భావావేశం ప్రతి మనిషికి ఉంటుంది. కాని ఆ భావాలకు సరైన రూపాన్నిచ్చి అక్షరాలను క్రమ పద్ధతిలో అమర్చగల నేర్పు, ఒడుపు చాలా కొద్దిమందికే జన్మతః వస్తుంది. జీవితంలో రాహిత్యం నుండి, బాధల నుండి వచ్చిన ప్రతి అక్షరమూ ఓ శరమై ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని తాకుతుంది. ఈ సమాజంలోని అన్యాయాన్ని, అసమానతలను ప్రశ్నిస్తూ, తన అక్షరాల్లో అగ్నికణాలను కురిపించే అతి కొద్దిమందిలో వైష్ణవిశ్రీ ఒకరు. ఉపాధ్యాయినిగా, బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, సమాజానికి తన వంతుగా సాహితీ సమారాధన చేస్తూ, తన మనసు కలంతో రాసిన నిప్పురవ్వలు కొన్ని ఆరు ఋతువుల అందాలను, ఆనందాలను, బాధలను, బాంధవ్యాలను పంచుకుని ఏడవ రుతువుగా మన ముందుకు వచ్చిన కవనమే ఈ " ఏడవ రుతువు ".
తాతయ్య కథల కబుర్లలో వెన్నెల రాత్రిళ్ళు పంచుకున్న బాల్యానుభూతులు తన కవిత్వానికి ఆద్యం అంటూ బాధగా వాడిన విశాఖను తల్చుకుంటూ చిగురింపజేసే చేయూత కూనిరాగాల తోట పాట కావాలంటారు. బతుకు బండి, పిట్టలు వాలని చెట్టు, జీవన వాహిని, "కన్నీ"ళ్ళ భారం వంటి కవితలు గతపు ఆనవాళ్లను, గాయాలను, కన్నవారి త్యాగాన్ని గుర్తు చేస్తాయి. పరధ్యానంలో వినబడని రాలిన రెక్కల చప్పుడు, పరధ్యానం చెదిరితే వినబడే కాలింగ్ బెల్ రాల్చిన చివరి కన్నీటి బొట్టు చప్పుడంటూ కన్నిటి చుక్క శబ్దాన్ని పోల్చడం చాలా కొత్త అభివ్య్తకి. స్నేహ గీతిక మైత్రి మాధుర్యాన్ని చెప్పింది. ప్రాణం, ప్రణవం అక్షరాలే అంటూ అక్షరాన్ని కావ్య నక్షత్రంగా పోల్చుతారు. అమ్మానాన్న ఎన్ని సర్దుబాట్లు చేసుకుంటే పిల్లలు ఎదుగుతారో చెప్పిన కవిత వాడికి తెలియదు. మట్టిని అన్నం ముద్దగా మార్చిన రైతు గురించి చెప్పిన కవిత మట్టి వీరుడు. మనిషితనాన్ని, మానవత్వపు ముసుగులో దాచేసిన అహంకారాన్ని దేహమేరా దేవాలయం కవితలో ప్రశ్నిస్తారు. అరుణ్ సాగర్ గారిపై అభిమానాన్ని బడుగు వర్గాల మనస్సాక్షి కవిత చెప్తుంది. చిరునవ్వు చాటున దాచేసిన విషాదాన్ని, మనసు నిశ్శబ్దపు ఘోషను, వేదనను మౌన సంద్రం గా మన ముందు ఆవిష్కరిస్తారు. పేద మనసు ఎవరిదో సోదాహరణంగా చెప్తారు. నన్ను నేను తెలుసుకోవడానికి నాకంటూ కొన్ని క్షణాలు కావాలని అడుగుతారు. అడుగడుగునా ఆంక్షలతో బందీగా మారిన ఇల్లాలి మనసు అమ్మతనాన్ని మాత్రం ఎప్పటికి కోల్పోడని చెప్పిన కవిత " అమ్మని " చదువుతుంటే మనసు తడి కాకుండా ఉండదు. ఒంటరి జెండా, కొన్ని జీవితాలు ఇంతే, అగ్ని పునీతలు, పాతివ్రత్యం ప్రబోధాలు, గుండెలు మండుతున్నాయి, విధి వంచిత, రాలిన అశ్రువు వంటి కవితలలో సమాజంలో ఉన్న వివక్షను, ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలను, నశిస్తున్న మానవత్వపు విలువలను ఎత్తి చూపుతూ ఘాటుగా ప్రశ్నిస్తారు. " ముగింపు లేని లేఖ
మనసు పేజీపై గాయపడి
లిపిగా వెంటాడుతూనే ఉంది " అని ముగింపు లేని లేఖ కవితలో మనసు మొండితనాన్ని మనసు కాగితంపై అక్షరంగా మలచడానికి చేసిన ప్రయత్నాన్ని అద్భుతంగా చెప్తారు. పెద్దలకు ఎదురు చెప్పలేక ప్రేమలో ఓడిన రెండు మనసుల బంధాలను జత చేసిన పెద్దరికాన్ని, కన్నవారిని గెలిపించి తాము ఓడినా నిత్య విజేతలే అని చెప్పిన తీరు చాలా బావుంది. చెల్లని నోటు చరిత్ర బావుంది. తాత్విక ప్రకటన కవితలో " రెండు కళ్ళ దేశంలో నిత్యం అకాల వర్షం " అంటూ సమాజంలో జరుగుతున్న అమానుష కృత్యాలపై కవి కలం కన్నీటి నివాళి అంటారు.
" చప్పుడు చేయని మరణం
చెప్పి రాదు ..
రాకుండా ఉండదన్నది నిజం ! " అంటారు విస్తృత మరణం కవితలో.
ఆత్మస్థైర్యాన్ని పెంచి, బానిసత్వానికి తలాక్ చెప్పే అమ్మి జాన్, అబ్బా జాన్ కావాలంటారు తలాక్ కవితలో. ఏట కొడవలి కవిత మత్స్యకారుని జీవిత పోరాటాన్ని చెప్తూ, యుద్ధభూమిలో సైనికుని పోతరానికి దీటైనదిగా అక్షరీకరించారు. ప్రశ్నార్థకం కవిత ప్రశ్నగానే మిగిలింది.
రాయబారాలు, పిడికిలి బిగించు, వంతెన, అంకురార్పణ, ఉరి, మానవత్వపు కాగడా, ప్రబోధం, దగ్ధ హృదయం, దురహంకార అంధత్వం, నిశ్శబ్ద తరంగం, మనసు ఎరుపెక్కుతోంది, పోస్టు మార్టం, విశ్వ మానవిని, ఆకలి ఉట్టి, ప్రక్షాళన చేసుకోండి, ఆకలి..అన్వేషణ, అనలగీతం, స్వచ్ఛ భారత్ చప్పట్లు, రహస్యం, చదరంగం, ఎర్రసముద్రం, లాల్ సలాం, ప్రపంచ పటం, కదులుతున్న ఉద్యమం వంటి కవితలు సమాజపు అసమానతలను, అన్యాయాలను, కార్పోరేట్ మోసాలను, రాజకీయపు మోసాలను ఇలా ప్రతి చిన్న సమస్యపై వైష్టవిశ్రీ సంధించిన అక్షర తూటాలు గమ్యానికై గమన నిర్ధేశనం చేస్తున్నాయి.
మరణించిన రాత్రి, (సం),,వేదన, అక్షరారణ్యం, మా ఊరు, తొలకరి హరితం, వెన్నెల బువ్వ, వేకువ, చినుకు పువ్వులు, సీతాకోక చిలుక, కాల చక్రం, సారె జహాసి అచ్చా, ఆమె..కాఫీ కప్పు, బడంటే ఇదేనా, బందీ, శూన్యం, నవ్వలేని పువ్వు, జ్ఞాన కెరటం, "యుగాది"నై అడుగుతున్నా, రుతు రాగాలు వంటి కవితలు కవయిత్రిలోని సున్నితత్వాన్ని చెప్తూనే సూటిగా చదువరుల మనసుల్ని తాకుతాయి.
అనంత సాగరాలను దాటుకుంటూ పయనించే జీవితంలో నాకై నేను నాకన్నీ నేనే అంటూ చక్కని ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంటారు. జీవితమంటే మనకు కనిపించే ఇంద్రధనుసులో ఏడు రంగులే కాదు, కనపడని ఎనిమిదో రంగు మానసిక సంఘర్షణగా చెప్పిన తీరు అమోఘం. అక్షర ఘోష, అతను వెళ్ళిపోయాడు కవితలు గౌరీ లంకేష్, సినారె గార్ల స్మృతిగా రాయడాం బావుంది.
స్త్రీ తత్వపు సున్నితత్వంతో పాటుగా, అన్యాయాన్ని సహించలేని అపర కాళికగా, అమ్మగా, ఆలిగా, ఆత్మీయురాలిగా, ఓరిమి, క్షమా గుణంతో, సృష్టికే మూలమైన ప్రకృతి ప్రేమికురాలిగా, ఓ ప్రశ్నగా, ఓ సమాధానంగా, కన్నీటిని తుడిచే నేస్తంగా, బంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా ఇలా ప్రతి భావానికి చక్కని సరళ పదాలతో తన మనసు సంఘర్షణను మన ముందు పరిచిన ఈ మనసాక్షారాలు మనం అలవాటు పడిన ఆరు ఋతువులే కాదు, మనిషి జీవితంలో మనం చూడని " ఏడవ రుతువు " ఇదీ అని నిర్భయంగా చెప్పిన వైష్టవిశ్రీని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి