స్నేహితులు, చిన్ననాటి నేస్తాలు ఉన్నారని చెప్పడం నాకు చాలా గర్వకారణం.
మేము విజయనగరం పక్కన చిన్న పల్లెటూర్లో ఒక ఏడు సంవత్సరాలు ఉన్నాము. మా నాన్న స్నేహితుడు అని నమ్మిన వ్యక్తి ఇప్పుడు చాలా గొప్పవాడు. కానీ ఈ భూమి మీద లేరు. ఇక్కడ వాళ్ళ గురించి చెడుగా రాయడం నా అభిమతం కాదు. చెప్పాల్సిన సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. (వాళ్ళ అవసరాలు ఎన్నో తీర్చారు ఒకప్పుడు రూపాయి లేకపోతే మా పురిలో వడ్లు అన్ని అమ్మి వాళ్ళ ఆవిడకి డబ్బులు ఇచ్చి పంపారు. ) మా సొంత ఊరిలో పొలాలు అమ్మి విజయనగరంలో ఈ స్నేహితుడికి మొత్తం డబ్బులు ఇచ్చి మోసపోయారు. నాకు చెప్పారు ఆ స్నేహితుడు .. నీ కనుచూపు మేర కనిపించే పొలం అంతా నీదే అని... అక్క, అన్నయ్య, పెద్దమ్మ చాలా మంచివాళ్ళు. మేము వనవాసం చేసిన ఆ ఏడు సంవత్సరాలు నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చాయి.
పినవేమలిలో మేము ఉన్నది. స్కూలుకి రోజు జొన్నవలస రెండు మైళ్ళు ప్రైవేట్ బస్ లేదా నడిచి వెళ్ళాలి. ఏడు నుంచి పది వరకు అక్కడే నా చదువు గవర్నమెంట్ హైస్కూలు లో. నాతొ చదువుకున్న నా నేస్తాలు చాలా మంది ఇప్పుడు బావున్నారు. అలాంటి వారిలో జీవితం మీద కసితో పైకి వచ్చిన సాధూరావ్ ని మీకు అందరికి పరిచయం చేయాలి.
చిన్నప్పుడే నాన్న నిర్లక్ష్యంతో సంసారాన్ని వదిలేస్తే అమ్మ కూలికి వెళుతుంటే తాను కూడా కూలికి వెళ్లిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్ వసతి గృహం (హాస్టల్) లో ఉండి చదువుకున్నాడు. బాగా కష్టపడి చదివేవాడు. అప్పట్లో పదిలో ఫస్ట్ క్లాస్ అంటే చాలా గొప్ప. నలభై మందిలో ఏడుగురం పాస్ అయితే నాలుగు ఫస్ట్ క్లాసులు, మూడు సెకెండ్ క్లాస్ లు. ఆ నాలుగు ఫస్ట్ క్లాసుల్లో సాధూరావ్ ది ఒకటి. తరువాత ఇంటర్ ఐయ్యాక మేము మోసపోయిన జీవితంతో మళ్ళి మా సొంత ఊరు కోటా బియ్యం తీసుకుని వచ్చేసాము. అది అప్పటి పరిస్థితి. తరువాత నా ఇంజనీరింగ్, పెళ్ళి ... వగైరా.
చాలా సంవత్సరాల తరువాత కలిసినప్పుడు కలిసిన సంతోషంతో పాటు సాధూరావ్ ఉన్నతిని విని ఎంత గర్వంగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేను. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న, ఎవరి అండదండలు లేకుండా ఓ వ్యక్తి ఈరోజు తన కుటుంబానికి చక్కని గుర్తింపునిచ్చాడు..తన కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా కనీసం ఓ వంద మందికి ఉపాధి చూపించగలుగుతున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. కాస్తో కూస్తో ఉన్న జనం జీవితంలో ఎదగడం పెద్ద విషయం కాదు. కోటికి ఇంకొన్ని కోట్లు చేరతాయి అంతే. కష్టం విలువ తెలిసిన పేదరికానికి తెలుస్తుంది జీవితంలో ఎదగడం అంటే ఏమిటో.
అభినందనలు నా చిన్ననాటి నేస్తానికి.. మా ఈ గర్వానికి కారణమైనందుకు... తాను మరింతగా ఎదగాలని కోరుకుంటూ...
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి