29, జనవరి 2020, బుధవారం

ఏ'కాంతా'క్షరాల సమీక్ష ఆంధ్రభూమిలో..!!

నా ఏ'కాంతా'క్షరాలు ఏక్ తారల పుస్తకంపై రాజా చంద్రశేఖర్ మానాపురం గారు ఆంధ్రభూమి వార్తా పత్రికలో రాసిన సమీక్షకు వారికి, ఆంధ్రభూమి యాజమాన్యానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...
  ఏకార్త అని అచ్చు తప్పుగా పడినందుకు, అది తెలియజేసినవారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు.  సృజనకర్త అని కాకుండా సృష్టి కర్తగా పొరపాటుగా అచ్చయింది. గమనించ మనవి. 

ఏక్తారల  ఏ'కాంతా'క్షరాలే ఈ చిరు కవితలు

                           - మానాపురం రాజా చంద్రశేఖర్
                                                  9440593910

     వర్తమాన కవిత్వం అనేక సాహితీ ప్రక్రియలకు ఊపిరి పోసి పలు లఘు కవితా రూపాలకు ప్రాణప్రతిష్ఠ చేసింది. వీటిలో అత్యాధునిక కవితా రూపమే " ఏక్తార ".దీని సృజనకర్త కవయిత్రి ' మంజు యనమదల '. 28 అక్షరాల పరిమితికి లోబడి, ఏక వాక్య కవితా ప్రయోగంతో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.రెండు వాక్యాలను ఏక నిడివితో కలుపుతూ చిరు కవితలుగా మలిచి 'ఏక్ తారల'గా ఆవిష్కరించారు.గాఢత, స్పష్టత, సరళతలు వీటి ప్రత్యేకతలు. షడ్రుచులుగా చెప్పబడే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు శీర్షికలతో ఈ లఘు కవితా ప్రక్రియను పరిపుష్టం చెయ్యగలిగారు.ఇవి రాశిలో కన్నా వాసిలో మిన్నగా అనిపిస్తాయి.అనుభవసారం నిండిన కవితాత్మక తాత్విక సత్యాల్ని తార్కికబద్ధంగా ధ్వనింపచేస్తాయి. నర్మగర్భితమైన జీవన సందేశాల్ని కళాత్మకంగా,  సున్నితంగా, సహజంగా, సాహిత్యపరంగా విప్పి కప్పి లోతైన భావాలతో ప్రతిఫలింపచేస్తాయి. మార్మికత పొడసూపే విభిన్న మానసిక సంఘర్షణల భావోద్వేగాలను, అనుభూతులను, సందర్భాలను ఒకచోట కుప్పగా పోసి, పాఠకులను అలరించి రసార్ద్రభరితం చేస్తాయి. స్వతహాగా భావుకురాలైన మంజు యనమదల వీటిని " ఏ'కాంతా'క్షరాలు " శీర్షికతో కవితాసంపుటిగా తీర్చిదిద్ది అందించారు.
     " నిరాశకు చరమగీతం - నిశిలో సైతం వెలుగు పూల వర్షం " అని చెబుతున్నప్పుడు- ఒక రకమైన ఆశావహ దృక్పథం తొణికిసలాడుతుంది. నిరాశను నిశికి ప్రతీకగా చేసి, వెలుగును ఆశావాదానికి ప్రతిబింబంగా నిలుపుతుంది ఈ ఏక వాక్య కవిత. ఈ కాంతి పూల వర్షం వెల్లువలో చైతన్యం వెల్లివిరిసి, చీకటిని పోలిన నిరాశకు చరమగీతం పాడవచ్చనే భావన ఈ స్వల్ప అక్షరాల్లో ధ్వనిస్తుంది. ఇదే ఈ వచనరచన పరమార్థం. ఇందులో తాత్వికత అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
     " అమాయకత్వంలో ఆహ్లాదం - విడువలేని పసితనపు ఛాయలు " అంటూ మరోచోట కవిత్వీక రిస్తారు మంజు యనమదల. బాల్యం అంటేనే అమాయకత్వానికి ప్రతిరూపం. ఎలాంటి కల్మషత్వం ఎరగని సున్నితమైన పసిమనసుల నిర్మల మనోభావాలు ఇందులో ప్రతిఫలిస్తాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఒక్క చిరుప్రాయంలోనే పసితనపు జ్ఞాపకాలుగా ఊగిసలాడుతూ కడదాకా వెంటాడతాయి. ఈ సందర్భాన్నే ఇక్కడ కవయిత్రి కవిత్వమయం చేసింది. దీనిలో సజీవ శాశ్వత జీవ లక్షణం ఉట్టిపడుతుంది.
     " స్వప్నమూ మెలకువలోనే - గాయాలను నిదురపుచ్చలేక " అని వాపోతున్నప్పుడు నిలువెల్లా గూడుకట్టిన మానసిక జీవ సంఘర్షణతో సుడులు తిరుగుతున్న వేదన అడుగడుగునా వర్ణనాతీతంగా మిగిలిపోతుంది. ఈ రంపపుకోతలో స్వప్నం కూడా నిద్రాణ స్థితిలాంటి మెలకువలోనే ఊగిసలాడుతూ గాయాల సమస్యలకు పాదు కడుతున్న సందర్భంలోనివి ఈ కవిత్వపంక్తులు. కాబట్టే క్షణక్షణ నరకయాతన మౌన సందిగ్ధ మూగ మానసిక స్థితికి ఇది దర్పణం పడుతుంది. 
     " చుక్కల సందడితో - గగనమంతా నవ్వులే " అంటున్నపుడు భావుకత పరాకాష్టకు చేరుకుని వెన్నెలనవ్వుల్ని కురిపిస్తాయి. వెన్నెల ఆహ్లాదానికి సంకేతం. చల్లదనానికి ప్రతిబింబం. ఇది ఆకాశంలో పరుచుకుని చుక్కల మధ్య కాంతివంతంగా మెరిసి పోతుంటుంది. ఈ తారల మెరుపుల సందడికి గగనమంతా విచ్చుకున్న నవ్వుల విశ్వంగా మారిపోతుంది. ఈ దృశ్యం చూపరులకి కనువిందుగా మారి అనుభూతితో మమేకం చేస్తుంది. దీనినే సందర్భోచితంగా సౌందర్యారాధనా దృష్టితో కవయిత్రి చిత్రిస్తారు.
     " ముక్కలైన మనసులో - ఎక్కడ చూసినా నీ ప్రతిబింబమే " అంటారు ఇంకోచోట మంజు. ఈ పలుకుల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, తునాతునకలైన మనసు బీభత్సాన్ని ఉద్వేగభరితంగా కళ్ళకి కట్టిస్తారు ఈమె. గాయపడి ఛిద్రమైన సన్నివేశాల్ని విఫలమైన సంఘటనల కోవలోంచి ఎత్తిచూపి అవతలివారిని దోషిగా, మూలకారకులుగా సందర్భీకరించే ప్రయత్నంలోనిది ఇది. చాలా హృదయవిదారకంగా కవిత్వీకరిస్తారు.
     ఇంకో చోట- " నిలబడే ఉంది - నీడలో నిజం " అనడం వెనుక సజీవమైన ఒక భౌతికసత్యాన్ని తర్కబద్ధమైన కోణంలో ఆవిష్కరిస్తారు. నిప్పు లాంటి నిజం నిలబడే నీడలో దాగివుందనే స్పృహను తేటతెల్లం చేస్తారు. ఇది పైకి కనీ కనిపించని వాస్తవమే అయినా అంతర్లీనంగా ధ్వనించే అర్థాన్ని చాలా నర్మగర్భితంగా మార్మికతతో విడమర్చి చెబుతారు కవయిత్రి.
     " ఒక్కో చినుకే - వేల జీవాలకు ప్రాణాధారంగా " అంటూ చెప్పినపుడు జీవకోటి మనుగడకి ఆధారభూతమైన చినుకుచుక్క ఉనికి ఈ లోకానికి ఎంతవసరమో స్పష్టంగా విపులీకరిస్తారు. తాగడానికీ, జీవజాలం మొలకెత్తడానికీ, శుభ్రపరుచుకోవడానికీ నీటి ఆవశ్యకత ప్రాధాన్యతను తెలియజేస్తారు. జలం లేనిదే ప్రాణి బతికి బట్టకట్టలేదు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి దీనిని ఒక సందర్భ ప్రయోజనంగా భావించాలి.
     వీటితోపాటు కవితాత్మక వాక్యప్రయోగాలు ఈ సంపుటిలో కోకొల్లలుగా దర్శనమిచ్చి సృజనాత్మకతకు గీటురాయిగా నిలుస్తాయి. మచ్చుకు వీటిలో కొన్నింటిని రుచి చూద్దాం. ' చుక్కల దుప్పటి ఎగిరిపోయింది ' , ' కాలం రాల్చిన కలలు ' , ' మౌనం మాటలు పరిచింది ' , ' వెన్నెలకే వర్ణాలన్నీ ' , ' అసూయ నల్లపూసైoది' , ' సరిగమలు ఒలికి పోయాయి ' , ' నిరీక్షణ ఓ రాగమైంది ' , ' ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు ' , ' వెన్నెల ఆరబెట్టుకుంటోంది ' , ' గాయపడ్డ వేణువు గానం ' , ' రెప్పచాటు స్వప్నాలు ' , ' చీకటి చిరునామా చెరిగిపోయింది ' , ' రాలుతున్న పూల రాగాలు ' , ' వాలిపోతున్న పొద్దులో వర్ణాలు ' , ' మనసు చెమ్మ మదిని తాకింది ' , ' పగిలింది నిశ్శబ్దం ' , ' చిరు స్పర్శే విశ్వమంతగా మారింది ' , ' పిలుపు పిల్లనగ్రోవిలో సాగి ' , ' వెన్నెల దోసిళ్ళలో ఒదిగిపోయింది ' , ' పెదవి అంచున చిరునవ్వవుతావా ' , ' మౌనమూ మాటలు కలిపింది ' , ' నీ నవ్వుల్లో రాలిన ముత్యాలు ' , ' తూరుపు సిందూరమై మెరుస్తోంది ' , ' అనంతమై నన్ను చుట్టేశావు ' , ' సంతోషం ఉప్పెనయ్యింది ' , ' హృదయం చేజారిపోయి ' , ' తాకినది మది మౌన తరంగం ' , ' గుండె గొంతు విప్పింది ' , ' చిరునవ్వుల మౌనాన్ని నేను ' , ' నేల రాలినా నిత్య పరిమళమే ' , ' కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది ' , ' గెలిచిన మనసుని అక్షరాలుగా మలుస్తూ ' , ' గువ్వల్లా ఒదిగిన జ్ఞాపకాలు ' , ' మువ్వలా ముడుచుకుంది ' , ' నిశిని చుట్టేసిన వెన్నెల' , ' మంచులా నీ మనసెంత చల్లన ' , ' పున్నమి వెన్నెలే చెలి సింగారాలు ' , ' అక్షర సంచారమే జీవితం ' వంటి కవిత్వ పరిమళాలు సహజంగానే మనసుని హత్తుకుంటాయి. ఇలా బహుముఖ అంశాల వెల్లువలో సేదతీరిన ఈమె కవిత్వం ' ఏక్తారల ఏ'కాంతా'క్షరాలుగా కొలువుదీరి సామాజిక చైతన్యాన్ని ఉద్దీపింపచేస్తుంది. లోతైన భావజాలంతో పలు పార్శ్వాలకు అక్షరాలతో ఊపిరి పోసిన కవయిత్రి మంజు యనమదలకు సాదర ఆహ్వానం పలుకుతూ పాఠకలోకంలోకి స్వాగతిద్దాం.

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ఈ ఏక వాక్య కవితలు అన్నది ఒక విశిష్ట ప్రయోగం గా తోస్తుంది.

వ్యాసం లో ఇచ్చిన ఉదాహరణలు చూస్తే పుస్తకం చదవాలనిపిస్తుంది.


మీ పుస్తకం ఎక్కడ లభిస్తుంది

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అడ్రస్ నా మెయిల్ కి పంపండి...myanamadala@gmail.com

అజ్ఞాత చెప్పారు...

If possible please upload pdf of this book so that the beautiful poetic thoughts can reach many

అజ్ఞాత చెప్పారు...

మరొక్కసారి అభినందించాలి అనిపించింది మంజు గారు. ఈ పరిచయం లో ఇచ్చిన ప్రతి ఏక వాక్య కవిత అద్భుతంగా ఉంది.

చెప్పాలంటే...... చెప్పారు...

విజయవాడలో మల్లెతీగ పబ్లిషర్స్ దగ్గర.. ధన్యవాదాలు

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అడ్రెస్ myanamadala@gmail.com కి పంపండి

చెప్పాలంటే...... చెప్పారు...

మన:పూర్వక ధన్యవాదాలండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner