7, ఆగస్టు 2019, బుధవారం

ప్రాణం వాసన సమీక్ష..!!

                             మానవత్వపు పరిమళమే ఈ " ప్రాణం వాసన "..!!

               చదువు పాఠం నేర్పి పరీక్షలు పెడితే పరీక్ష పెట్టి పాఠం నేర్పేదే జీవితం అన్న జీవిత సత్యాన్ని ఎరిగిన పోరాట పఠిమ, తెగువ కలిగిన మనసున్న కవయిత్రి, ఉపాధ్యాయురాలు శ్రీమతి రమాదేవి బాలబోయిన. ఓటమి నుండి గెలుపు పయనానికి నిత్య సంఘర్షణే తన జీవితానుభవమని చెప్తూ, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూసి స్పందించిన మనసు ప్రశ్నలు, వేదనలు, ఆలోచనలే ఈ  " ప్రాణం వాసన " కవితా సంపుటిగా రూపుదిద్దుకుంది.
            ఈ ప్రపంచంలో ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడకోసం పోరాటం తప్పదని, ఒంటరి యుద్ధం చేయాలని చక్కగా చెప్తారు ఈ సంపుటిలో మొదటి కవితలో. ప్రాణమున్నప్పుడు కష్టాలు కనిపిస్తాయి కానీ, ప్రాణం పోయిన తరువాత డప్పుల చప్పుళ్లతో తీసుకు వెళతారు. అప్పుడు నీ గుండె చప్పుడు చేయదా సాయం చేయడానికి అని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది ఈ " ప్రాణం వాసన " కవిత. మానవత్వం లేని ప్రతి ఒక్కరి దగ్గరా శవపు వాసనే వస్తుంది అని చక్కని తెలంగాణా యాసలో వేసిన ఈ చురక అందరు చదివి తీరాల్సిందే.
" ఇగ జూడు
గీ దునియాల
మానవత్వం మర్సినోల్లకాడ
పీనుగ కంపు తప్ప
ప్రాణం వాసన గొడ్తలేదు.." ఎంత బాగా చెప్పారో మానవత్వం, మనిషితనం గురించి.
మరో కవిత " అన్నీ తానైన ఆమె " లో ఓ అతివ అంతరంగ అశక్త గీతం ఎంత బాగా వినిపించారో ఈ రెండు మాటల్లో చూడండి.
" ఎన్నింటా తానున్నా
 వెలుగు పోయి చీకటొచ్చెసరికి
తను ఆమెగా మిగిలింది. "
యాదికున్నదా బిడ్డా కవిత నేటి సమాజంలో వృద్ధాశ్రమాల పాలౌతున్న తల్లిదండ్రుల మనోవేదన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ తల్లే కాదు ఏ తల్లి మనసైనా కొట్టుకులాడేది బిడ్డల బాగు కోసమేనన్నది జగమెరిగిన సత్యం. " నీకోసం నేనుండగలుగుతున్నా ఈడ బిడ్డా..  రేపటి రోజున నీ బతుకు ఇలాగయితే నేను తట్టుకోలేను అని చెప్పడం చదువుతుంటే మనసు తడి కంటికి చేరుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వైవిధ్యంగాదేశానికి వెన్నెముకైన రైతన్నను " ఆకుపచ్చ జాబిలి " గా అభివర్ణించిన తీరు అభినందనీయం. అమ్మా.. నొప్పీ.. అంటూ అమాయక చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను వేదనగా అక్షరాల్లో చూపుతారు. అక్షర స్నేహాన్ని నా నేస్తం, అక్షరాలతో సోపతి అంటూ అక్షర అనుబంధాన్ని చాటుతారు. ఆకలికి ప్రాణం హారతి, గొంతెత్తి అరవాలనుంది, హృదయాంతరం, నేరం నాది కాదు, స్వయంబంధీయై, ఒంటరి పక్షులు,  మట్టిబొమ్మ, ఆమె ఉలిక్కిపడింది, మనసులేని లోకం చెవులకు కళ్ళున్నాయా, అంతా భ్రమ, ఆ పాదాల పూచిన రుధిర పూలు, జ్వలిత దేహం వంటి కవితలు మన చుట్టూ జరుగుతున్నఆకలి కేకలు, మహిళా  సమస్యలను మానవతా కోణంలో చూడమని చెప్పడం చాలా బావుంది. ప్రేమ పంచితే నా (నీ)నేనుగా మారతానని, కాలం సాక్షిగా జీవన సందేశాన్ని ద్విముఖుడి లక్షణాలను వినిపిస్తూ అమ్మ కొలువైన చోట ఆనందాల హరివిల్లులను చూపిస్తూ, విద్యతో యువతను  దేశ ప్రగ్రతికి పునాదులు వేయమని చెప్పడం, ఆమెకు పొగరే అంటూ స్త్రీ కి పెట్టని ఆభరణమైన ఆత్మాభిమానాన్ని అత్యంత అందంగా వర్ణించారు. ఆవేశం, ఆరాటం, ఆక్రోశం, ఆనందం ఇలా ప్రతి అనుబిభూతి నుండి పుట్టేదే కవిత్వం అని కవిత్వం పుట్టుక గురించి చెప్పారు. అంతిమ ప్రయాణ సన్నాహాలను స్నానం పూర్తయ్యింది... కవితలో చదువరుల కనుల ముందు ఆవిష్కరింపజేశారు. బాల్య వివాహాల భారాన్ని చితినెక్కిన బాల్యంలో, ఆడ'పిల్ల ఈడపిల్లగా తండ్రికి రాసిన లేఖ లేక లేక ఓ లేఖగా మనముందుంది. మారిన మనుష్యుల తీరు, మాట, లోకం పోకడ అన్ని అప్పటి రోజులు కాదంటూ జర్ర నువ్వు జూచే పద్దతి మార్సబ్బా అంటూ ఓ చిన్న హెచ్చరిక చేయడం,  నల్లని అక్షరాలా సాక్షిగా గతించిన కాలం తిరిగిరానంది అంటూ బతుకు పుస్తకంలో మరో పేజీని చెప్పడం, నీ నయనాశ్రుచిత్రాలలో, గుచ్చుతున్న జ్ఞాపకాల అంపశయ్య, ఓరోజు గడిచిపోయింది, నా ప్రాణమా, నిన్ను ప్రేమిస్తున్నాను, కాలచక్రం, నే "బాల"నోయి, గుప్పెడంత మనసు, బతుకు రంగోళీ, ఏకాంతాస్వాదన, మృదువిరులు, నీకూ నాకూ మధ్య వంటి కవితలు ఆరాధన, ప్రేమ, ఆశలు, ఆనందాల అనుభూతులను, జీవితపు భిన్న పార్శ్వాలను చూపుతాయి. ఆమె విద్యా జ్యోతి అంటూ సావిత్రిబాయిని గుర్తుచేసుకుంటారు. నా చుట్టూతా ఎన్నో కథలు, వ్యర్థాలు చూస్తూ అలిసిపోయానంటారు. అన్వేషిత కవిత అర్థవంతంగా ఉంది. అమ్మభాషలో నుండి వచ్చిన భావాలు నా గళం తాగిన అమృతాక్షరాలు అంటారు. అపరిచితంగా పరిచయమైన బంధాన్ని ఇంతకీ ఎవరంట అంటారు. వెన్నెల తాగిన పసితనం, ఒక స్వప్నం, తూరుపుపిట్టలు, ఆ డొక్కల మృదంగం, చిన్ని వెలుగులు వంటి కవితలు పసితనపు ఆనందాలను, ఆకలి బాధలను, కలల కోరికలను వినిపిస్తాయి. స్వగతపు అంతరంగాన్ని, ఆశయాలను మరో అడుగేస్తున్నా కవితలో వినిపిస్తారు. ఆడశిశువు పిండంగానే నలిపివేయబడటాన్ని నా జాడ మరుగైతాంది కవితలో వేదనగా నివేదిస్తారు. మానవత్వపు అస్తిత్వం మరుగవకముందే ఓ మనిషి మేలుకో అంటారు. బిడ్డలుండి అనాధగా బతుకు తెల్లార్చుకున్న అవ్వను తెల్లారిపోయింది కవితలో చూపిస్తారు. బాల్యాన్ని దాటి ఆంక్షల పర్వానికి అడుగు పడిన ఆ రోజులను,  అర్థంకాని ఆ పసి మనసు అనుమానాలను మెట్టు "ముట్టు"కోకు కవితలో చాలా బాగా చెప్పారు. మట్టివాసన కవిత అద్భుతంగా ఉంది.
" గా మట్టి వాసన మంచిగుంటది
   మనాది మొత్తం తీసేసి మనల్ని మనుషుల్ని చేస్తది
   కన్నతల్లి ఒడిలో పసిపాపనై ఒదిగినట్లుంటది. "  ఎంత చక్కని భావన ఇది.
పండుటాకు గోసలో దూరాన ఉన్న బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నా ముసలిప్రాణం మనోవేదన చదువుతుంటే కంట నీరు రాక మానదు. ఆవిరైన ఆశలు, శనార్తులు జేసుకుంట అడుగుతాన, మనిషి కరువైతుండు, వంటి కవితలు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి. అమ్మ ఋణం తీర్చుకోలేనిదంటూ  చెప్తూ అంతరించి పోతున్న కొన్నింటిని గుర్తుచేస్తూ  ఊరపిచ్చుకలు కవితలో పిచుకలను ఉదహరిస్తూ చరిత్రలో ఒకప్పటి కథగా మిగిలిపోతున్న జాతులలో రైతులను చేర్చడం చాలా చక్కగా ఉంది.
                చిన్నప్పటి నుండి కష్టాలను తన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ పెరిగి జీవనపోరాటంలో ఓటమి నుండి గెలుపు తాయిలం కోసం శ్రమిస్తూ, ఎందరికో మార్గదర్శకంగా నిలబడి, సమాజాన్ని తన రచనలతో చైతన్యవంతం చేస్తూ, మానవత్వపు వాసనలను సమాజమంతా పరచాలని కలలుగంటున్న మానవతావాది రమాదేవి బాలబోయిన మనసు వెలువరించిన భావాలకు జీవం పోసిన అక్షరాలు నింపిన ఈ  " ప్రాణం వాసన " కు హృదయపూర్వక అభినందన మందారాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner