందరికి ....!!

20, మార్చి 2017, సోమవారం

మరచిపోతున్నారు...!!

నేస్తం,
         ప్రతిభను గుర్తించడం పక్కన పెట్టినా కనీసం ఒకే ఊరిలో ఉన్న వాళ్ళను పిలవాలని కూడా లేకుండా పోతోంది కొందరికి. కుటుంబాలకే పరిమితం అనుకున్న అహాలు, ద్వేషాలు సాహిత్యానికి కూడా అంటుకుంటున్నాయి. బయటివారు గుర్తించిన మన వాళ్ళ ప్రతిభను కళ్ళెదురుగా ఉన్నా మనం గుర్తించలేక పోవడం హాస్యాస్పదం. ఎక్కడెక్కడి వారికో ఆహ్వానాలు పంపి ఇంట్లో వాళ్ళను మర్చిపోయినట్లు ఉంది. ఇంట్లో వాళ్ళను పిలవాలా అని మళ్ళీ మరో ప్రశ్న వేయవద్దు. పిలువని పేరంటానికి ఎవరైనా ఎలా వస్తారు..? సాహిత్యం అందరికి సన్నిహితంగా ఉంటే  బావుంటుంది.మీ అంత గొప్పవాళ్ళు కాకపోయినా ఏదో అ ఆ లు నేర్చుకుంటున్న కొద్దిమందినయినా కాస్త ప్రోత్సహించండి. మీకేం పోటీ కాబోరు....!!

త్రిపదాలు...!!

1. ఆకర్షణకి వికర్షణకి మధ్యలో
నీ నా ల బంధం విలక్షణంగా
నిలబడి స్నేహానికి సరికొత్త అర్దానిస్తూ...!!

2. చీకటి చుట్టమై చేరినా
జ్ఞాపకాల నక్షత్రాలను దాయలేక
మది ముంగిలిలో వెన్నెలపూలు...!!
 

19, మార్చి 2017, ఆదివారం

విష పంజరాలెన్నో...!!

అంతర్జాలపు మాయాజాలంలో
ముఖచిత్రాల్లేని ముఖ పుస్తక ఖాతాలెన్నో

అస్తవ్యస్తపు ఆలోచనలతో
అధోగతి పట్టిన బతుకులెన్నో

అక్షరాలు సిగ్గుపడే రాతలతో
అగమ్య గోచరపు జీవితాలెన్నో

గమనం తెలియని శరాలతో
మనసులను చంపుతున్న కౄర మృగాలెన్నో

సప్తపదుల అర్ధాలకు క్రొంగొత్త భాష్యాలతో
అగాధపు అంచులలో కూలుతున్న కాపురాలెన్నో

క్రమ సంబంధాలు లేని బంధాలతో
అక్రమ సంబంధాలు ఆడుకునే ఆటలెన్నో

నమ్మకాన్ని వమ్ము చేస్తూ తమ నటనతో
వ్యాపారాలు చేస్తున్న కుహనావాదులెందరో
 
మరుగౌతున్న మానవతా విలువలతో 
కనుమరుగు కాలేని మాసిపోని మమతలెన్నో

నీలి నీడల చిత్ర 'వి'చిత్రాల వలయాలతో
వీక్షకులకు కొరత లేని వింత విష పంజరాలెన్నో...!!

18, మార్చి 2017, శనివారం

గురివింద గింజ సామెత...!!

అమ్మాయో అబ్బాయో తెలియని సుమిత్రా, 

          నీ చాట్ లో మెసేజ్లకు బదులు ఇవ్వని లేదని అందరివీ అబద్దపు ఐడిలు కాదు, వాళ్ళందరు  నీలా పనికిమాలిన చాట్ లు చేయడం లేదు. నీ దృష్టిలో నీతో చాట్ చేయక పొతే ఇక అందరు మిడ్ నైట్ చాట్ లు చేస్తారు, ఫేక్ ఐడిలతో చాట్ లు చేస్తారు అనుకుంటే అది చాలా తప్పు. ఒకరిని అనే ముందు నీది నువ్వు చూసుకో. నీదే ఫేక్ ఐడి నువ్వు ఇంకొకరిని అనడం చాలా హాస్యాస్పదం గా ఉంది. అయినా నువ్వు చెప్పే గుడ్ మాణింగ్ / గుడ్ నైట్ మెసేజ్ లకు రిప్లై ఇవ్వక పోతే ఎదుటివాళ్ళకి సంస్కారం, సభ్యత లేదు అనడానికి నీకేం హక్కు ఉంది..? అది వాళ్ళ ఇష్టం గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు ఎఫ్ బి లో ఉంటారు ఉన్నంత మాత్రాన నీతో చాట్ చేయాలని రూల్ లేదు. ఇక పోస్టులంటావా నావి గొప్ప పోస్టులో కాదో నాకు తెలియదు, నిన్ను ఒప్పుకోమని నేను చెప్పలేదు. నా గోడ మీద నా ఇష్టం వచ్చింది రాసుకుంటాను, నిన్ను చూడమని కూడా నేను ఎప్పుడు  చెప్పలేదు. నేను ఏమిటి అనేది నేను తెలిసిన అందరికి తెలుసు. నా ఐడి ఫేక్ అనుకుంటే అది నీ ఖర్మ. నా ప్రొఫైల్ చూస్తేనే తెలుస్తుంది నేను ఫేకా కాదా అని. నువ్వు నన్ను బాస్టర్డ్ అన్నావు. పర్లేదు నన్ను అడిగిన ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకో అప్పుడు ఎవరు బాస్టర్డ్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్ గా ఆడ్ చేసినంత మాత్రాన అడ్డమైన ప్రశ్నలు వేస్తువుంటే సమాధానాలు చెప్పడం, మీరు పెట్టే మెసేజ్ లకు సమాధానాలు చెప్పడం నేను చేయను. అవసరమైన వాటికే సమాధానాలు ఇస్తాను. ఇష్టం లేని వాళ్ళు నిరభ్యంతరంగా నన్ను ఆన్ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేసుకోవచ్చు. మీ అంచనాలకు తగ్గట్టుగా ప్రతిస్పందించని వాళ్ళను నోటికి వచ్చినట్లు మాట్లాడ వద్దు.
సుమిత్రా ముందు నీ ఐడి చూసుకో నువ్వు ఒకరిని అనే ముందు.
 గురివింద గింజ సామెత ముందు నీకే వర్తిస్తుంది.అసలు పేరు ఫొటోతో లేని నువ్వు ఇంకొకరిని అనడం, చెప్పడం కాదు ఆచరించండి అని చెప్పడం చాలా నవ్వు తెప్పిస్తోంది. నీ ప్రొఫైల్లో వాడిది ఫేక్ ఐడి, వాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఇవే కదా ఉంది.. ఆడ్ చేసినప్పటి నుంచి చూస్తున్నా నీ ఐడి తేడాగానే ఉంది నీ మెసేజ్ లు కూడా... ఇక ఈ రోజు తప్ప లేదు..
నా ఫ్రెండ్ లిస్ట్  లో ఉన్న అందరికి ఇదే చెప్తున్నా ఆడ్ చేసాను కదా అని గుడ్ మాణింగ్ / గుడ్ నైట్ మెసేజ్ లకు రిప్లలు ఇవ్వడం, మీరు అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పడం నా పని కాదు. ఇష్టమైన  వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు అన్ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేసుకోవచ్చు , నాకేం ఇబ్బంది లేదు. అంతే కానీ తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు ఇలా అడిగి ఎదుటివాళ్ళ సహనాన్ని పరీక్షించకండి. కాలం చాలా విలువైనది.. ఎవరి కాలాన్ని వారికే వదిలేయండి...!!         

ఏక్ తారలు ..!!

1. కలలను తుంచకు_అలసిన మదికి ఆలంబన అవే కదా..!!
2. పద త్వరగా_పరుగులెత్తి పోయే కాలాన్ని మనం ఆపేద్దాం...!!
3. మాను మోడుబారిపోతోంది_అయినా కొత్త చివుర్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది..!!

13, మార్చి 2017, సోమవారం

కాలుతున్న చితి..!!

ఎగసి పడుతున్న మంటల్లో
కాలుతున్న నిజాల నుంచి
పచ్చి నెత్తుటి వాసన వస్తూనే ఉంది

మండుతున్న గుండె చప్పుడు
వినిపిస్తున్న ఖేదాల నాదాన్ని
చావు దప్పుల మోతలో కలిపేస్తోంది

మనసు జార్చిన భారమంతా కలిసి
కన్నీటి తడిలో ఆరిపోతున్న
దీపాల వెలుగు మసకబారుతోంది

నిన్నటి గతాన్ని జ్ఞాపకంగా మార్చి
రేపటి వాస్తవానికి నాందిగా కాలుతున్న చితి
స్నేహంగా మరణంతో మాట్లాడుతోంది...!!

అతిశయమెందుకో అక్షరానికి..!!


అద్దంలా అగుపిస్తూ
అనంత పద సంపదకు
బాసటగా నిలిచినందుకేమో

అనునయాల అభిమానాలకు
చిప్పిల్లిన కన్నీళ్ళకు చేరువ
తానైనందుకేమో 

మధన పడే మనసుకు
మూగబోయిన భావాలకు
చేయూతగా మారినందుకేమో

ఆనందాలకు నెలవుగా
దుఃఖాలకు ఓదార్పుగా
ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నందుకేమో

ఓటమి క్షణాలకు తలవంచి
విజయ పథానికి తావిచ్చి
గెలుపు పిలుపు వినిపిస్తున్నందుకేమో

ఏకాంతానికి ఎడబాటుకి
గతానికి వర్తమానానికి
ఏకైక నేస్తంగా చేరినందుకేమో

అతిశయమెందుకో అక్షరానికి
అర్ధమైన అనుబంధం జత కలిసి
క్షణాల జ్ఞాపకాలను యుగాలకు దాచినందుకేమో...!!

10, మార్చి 2017, శుక్రవారం

పుట్టగతులు లేకుండా పోతారు...!!

నేస్తం,

        పాత సామెతే అయినా మళ్ళి ఓ సారి గుర్తు చేయాల్సి వస్తోంది. "పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది" అన్న మాట మరోసారి నిజమైంది. తాగుడు, తిరుగుడు ఎవరి ఇష్టం వాళ్ళది. కొంత మందికి పెళ్ళాం, పిల్లలు, బాధ్యతలు ఉండవు. ఒక్క మగాడు అన్న అహం తప్ప. అది కూడా ఎంత అంటే వీడు ఎక్కడైనా తిరగొచ్చు, ఎంత మందితోనైనా ... సాక్ష్యాలతో పట్టుబడితే పెళ్ళాన్ని అందరి ముందు కొట్టొచ్చు.. జీతం బత్తెం లేని పనిమనిషిగా పెళ్ళాం పడి ఉండాలి వీరి దృష్టిలో. నాలుగు రోజులు కన్నవారింటికి వెళ్ళినా అనుమానించి  అవమానించే మహా పురుష పుంగవులు, బయటివారికి అపర శాంతిదూత. ఇలాంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారంటే నమ్ముతారా..! మరి వీళ్ళకి ఇదేం పోయేకాలమో అర్ధం కావడం లేదు ఇంట్లో ఆలి పనికి రాదు కానీ వయసుతో పని లేకుండా బంగారాలు, సింగారాలు, పండులు ఇలా బోలెడు మంది ముద్దుపేర్ల మందారాలు అవి వడలినా, ముడుచుకున్నా వీరికి వాళ్ళ దగ్గర రోజు పండగే మరి. నాకయితే మరో సామెత కూడా గుర్తు  వస్తోంది.. "ముసలోడి దసరా పండగ" అంటే ఇదేనేమో. వీళ్ళు దిగజారిపోయి ఎదుటివాళ్ళు కూడా వీళ్ళ లానే అనుకుని తృప్తి పడుతూ ఉంటారు.
పదవులు డబ్బులు ఉంటే సరిపోదు ప్రతి మనిషికి వ్యక్తిత్వం అనేది ఉండాలి. మనకి లేదని ఎదుటివాళ్ళకు లేదు అనుకుంటే అది మీ భ్రమ. మేము తాగాలి, తిరగాలి అనుకుంటే ధైర్యంగా తాగగలం, తిరగగలం. మాకంటూ కుటుంబ విలువలు ఉన్నాయి. తప్పేదో ఒప్పేదో బాగా తెలుసు. మీరు చేసే ఎదవ పనులకు మామీద పడి ఏడవద్దు. ఇచ్చిన విలువ పోగొట్టుకోవద్దు. శాడిజం ఆభరణం కాదు. మానసిక రోగం. అది తెలుసుకుని ముందు దానికి మందు వేసుకుంటే కనీసం చివరి క్షణాల వరకు మీ అన్న నలుగురు తోడు ఉంటారు లేదా ఏకాకుల్లో కాకిలా మిగిలి పోతారు. మానసిక హింసకు శిక్ష లేదు అని మీరు అనుకోవచ్చు కానీ పైవాడు ఒకడు ఉన్నాడు కదా వాడు అందరి లెక్కలు, అన్ని కూడికలు తీసివేతలు సరి చేస్తాడు. మీ తప్పులను సహించే బంధాన్ని హింసిస్తే పుట్టగతులు లేకుండా పోతారు. జాగ్రత్త...!!

ముసలి చెట్టు ...!!


మోడుబారిన ముసలి చెట్టు
మూగగా చూస్తోంది
రాలుతున్న పండుటాకుల్లో
గురుతుగా మిగిలిపోయిన 
జ్ఞాపకాలను ప్రోది చేసుకుంటూ
ఏళ్ళ తరబడి పాతుకుపోయిన
వేళ్ళు ఎండిపోతుంటే
విశాలంగా విస్తరించిన వంశవృక్షం
నలుదెసలా అందంగా పాకితే
సంతసించిన ఆ తనువు
ఈనాడు.. 
ముడుతలు పడిన చర్మంలో
దాగిన జీవం కొడగడుతుంటే
పచ్చని కొమ్మలను, లేచివుర్లను
ఒక్కసారి తనివిదీరా చూడాలన్న
తపనతో తడియారిన కన్నులలో
వెలుగులు నింపుకుని
ఎదురుతెన్నులు చూస్తోంది
భారమైన మనసుతో..!!

5, మార్చి 2017, ఆదివారం

గర్వంగా ఉంది..!!

మనలో జీవితం మీద కసితో పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండి ఉండవచ్చు. అలా వచ్చిన వాళ్ళలో నా
స్నేహితులు, చిన్ననాటి నేస్తాలు ఉన్నారని చెప్పడం నాకు చాలా గర్వకారణం.

మేము విజయనగరం పక్కన చిన్న పల్లెటూర్లో ఒక ఏడు సంవత్సరాలు ఉన్నాము. మా నాన్న స్నేహితుడు అని నమ్మిన వ్యక్తి ఇప్పుడు చాలా గొప్పవాడు. కానీ ఈ భూమి మీద లేరు. ఇక్కడ వాళ్ళ గురించి చెడుగా రాయడం నా అభిమతం కాదు. చెప్పాల్సిన సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. (వాళ్ళ అవసరాలు ఎన్నో తీర్చారు ఒకప్పుడు రూపాయి లేకపోతే మా పురిలో వడ్లు  అన్ని అమ్మి వాళ్ళ ఆవిడకి డబ్బులు ఇచ్చి పంపారు. ) మా సొంత ఊరిలో పొలాలు అమ్మి విజయనగరంలో ఈ స్నేహితుడికి మొత్తం డబ్బులు ఇచ్చి మోసపోయారు. నాకు  చెప్పారు ఆ స్నేహితుడు .. నీ కనుచూపు మేర కనిపించే పొలం అంతా నీదే అని... అక్క, అన్నయ్య, పెద్దమ్మ చాలా మంచివాళ్ళు. మేము వనవాసం చేసిన ఆ ఏడు సంవత్సరాలు నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చాయి.

పినవేమలిలో మేము ఉన్నది. స్కూలుకి రోజు జొన్నవలస రెండు మైళ్ళు ప్రైవేట్ బస్ లేదా నడిచి వెళ్ళాలి. ఏడు  నుంచి పది వరకు అక్కడే నా చదువు గవర్నమెంట్ హైస్కూలు లో. నాతొ చదువుకున్న నా నేస్తాలు చాలా మంది ఇప్పుడు బావున్నారు. అలాంటి వారిలో జీవితం మీద కసితో పైకి  వచ్చిన సాధూరావ్ ని మీకు అందరికి పరిచయం చేయాలి.

చిన్నప్పుడే నాన్న నిర్లక్ష్యంతో సంసారాన్ని వదిలేస్తే అమ్మ కూలికి వెళుతుంటే తాను కూడా కూలికి వెళ్లిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్ వసతి గృహం (హాస్టల్) లో ఉండి చదువుకున్నాడు. బాగా కష్టపడి చదివేవాడు. అప్పట్లో పదిలో ఫస్ట్ క్లాస్ అంటే చాలా గొప్ప. నలభై మందిలో ఏడుగురం పాస్ అయితే నాలుగు ఫస్ట్ క్లాసులు, మూడు సెకెండ్ క్లాస్ లు. ఆ నాలుగు ఫస్ట్ క్లాసుల్లో సాధూరావ్ ది ఒకటి.  తరువాత ఇంటర్ ఐయ్యాక మేము మోసపోయిన జీవితంతో మళ్ళి మా సొంత ఊరు కోటా బియ్యం తీసుకుని వచ్చేసాము. అది అప్పటి పరిస్థితి.  తరువాత నా ఇంజనీరింగ్, పెళ్ళి ... వగైరా.

చాలా సంవత్సరాల తరువాత కలిసినప్పుడు కలిసిన సంతోషంతో పాటు సాధూరావ్ ఉన్నతిని విని ఎంత గర్వంగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేను. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న, ఎవరి అండదండలు లేకుండా ఓ వ్యక్తి ఈరోజు తన కుటుంబానికి చక్కని గుర్తింపునిచ్చాడు..తన కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా కనీసం ఓ వంద మందికి ఉపాధి చూపించగలుగుతున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. కాస్తో కూస్తో ఉన్న జనం జీవితంలో ఎదగడం పెద్ద విషయం కాదు. కోటికి ఇంకొన్ని కోట్లు చేరతాయి అంతే. కష్టం విలువ తెలిసిన పేదరికానికి తెలుస్తుంది జీవితంలో ఎదగడం అంటే ఏమిటో. 

అభినందనలు నా చిన్ననాటి నేస్తానికి.. మా ఈ గర్వానికి కారణమైనందుకు... తాను మరింతగా ఎదగాలని కోరుకుంటూ...

3, మార్చి 2017, శుక్రవారం

పూలమాల...!!

ముగ్ధంగా ముడుచుకున్న మొగ్గలు
విఛ్చిన వేవేల వర్ణాల పూబోణియలు

రెప్పపాటు ఈ జీవితానికి పూబంతులతోనే
ఆనంద విషాదాల అనునయ పరిచయాలు

పుట్టిన వేడుకలోనూ, జీవన చరమాంకానికి
పూల పానుపుల సుగంధాలతో మమేకాలు

విరుల మాలల అందాలలో అగుపించిన
విభిన్న మనస్థత్వాల భిన్న సమ్మేళనలు

దైవత్వానికి మానవత్వానికి చేరువగా
మగువల మనసు దోచే పూమాలలు

పరిమళాల సొరభాల సోయగాలతో
రెక్కలు విప్పిన పూలు ప్రపంచ శాంతి కపోతాలు..!!

2, మార్చి 2017, గురువారం

వజ్జా వారి వంశ వృక్ష విస్తరణ...!!


అందరికి శుభోదయం
వజ్జా వారి వంశ వృక్షం విస్తరణలో భాగంగా... నా ఈ లేఖ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న వజ్జా వారికి అందరికి ...

పది తరాల నుండి వింజనంపాడు  ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలం ఈ చుట్టుపక్కలే ఉన్నామనుకున్న మన వంశం పాకాల నుంచి పలాస వరకు, బోధన్ నుంచి వరంగల్ ఖమ్మం వరకు పలు ప్రాంతాల్లో చక్కని నడవడితో, మంచి కుటుంబ విలువలతో విస్తరించినట్లుగా తెలిసి చాలా సంతోషంగా ఉంది. మనం ఒక్కరమే ఉన్నామనుకున్న ఏకాంతం నుంచి నావాళ్ళు బోలెడు మంది నా చుట్టూ ఉన్నారన్న తృప్తి  చెప్పలేని సంతోషం అందిస్తుంది. మనం అందరం కనీసం ఒకసారి కలిస్తే బావుంటుంది అన్నది నా కోరిక. మీ వీలుని బట్టి మనవాళ్ళు అందరు ఎక్కడెక్కడ  ఉన్నారో వివరాలు నాకందిస్తే మన అందరి కలయికకు వేదిక సిద్ధం చేస్తాను.

పెద్దలు, పిన్నలు, హితులు, సన్నిహితులు ... అందరు నా ఈ కోరికను మన్నించి వివరాలు తెలుపగలరని మనవి.
నా పేరు వజ్జా రామకృష్ణ ప్రసాద్. మా ఊరు పసుమర్రు. చిలకలూరిపేట దగ్గర. నా ఫోన్ నెంబర్ 9848252066.

అందరిని కలవాలనుకునే
       మీ అందరి
వజ్జా రామకృష్ణ ప్రసాద్
9848252066
పసుమర్రు

1, మార్చి 2017, బుధవారం

మిగిలి పోవాలని ఉంది..!!

భయం లేదు బెరుకు లేదు
అధైర్యమసలే లేదు
ఆశ లేదు నిరాశ లేదు
అతిశయమసలే లేదు
కోపం లేదు శాంతం లేదు
చిరునవ్వసలే లేదు
వాంఛ లేదు వలపు లేదు
వారింపసలే లేదు 
నడక లేదు నడత లేదు
నడవడికసలే లేదు  
రూపం లేదు మొహం లేదు
నటనసలే లేదు
పలుకు లేదు పలకరింపు లేదు
మౌనమసలే లేదు 
జీతం లేదు భత్యం లేదు
జీవితమసలే లేదు 
ఓటమి లేదు గెలుపు లేదు
గమ్యమసలే లేదు
ఏది లేకున్నా నాదేదీ కాకున్నా
నీతి ఉంది నిజాయితీ ఉంది
న్యాయంగా నిలవాలన్న
తపన ఉంది
రెప్పపాటు జీవితంలో
రెప్పచాటు స్వప్నంగా
మిగిలి పోవాలని ఉంది..!!

(వనజ గారు మీ చిత్రాన్ని తీసుకున్నా... ధన్యవాదాలు )




నా రాత...!!

నా చేతిరాతలో అక్షరాలు...
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner