28, జనవరి 2019, సోమవారం

ఏక్ తారలు...!!

1.   పరిచింది అక్షరాలే_పదాలకు భావాల మత్తు చేరిందనుకుంటా...!!

2.   మనసులొకటే మరి_ఆంతర్యాల అంతర్యుద్ధం మౌనంగా చేస్తున్నా ...!!

3.   అస్పష్టంగా ఉన్నా స్పష్టమైనవే_మనసు తెలిసిన భావాలవి..!!

4.   అలవోకగానే ఈ అద్భుతాలు_మదినలరించే అక్షరాలు చేరికైనప్పుడు...!!

5.   అక్షరాల మాయాజాలమదే_అనుభవాల అనుభూతులను అద్దంలా చూపించేస్తూ...!!

6.  అలుపెరగని ఆలోచనలే_అడపాదడపా ఆనందాన్నిస్తూ...!!

7.   మర్మమెరుగని మనసది_మానసాక్షరాలకు నెలవుగా మారి...!!

8.   పసితనంలో నువ్వున్నావని కాబోలు_వయసేదయినా మది పయనం బాల్యానికే...!!

9.  కాలం ముదమందుతోంది_అనుబంధాలను అనుసంధానిస్తూ...!!

10.  భావాలు అలుగవూ_అక్షరాలన్నింటా నీవేనంటే...!!

11.   జ్ఞాపకాలు మురిసిపోతున్నాయి_నీ మౌనానికి తామే హితమైనందుకు...!!

12.   దాగలేనంటోంది మది గాయం_అక్షరాల్లో సేదదీరాలనుకుంటూ....!!

13.    అనుబంధమేదైనా సరే_మనసు మౌనాన్ని మాయ చేసేది ఈ అక్షరాలే...!!

14.    మది రాల్చిన మౌనం_సజీవ అక్షర శిల్పాలుగా....!!

15.    నుదుటిరాత అది_గమ్య నిర్దేశానికి గాయాలను రాతలుగా మార్చుతూ....!!

16.    సమయం చిక్కనీయని కాలమిది_సోమరితనానికి చోటెక్కడ మరి...!!

17.   కథలన్నింటా నువ్వే_పాత్రలతో నీకేలా..!!

18.   సంశయానికి చోటెక్కడిది_మనసులొకటైన మన మధ్యన...!!

19.   సిందూర మందారాలు సూరీడు నొసటన చుక్కలే_ఆకాశానికి ఆభరణాలై...!!

20.   లిపి తెలియని మదికి తెలుసు_గుర్తులను కాగితాలకెలా తెలపాలో...!!

21.   స్వరమే అక్షరమైంది_స్నేహరాగాలకు బాణీలు కట్టాలంటూ...!!

22.  మది పుస్తకానికి ఎరుకనే_అక్షర స్నేహానికి ఏ రహదారిన వెళ్ళాలో...!!

23.   స్నేహ సహవాసం అక్షయపాత్రే_పూరించిన ఖాళీలకు మళ్ళీ చోటిస్తూ...!!

24.    స్వరాలు తేనెలొలుకుతున్నాయి_జీవనాదమై అక్షరాలు అమరగా...!!

25.  అక్షరాలన్నీ ఇంతే_ఊపిరాడని జీవితాలకు ఆటవిడుపుగా మారుతూ...!!

26.   మనసు ఖాళీలు మాట్లాడుతున్నాయి_అక్షరాలను ఆసరా చేసుకుని...!!

27.   ఊతమే తానయ్యింది అక్షరం_ఊపిరాడని బతుకు పయనంలో...!!

28.   అక్షరాలు అలిగినా అందమే_మౌనానికి మనసుకి బంధం వేస్తూ...!!

29.   గురుతెరగని అనుబంధం కాదుగా మనది_జన్మజన్మలుగా కొనసాగుతునే...!!

30.   ఊపిరి పోసిన అక్షరాలే అన్నీ_ఊహలకు జీవాన్నిస్తూ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner