24, జనవరి 2019, గురువారం

జీవన 'మంజూ'ష (జనవరి)...!!

నేస్తం,
         ఏ నావది ఏ తీరమో అన్నట్టు ఏ బంధమెటుపోతుందో తెలియడం లేదు. ఏ సమస్యా లేకపోయినా ప్రపంచంలో తమకన్నా ఎక్కువ సమస్యలున్నవాళ్ళు లేరని, కొందరు లేనిపోని రోగాల పాలబడుతున్నారు. కనబడిన డాక్టర్ దగ్గరకల్లా వెళుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటూ శునకానందం పొందుతుంటారు. మనమసలే ఇప్పుడు బతుకుతున్నది కార్పొరేట్ వ్యవస్థలో, ఇక దీనికి తోడు ఏదో రోగముందన్నఈ అనుమాన భూతం తోడైతే పరిస్థితి చెప్పతరమా. ఈ విశాల ప్రపంచంలో మనమో చిన్న ఇసుక రేణువు పాటి కూడా చెయ్యము, దీనికి అందరు మన గురించే పట్టించుకుంటున్నారని, మన మీద నిఘా వేశారన్న అనుమానంతో ఇటు మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, మన అన్నవాళ్ళకు కూడా నరకాన్ని చూపిస్తూ బతకడంలో అర్ధం ఉందంటారా...!
        జీవితంతో పోరాడేవారు కొందరైతే, జీవితం అంటే తెలియని వాళ్ళు బతుకు మాధుర్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు. పుట్టడం చావడం అనేది జీవమున్న ప్రతి ప్రాణికి సహజమే. మన పెద్దలు చెప్పిన మాట ఉండనే ఉంది. " కాకిలా కలకాలం బతికేకంటే హంసలా అరక్షణం బతికినా చాలు" అని. ప్రస్తుత సమాజంలో అన్ని బంధాలు డబ్బుతో ముడిబడి ఉన్నాయన్నది చేదు వాస్తవమే. సొమ్ము లేకపోతే రక్త సంబంధమయినా అంటీముట్టనట్టుగా దూరంగా ఉంటున్న ఆత్మీయబంధాలే మన చుట్టూ. బిడ్డలు దూరంగా ఉన్నారని బాధ పడే తల్లిదండ్రులున్నట్టే, బిడ్డలను గాలికొదిలేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. దగ్గర బంధాలు దూరమైనా చాలా నిరాస్తకంగా తమకు ఏమి పట్టనట్టుంటున్న నాగరికులు ఎంతమందో నేడు మన చుట్టూనే ఉన్నారు. బతకడానికి డబ్బు అవసరమే, కాని బతుకే డబ్బుగా మార్చుకుంటున్న దొడ్డ మనస్కులు ఎప్పటికి తెలుసుకుంటారో..బంధాలను డబ్బుతో వెల కట్టలేమని. సంపాదన మన వెంట రాదన్న వాస్తవం తెలియక పైసాకి ప్రాకులాడుతూ కోల్పోతున్న వ్యక్తిత్వాన్ని, విలువను కాపాడుకోలేక మనిషిగా దిగజారిపోతున్నారు. రేపు పోయిన నాడు మోయడానికి " ఆ నలుగురు " కరువైన రోజున తెలిసినా ఉపయోగం ఏమి ఉండదు. దూరం అనేది పెంచుకుంటూ పోతే ఏకాకులమై మిగిలిపోతాము. ఓ చిన్న మాటే మనుష్యులను, మనసులను దగ్గర చేస్తుంది. అదే చిన్న మాట అందుకోలేని అగాధాలను సృష్టిస్తుంది. మన ప్రవర్తన మంచికో, చెడుకో అన్నది మన మాట తీరు మీదే ఆధారపడి ఉంటుంది అన్నది గుర్తుంటే అందరు మన దగ్గర బంధువులే.

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner