29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తారా సుమాలు ..!!

1.ఆత్మ సాక్షాత్కారానికి సోపానం....శాంతి సహనానికి నెలవు గౌతముడు..!! 25/09/2017

2.అంతరాత్మతో మమేకం... అలవికాని పరమానందం...!! 25/09/2017

3. మనసు మౌనమైతే..అంతరాత్మ  పరమాత్మతో మాట్లాడుతుంది..!! 26/09/2017

4. మది రుథిరాన్ని వెదజల్లుతున్నాయి..ముచ్చటైన రోజాలు...!! 3/10/17

5.  గుండెను గుచ్చే  గాయాలు చేసినా... ప్రేమకు ప్రతిరూపాలే ఎర్ర గులాబీలు..!!

27, సెప్టెంబర్ 2017, బుధవారం

ఏక్ తారలు..!!

1. మనసైనజ్ఞాపకం_వదలలేనంటూ మారాము చేస్తోంది...!! 27sept17

2.  విద్వత్తు విస్తుబోతోంది_విషపు కోరల వ్యక్తిత్వాల్లో చిక్కుబడి....!! 27sept17

3. వాగ్దేవి వల వలా ఏడుస్తోంది_వికృత చేష్టల విలయకారుల చేతల్లో...!! 27sept17

4. మౌనం మనసు విప్పింది_జ్ఞాపకాల కేరింతలలో....!! 28sept17

5.  కల అంటే కల్ల అనుకున్నా_నువ్వు వస్తావని తెలియక..!! 30sept17

6.  వెన్నెల వంతపాడుతోంది_రాతిరికి చేరువైన కలలకు చోటిమ్మంటూ....!!  5oct17

7.  మౌనం మాటలు పరిచింది_నీ మమకారం రుచి చూసాక...!!6oct17

8. కథ కంచికెళ్ళింది_రేపటి కలను స్వాగతిస్తూ...!!10 Oct 17

9. శాపమూ వరమే మరి_జ్ఞాపకమై నువ్వు నాతోనే ఉంటే..!! 11oct17

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

అమ్ముడుబోతోంది ...!!

అమ్మదనం అమ్ముడుబోతోంది
కుటుంబ అవసరాలకోసమో
తన వ్యాపకాల వ్యామోహాలకో

విడువలేదు తల్లీబిడ్డల బంధాన్ని సైతం
కాసుల కోసం వ్యాపారం మొదలై
సంస్కృతీ సంప్రదాయాలను కాలరాస్తూ

కార్పొరేట్ ప్రాకారాలు అడ్డాలుగా
మానవత్వానికి మాయని మచ్చలుగా
వైద్యాలయాలు నిరాకారంగా మిగిలిపోతున్నాయి

కుప్పకూలుతున్నాయి విలువలు
కూలదోస్తున్నాయి సమాజాన్ని
అధికార అనధికారపు హంగులు

వితరణ లేని విమర్శలు
వికృత చేష్టల వింత పశువులను 
కావలి కాయలేని తరాల అంతరం అగమ్య గోచరమైంది...!!

16, సెప్టెంబర్ 2017, శనివారం

ద్విపదలు...!!

1.జ్ఞాపకాలను ఆశ్రయించటమే
మదిని తడిమే మౌనాన్ని  లిఖించడానికి...!!

2. అక్షరమెప్పుడూ వేగుచుక్కే
నిశీధికి వెలుగద్దుతూ...!!

3. కాలానికెంత తొందరో
ఓ క్షణమైనా విశ్రాంతి తీసుకోదు....!!

4.  మనసెప్పుడూ నీతోనే
నువ్వున్నా లేకున్నా ....!!

5.  మౌనం మాటలు నేర్చింది
నీ స్నేహంలో సేదదీరాక....!!

6.   అక్షరాలు అలికిడి చేస్తున్నాయి
నీ మౌనానికి ముచ్చటపడి....!!

7.  ప్రణయమే ఓ ప్రబంధమైంది
నిన్ను నాలో చదివేస్తూ ...!!

8.  మాటే మధురమైనది
నాలోని నీకై పలికే స్వరంలో..!!

నిజాయితీగా బతకడం మొదలెట్టండి..!!

నేస్తం,
      స్వార్ధం రూపాలు ఎంతగా మారినా దాని అంతిమ లక్ష్యం ఏమిటనేది జగమెరిగిన సత్యం. గత కొన్నేళ్లుగా గుర్తుకే లేని ఊరి బాగోగులు అన్ని తామే తమ పలుకుబడితో చేయించామని చెప్పుకుంటున్న ఊరిలోని వాళ్ళు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళారో. మోకాళ్ళ లోతు బురద, తాగడానికి మంచినీళ్ళు కూడా కరవైన రోజులు, పాడుబడిపోయిన రామాలయం ఉన్నప్పుడు కనిపించని ఊరి పరిస్థితి ఒక్కసారిగా సిమెంట్ రోడ్లు, పల్లంలోని గుడి, మంచినీళ్ళు ఇలా కొన్ని ఊరికి అవసరమైనవి అన్ని పదవి వచ్చాక తమ బంధువులతోనే చేయించామని చెప్పుకోవడంలో నిజం ఎంత. పంచాయితీ స్థలాన్ని కలుపుకోవడంలో చాలా నైపుణ్యం చూపించి, అడిగిన వాళ్ళపై నోరు పారేసుకుంటే తప్పు ఒప్పై పోదు. రాళ్లు రువ్వడం కాదు, నోరుందని అరవడం కాదు, మీకు పదవులు కట్టబెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీ ఊరివాడు కాదని. ఒకడేమో ఏంటి మీ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారంట అనడం, మీ పన్నాగాలు, గోతులు అన్ని అందరికి తెలుసు. మాడం గారు కొత్తగా ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో చెప్పి పాపం రోడ్లకి డబ్బులు ఇప్పించారంట. ఆ డబ్బులు ఎలా వచ్చాయి అన్న దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. మీ జీవిత చరిత్రలు తిరగేయడం  మొదలుబెడితే ఏమౌతుందో అందరికి తెలుసు. ఆ ఊరిలో ఎవరికి తెలియని చరిత్ర కాదుగా.
ఒకప్పుడు ఉరి గురించి ఆవేదన చెందితే పెద్దలు అన్నారు ఊరు చాలా బావుంది ఊరు రోడ్లు, చెరువు, గుడి ఇలా అన్ని రకాలుగా ఊరు అభివృద్ధి చెందితే ఈవిడ ఊరు మారాలి, ఊరి జనంలో మార్పు రావాలి అంటోంది అని. ఊరిలో వాళ్ళు తినేది అన్నమే అయితే తప్పుని తప్పు అని చెప్పండి. ఒప్పుని ఒప్పు అని చెప్పండి అంతే కాని మీ అవసరాలకు మనుష్యులను వాడుకోకండి. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదని అదే ఊరిలో జనం, బంధువులు నాతో ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటున్నారో తెలుసు. పైకి మంచితనంగా ఉంటూ గోతులు తవ్వాలని చూస్తే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. బంధువులన్నాక కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఉండరు, అవి పనిమాలా వేరే ఊర్లకి జారవేయడాలు, మన దగ్గరేమో అక్కా తొక్కా అంటూ మాటలు. మంచి చెడు అన్నవి అన్ని కుటుంబాలలో ఉంటాయి. ఈ రోజు గడిచింది లెక్క కాదు రేపటి రోజన్నది ఒకటుంటుంది అది గుర్తుంచుకోవాలి. నటించడం మానేసి కాస్తయినా నిజాయితీగా బతకడం మొదలెట్టండి. కనీసం మన పిల్లలయినా బావుంటారు.

స్నిపెట్స్...!!

1.మౌనానికి మనసైందట
అక్షరాల అక్షతలతో దీవించేస్తుందట..!!

2. మౌనం మనసు విప్పింది
అక్షరాలకు పనిబెడుతూ....!!

3. జ్ఞాపకాలన్నీ నాతోనే
గమ్యాన్ని చేరడానికి ఊతంగా.....!!

4. మౌనం నిండా నీ ఊసులే
ఏకాంతానికి విరామమిస్తూ...!!

5.  జ్ఞాపకాల గూటికి చేరిందో క్షణం
రాతిరి కలలో నిన్ను దాచుకుని....!!

6. లెక్కలు తేలని మలుపుల్లో
అక్కరకు రాని మరపులే...!!

7.  కలతలన్నీ వెలితి పడుతున్నాయి
క్షణాలన్నీ నీతో చేరికౌతుంటే...!!

8.  మనసు తెలిపే మౌనాలే మనవి
దాచిన జ్ఞాపకాల అరల్లో...!!

9.  మరకలన్నీ మాయమిక
మనసు స్వచ్ఛత ముంగిట...!!

10.  వెన్నెల వర్షిస్తోంది
చీకటి చినుకులకు పోటిగా...!!

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

త్రిపదలు...!!

1.కన్నీళ్లకీ తెలియలేదట
నవ్వినందుకో
ఏడ్చినందుకో అని....!!

2.  తప్పుడు సాక్ష్యాలకు 
తలమానికమౌతున్నారు
ప్రజానాయకులు....!!

3. నాకంటూ  
ఉన్న  క్షణాలన్నీ
నీతోనే నిండిపోయాయి...!! 

4. కలలన్నీ పండాయిక్కడ
నీ నవ్వుల్లో నేనున్నానని 
తెలిసిన క్షణాల్లో....!!

5. మరపు సుసాధ్యమే
కొంగ్రొత్త పరిచయాలను
స్వాగతిస్తూ...!!

6. మౌనం 
మాట్లాడేస్తోంది
నీ పరిష్వంగంలో....!! 

7. రెక్కలున్నా
ఎగరలేని పక్షి
బంధాల నడుమ బాటసారి....!!

8. భావాల తాకిడికి
అక్షరాలు అటు ఇటు పోతూ
జ్ఞాపకాలై అల్లుకుంటున్నాయి...!!


9.  మనసెప్పుడూ మూగదే
మాటలన్నీ దాచేస్తూ
మౌనాలని మనకొదిలేస్తూ..!!

10. అన్నీ అపసవ్య పయనాలే
ఓటమికి చేరువగా
చీకటికి చుట్టాలై...!!

11.  మనిషిలోని మృగమే
సమస్యగా మారితే
సంకటాలే అన్నీ...!!

12.  దిశ మారింది
నీ చెలిమి చేరువయ్యాక
గెలుపు తలుపు తట్టింది.....!!  

13.  గుండె నిండా నువ్వేగా
తాకిన సవ్వడులన్నీ
జపించేది నీ పేరే....!!

14.   ఏకాంతానికి అసూయే
నన్నొదలని నీ ఊసులను
నా నుండి విడదీయలేక...!!

15.   మనసులోనూ గుబులే
మన ఏకాంతంలో
మరొకరికి తావుందేమెానని...!!

16.  శూన్యాన్ని పలకరించు
ముచ్చట్లు వినిపిస్తుంది 
ఒంటరితనానికి సాంత్వనగా....!!

17.  మరణ శాసనమెప్పుడు
మౌనంగానే రచింపబడుతూ
సంతోషాలను హరిస్తుంది...!!

18.  చిరునామా లేకున్నా
చిగురులు వేసేదే
చెలిమి అనుబంధం...!!

19.  చిరునవ్వుకు జీవితానిస్తే
చిగురించే ఆ నవ్వుకు
వెల కట్టే నవాబులే లేరు...!!

20.   నేనంటాను
అక్షరం 
సజీవమైనదని.. !!

21.   ఒక్క మాట చాలదూ
మనసు ముక్కలవడానికి
బంధం దూరం కావడానికి..!!

22.  మాటలకందని
మనసు భాష 
అమ్మ పెట్టిన తొలి ముద్దు...!!
  
 23.  మనసుని పరిచే మౌనభాష 
గాయాన్ని సైతం ఘనంగా
వినిపించే హృదయఘోష కవిత్వం... !!

24.  రగిలిన గాయాలు వినిపించేది
ముక్కలుగా చిదమబడ్డ
మనసు గేయాలే కదా...!!

25.  మాట మౌనమై
ధ్యానం వరమై
మదిలో దాగినది నీ తలపే...!!

14, సెప్టెంబర్ 2017, గురువారం

రాతిరి చినుకులే..!!

దిగులు గుబులు వెంబడిస్తూ
గుండె గూటిలో గూడు కట్టిన
వెతల కన్నీటి ధారలను గుర్తించక
వ్యసనాల వ్యాపకాల చుట్టూ తిరుగుతూ
అనుబంధాల పంపకాలను
అంపశయ్యలకు అందిస్తున్న
వారసులకు వారథులుగా మారి
కాలిపోతున్న గతాల్లో
మిగిలిపోయిన జ్ఞాపకాలు
ముసురు పట్టిన మబ్బుల్లో
రాలిపోతున్న రాతిరి చినుకులే..!!

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

త్రిపదలు...!!

 భావమంటే.. 
మనసుని అక్షరాల్లో 
లిఖించడమే...!!

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నా సమయం నా కోసమే..!!

నేస్తం,
        కొన్ని ఎంత వద్దనుకున్నా రాయక తప్పడం లేదు. అమ్మాయి/అబ్బాయి ఫోటో బావుంది లేదా పేరు బావుంది అని రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళు ఒప్పుకోగానే దాడి మొదలు. గుడ్ మాణింగ్, గుడ్ నైట్, తిన్నారా, పడుకున్నారా వగైరా వగైరా. ఏదో ఓ రెండిటికి సమాధానం చెప్తే చాలు ఇక అసలు స్వరూపాలు. నాకు అర్ధం కానిది ఒక్కటే చక్కగా అమ్మాయిల పేర్లు, ఫోటోలు పెట్టుకుని అమ్మాయిల వయస్సు అడిగితే మీరు ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు ఈరోజుల్లో ఎవరున్నారో. చాట్ చేయము ఆంటే దానికి ఎందుకు, ఏమిటి అని సవాలక్ష ప్రశ్నలు. ఉబుసుపోక, అదే పనిలో ఉండేవాళ్ళు బోలెడు మంది ఉంటారు వారితో మీ ఇష్టం వచ్చినంత సేపు చాట్ చేసుకోండి. కొందరు అలా ఉన్నారని అందరు అలా ఉండరు. దయచేసి అందరిని ఒకే ఘాటిన కట్టేయకండి. మా సమయాన్ని మాకు వదిలేయండి. ఈ జీవితం చాలా చిన్నది. మా సంతోషాలకు అడ్డుగా రాకండి. మీ అమ్మానాన్న పంచి ఇచ్చిన సంస్కారానికి చెదలు పట్టించకండి. విజ్ఞతా వివేకంతో మెలగండి. నా సమయం నా కోసమే కాని అక్కర్లేని వ్యాపకాల కోసం కాదని మనవి చేస్తున్నా..!!

ఏక్ తారలు..!!

1. అలుకలు అక్షరాలౌతున్నాయి_ఆత్మీయత అక్కున చేర్చుకుంటుంటే..!!
2. గతాన్ని మరువనివ్వని జ్ఞాపకాలు_వాస్తవానికి వారసులుగా...!!
3. అతిథిలా అలరించింది_నీ స్నేహ సమీరం నా జీవితంలో..!!
4. గతి తప్పిన కాలం_గాడిన పడేదెన్నడో..!! 
5. నీతిమాలిన న్యాయం_నిర్వీర్యమయ్యేదెన్నడో...!! 
6. గాయాల గేయాలే అయినా_గాంధర్వ గానాలే వేణునాదాలు...!!

త్రిపదలు..!!

అక్షరానికెంత అణకువో
ఎన్ని వంకర్లు తిప్పినా
భావాలను పండిస్తుంది...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner