మనసు తడి అక్షరాల్లో చేరితే అదే ఈ రెప్ప కింది ఉప్పెన...!!
అంతర్జాలంలో అందరికి సుపరిచితులు, ప్రభుత్వోద్యోగిగా, తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూ సాహితీ రంగంలో తనదైన శైలితో చక్కని కవితలు రాస్తున్న శ్రీమతి విజయలక్ష్మి మార రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటి సమీక్షలో ఇంటి బాధ్యతలతో సతమయ్యే ఇల్లాలి ప్రేమెప్పుడూ ఒంటరేనంటారు నా ప్రేమెప్పుడూ ఒంటరే అన్న కవితలో. అమ్మ కవితలో పిల్లలకు దూరమైనా ఆ జ్ఞాపకాల్లో బతికే అమ్మ ప్రేమను చూపించారు. ఎన్ని కష్టాలెదురైనా ఓటమికి వెరవని గులాబీ జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపించారు. రాలిన హృదయం, మరణ మృదంగమది కవితల్లో ఓ స్త్రీ జీవితంలోని కొన్ని కోణాలను, వాస్తవంలో అవాస్తవాన్ని, వేదన తీర్చలేని మరణము చిన్న చూపే చూసిందంటారు. ముక్కుపుడక అందాల మెరుపునూ, యువత కర్తవ్యాన్ని వినిపిస్తారు. రెండవ నెలవంక అంటూ సరి కొత్తగా ప్రేమను, ఆరాధనను హృద్యంగా చెప్తారు. ఐకమత్యంలో డబ్బు కోసం కోల్పోతున్న విలువలను, స్త్రీ మనసు కవితలో కొన్ని క్షణాలు సమయాన్ని కేటాయిస్తే స్త్రీ ప్రేమ అర్ధమౌతుందంటారు. అంతరంగంలో అవ్యక్తమైన ప్రేమను, " నా ఈ శ్వాసని నీకై ఈ గాలిలోనే ఒదిలేస్తున్నా ఒక్కమారు నీవు శ్వాచించినా చాలు" నా జన్మ ధన్యమేనంటారు. బంగారు బాల్యం, అనాధ బిడ్డ, అల్లరి ఆత్మీయతలు, అమ్మ ప్రేమ వంటి కవితలు మన అందరి జ్ఞాపకాలను తడుముతాయి అనడంలో ఎట్టి సందేహమూ లేదు. పంజరంలో రామచిలుక, అతివ జీవితాలను సరిపోల్చుతారు. ధూమపానం, తాగుడు మానండి అంటూ మానడం వలన కలిగే లాభాలను చెప్తారు. ఈ కవితా సంపుటి పేరైన రెప్ప కింది ఉప్పెన కవితలో అవనిపై అతివ తిప్పలు, ముప్పులు, కష్టాలు, కన్నీళ్లు ఇలా అన్ని ఏకరువు పెడుతూ శిథిలమౌతున్న స్త్రీ హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మోడువారిన మానుతో అభిసారికను పోల్చడం బావుంది. బాధ్యతలను గుర్తు చేస్తూ మొక్కల్ని పెంచమంటూ, మనసు బాసలు వినిపిస్తూ, బాల్యమెంత మధురమంటూ ఆ వెంటనే పిండంగా ఉండగానే చేస్తున్న హత్యలను ఘాటుగా నిరసిస్తారు. కల్లలైన కలలను కనబడనీయక నటించేస్తున్నామంటారు జీవన కావ్యంలో. ఒంటరి అనామికలో దగా పడిన స్త్రీ కోరికలు, ఆవేదన చెప్తూ ఆమెపై సంఘపు కట్టుబాట్లపై విసుర్లు విసురుతారు. ఆత్మాలింగన ఆరాధనను రాధామాధవీయంలో చూపిస్తారు. చీడపురుగుల కామాంధుల మగతనపు మృగత్వాన్ని మృగాలు కవితలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కన్నీటి మేఘం,అనుకోని అతిథి, వసుధ ఘోష వంటి కవితలు ఆత్మీయతకు అలమటించే మనసులను తెలుపుతాయి. యముడికీ చేదే అన్న కవిత చదువుతుంటే మనసు కలుక్కుమనక మానదు. ప్రేమైక సమాజాన్ని, మధుర కావ్యాలను, కన్నీటి చెలిమితో పరిచయం చేస్తూ ఎంత ధనం పోసినా కొనలేని ఆయువుకి ఆరడుగుల నేల చాలంటారు తాత్వికంగా. ధన్య జీవి ఎలా కాగలరో చెప్తారు తనదైన మాటల్లో. రైతు ఘాటు ఘోషలో కనీస గిట్టుబాటు ధర గిట్టని రైతుల కష్టాన్ని, తన ఆనందాలనన్నింటిని త్యాగం చేసి సంతోషాన్ని మాత్రమే మనకు పరిచయం చేసేది నాన్నేనంటారు. ధైర్యం - బలం అంటూ విజయాన్ని పొందమంటారు. నిజంగానే రోటి పచ్చడి రుచిని మన అందరితో ఆస్వాదింపజేస్తారు రోటి పచ్చడి కవితతో. రాణివాసపు చిలక, లిల్లీ - లొల్లి కవితలు బాధని కూడా సున్నితంగా చెప్తాయి. స్త్రీ గురించి చెప్తూ హెచ్చరిక జారీ చేస్తారు. తూర్పు పడమర కవిత అందమైన ఆరాధనకు ప్రతీకగా నిలిచింది. నా నీవే..నీ నేనే, ఆవిరైన ప్రాయం, శాసించు ప్రియా కవితలు ఎదురుచూపుల విరహాన్ని, ప్రేమ బంధాన్ని తెలుపుతాయి. విశ్వజనీనమైంది అమ్మ ప్రేమ అంటారు అమ్మ అమ్మే కవితలో. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే మహిళను ఓ మహిళా ఉద్యోగిలో, ఎవరు లేక బోసిబోయిన ఇప్పటి ఊరుని, అప్పుడు పంచిన జ్ఞాపకాలను నా ఊరు కవితలో తలచుకుంటారు. తొలిపొ(ము)ద్దు మలి జీవితంలోనూ వేకువపొద్దే ఆ జ్ఞాపకమంటారు. మట్టి గాజుల అందాలను, గడిచిన ప్రేమలో గతించిన జ్ఞాపకాల్లో గువ్వలా ఒదగనీమంటారు. తోలి ఉషస్సు, శిలా శాసనం, జలతారు కన్య, సొగసు చూడ తరమా, జీవన వాసంతం, మది ఆలాపన, వలపు రాగం, అజంతా అందం, అశ్రు ధారలు వంటి కవితల్లో చక్కని ప్రేమ భావుకత, విరహం, నిరీక్షణ కనిపిస్తుంది. మనసు జాబు కవితలో ఆర్దతతో నిండిన ఆరాధన, పొదరిల్లు కవితలో అందమైన ఉహలజల్లు, నిరీక్షణ, విరహ జ్వాలలు, శశి కిరణం, జన్మ జన్మల బంధం, రంగుల ఫక్కీలు, రాలినా మధురమే,నీవే వంటి కవితల్లో ఆర్తితో కూడిన ప్రేమ, ఆరాధనా, ఆత్మీయ సన్నిహితమైన అనుబంధం కనిపిస్తుంది. చినుకుకై ఎదురుచూసే రైతు బిడ్డల ఎదురుచూపు రైతు ఆవేదనలో వినిపిస్తారు. ఊహాలోకం, సిగ్గులొలికేనా, తెల్ల గులాబీలు, మేని పరవశం, నాలో నీవో..నీలో నేనో.. , మారాణి, తుంటరి ఊహ, మేలిమి ముత్యం, రంగుల ప్రపంచం, రాయినైతిని, విధి, ఉంటావ్, బంధం, జాజుల గె(తె)లుపు, వర్ణనకందని అందం, క(చ)లవ్ భామా కవితలన్నింటిలో చక్కని భావుకత్వంతో నిండిన ప్రేమానురాగాలు, అందమైన ఊహాలోకపు వర్ణనలు మనకు కనిపిస్తాయి. వేదనకు వీడ్కోలిస్తూ సాగిపొమ్మంటారు వేదన కవితలో. మరణించినా జీవిచడం ఎలానో చెప్తారు, మా మగజాతి సలాంలు అంటూ స్త్రీ ఔన్నత్యానికి గులామంటారు. నయన సోయగానికి స్వాగతమంటూ మది భావాన్ని కన్నీటి మంచు పూలతో అక్షరాల్లో నింపుతారు. చెలిని వర్ణిస్తూ అద్భుత ప్రేమను చూపుతారు. రాలుతున్న పండుటాకునే కవిత ఇప్పటి వాస్తవ కథనాన్ని, బిడ్డలు వదిలెళ్లిన తల్లిదండ్రుల మనసును చూపిస్తుంది. శిలా ఫలకం నీ నామం కవిత మనసులోని అవ్యాజ్యమైన ప్రేమను చూపించడంలో సఫలమైనట్లు తోస్తుంది.
రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటిలో కవితలు ప్రేమ, విరహం, వేదన, ఊహలు, వర్ణనలు, ఎదురుచూపులు, అనుబంధాలు, ఆవేశాలు, నివేదనలు, నిట్టూర్పులు, నిరాశలు వంటివి కనిపిస్తున్నా జేవితాన్ని బాల్యం మొదలు వృద్ధాప్యం వరకు అన్ని కోణాల్లో చూసిన మనసుల అనుభూతులను మనకు అందిస్తాయి అనడంలో ఏ విధమైన అనుమానమూ లేదు. చక్కని భావాలతో గుండె లోతులను తడిమిన ఈ రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటి కవయిత్రి విజయలక్ష్మి మారకు హృదయపూర్వక అభినందనలు.