28, జనవరి 2019, సోమవారం

ద్విపదలు...!!

1.   పదాల పదబంధం చాలదూ
పేర్చిన అక్షరాలు గాటినబడటానికి...!!

2.   అక్షరాలెప్పుడూ అక్షయమే
గుండెగూటిలో నీ జ్ఞాపకాలున్నంత వరకు...!!

3.   మలి వయసే ఇప్పుడు
పసితనపు ఛాయలు అద్దుకుంటూ. ..!!

4.   అక్షరాల చుట్టూనే అనుబంధం
మనసు పరిమళాన్ని భావాలకద్దేస్తూ...!!

5.    వద్దన్నా వెంటబడక మానవు కదా
విడిచి ఉండలేని అనుబంధం మనదైనప్పుడు...!!

6.    అక్షరమై అలరిస్తుంటానిలా
ఆదరించి ఆస్వాదించే మనసులు మీవైనప్పుడు...!!

7.   కొన్ని మనసాక్షరాలింతే
భావాలకు బాధ్యతలకు మధ్యన నలుగుతూ...!!

8.   నా జ్ఞాపకాల్లో నువ్వున్నావుగా
పేలవమైన బ్రతుకులో జీవాన్ని నింపి జీవితాన్ని ఇవ్వడానికి....!!

9.    తడబాటుకు స్థానమే లేదు
నా నెలవు నీలోనున్నప్పుడు...!!

10.   అక్షరాల్లో పరుస్తుంటానిలా
మనసైన ప్రతిసారి....!!

11.   ఆర్తిగా ఆలింగనం చేసుకుంటుంది దుఃఖం
మనసు భారాన్నంతా తానే మెాస్తూ...!!

12.   కాలాన్ని కలంతో కలిపేసా
కొత్త కథలు వినిపిస్తుందని..!!

13.    దిగులుకు చోటెక్కడా
గమ్యమే నీవైన పయనం నాదైతే...!!

14.   తప్పనితనంగా మార్చుకున్న ఆధునికత
అవసరార్ధం అనుబంధాలకు దగ్గరౌతూ....!!

15.   కనురెప్పల నీడలో కదలాడుతోంది
కనుమాయమవని నీ జ్ఞాపకమిలా..!!

16.    జ్ఞాపకాల ముత్యాలను సేకరిస్తున్నా
మేలిమిసరాలుగా వర్తమానానికి కానుకనీయడానికి...!!

17.   మనసుకు మాటిచ్చాను
మరపు దరిజేరదని...!!

18.   జ్ఞాపకాలూ అంతే
మనసు పుస్తకంలో చొరబడనిదే ఉండలేవు...!!

19.   అద్భుతాన్ని ఆవిష్కరించేది అక్షరాలే
మనోభావనలను చరిత్రపుటల్లో లిఖిస్తూ....!!

20.    రెక్కలు తెగిన అక్షరాలవి
ఆకాశవిహంగాలైన భావాలను మెాసినందుకు....!!

21.   చెప్పేవరకు వదలని భావాలవి
అక్షరాలకు అనువుగా మసలుతూ..!!

22.   కలలకు కొత్తదనం కావాలట
బుజ్జగింపులు వాస్తవాలను మరువనివ్వట్లేదని...!!

23.   తానైంది అమ్మ
మనసేదో తెలిసినట్టు మమతేదో పిలిచినట్టు..!!

24.   పరిధులే పదాలకన్నీ
అక్షరాలకు పొదుపు అలవాటు చేస్తూ..!!

25.   అక్షరమెప్పుడూ అపురూపమే
మనసులను రజింపజేస్తుందని..!!

26.   పొరబాటే మనసుది
మరిచిపోవడం తెలియక...!!

27.   కొన్ని చేతులంతే
అక్షరాలనలా ఒంపేస్తాయి మాటలకందని భావాలుగా...!!

28.   అవధుల్లేని ఆనందమే ఇది
అనిర్వచనీయ ప్రేమకు సాక్ష్యంగా..!!

29.   మరపు మౌనమయ్యింది
ప్రేమ సంద్రమై చెంత చేరితే...!!

30.   అద్దానికి అర్థమయ్యింది
మనసు భావాలు మనవే అని...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner