15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

త్రిపదలు...!!

1.కన్నీళ్లకీ తెలియలేదట
నవ్వినందుకో
ఏడ్చినందుకో అని....!!

2.  తప్పుడు సాక్ష్యాలకు 
తలమానికమౌతున్నారు
ప్రజానాయకులు....!!

3. నాకంటూ  
ఉన్న  క్షణాలన్నీ
నీతోనే నిండిపోయాయి...!! 

4. కలలన్నీ పండాయిక్కడ
నీ నవ్వుల్లో నేనున్నానని 
తెలిసిన క్షణాల్లో....!!

5. మరపు సుసాధ్యమే
కొంగ్రొత్త పరిచయాలను
స్వాగతిస్తూ...!!

6. మౌనం 
మాట్లాడేస్తోంది
నీ పరిష్వంగంలో....!! 

7. రెక్కలున్నా
ఎగరలేని పక్షి
బంధాల నడుమ బాటసారి....!!

8. భావాల తాకిడికి
అక్షరాలు అటు ఇటు పోతూ
జ్ఞాపకాలై అల్లుకుంటున్నాయి...!!


9.  మనసెప్పుడూ మూగదే
మాటలన్నీ దాచేస్తూ
మౌనాలని మనకొదిలేస్తూ..!!

10. అన్నీ అపసవ్య పయనాలే
ఓటమికి చేరువగా
చీకటికి చుట్టాలై...!!

11.  మనిషిలోని మృగమే
సమస్యగా మారితే
సంకటాలే అన్నీ...!!

12.  దిశ మారింది
నీ చెలిమి చేరువయ్యాక
గెలుపు తలుపు తట్టింది.....!!  

13.  గుండె నిండా నువ్వేగా
తాకిన సవ్వడులన్నీ
జపించేది నీ పేరే....!!

14.   ఏకాంతానికి అసూయే
నన్నొదలని నీ ఊసులను
నా నుండి విడదీయలేక...!!

15.   మనసులోనూ గుబులే
మన ఏకాంతంలో
మరొకరికి తావుందేమెానని...!!

16.  శూన్యాన్ని పలకరించు
ముచ్చట్లు వినిపిస్తుంది 
ఒంటరితనానికి సాంత్వనగా....!!

17.  మరణ శాసనమెప్పుడు
మౌనంగానే రచింపబడుతూ
సంతోషాలను హరిస్తుంది...!!

18.  చిరునామా లేకున్నా
చిగురులు వేసేదే
చెలిమి అనుబంధం...!!

19.  చిరునవ్వుకు జీవితానిస్తే
చిగురించే ఆ నవ్వుకు
వెల కట్టే నవాబులే లేరు...!!

20.   నేనంటాను
అక్షరం 
సజీవమైనదని.. !!

21.   ఒక్క మాట చాలదూ
మనసు ముక్కలవడానికి
బంధం దూరం కావడానికి..!!

22.  మాటలకందని
మనసు భాష 
అమ్మ పెట్టిన తొలి ముద్దు...!!
  
 23.  మనసుని పరిచే మౌనభాష 
గాయాన్ని సైతం ఘనంగా
వినిపించే హృదయఘోష కవిత్వం... !!

24.  రగిలిన గాయాలు వినిపించేది
ముక్కలుగా చిదమబడ్డ
మనసు గేయాలే కదా...!!

25.  మాట మౌనమై
ధ్యానం వరమై
మదిలో దాగినది నీ తలపే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner