23, జులై 2017, ఆదివారం

మననెందుకు పలకరించాలి..?

నేస్తం,
        కనీసం కాకులకున్నపాటి నీతి కూడా జన్మలన్నింటికన్నా ఉత్తమెత్తమమైన మానవజన్మ ఎత్తిన మనకు ఉండటం లేదు. ఒక్క కాకి చనిపోతే వందల కాకులు చేరతాయి, కనీసం నీళ్ళు కూడా ముట్టవు. సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, పురస్కారాలు, పదవులు  పొందగానే సరి కాదు. కనీసం మానవతా విలువలు కూడా మర్చిపోతున్నాం. మొన్నీమధ్య రచయిత, డాక్టరు అయిన ఒక మంచి వ్యక్తి చనిపోతే దూరం నుంచి వెళ్ళలేని వారు సరే అక్కడే ఉన్నవారు కూడా నలుగురు వెళ్ళలేక పోయారు అంటే చాలా సిగ్గు పడాల్సిన విషయం. సాటి రచయిత చనిపోయారు, ఒక్క క్షణం చూడటానికి సమయం లేదన్నప్పుడు మనకు రచయితల సంఘాలెందుకు..? మన గొప్పలు మనం  చెప్పుకోవడానికే అనుకోవాలి. చనిపోయాక సంస్మరణ సభలు మాత్రం పెడతారు. కష్టంలో ఉన్నప్పుడు ఒక్క పలకరింపుకి కూడా సమయం ఉండదు మనకు. ముఖ పరిచయస్తులు కూడా మొఖాలు చాటేస్తున్న ఈ ఆధునికతలో ఇలా ముసుగు వేసుకుని బతికేయడం, నీతులన్నీ ముఖ పుస్తక గోడలకే పరిమితం చేయడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ బాధను తీర్చలేము కానీ ఓ చిన్న పలకరింపు ఎంత శక్తిని ఇస్తుందో మాటల్లో చెప్పలేము. చావు పుట్టుకలు ఎలానూ మన చేతిలో లేవు, కనీసం మనకు చేతనైన పలకరింపు పలకరిస్తే మనుష్యులుగా పుట్టినందుకు కొన్ని క్షణాలను సార్ధకం చేసుకుందాం. ఎలాగూ మనం పోయినరోజు ఎవరు వచ్చారో చూడలేము, మన గురించి ఏం చెప్పుకున్నారో వినలేము. కొంతమంది అనుకుంటారు నేను కష్టంలో ఉన్నప్పుడు నన్నెవరు పలకరించలేదని, అప్పుడు ఆలోచించం, మనమెవరినైనా పలకరించామా అని. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. కనీసం వెళ్ళలేకపోతే పోనీ ఫోనులో కూడా పలకరించము. అలాంటప్పుడు మననెందుకు పలకరించాలి..? అలా అనుకోవడానికి కూడా అర్హులం కాదు. మరికొందరేమో అన్నం పెట్టిన చేతినే కాటు వేసే రకాలు. అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు రకాలు మనలోనే. అందుకేనేమో ఏది ఎక్కువగా ఆశించకూడదు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner