30, ఆగస్టు 2019, శుక్రవారం

నీకు..నాకు మధ్యన...!!

అభిమానించడం నా నైజం
అహంభావం చూపించడం నీ లక్షణం

బాధ్యతలకు బంధీని నేనైతే
హక్కులకు అధికారివి నువ్వయ్యావు

మనసు కత నాదైతే
మనిషి మాయ నీదయ్యంది

కలత కన్నీటి చెలిమి నాతోనుంటే
కంటతడి తెలియని జీవితం నీది

వేదన రాగం వదలనంటోంది నన్ను
అత్యుత్సాహ మేఘం కమ్మింది నిన్ను

మార్చుకోలేని మార్పు
మనదని తెలిసిందో ఏమెా

ముడిబడిన బంధాల నడుమన
అంతరాలు ఇందుకేనేమెా మరి...!!

28, ఆగస్టు 2019, బుధవారం

అమోహం పుస్తక సమీక్ష...!!

                 " వసంతాన్ని మోసుకొచ్చి విరగపూసిన వెదురుపువ్వుల పరిమళం ఈ అమోహం "
       ఇదంతా ఏమిటని అనుకోవద్దంటూనే ఎప్పుడు ఏది ఎలా మొదలవుతుందో తెలియదంటూనే, భాషకెరుగని భావాన్ని చిక్కించుకోలేని నిశ్చలమైన అనిశ్చితితో కొట్టుకుపోయిన నిజమైన ముగింపెరుగని ఓ హృదయ నిజమైన సంవేదనే ఈ అమోహం. సున్నిత, సునిశిత వ్యక్తిత్వం గల శ్రీసుధ మోదుగు తన మనసుకు నచ్చినట్లుగా రాసిన అక్షరాలు, మనతో మనం పంచుకున్న మాటల భావాలై, ఇదేంటీ మనమే మాట్లాడేసుకుంటున్నాం మనతో అనిపించేటట్లుగా అతి సరళంగా రాసిన కవనాలు ఈ అమోహం కవితా సంపుటి నిండా ఎన్నో ఉన్నాయి.
       తెల్లారుఝామున రాలిన నక్షత్రధూళితో వేకువ పొడిచిన వెలుగులో ఈ ప్రపంచాన్ని చూడటంతో మొదలై కలల ప్రపంచం,  అందమైన ప్రకృతి పరవశాలు, నిశ్శబ్ద ప్రవాహాలు, క్షణాల ఏకాంతాలు, ఏది పట్టని నిశ్చలత్వం ఇలా కంటికి కనిపించేది, మనసు స్పందించే ప్రతిదీ భాష లేని భావమై మిగిలిపోతుంది. ఇవన్నీ చీకటి, శూన్యం తెలియని సూర్యుడితో చెప్తూ " ప్రతిసారీ అక్షరాలు దొరుకుతాయా అనుభూతిని ఒంపుకోడానికి " అంటూ నర్మగర్భ భావుకతను సుకుమారంగా మన మనసుల్లోనికి యుగాల ఏకాంతపు ప్రేమను ఒంపేస్తారు అతి నేర్పుగా. ప్రియమైన అవస్థను పద్యం, పాటగా మనం అంటూ కాసింత బాల్యాన్ని అద్దేసి పిచుక చిప్పిన ఆదిమరహస్యాన్ని పూలమొక్కలో విరబూయిస్తారు. మరోచోట " కొన్ని ఊహలు నిజాయితీగా నీతో వుండిపోవడంతో రాత్రి ఉదయిస్తుంది " . ఎక్కడైనా రాత్రి ఉదయిస్తుందా అని  మనం అనుకుంటాం కానీ ఇది అనితరసాధ్యమైన ప్రేమకు, ఇష్టానికి మనసుకున్న ఆశను తెలియజేస్తుంది. చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయంటారు మరోచోట. చీకటిని గోప్యంగా గుప్పెట్లో దాచుకోమంటారు. అంతిమంగా తెలుస్తుంది జీవితమంటే ఏమిటో, పరుగెత్తి అలసిపోయాక చావుపుట్టుకల రహస్యం అంటారు.  ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో తెలియదంటారు. జీవిత పరమార్థాన్ని చెప్తారు చివరగా ఈ మొదటి అంకంలోనే.
           ఇక రెండవ అంకం " మొదలంటూ తెలుసుకోలేని ముగింపే లేని అద్భుతానివి నువ్వు" అంటూ " ఇసుక రేణువులను వేణువుగా చేసి ఊదడం నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు " అంటూ మనసు లగ్నమైన ప్రేమను " ధ్యాసలో ధ్యానంలా దోసిట్లో నువ్వు నెమ్మదిగా నాలోకి జారడం " నా స్పందనలు అనుభూతులు భాషై, ప్రేమై, బాధై రాత్రి వర్షమై కురుస్తాయి  కలచి కలత పెట్టె కలలై నిదుర కౌగిలిని విడిపిస్తాయి. " ఇలాంటి అద్భుత భావనలు చదువుతున్న మనకు ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి. ఇది చుడండి ఎంత అమోఘమైన అనుభూతో
" నువ్వు లేని క్షణం
యుగయుగాల
నిరంతర ధ్యానం " ఎన్నో రకాల పూల సుగంధాలను మనకు పరిచయం చేస్తూ ఒంటరితనాన్ని ఏకాంతంగా ఎంత  అద్భుతంగా మలచుకోవచ్చో చెప్తారు, అదీ మనకు అలవాటైన అతి సాధారణ వ్యక్తీకరణతోనే.
      మూడవ అంకంలో " చినుకు చినుకుకూ మధ్య దారిని చేసుకున్న వెలితి రాత్రి రజాయిలో చుట్టుకుని గుసగుసలాడింది " అని చెప్తూ " చీకటిని మరచిన కాంతికి దుఃఖాన్ని అద్ది సాయంత్రపు గ్గాలికి తోడై కడలిని వణికించింది " అంటూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూఛాయగా చెప్తారు. మనసు కొంచం కొంచంగా ఖాళీ అయినప్పుడు వచ్చి చేరే ఆలోచనల పరంపర, జ్ఞాపకాల రొద, ప్రశ్నలకే ప్రశ్నగా మిగిలిన జీవితమనే ప్రశ్న ఎప్పటికి తేల్చుకోలేనిది అంటారు. గాయాలను, కన్నీళ్ళను, అన్యాయాలను, దిగులు గుబులును, కథ మొదలైన సంగతిని, కనుమరుగైన జ్ఞాపకాలను తల్చుకుంటూ ఎన్నో అనుభవాలను, ఆశలను పంచుకుంటారు.
           నాలుగవ అంకంలో జీవితమొక లెక్కల పట్టీ కాదని ఏదీ ఎవరినీ నిర్వచించలేదని ప్రపంచంలో మనం, మనలో ప్రపంచం లేదని ఎప్పటికి తెలుసుకుంటామో ! " అని కించిత్ ఆందోళనకు లోనవుతారు. ఆ వివరాలలోనికి వెళితే  " ఆకాశాన్ని ఈదడం సముద్రాన్ని ఒంపుకోవడం తేలికేమి కాదు " అని ఓ హెచ్చరికగా చెప్తూ నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో నీకు ఏదీ అంట ముఖ్యం కాదు, మనం అన్న మనుగడ తప్ప అని చెప్తారు. మన ప్రయత్నమేమీ లేకుండానే విషాదం ఎక్కడినుంచైనా వస్తుంది. ప్రపంచ దుఃఖాన్ని మనమే ఓదార్చాలని దయను భుజాన వేసుకుని బయలుదేరుతాం కాని మనకు పొలమారితే గ్లాసెడు నీళ్ళ కోసం వెదుక్కుంటాం అంటూ మనలో లోపాన్ని ఎత్తిచూపుతారు, మనకు నచ్చకపోయినా." నేనొక నిజం నువ్వొక అనుభూతి జీవితమొక అనుభవం "  అని చెప్తూ హృదయం పచ్చనితోట కాదు నెర్రెలిచ్చి రక్తం ఓడుతున్న ఓ అశాంతి పుష్పం అంటూ జీవితపు బాధలు, అశాంతులు వెళ్లగక్కుతారు. పిరికితనం, భయం, నష్టం మొదలైనవి మనిషి తెలివిని ఎలా గెలుస్తాయో వివరిస్తారు, భారాన్ని దైవంపై మోపమంటారు.
          ఐదవ భాగంలో జేవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఇలా చెప్తారు. " కొంచం కొంచంగా వలుచుకుంటూ కొసరికొసరి జీవితాన్ని రుచి చూసుకుంటూ అపురూప నిశ్శబ్ద మమేక క్షణాలివి... ఏదీ పట్టదు.. ఎంతకూ తరగదు " అని చెప్పడం, " ఎంత ప్రయత్నించినా సముద్రాన్ని తవ్వలేమనుకుంటాం... నువ్వే సముద్రమై చేపపిల్ల కళ్లలో తప్పిపోయిన అద్భుతమిది " అని వర్ణించడం ఎక్కడా చదవని అభివ్యక్తి.
 " సన్నని చేతి రేఖలు చెపుతాయి
స్మృతిలో వున్నవాళ్ళు
ఆపైన వెళ్లిన వాళ్ళు
ఏమీ మిగలకుండా
ఏదీ అంటకుండా
ఎవరికీ చెందకుండా వెళ్ళడం
ఒక వరమని

ఓ సాధారణ సూర్యాస్తమయమే
కాలం ఇచ్చే ముగింపని ." అని ఓ తాత్వికతని చెప్తూ యుగాల ఎదురుచూపులు, మరెన్నో మనసు చెప్పలేని ఆరాధనా భావనలు, నిరీక్షణలో నీరెండలా తాకే జ్ఞాపకాల గురుతులు, మునుపెన్నడో పంచుకున్న ముచ్చట్లు, చివరికి మిగిలేది నీకు నువ్వే అని, కాలం మాయలో అందరు అన్ని మర్చిపోతారు నీతో సహా అని సులభంగా  చెప్పేస్తారు అనుబంధాల జీవిత సత్యాన్ని.
             ఓ శాంతి సందేశాన్ని ఆరవ అంకంలో ఇలా చెప్తారు. " కల్మషం లేని ఓ ఆలా నిండిన మనసుతో దొరికిన నక్షత్రాన్ని దోసిట్లో పెట్టుకొని ఆకాశం ముందు మోకరిల్లుతా .. ఎగురుతున్న పావురాళ్లను క్షేమంగా ఇంటికి చేర్చమని హత్తుకునే హృదయాలకు శాంతివ్వమని " ఈ మాటల్లో కవయిత్రి ఎంత సున్నిత మనస్కురాలో తెలుస్తోంది. సూర్యుడు అస్తమించే కాలమెప్పుడు మనోహరమే అని అంటూ యదార్ధానికి, ఊహలకు మధ్యన మిగిలిన కాలాన్ని ఆరాధనలో మమేకమైన మనసుని, కొన్ని సంశయాలను, సందిగ్ధతలను అక్షరీకరిస్తూ, కొద్దిగా జీవించడమో, లేదాయే పూర్తిగా నటించడమో నేర్చుకోవాలంటారు. కొత్త తొడుగులేసుకున్న కాలంలో కొంచం నమ్మకం, ధైర్యం, ప్రేమతో పూజించే చేతులను, ప్రార్థించే మనసును ఇచ్చినందుకు దైవానికి దూపం వెలిగించి కృతజ్ఞతలు చెప్పుకుంటానంటారు. 
             ఇక చివరిది ఏడవది అయిన అంకంలో ప్రత్యేకంగా సముద్రం లక్కకున్న ఇసుకను లెక్కలేయడం,  ఒడిలో నిద్ర పోయిన సూర్యుడిని మరిచిపోయిన ఊహను రాతల్లో నిక్షిప్తం చేయడంలో విసుగు చూపిస్తూ " ఏమైనా కాళ్ళతోనే నడవాలి కళ్ళతోనే చూడాలి ఒకానొక ఆఖరి మలుపులో సత్యం స్వప్నమౌతుంది. " అని చెప్పడం లెక్కలేన్నన్ని రాత్రుళ్ళు, పగళ్ళు రాలిపోయి అంతుచిక్కని అరణ్యం తప్పిపోయింది అంటూ చాలా కొత్తగా జీవితపు స్థితులను, నిర్భావస్థితి అనుభవాలను, మనసు తోలుబొమ్మలాటలను, అంతిమ సమాధి అసలైన సమ్మోహనమనడం, ఎవ్వరిని పట్టి వుంచలేము, ఎవరికీ పట్టుబడలేము, విడదీసి, విచ్చిన్నం చేసి, వంచించి ఆదుకున్న ఆప్తమిత్రురాలు కాలం అనడం, గాయాలను మాటలు నయం చేయలేవు, పీడకలలు రాకుండా ఏ కన్ను ఆపలేదు అనడం చివరిగా " Reality is nothing but life and lie "  అన్నది ఎంత వాస్తవమో మీకీపాటికి అర్థం అయ్యే ఉంటుంది. అమోహం మొదలు పెట్టినప్పుడు ఇదంతా ఏమిటని అనుకోకండి అని తన మనసు ఊసులను, భావోద్వేగాలను, ఆశలను, అనుభూతులను మరెన్నో ఆలోచనలను మనతో పంచుకున్న కవయిత్రి... ఇది ఇంతేనా అని వదిలేయకండి అంటూ హృదయంలో ఏ మూలో పూసిన గడ్డిపూల దుఃఖాన్ని, ఆ దుఃఖాన్ని ఓదార్చే ఓదార్పును, క్షమించం ఎలానో మనసుకు తెలిసే వుంటుందంటూ, తెలిసిన అర్ధాన్ని, ప్రేమను వదులుకోకుండా ఓ చిన్న భావాన్నైనా కవితగా ప్రేమగా హృదయానికి హత్తుకోమంటూ విన్నవిస్తారు చాలా సున్నితంగా.
          శ్రీసుధ మోదుగు  రాసిన అమోహం చదువుతుంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రేమలు, ఆరాధనలు, కోరికలు, కోపాలు, కన్నీళ్ళు ఇలా జీవితంలోని ప్రతి చిన్న ఆలోచనకు అక్షర రూపం కనిపిస్తుంది. మనం చెప్పలేని ఎన్నో అనుభూతులను హృద్యంగా సరికొత్తగా అక్షరాభావాలను ఆవిష్కరించి ప్రతిష్టాత్మక ఉమ్మిడిశెట్టి పురస్కారాన్ని తన తొలి కవితా సంపుటికి తీసుకున్న కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.


యదార్థవాది...!!

తీరికగా ఉన్నామని
తీర్పులిచ్చేస్తుంటే ఎలా
మన జీవితమే మనది కాదని
తెలుసుకోవాలి కదా

తప్పొప్పుల తక్కెడలో
తూకాలు సరి చేయడానికి
తూసేవాడు మన చుట్టం కాదని
మరిచిపోతే కష్టమే

అన్యాపదేశంగా ఉపన్యాసాలివ్వడం
కాదు మనం చేయాల్సింది
గాయపడిన హృదయానికి
లేపనాలు పూయనక్కర్లేదు

ఒకరి గమనం నిర్దేశించడానికి
మనకున్న అర్హత ఏమిటన్నది
తెలుసుకున్న రోజు
ఎవరి గమ్యానికి ఆటంకం కాలేము

చావుపుట్టుకల సమతౌల్యం
కర్మానుసారమన్న సత్యమెరిగిన నాడు
లోకానికి నచ్చని
యదార్థవాదిగా మిగిలిపోతాం..!!

26, ఆగస్టు 2019, సోమవారం

మనకెందుకు లేదు..!!

నేస్తం,
       ఏ ఒక్కరూ నూటికి నూరు శాతం సరైనవారు కారు. ప్రతి మనిషిలో తప్పొప్పులు ఉంటాయి. ఎదుటివారి తప్పులు ఎంచే ముందు మనవి మనం చూసుకుంటే ఎవరిని మాట తూలము. ఒకరిని కులం కంపు అనే ముందు మన కులం అడ్డు పెట్టుకుని మనమేం చేస్తున్నామెా చూసుకుంటే బావుంటుంది. అయినా నాకు తెలవకడుగుతున్నా మనం కులం పేరు చెప్పుకోకుండానే బతికేస్తున్నామా. మనం అవునన్నా కాదన్నా పుట్టుకతో వచ్చిన కులం వాసన పోదు కదా. నాకు తెలిసి కులం కంపు, కులగజ్జి అని ఎదుటివారికి అంటగట్టి మాట్లాడేవారే ఆ కులాన్ని నెత్తికెత్తుకుని మరీ మెాస్తూ, నాది పలానా కులమని ఎలుగెత్తి చాటుతూ ఆ గొప్పదనానికి నాలుగు చప్పట్లు కొట్టించుకుంటున్నారు. మనకు నచ్చింది ఏదైనా సమర్థిస్తే చాలు క్షణమాలశ్యం చేయకుండా కులగజ్జి అని స్టాంప్ వేసేస్తారు ఈ సదరు కుల రహిత మనస్కులు. కొందరు జర్నలిస్ట్లు, పోలీసు అధికారులు ఇలా చాలామంది కూడా అంతే ఉన్నారు. మీ వృత్తికి మీరు న్యాయం చేయలేనప్పుడు ఆ వృత్తిని వదిలేయండి దయచేసి..కవులు పలానా మాత్రమే రాయాలని ఆంక్షలు పెట్టకండి. సమాజం కోసం, జనం కోసం చేయాల్సిన పనులను మీ మీ స్వార్ధం కోసం అధికారానికి కొమ్ము కాయకండి. ఎదుటివారి తప్పులు ఎంచే ముందు మీ మనస్సాక్షికి సమాధానం చెప్పి అప్పుడు వేలు చూపండి... ప్రతిక్షణం కులమని గుర్తు చేసుకునే మీరు మీ అవలక్షణాన్ని మరొకరికి అంటగట్టే ప్రయత్నం చేయకండి.. చాలా హాస్యాస్పదంగా ఉంది మీ సూక్తిసుధలకి.

ఇదంతా చెప్పడమెందుకంటే నీతులు, సూక్తిసుధలు రాతలకు, ఎదుటివారికి చెప్పడానికి, వేలెత్తి చూపడానికే అనుకునే వారికి మాత్రమే...చెప్పినందుకు అన్యధా భావించకండి...
మీ సూక్తిసుధలు చూసి చూసి తట్టుకోలేక ఇలా చెప్పాల్సి వచ్చింది..🙏

21, ఆగస్టు 2019, బుధవారం

జీవన 'మంజూ'ష ..!! ( సెప్టెంబర్ )

 నేస్తం,
        ఈ ఆధునిక యుగంలో యంత్రాల మాయలో పడి 
మనుషుల మనసుల మధ్యన  రాహిత్యం ఎక్కువై బంధాలు బలహీన పడిపోతున్నాయేమో అన్న చిన్న సందేహం కలుగుతోంది. అన్ని బంధాలకు మూలం ధనమే అన్నది తిరుగులేని సత్యంగా నిలిచింది. అనుబంధాలు కూడా యాంత్రికమై పోవడానికి ఆర్థిక అవసరాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర వహించడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చేమో. బిడ్డలు ఎందరున్నా తల్లిదండ్రులను కష్ట సమయంలో ఆదుకోవడానికి ముందు వెనుకా చూస్తున్నారంటే..తరాలు మారుతున్నా అంతరాలు, ఆంతర్యాలు ఎంతగా బయటపడుతున్నాయో చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది.
      ఒకప్పుడు పల్లెల్లో ఒక ఇంటిలో శుభకార్యమే కానివ్వండి, అశుభకార్యమే కానివ్వండి ఏదైనా ఊరంతా తమ ఇంటి కార్యక్రమమే అన్నట్టుగా భావించేవారు చుట్టరికంతో సంబంధం లేకుండా. ఇప్పుడు పల్లెలు లేదు పట్నాలు లేదు అన్ని అతికించుకోవడాలే అయిపోయాయి. చావైనా, పెళ్లయినా ఎవరు ఎంత ఘనంగా నగలు, బట్టలతో వచ్చారన్నదానికే ప్రాముఖ్యత పెరిగింది. విలువన్నది మనం కట్టుకున్న బట్టలకి, వేసుకున్న నగలకు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. చాలామంది పలకరింపులు కూడా పుల్లవిరుపుగా పలకరిస్తారు. ఇప్పుడు రక్తసంబంధం కూడా డబ్బు సంబంధంగా మారిపోవడానికి కారణం ఎవరు? తేడా ఎక్కడ? ప్రశ్న చిన్నదే కాని సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.
     చట్టం, న్యాయం కూడా అధికారానికి, ధనానికి దాసోహమంటున్నాయంటే అతిశయోక్తి ఏమి లేదు. ఇక బంధాలు, బాధ్యతలు ఎంత? మనం కనిపెట్టిన రూపాయే మనల్ని శాసిస్తోంది అంటే ఎంత విచిత్రం. మనిషి జీవితమే చిత్రమనుకుంటే ఆ చిత్రంలో " ధనమేరా అన్నిటికి మూలం" అన్న మాటను నిజం చేస్తున్న మన మనస్తత్వాల్లో మార్పు ఎన్నడో మరి..!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
     

ఏడవ రుతువు సమీక్ష..!!

                        మనిషి మనుగడను, కాలాన్ని ప్రశ్నించిన " ఏడవ రుతువు "
         భావావేశం ప్రతి మనిషికి ఉంటుంది. కాని ఆ భావాలకు సరైన రూపాన్నిచ్చి అక్షరాలను క్రమ పద్ధతిలో అమర్చగల నేర్పు, ఒడుపు చాలా కొద్దిమందికే జన్మతః వస్తుంది. జీవితంలో రాహిత్యం నుండి, బాధల నుండి వచ్చిన ప్రతి అక్షరమూ ఓ శరమై ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని తాకుతుంది. ఈ సమాజంలోని అన్యాయాన్ని, అసమానతలను ప్రశ్నిస్తూ, తన అక్షరాల్లో అగ్నికణాలను కురిపించే అతి కొద్దిమందిలో వైష్ణవిశ్రీ ఒకరు. ఉపాధ్యాయినిగా, బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, సమాజానికి తన వంతుగా సాహితీ సమారాధన చేస్తూ, తన మనసు కలంతో రాసిన నిప్పురవ్వలు కొన్ని ఆరు ఋతువుల అందాలను, ఆనందాలను, బాధలను, బాంధవ్యాలను పంచుకుని ఏడవ రుతువుగా మన ముందుకు వచ్చిన కవనమే ఈ " ఏడవ రుతువు ".
                      తాతయ్య కథల కబుర్లలో వెన్నెల రాత్రిళ్ళు పంచుకున్న బాల్యానుభూతులు తన కవిత్వానికి ఆద్యం అంటూ బాధగా వాడిన విశాఖను తల్చుకుంటూ చిగురింపజేసే చేయూత కూనిరాగాల తోట పాట కావాలంటారు. బతుకు బండి, పిట్టలు వాలని చెట్టు, జీవన వాహిని, "కన్నీ"ళ్ళ భారం వంటి కవితలు గతపు ఆనవాళ్లను, గాయాలను, కన్నవారి త్యాగాన్ని గుర్తు చేస్తాయి. పరధ్యానంలో వినబడని రాలిన రెక్కల చప్పుడు, పరధ్యానం చెదిరితే వినబడే కాలింగ్ బెల్ రాల్చిన చివరి కన్నీటి బొట్టు చప్పుడంటూ కన్నిటి చుక్క శబ్దాన్ని పోల్చడం చాలా కొత్త అభివ్య్తకి. స్నేహ గీతిక మైత్రి మాధుర్యాన్ని చెప్పింది. ప్రాణం, ప్రణవం అక్షరాలే అంటూ అక్షరాన్ని కావ్య నక్షత్రంగా పోల్చుతారు. అమ్మానాన్న ఎన్ని సర్దుబాట్లు చేసుకుంటే పిల్లలు ఎదుగుతారో చెప్పిన కవిత వాడికి తెలియదు. మట్టిని అన్నం ముద్దగా మార్చిన రైతు గురించి చెప్పిన కవిత మట్టి వీరుడు. మనిషితనాన్ని, మానవత్వపు ముసుగులో దాచేసిన అహంకారాన్ని దేహమేరా దేవాలయం కవితలో ప్రశ్నిస్తారు. అరుణ్ సాగర్ గారిపై అభిమానాన్ని బడుగు వర్గాల మనస్సాక్షి కవిత చెప్తుంది. చిరునవ్వు చాటున దాచేసిన విషాదాన్ని, మనసు నిశ్శబ్దపు ఘోషను, వేదనను మౌన సంద్రం గా మన ముందు ఆవిష్కరిస్తారు. పేద మనసు ఎవరిదో సోదాహరణంగా చెప్తారు. నన్ను నేను తెలుసుకోవడానికి నాకంటూ కొన్ని క్షణాలు కావాలని అడుగుతారు. అడుగడుగునా ఆంక్షలతో బందీగా మారిన ఇల్లాలి మనసు అమ్మతనాన్ని మాత్రం ఎప్పటికి కోల్పోడని చెప్పిన కవిత " అమ్మని " చదువుతుంటే మనసు తడి కాకుండా ఉండదు. ఒంటరి జెండా, కొన్ని జీవితాలు ఇంతే, అగ్ని పునీతలు, పాతివ్రత్యం ప్రబోధాలు, గుండెలు మండుతున్నాయి, విధి వంచిత, రాలిన అశ్రువు వంటి కవితలలో సమాజంలో ఉన్న వివక్షను, ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలను, నశిస్తున్న మానవత్వపు విలువలను ఎత్తి చూపుతూ ఘాటుగా ప్రశ్నిస్తారు. " ముగింపు లేని లేఖ
మనసు పేజీపై గాయపడి
లిపిగా వెంటాడుతూనే ఉంది " అని ముగింపు లేని లేఖ కవితలో మనసు మొండితనాన్ని మనసు కాగితంపై అక్షరంగా మలచడానికి చేసిన ప్రయత్నాన్ని అద్భుతంగా చెప్తారు. పెద్దలకు ఎదురు చెప్పలేక ప్రేమలో ఓడిన రెండు మనసుల బంధాలను జత చేసిన పెద్దరికాన్ని, కన్నవారిని గెలిపించి తాము ఓడినా నిత్య విజేతలే అని చెప్పిన తీరు చాలా బావుంది. చెల్లని నోటు చరిత్ర బావుంది. తాత్విక ప్రకటన కవితలో " రెండు కళ్ళ దేశంలో నిత్యం అకాల వర్షం " అంటూ సమాజంలో జరుగుతున్న అమానుష కృత్యాలపై కవి కలం కన్నీటి నివాళి అంటారు.
" చప్పుడు చేయని మరణం
చెప్పి రాదు ..
రాకుండా ఉండదన్నది నిజం ! " అంటారు విస్తృత మరణం కవితలో.
ఆత్మస్థైర్యాన్ని పెంచి, బానిసత్వానికి తలాక్ చెప్పే అమ్మి జాన్, అబ్బా జాన్ కావాలంటారు తలాక్ కవితలో.  ఏట కొడవలి కవిత మత్స్యకారుని జీవిత పోరాటాన్ని చెప్తూ, యుద్ధభూమిలో సైనికుని పోతరానికి దీటైనదిగా అక్షరీకరించారు. ప్రశ్నార్థకం కవిత ప్రశ్నగానే మిగిలింది.
     రాయబారాలు, పిడికిలి బిగించు, వంతెన, అంకురార్పణ, ఉరి, మానవత్వపు కాగడా, ప్రబోధం, దగ్ధ హృదయం, దురహంకార అంధత్వం, నిశ్శబ్ద తరంగం, మనసు ఎరుపెక్కుతోంది, పోస్టు మార్టం, విశ్వ మానవిని, ఆకలి ఉట్టి, ప్రక్షాళన చేసుకోండి, ఆకలి..అన్వేషణ, అనలగీతం, స్వచ్ఛ భారత్ చప్పట్లు, రహస్యం, చదరంగం, ఎర్రసముద్రం, లాల్ సలాం, ప్రపంచ పటం, కదులుతున్న ఉద్యమం వంటి కవితలు సమాజపు అసమానతలను, అన్యాయాలను, కార్పోరేట్ మోసాలను, రాజకీయపు మోసాలను ఇలా ప్రతి చిన్న సమస్యపై వైష్టవిశ్రీ సంధించిన అక్షర తూటాలు గమ్యానికై గమన నిర్ధేశనం చేస్తున్నాయి.
    మరణించిన రాత్రి, (సం),,వేదన, అక్షరారణ్యం, మా ఊరు, తొలకరి హరితం, వెన్నెల బువ్వ, వేకువ, చినుకు పువ్వులు, సీతాకోక చిలుక, కాల చక్రం, సారె జహాసి అచ్చా,  ఆమె..కాఫీ కప్పు, బడంటే ఇదేనా, బందీ, శూన్యం, నవ్వలేని పువ్వు, జ్ఞాన కెరటం, "యుగాది"నై అడుగుతున్నా, రుతు రాగాలు వంటి కవితలు  కవయిత్రిలోని సున్నితత్వాన్ని చెప్తూనే సూటిగా చదువరుల మనసుల్ని తాకుతాయి.
          అనంత సాగరాలను దాటుకుంటూ పయనించే జీవితంలో నాకై నేను నాకన్నీ నేనే అంటూ చక్కని ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంటారు. జీవితమంటే మనకు కనిపించే ఇంద్రధనుసులో ఏడు రంగులే కాదు, కనపడని ఎనిమిదో రంగు మానసిక సంఘర్షణగా చెప్పిన తీరు అమోఘం. అక్షర ఘోష, అతను వెళ్ళిపోయాడు కవితలు గౌరీ లంకేష్, సినారె గార్ల స్మృతిగా రాయడాం బావుంది.
         స్త్రీ తత్వపు సున్నితత్వంతో పాటుగా, అన్యాయాన్ని సహించలేని అపర కాళికగా, అమ్మగా, ఆలిగా, ఆత్మీయురాలిగా, ఓరిమి, క్షమా గుణంతో, సృష్టికే మూలమైన ప్రకృతి ప్రేమికురాలిగా, ఓ ప్రశ్నగా, ఓ సమాధానంగా, కన్నీటిని తుడిచే నేస్తంగా, బంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా ఇలా ప్రతి భావానికి చక్కని సరళ పదాలతో తన మనసు సంఘర్షణను మన ముందు పరిచిన ఈ మనసాక్షారాలు మనం అలవాటు పడిన ఆరు ఋతువులే కాదు, మనిషి జీవితంలో మనం చూడని " ఏడవ రుతువు " ఇదీ అని నిర్భయంగా చెప్పిన వైష్టవిశ్రీని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.


             

18, ఆగస్టు 2019, ఆదివారం

సత్యానికి..స్వప్నానికి మధ్యన..!!

వాస్తవానికి అద్దకపు రంగులు వేసేసి
ఊహకందని జీవితాన్ని
ఊహాలోకపు వాకిట్లో నిలబెట్టేసిన
ఊపిరాడనివ్వని వాగ్దానాల హోరు
వినడానికి మాత్రమే పరిమితమై
ఆచరణకు నోచుకోవన్న నిజం
గుర్తించలేని కళ్ళున్న కబోదులమై
మనమునప్పుడు
సాకారం సాధ్యం కాని
ఏ స్వప్నమైనా సుందరమే
సుమనోహరమే
ఏదేమైనా ఎవరమెలా ఉన్నా
కలలెప్పుడూ బావుంటాయన్నది
నిజమేనేమెా మరి..!!


   

17, ఆగస్టు 2019, శనివారం

ఏక్ తారలు...!!

1.   చిత్రమైనదే జీవితం_విచిత్రాలను వినీలాకాశానికి పరిచయం చేస్తూ...!!

2.   ఏ జ్ఞానమున్నా ఏమున్నది గర్వకారణం_అజ్ఞానం మన ఇంటిపేరైనప్పుడు...!!

3.   ప్రేమంతా పదిలమే_అతివ మదిలో అక్షయమై...!!

4.   మానసిక వైకల్యాన్ని చూపుతాయి_పరిణితినెరుగని రాతలు కొన్ని...!!

5.   మమతలల్లుకున్న మాటలే అన్నీ_మనసు మౌనం వీడకున్నా...!!

6.  మనసైన మౌనం మనకలవాటైందే కదా_మాటల మమకారపు నెలవులో...!!

7.  గాయాల లెక్కలు తేలనివే_మౌనంగా భరించే మది మాటున..!!

8.   మాటలకు గుబులైందట_మౌనం వీడని నీ మదిని తలచి..!!

9.   గాయం తెలుపుతుంది_మన గమ్యమేమిటని...!!

10.   మెాపలేని భారమంతా మనసుదే_కన్నీరు కనురెప్పల మాటున చేరినా..!!

11.  భాష్యమక్కర్లేని భావాలివి_అనుబంధాలై అల్లుకుపోతూ...!!

12.  సారూప్యతెప్పుడూ సన్నిహితమే_అనుబంధపు ఆనవాళ్ళు లేకున్నా...!!

13.   దగ్గరగా చూపేవీ ఆ స్వప్నాలే_దూరాలను భారం కానీయక..!!

14.   అలిగినా అందమైనదే స్వప్నం_చీకటిలో వెన్నెలను చూపిస్తూ..!!

15.   దిగులు దుప్పటి తొలుగుతుంది_ఆశల వెలుగులు అందుతుంటే..!!

16.   మౌనమేమి చెప్పదు_మనసు తెలుపుతుందంతే..!!

17.   ఎదురుచూపులు యదార్థమే_మనసు చేస్తున్న మాయకు లోనైన మౌనానికి...!!

18.   వేకువై వెంటబడుతూనే ఉన్నా_చెదిరిన స్వప్నాన్ని సర్దడానికి...!!

19.   వాస్తవం వెన్నంటే ఉంది_బాధ్యతలను గుర్తుచేస్తూ...!!

20.   చేరువైన కలలే అన్నీ_వెన్నలద్దిన వన్నెల్లో మెరుస్తూ...!!

21.   పదమై పరవశించెను_పరితాపమెరుగని భావజాలమై...!!

22.   కుళ్ళు కంపు కొట్టేది కులం కాదు_మనమనుకునే మన మంచి బుద్ది...!!

23.   కొన్ని పరిచయాలంతే_పలకరింతలవసరమే లేదన్నట్టుగా..!!

24.   కుదింపులు తప్పని జీవితాలు_వస్తువు పాతదైనా సరికొత్త కథనంతో...!!

25.   అజమాయిషీ కాదది_హితమైన అదలాయింపు...!!

26.   మౌనం దాచిన విషాదమది_రాగమేదయినా భావాన్ని స్వరపరుస్తూ...!!

27.   ఆత్మీయంగా హత్తుకోవడమే అక్షరానికి తెలుసు_ఏ కుతంత్రాలు ఎలా ఉన్నా...!!

28.   మనసు రాగమది_మౌనం నేర్చిన మాటల మాటున చేరుతూ...!!

29.   స్వరాలాపన అద్భుతమే_పద కమలాలు పాద మంజీరాలైన వేళ...!!

30.   ఊహలలాగే ఊసులాడతాయి_ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా...!!

13, ఆగస్టు 2019, మంగళవారం

వర్ణిక సమీక్ష..!!

                                మరుగౌతున్న మధుర లేఖా సాహిత్యపు అరుదైన ఆనవాళ్లు వర్ణికలో ..!!
         తెలుగు సాహిత్యంలో బోధన, రాగయుక్తంగా పిల్లల కోసం బాల సాహిత్యపు గేయరచనలు, కవితలు, వ్యాసాలు, గజళ్ళు  ఇలా  పలు రచనా ప్రక్రియలలో అందె వేసిన చేయి, బహుముఖ ప్రజ్ఞాశాలి,  ఎన్నో సన్మానాలు, పురస్కారాలు, అభిమానులతోపాటుగా ఎందరో విమర్శకుల ప్రశంసలు పొందిన " నుడి గుడి "  సృష్టికర్త " రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి " గారి సాహితీ కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం  " వర్ణిక " లేఖా సాహిత్యం. 
                      ఒకప్పుడు ఉత్తరాలు మనుష్యుల మధ్యన దూరాలను దగ్గర చేసేవి. అభిప్రాయాలను, అనుబంధాలను పంచుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాయనడంలో అతిశయోక్తి లేదు. విభిన్నమైన లేఖలు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా యంత్రాల మాయకు దాసోహమైపోయిన నేటి జీవన విధానంలో ఈ లేఖలు దాదాపు కనుమరుగై పోయాయి. పాత తరాల మాధుర్యాన్ని, మమకారాన్ని ఇప్పటి తరాలతో పాటుగా భవిష్యత్ తరాలకు అందించాలన్న సత్ సంకల్పంతో ఈ " వర్ణిక " లేఖా సాహిత్యానికి శ్రీకారం చుట్టారు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. 
                  వర్ణికలోని ప్రతి లేఖ ఓ ఆణిముత్యమే. వర్ణిక చదువుతుంటే మనకు తెలియని, వాడుకలో లేని ఎన్నో తెలుగు పదాలు పలకరిస్తాయి లేఖలతో పాటుగా. లేఖలు చదివిన ప్రతి ఒక్కరికి తమ మనసు పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలు రాక మానవు. లేఖలలో ఉన్న అన్ని రకాలను స్పృశించారు. లేఖలలో ఎక్కువగా ప్రేమ, విరహం, ఆరాధన కనిపిస్తాయి. స్నేహ సౌగంధికా సుమాలతో ప్రేమ రసధునిలో ఓలలాడిస్తారు కొన్ని లేఖలలో. మరో లేఖలో మనసులోని ప్రేమారాధనను వలపు మధురిమగా అందిస్తారు. దూరాన ఉన్న మనసుల మధ్యన సాంగత్యాన్ని నిరీక్షణలో పలికిన మనసు జతులను అందిస్తారు సున్నితమైన భావావేశంతో. సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ పెద్దరికంతో ఎన్నో కుటుంబాల వినాశనానికి దారితీసిన తాగుడు బలహీనత గురించి ఓ అక్కగా బాధ పడుతూ రాసిన లేఖ హృదయాన్ని కలచివేస్తుంది. ప్రేమను అంతా రంగరించి రాసిన మరో లేఖ తల్లి తన కొడుక్కి గుర్తుచేసిన బాల్య జ్ఞాపకాలు, వెన్నెల్లో ఆరుబయట ఆస్వాదించిన అనుభూతులు. అద్భుతమైన లేఖ ఇది. వృత్తిలో స్నేహితురాలు ఎదుర్కున్న హెచ్చరికలు, ఇబ్బందులను చెప్తూ, ఆ స్నేహితురాలికి చెప్పిన ధైర్య వచనాలు మరో లేఖలో. కలికితనాన్ని, చిలిపితనాన్ని కలిపి కవిత ఎలా ఉండాలో రాసిన కవితా ఓ ఓ కవిత బావుంది. అనారోగ్యాన్ని దాచేసి కుటుంబం కోసం చనిపోవాలనుకున్న ఓ మనసు వ్యథను ఓ లేఖలో చదువుతుంటే కన్నీరు రాణి మనసు, మనిషి ఉండరు. అవార్డులు, రివార్డుల పేరిట సాహిత్యంలో జరుగుతున్న పలు మోసాలు, మధ్యతరగతి కుటుంబాల్లో చదువు, సంస్కారం, తెలివి అన్ని ఉంది కూడా పెళ్ళి కాని ఓ  యువతి ఎదుర్కున్న కన్నవాళ్ళ  వివక్షను, ఇప్పటి వారిలో లోపంచిన భాషపై పట్టును, చదవడం, రాయడంలోని లోపాలను, స్నేహితురాలితో పంచుకున్న మనసు ముచ్చట్ల, బాధలు , వేదనలు, మనిషి ఎలా ఉండాలో, శ్రీవారికి విన్నవించిన నివేదనలు, గజల్ చరిత్రను,  ఎన్నో సామాజిక అంశాలను చర్చిస్తూ రాసిన వివిధ రకాలైన లేఖలు ఈ వర్ణిక లేఖా సాహిత్యంలో మనకు కనువిందు చేస్తాయి. ఇవి మచ్చుకు కొన్నే..ఇలా చెప్పుకుంటూ పొతే చాలా లేఖలున్నాయి ఈ పుస్తకంలో.
           స్వతహాగా భావుకురాలైన రచయిత్రి ఈ లేఖలలో చక్కని పద లాలిత్యాన్ని అందించారు. అవడానికి లేఖా సాహిత్యమే అయినా అద్భుతమైన వర్ణనతో, భావ కవిత్వపు మెరుగులు దిద్ది " వర్ణిక " పేరుకు తగ్గట్టుగా అందమైన వర్ణనలతో, ఒయ్యారమైన పదాలను చతురతగా ఒలికించారు. తన భాషా పఠిమ ప్రతి లేఖలోనూ కనిపిస్తుంది. యాంత్రిక జీవితాలకు అలవాటు పడిపోతున్న మన జీవన విధానంలో ఈ " వర్ణిక " మనం కోల్పోయిన ప్రపంచాన్ని సరికొత్తగా మనకు మళ్ళీ పరిచయం చేయగలదని ఘంటాపథంగా చెప్పగలను. వేదనను కూడా సున్నితంగా, సుకుమారంగా చెప్పిన రచయిత్రి ప్రతిభ ప్రతి లేఖలోనూ కనిపిస్తూ, " వర్ణిక " అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ.. ఇంత చక్కని లేఖలను వెలుగులోనికి తెచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.
              

7, ఆగస్టు 2019, బుధవారం

ప్రాణం వాసన సమీక్ష..!!

                             మానవత్వపు పరిమళమే ఈ " ప్రాణం వాసన "..!!

               చదువు పాఠం నేర్పి పరీక్షలు పెడితే పరీక్ష పెట్టి పాఠం నేర్పేదే జీవితం అన్న జీవిత సత్యాన్ని ఎరిగిన పోరాట పఠిమ, తెగువ కలిగిన మనసున్న కవయిత్రి, ఉపాధ్యాయురాలు శ్రీమతి రమాదేవి బాలబోయిన. ఓటమి నుండి గెలుపు పయనానికి నిత్య సంఘర్షణే తన జీవితానుభవమని చెప్తూ, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూసి స్పందించిన మనసు ప్రశ్నలు, వేదనలు, ఆలోచనలే ఈ  " ప్రాణం వాసన " కవితా సంపుటిగా రూపుదిద్దుకుంది.
            ఈ ప్రపంచంలో ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడకోసం పోరాటం తప్పదని, ఒంటరి యుద్ధం చేయాలని చక్కగా చెప్తారు ఈ సంపుటిలో మొదటి కవితలో. ప్రాణమున్నప్పుడు కష్టాలు కనిపిస్తాయి కానీ, ప్రాణం పోయిన తరువాత డప్పుల చప్పుళ్లతో తీసుకు వెళతారు. అప్పుడు నీ గుండె చప్పుడు చేయదా సాయం చేయడానికి అని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది ఈ " ప్రాణం వాసన " కవిత. మానవత్వం లేని ప్రతి ఒక్కరి దగ్గరా శవపు వాసనే వస్తుంది అని చక్కని తెలంగాణా యాసలో వేసిన ఈ చురక అందరు చదివి తీరాల్సిందే.
" ఇగ జూడు
గీ దునియాల
మానవత్వం మర్సినోల్లకాడ
పీనుగ కంపు తప్ప
ప్రాణం వాసన గొడ్తలేదు.." ఎంత బాగా చెప్పారో మానవత్వం, మనిషితనం గురించి.
మరో కవిత " అన్నీ తానైన ఆమె " లో ఓ అతివ అంతరంగ అశక్త గీతం ఎంత బాగా వినిపించారో ఈ రెండు మాటల్లో చూడండి.
" ఎన్నింటా తానున్నా
 వెలుగు పోయి చీకటొచ్చెసరికి
తను ఆమెగా మిగిలింది. "
యాదికున్నదా బిడ్డా కవిత నేటి సమాజంలో వృద్ధాశ్రమాల పాలౌతున్న తల్లిదండ్రుల మనోవేదన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ తల్లే కాదు ఏ తల్లి మనసైనా కొట్టుకులాడేది బిడ్డల బాగు కోసమేనన్నది జగమెరిగిన సత్యం. " నీకోసం నేనుండగలుగుతున్నా ఈడ బిడ్డా..  రేపటి రోజున నీ బతుకు ఇలాగయితే నేను తట్టుకోలేను అని చెప్పడం చదువుతుంటే మనసు తడి కంటికి చేరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వైవిధ్యంగాదేశానికి వెన్నెముకైన రైతన్నను " ఆకుపచ్చ జాబిలి " గా అభివర్ణించిన తీరు అభినందనీయం. అమ్మా.. నొప్పీ.. అంటూ అమాయక చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను వేదనగా అక్షరాల్లో చూపుతారు. అక్షర స్నేహాన్ని నా నేస్తం, అక్షరాలతో సోపతి అంటూ అక్షర అనుబంధాన్ని చాటుతారు. ఆకలికి ప్రాణం హారతి, గొంతెత్తి అరవాలనుంది, హృదయాంతరం, నేరం నాది కాదు, స్వయంబంధీయై, ఒంటరి పక్షులు,  మట్టిబొమ్మ, ఆమె ఉలిక్కిపడింది, మనసులేని లోకం చెవులకు కళ్ళున్నాయా, అంతా భ్రమ, ఆ పాదాల పూచిన రుధిర పూలు, జ్వలిత దేహం వంటి కవితలు మన చుట్టూ జరుగుతున్నఆకలి కేకలు, మహిళా  సమస్యలను మానవతా కోణంలో చూడమని చెప్పడం చాలా బావుంది. ప్రేమ పంచితే నా (నీ)నేనుగా మారతానని, కాలం సాక్షిగా జీవన సందేశాన్ని ద్విముఖుడి లక్షణాలను వినిపిస్తూ అమ్మ కొలువైన చోట ఆనందాల హరివిల్లులను చూపిస్తూ, విద్యతో యువతను  దేశ ప్రగ్రతికి పునాదులు వేయమని చెప్పడం, ఆమెకు పొగరే అంటూ స్త్రీ కి పెట్టని ఆభరణమైన ఆత్మాభిమానాన్ని అత్యంత అందంగా వర్ణించారు. ఆవేశం, ఆరాటం, ఆక్రోశం, ఆనందం ఇలా ప్రతి అనుబిభూతి నుండి పుట్టేదే కవిత్వం అని కవిత్వం పుట్టుక గురించి చెప్పారు. అంతిమ ప్రయాణ సన్నాహాలను స్నానం పూర్తయ్యింది... కవితలో చదువరుల కనుల ముందు ఆవిష్కరింపజేశారు. బాల్య వివాహాల భారాన్ని చితినెక్కిన బాల్యంలో, ఆడ'పిల్ల ఈడపిల్లగా తండ్రికి రాసిన లేఖ లేక లేక ఓ లేఖగా మనముందుంది. మారిన మనుష్యుల తీరు, మాట, లోకం పోకడ అన్ని అప్పటి రోజులు కాదంటూ జర్ర నువ్వు జూచే పద్దతి మార్సబ్బా అంటూ ఓ చిన్న హెచ్చరిక చేయడం,  నల్లని అక్షరాలా సాక్షిగా గతించిన కాలం తిరిగిరానంది అంటూ బతుకు పుస్తకంలో మరో పేజీని చెప్పడం, నీ నయనాశ్రుచిత్రాలలో, గుచ్చుతున్న జ్ఞాపకాల అంపశయ్య, ఓరోజు గడిచిపోయింది, నా ప్రాణమా, నిన్ను ప్రేమిస్తున్నాను, కాలచక్రం, నే "బాల"నోయి, గుప్పెడంత మనసు, బతుకు రంగోళీ, ఏకాంతాస్వాదన, మృదువిరులు, నీకూ నాకూ మధ్య వంటి కవితలు ఆరాధన, ప్రేమ, ఆశలు, ఆనందాల అనుభూతులను, జీవితపు భిన్న పార్శ్వాలను చూపుతాయి. ఆమె విద్యా జ్యోతి అంటూ సావిత్రిబాయిని గుర్తుచేసుకుంటారు. నా చుట్టూతా ఎన్నో కథలు, వ్యర్థాలు చూస్తూ అలిసిపోయానంటారు. అన్వేషిత కవిత అర్థవంతంగా ఉంది. అమ్మభాషలో నుండి వచ్చిన భావాలు నా గళం తాగిన అమృతాక్షరాలు అంటారు. అపరిచితంగా పరిచయమైన బంధాన్ని ఇంతకీ ఎవరంట అంటారు. వెన్నెల తాగిన పసితనం, ఒక స్వప్నం, తూరుపుపిట్టలు, ఆ డొక్కల మృదంగం, చిన్ని వెలుగులు వంటి కవితలు పసితనపు ఆనందాలను, ఆకలి బాధలను, కలల కోరికలను వినిపిస్తాయి. స్వగతపు అంతరంగాన్ని, ఆశయాలను మరో అడుగేస్తున్నా కవితలో వినిపిస్తారు. ఆడశిశువు పిండంగానే నలిపివేయబడటాన్ని నా జాడ మరుగైతాంది కవితలో వేదనగా నివేదిస్తారు. మానవత్వపు అస్తిత్వం మరుగవకముందే ఓ మనిషి మేలుకో అంటారు. బిడ్డలుండి అనాధగా బతుకు తెల్లార్చుకున్న అవ్వను తెల్లారిపోయింది కవితలో చూపిస్తారు. బాల్యాన్ని దాటి ఆంక్షల పర్వానికి అడుగు పడిన ఆ రోజులను,  అర్థంకాని ఆ పసి మనసు అనుమానాలను మెట్టు "ముట్టు"కోకు కవితలో చాలా బాగా చెప్పారు. మట్టివాసన కవిత అద్భుతంగా ఉంది.
" గా మట్టి వాసన మంచిగుంటది
   మనాది మొత్తం తీసేసి మనల్ని మనుషుల్ని చేస్తది
   కన్నతల్లి ఒడిలో పసిపాపనై ఒదిగినట్లుంటది. "  ఎంత చక్కని భావన ఇది.
పండుటాకు గోసలో దూరాన ఉన్న బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నా ముసలిప్రాణం మనోవేదన చదువుతుంటే కంట నీరు రాక మానదు. ఆవిరైన ఆశలు, శనార్తులు జేసుకుంట అడుగుతాన, మనిషి కరువైతుండు, వంటి కవితలు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. అమ్మ ఋణం తీర్చుకోలేనిదంటూ  చెప్తూ అంతరించి పోతున్న కొన్నింటిని గుర్తుచేస్తూ  ఊరపిచ్చుకలు కవితలో పిచుకలను ఉదహరిస్తూ చరిత్రలో ఒకప్పటి కథగా మిగిలిపోతున్న జాతులలో రైతులను చేర్చడం చాలా చక్కగా ఉంది.
                చిన్నప్పటి నుండి కష్టాలను తన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ పెరిగి జీవనపోరాటంలో ఓటమి నుండి గెలుపు తాయిలం కోసం శ్రమిస్తూ, ఎందరికో మార్గదర్శకంగా నిలబడి, సమాజాన్ని తన రచనలతో చైతన్యవంతం చేస్తూ, మానవత్వపు వాసనలను సమాజమంతా పరచాలని కలలుగంటున్న మానవతావాది రమాదేవి బాలబోయిన మనసు వెలువరించిన భావాలకు జీవం పోసిన అక్షరాలు నింపిన ఈ  " ప్రాణం వాసన " కు హృదయపూర్వక అభినందన మందారాలు.

6, ఆగస్టు 2019, మంగళవారం

ద్విపదలు..!!

1.   రాయనలవి కాని భావం
మనసుని చదివేస్తే చాలంటూ...!!

2.   గమ్యమెప్పుడూ అందేంత దూరంలోనే
గమనమే అడుగడుగునా అడ్డంకులతో...!!

3.  రాయెద్దనుకుంటానా నిన్ను
క్షణమైనా ఉండలేను ఆ మాటపై..!!

4.  నీ ప్రేమలాంటిది
అక్షరమక్షరంలో ఆరాధనలొలికిస్తూ...!!

5.  మార్పు సహజమే
సజీవంగా మిగిలిన కొన్ని సాక్ష్యాలతో...!!

6.   జవాబులక్కర్లేని జీవితమైంది
నీ జత చేరినప్పటి నుండి..!!

7.   అసాధ్యమని అధైర్యమేలా
మన రూపాన్ని ప్రయత్నిస్తే కఠినత్వమెలా కరిగిపోతుందో చూడు..!!

8.    తరిమికొట్టనేల మౌనాన్ని
యుగాల జ్ఞాపకాలను మనకు చేరవేస్తుంటే..!!

9.   మౌనం మనసు దోచేస్తోంది
ముచ్చటగా పంచుకుంటున్న ముచ్చట్లకు..!!

10.   కాంతులీనింది ప్రతిక్షణమూ
కరిగిన కలల్లో కదలాడిన జ్ఞాపకమై...!!

11.   మనసు తెలిసిన అక్షరాలవి
మనిషి అడుగులను తడబడనీయవు..!!

12.   గుప్పెడు అక్షరాలే ఇవి
మదిని నింపే భావాలైపోతూ...!!

13.   కలం తన ప్రయత్నమాపలేదు
మనసుకు భావాలకు లంకె వేసే అక్షరాలను ఆకట్టుకోవడంలో...!!

14.   కలమాగినా కాలమాగదు
అల్లికలవాటైన అక్షరాలకు..!!

15.   తిమిరపు తెరలే అన్నీ
కలతలకు నెలవైన కథలకు..!!

16.   నిశీథిలోనూ నిధులే అవి
మిణుగురులై మెరిసే జ్ఞానాక్షరాలు...!!

17.   అమ్మను మరిచిందెక్కడా
గుర్తు రావడానికి జ్ఞాపకమైపోలేదు నా జీవమే తానైంది..!!

18.   కలలా కదిలిపోయింది కలత
చిరునవ్వుల విరుపుల సందడికి...!!

19.  క్షణాల్ని లెక్కిస్తున్నా
నీ సమక్షంలో లెక్కలు తేలని సమయాన్ని లెక్కించేద్దామని...!!

20.   క్షణాల్ని లెక్కిస్తున్నా
మనవైన ఘడియల్లో మనది కాని కాలానికి తావుందేమెానని..!!

21.   మౌనమంతా మటుమాయం
నీ జ్ఞాపకాలతో ఊసులాడుతున్న క్షణాల్లో..!!

22.   మనసు పరిమళమీ అక్షరాలది
భావ తారకలను బహు సున్నింతంగా దోసిళ్ళలో ఒంపేస్తూ...!!

23.    వెళ్ళాలనున్నా వెళ్ళనీయవు
మనసుతో కట్టి పడేయడం నీకలవాటేగా...!!

24.   బంధమూ లేదు అనుబంధమూ కాదు
అయినా విడదీయలేని ముడుల ఆనవాళ్ళేంటో..!!

25.   శిథిలాలూ పదిలమే
మనిషిలోని మనసు గురుతులను దాయాలనుకుంటే..!!

26.   ఏకాంతం అనంతమైంది
మనోసంద్రానికి తగ్గట్టుగా..!!

27.    అక్షరాల తడి మదిని తాకింది
ఏ భావం కలవర పెట్టిందో...!!

28.   మార్మికత అవసరమందుకే
భావాలు మనసులకు మాత్రమే తెలిసేలా...!!

29. గుండెకు భరోసానివ్వవూ
నీవు లేని క్షణాలను తట్టుకోలేకుంది...!!

30.   గుండె చప్పుడు చేయడంలేదు
జ్ఞాపకాలు వలసబోయాయని అలిగి..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner