25, జనవరి 2021, సోమవారం
కాలం వెంబడి కలం..38
థాంక్స్ గివింగ్ కి అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వదిన అడిగింది జమ్ షో లో నువ్వేం కొనలేదా అని. నాకన్నీ పిచ్చి పూసలులా అనిపించాయి, నేనేం కొనలేదని చెప్పాను. అలాగే అనిపిస్తాయి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, జమ్ షో లోనే తక్కువకి వస్తాయని చెప్పింది. ఇంతకి జమ్ షో లో ఏముంటాయంటే రకరకాలు పూసలు, ఆ పూసలతో చుట్టిన గొలుసులు, 10 కారట్, 18 కారట్ గోల్డ్ ఆర్నమెంట్స్(నగలు) ఉంటాయన్న మాట. పూసలంటే పచ్చలు, కెంపులు, ముత్యాలు, నీలం, పగడం ఇలా నవరత్నాలన్నింటితో పాటుగా, రకరకాలైన రంగురంగుల ముత్యాలు, నల్లపూసలు, గాజులు, రింగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి. మనకు తిరునాళ్ళలో కొట్లు ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా మెాసాలు జరుగుతాయి. బేరాలు ఆడి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి.
అమెరికాలో థాంక్స్ గివింగ్ పండుగకు ఫ్రెండ్స్, చుట్టాలు అందరు కలిసి ఎవరో ఒకరింటిలో కలుస్తారు. తలా ఓ వంటకం చేసుకు వస్తారు వీలైనంత వరకు. టర్కీ అని పెద్ద కోడి, దీనిని ఓవెన్ లో బేక్ చేసి అది కట్ చేయడంతో పండగ మెుదలవుతుంది. మనకు సంక్రాంతి పండగలా అన్నమాట.
థాంక్స్ గివింగ్ తర్వాత మళ్ళీ గెస్ట్ హౌస్ కి వచ్చేసాను. హైదరాబాదు మహారాణి గారు నన్ను యుదేచ్ఛగా ఏలేసుకుంటున్నారు. నేనేం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నా. శిరీష అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది. తను వచ్చినప్పుడే నాకు కాస్తంత సంతోషం. నా ఫ్రెండ్స్ ఉమలు ఇద్దరు, సతీష్.. మేడంగారు దయతలచి ఫోన్ ఇచ్చినప్పుడు పలకరిస్తూనే ఉంటూ, నాకవసరమైనవి చెప్తూ, ఇంటికి ఫోన్ చేసే కాలింగ్ కార్డ్స్ పంపిస్తున్నారు.
ఓ రోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది ఈవిడ టార్చర్ భరించలేక. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడ్చేసాను. అమ్మాయ్ నేను వస్తున్నా, నువ్వు బాధపడకు అంటూ... వెంటనే అన్నయ్య వచ్చేసాడు. ఆ టైమ్ లో రాణిగారు బయటకు వెళ్ళారు. అంతకు ముందు కూడా పారాడైమ్ మార్కెటింగ్ వాళ్ళకి ఈవిడ సంగతి చెప్పాను, కాని వాళ్ళు పట్టించుకోలేదు. నేను వెళుతూ ఫోన్ చేసి నా దగ్గర కీస్ లేవు. నేను అన్నయ్యతో వెళిపోతున్నాను, మీరు రండి అని చెప్పాను. మేము బయలుదేరే వరకు కూడా ఈవిడ కాని, వాళ్ళు కాని రాలేదు. హాల్ లో ఓ పక్క అంతా గ్లాస్ లే ఉండి వాటికి బ్లైండ్స్ ఉండేవి. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి, నేను ఈ గ్లాసెస్ వైపు నుండి వెళుతున్నాను. వచ్చి చూసుకోండి అని చెప్పి గ్లాసెస్ దగ్గరకు వేసి మేము బయలుదేరాము. అన్నయ్య మాట్లాడుతూ... అమ్మాయ్ నీకు అలవాటు అవుతుందని, నువ్వు ఉంటానన్నావని ఇక్కడ ఉంచాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను నీ జాబ్ గురించి. నువ్వు ఇంట్లోనే ఉండి ఇంటర్వూలు అటెండ్ అవ్వు అని చెప్పాడు. మళ్ళీ సుమీ రూమ్ లో నా పడక. చదువుకోవడం, ఈ మెయిల్స్ చూసుకోవడమే అప్పట్లో పని. నేను గెస్ట్ హౌస్ నుండి వచ్చిన మరుసటి రోజు పారాడైమ్ ఇన్ఫోటెక్ CEO శ్రీధర్ గారు ఫోన్ చేసి ఎందుకలా చెప్పకుండా వెళిపోయారంటే.. విషయం మెుత్తం ఆయనకు చెప్పాను. సరేనండి మీరు అక్కడి నుండే ప్రిపేర్ అవ్వండి, మార్కెటింగ్ చేస్తామని చెప్పారు.
నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పటి నా ఫ్రెండ్ వినీత న్యూజెర్సీ లో ఉండేవారు. నన్ను చూడటానికి తను, వాళ్ళాయన వచ్చారోరోజు. వీకెండ్ వస్తే వదిన వర్జీనియాలోని శివ విష్ణు టెంపుల్ లో ఫ్రీ సర్వీస్ చేసేవారు. అప్పుడప్పుడూ నన్ను తీసుకువెళుతుండేది. వీళ్ళే దోశలు, ఇడ్లీ ,ఇతర వంటలు చేసి అక్కడ గుడిలో ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు దేవుడికి ఇచ్చేసేవారు. అలాగే ఎవరింట్లోనైనా పూజ ఉండే చక్కగా అందరు తలోచెయ్యి వేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేవారు. ఇంతలో నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ రాజు ఫోన్ చేసి వేరే కంపెనీతో మాట్లాడాను, నువ్వు చికాగో వెళ్ళు, వాళ్ళు పీపుల్ సాఫ్ట్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో ప్లేస్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు మాట్లాడి చూడు అని చెప్పాడు.
వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. మీ H1B కూడా మేము మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, మీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని ట్రైనింగ్ క్లాసులు మెుదలవుతాయి. టికెట్ బుక్ చేస్తాము వచ్చేయండి అంటే సరేనని అన్నయ్యకు విషయం చెప్పాను. తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఇండియాలో చనిపోవడము, తను ఆ టైమ్ లో ఇండియా వెళ్ళలేక వర్జీనియాలోనే దశదినకర్మ చేయాలనుకోవడము జరిగిపోయింది. తెలిసిన ఫ్రెండ్స్ కి భోజనాలు ఏర్పాటు చేసాడు పదోరోజు. నాకు ఫోన్ చేసి 2 రోజులు వాళ్ళంట్లో ఉండమని, ఇద్దరూ అన్నయ్య వాళ్ళింటికి వచ్చి,అన్నయ్య పెంచిన పెద్ద కరివేపాకు మెుక్క నుండి కరివేపాకు తీసుకుని మళ్ళీ వాళ్ళింటికి నన్ను తీసుకువెళ్ళారు. కార్యక్రమం అయిపోయాక మరుసటి రోజు షాపింగ్ కి తీసుకువెళ్ళి, నువ్వు వెళ్ళేది చికాగో, బాగా చల్లగా ఉంటుందని 20 డాలర్లు పెట్టి కంఫర్టర్ ఎంత వద్దంటున్నా వినక కొనిపెట్టారు.
నా ప్రయాణం దగ్గర పడేసరికి అన్నయ్య వాళ్ళ పిల్లలు సుమి, కృష్ణ ఇంట్లోనే ఉన్నారు.
వాళ్ళు చీజ్ తో ఏదైనా చేసుకుంటే నాకా వాసన పడేది కాదు. ఏంటన్నయ్యా ఉప్పుచేప కాల్చిన వాసన అంటే అన్నయ్య నవ్వి, నీకు అలవాటు అవుతుందిలే అది చీజ్ వాసన అనేవాడు.
సుమి షాపింగ్ కి వెళుతుంటే అన్నయ్య నన్ను కూడా తీసుకువెళ్ళి, ఏం కావాలో కొనిపెట్టమని చెప్పాడు. సుమితో షాపింగ్ కి వెళ్ళి ఓ చిన్న మఫ్లర్, చేతులకు గ్లౌజస్ ఇంకా కొన్ని అన్నీ కలిపి ఓ 50 డాలర్ల షాపింగ్ చేసా. అంతకు ముందు అన్నయ్య కొన్ని షాప్ లు చూపించి ఇంటికి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయని వివరాలు చెప్పాడు. వదిన కూడా బట్టల షాపింగ్ కి తీసుకువెళ్ళింది.
ఇక్కడ ఓ చిన్న సంఘటన చెప్పాలి. సుమితో షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది. మనకేమెా అదంటే కాస్త భయమప్పుడు. అప్పుడప్పుడే కదా కాస్త అలవాటు పడుతున్నా. అతి జాగ్రత్తగా, భయంగా ఎక్కి దిగుతుంటే సుమి నవ్వేసింది. మనం చేసింది మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం టైపులోనన్న మాట. ఈ సినిమా ఈ మధ్యనే వచ్చిందిలెండి. ఎస్కలేటర్ చూసినప్పుడల్లా ఇప్పటికి నవ్వుకుంటా అప్పటి నా భయాన్ని తల్చుకుని.
నా ప్రయాణం రోజు పిల్లలు ఇద్దరూ వచ్చి ఫ్లైట్ ఎక్కించారు. ఎలా అంటే పర్మిషన్ తీసుకుని ఫ్లైట్ గేట్ వరకు వచ్చి సెండాఫ్ చెప్పారు నవ్వుతూ. అలా అమెరికాలో మెుదటి విమాన ప్రయాణం చికాగోకి...
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
24, జనవరి 2021, ఆదివారం
ద్విపదలు..!!
1. కొన్ని సత్యాలింతే
అబద్ధాలను ఏమార్చలేక...!!
2. మనసు సున్నితమని అక్షరానికి ఎరుకే
అందుకే అనంతాన్ని తనలో ఇముడ్చుకుంటుందిలా...!!
3. బలహీనత బంధానిది
నిజం నిలకడైనదైనా...!!
4. నిజానికి ఓరిమెక్కువ
అబద్ధానికి ఆయుస్సు తక్కువేనని తెలిసి...!!
5. అనుబంధపు ముడులంతే
విడివడటాన్ని సహించలేవు...!!
6. కలలా మిగిలి కన్నీరై జారిపోవాలనుకోలేదు
భవితకు చిరునవ్వుతో స్వాగతం చెప్పాలనుకుంటూ...!!
7. పట్టుకుంది వదలడానికి కాదు నేస్తం
మరణంలో సైతం తోడుంటానని చెప్పడానికి...!!
8. ఏనాటి బంధమెా ఇది
మరణించిన మనసును పునర్జీవింపజేస్తూ...!!
9. జీవమెప్పుడూ జ్ఞాపకాలదే
మరణానికి సవాలంటూ...!!
10. చరిత్రలో చీకటి కోణాలెన్నో
ధరిత్రి మరువని నిత్యసత్యాలుగా...!!
11. పతనమై పోతున్నాయి ప్రామాణికాలన్నీ
బాసలు బంధాలను పట్టివుంచలేనప్పుడు..!!
12. మార్పు సహజమే
మారని గతాన్ని వెంటేసుకున్న కాలానికి..!!
13. మనసుని మాటాడిస్తున్నా
జ్ఞాపకాల గుభాళింపులతో కన్నీటిని దాయాలనుకుంటూ...!!
14. మౌనాన్ని వింటూనే ఉన్నా
మనసు చెప్పలేని మాటల్ని...!!
15. నిందను తిప్పికొట్టే నేర్పు అవసరమే
ఈ అ(న)వసరార్థపు బంధాలకు జవాబివ్వడానికి..!!
16. కథానాయికకు చెప్పేదేముంది?
కథనాన్ని అనువుగా మార్చుకోవడమెలాగో తనకు తెలిసిన విద్యేగా...!!
17. గతాన్ని వదల్లేదంటే
మరిపించే వాస్తవం మన వెన్నంటి లేదనే కదా..!!
18. మనసు విరిచేయడం సుళువే
అతుకులు దాయడమే కష్టం...!!
19. మనసుల కుటిలత్వం బయల్బడుతోంది
బంధాలు కుతంత్రాల నిలయమైనప్పుడు..!!
20. ప్రేమంటూ పరమపద సోపానమెక్కించావు
పైకెక్కే నిచ్చెనల పక్కనే పాములుంటాయని మరిచేటట్లు చేసి...!!
21. అప్పగింతల అంపకాలు తెమలడంలేదు ఎంతకీ
అక్షరాలకందని కన్నీటి వెతల పంపకాల్లో...!!
22. అక్షరాన్ని పరిచయం చేసింది అమ్మేగా
అందుకేనేమెా ఆ మనసే అక్షరానిదీనూ.. !!
23. అవ్యక్తమే తను
అనుభవంతో రంగరించి రాద్దామనుకున్న ప్రతిసారీ...!!
24. మనిషే కానరావడం లేదిప్పుడు
ఇంకెక్కడి మనసు గోల..!!
25. బతుకు పోరాటమిది
అలిసిపోని ఆశల వలయాల మధ్యన..!!
26. నా అక్షరాలూ ఇంతే
మనసు తడినో మమతల ఒడినో గుర్తు చేసేస్తుంటాయలా...!!
27. మాటలెప్పుడూ ఉన్నాయి
మన(సు) కథలన్నింటా...!!
28. సంశయం తీరిందిప్పుడు
ఏ బంధమెలా అల్లుకుందో తెలిసాక...!!
29. (అ)క్షరమై ఆవహిస్తున్నా
అనంతమై మిగిలిపోవాలని..!!
30. ఉపమానమెప్పుడూ ఉదహరించడానికే
సూక్తిసుధలు వల్లించే నైజం నాదైనప్పుడు..!!
వర్గము
ద్విపదలు
23, జనవరి 2021, శనివారం
ఆనందం...!!
సామాన్యురాలికి ఇంత గుర్తింపునిచ్చిన లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ మరియు a2z4uయుట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాము పడకంటి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..
వర్గము
కబుర్లు
20, జనవరి 2021, బుధవారం
అందరికి ధన్యవాదాలు..!!
నేస్తాలు,
ఓ పుష్కర కాలంగా నా రాతలు ఈ అంతర్జాలంలో కబుర్లు కాకరకాయలు అన్న బ్లాగు ద్వారా మెుదలయ్యాయి. 2009 జనవరిలో రూపుదిద్దుకున్న కబుర్లు కాకరకాయలు బ్లాగులో ఇప్పటికి 2000 పై చిలుకే పోస్టులయ్యాయి.
పుస్తకాలు చదవడం మాత్రమే అలవాటున్న నేను ఇలా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సరదాగా బ్లాగులో రాయడం మెుదలైన వ్యాపకం ముఖపుస్తకానికి జత చేరి ఇలా మీ అందరి పరిచయాన్ని, అభిమానాన్ని అందించింది.
అమ్మ నేర్పిన అక్షరం చేసిన మాయాజాలమిదంతా. అక్షరం మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదని తెలియజేసింది. మితాక్షరాలతో అనంతమైన భావాలను ఎలా అందించవచ్చో నేర్పింది. నిరాశలో ఉన్నప్పుడు ఆశల ఆనందాలను ఎలా అందుకోవచ్చో తెలిపింది. మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చో చెప్పింది. అక్షరాన్ని ఆయుధంగా ఎలా ప్రయెాగించాలో చూపించింది. మన శత్రువులను, మిత్రులను తెలియజెప్పింది. నా అన్న వారి నైజం తేటతెల్లం చేసింది. బంధువులను, రాబంధువులను గుర్తెరిగేటట్లు చేసింది. అమ్మ తొలి గురువైతే అక్షరం తొలి నేస్తమయ్యింది. మంచి చెడులను తెలియజెప్పిన ఆత్మబంధువులా అక్షరం అక్కునజేరింది.
పాతికేళ్ళు ఎలా గడిచాయెా తెలియకపోయినా మరో పాతికేళ్ళు పాతిక జన్మల అనుభవాలను మిగిల్చాయి. మనిషిలోని బహు ముఖాలను పరిచయం చేసాయి. గతాన్ని వదిలేయమని చాలామంది చెప్తారు. కాని అంత సులభం కాదు. మంచైనా చెడైనా కొన్ని సంఘటనలు మనసులో స్థిరంగా ఉండిపోతాయి. కొందరు జ్ఞాపకాలతో బతికేస్తుంటే, మరి కొందరు జ్ఞాపకాలే లేకుండా బతికేస్తుంటారు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయంతోనే మన సంతోష విషాదాలు నిర్ణయింపబడతాయి. నిర్ణయం మనది కనుక ఏదైనా భరించక తప్పదు ప్రాణం పోయేవరకు.
అనుకోని ఈ పుష్కర కాల అక్షర ప్రయాణంలో నాకెదురైన శత్రువులకు, మిత్రులకు అందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
వర్గము
కబుర్లు
19, జనవరి 2021, మంగళవారం
ఏక్ తారలు..!!
1. నటన అలవాటై పోయింది_డబ్బుతో ముడిబడిన అనుబంధాలకు...!!
2. విషాదమూ ఓ యెాగమే_భగవంతునికైనా తప్పని రాతగా...!!
3. జీవిత చదరంగమిది_నేర్పుగా ఆడాలి మరి...!!
4. అనంతాన్ని అక్షరాల్లో బంధించడం సాధ్యమే_ప్రేమను పంచినట్లుగా..!!
5. రాయి, రత్నము ఒకటే_విలువ తెలియని చోట...!!
6. వెతల వాకిళ్లు మూయాలి_వెలితిపడ్డ మనసునోదార్చడానికి...!!
7. వేదనను వారించేవి ఆత్మీయతలే_అవి అక్షరాలైనా అనుబంధాలైనా...!!
8. వెలుతురెప్పుడూ మీ వెంటే_చీకటి చుట్టరికానికి కావలి కాస్తూ...!!
9. అలంకరణ అవసరమేముంది_అక్షరాలన్నీ నిన్నే తలపిస్తుంటే...!!
10. ఏకాకి జీవితమని తెలుసుకోలేకున్నాం_అహాన్ని ఆత్మాభిమానమనుకుంటూ...!!
11. నిర్లక్ష్యంతో దప్పిక తీర్చేవారుండని మరుస్తున్నాం_పెద్దరికమని విలువిస్తే....!!
12. మూర్ఖుడూ మెుండివాడే_తెలివితేటలలో తనను మించినవాడు లేడనుకుంటూ..!!
13. కన్నీటి కలల సమాధులే_మెాసగించబడిన ప్రేమ సామ్రాజ్యాలన్నీ..!!
14. చరిత్ర పుటల్లో అజరామరం_మరణించిన మనసు కథలన్నీ...!!
15. గెలుపును ఆస్వాదించలేని మనసులే_కాలాతీతమైన జీవన విజయాలు...!!
16. గెలుపంటే మనం చెప్పుకునేది కాదు_మన గురించి ప్రపంచం తెలుసుకోవడం..!!
17. అలసట తెలియని మనసది_ఆరాధనకు పుట్టినిల్లుగా కొలువై..!!
18. అలసినా ఆనందమే_అమ్మతనంలోనున్న ఆత్మీయత అదేననుకుంటా...!!
19. కంటకమే కాదనలేని విజయానికి పునాది_నగుబాటుకు వెరవని గుండెకు...!!
20. ఇష్టం వెగటుగా మారుతోంది అప్పుడప్పుడూ_ఆరాధనకు అసలు అర్థం తెలియక...!!
21. నిజమైన ప్రేమకు చివరకు మిగిలేది_తుదిలేని నిరీక్షణే...!!
22. అత్యాశ అలవాటైపోయింది_సుతిమెత్తని మనసు కఠిన పాషాణమైపోయాక..!!
23. అశాశ్వతమైనది ఆయువు_ఆశే ఆధారం మనసు జీవనానికి...!!
24. దినసరి వేతనం దిగులయ్యింది_కన్నీటి విలువెరుగని మనుష్యుల మధ్యన..!!
25. తుంచుకునే వారికేం తెలుసు_పంచుకునే బంధాల విలువ..!!
26. గుప్పెడు అక్షరాలను విరజిమ్మతున్నా_గుండె వెలితిని నింపాలని...!!
27. అక్షరాలను కూర్చిన ఆ చేతికి తెలుసు_గుండె జ్ఞాపకాల నిధుల విలువెంతో..!!
28. రంగవల్లుల రంగులు చెదిరాయి_ఎద ఏడుపు ఎరికైనందుకేమెా...!!
29. మమతల పాశాలతో బంధిస్తున్నా_అక్షరాలకు ఆరాధనలద్దుతూ...!!
30. గతజన్మ ఆత్మీయ స్పర్శేమెా అది_ఈ జన్మలో అక్షరానుబంధమై...!!
వర్గము
ఏక్ తార
వేదనలెన్నో...!!
వాణి వెంకట్ గారి గజల్ చదివిన ప్రతిసారి నాకూ రాయాలనిపించేది. ఇది నాలుగు నెలల క్రిందట మెుదలు పెడితే ఇప్పటికి అయ్యింది.
థాంక్యూ సోమచ్ వాణి గారు.
వేదనలెన్నో...!!
నిట్టూర్పుల నీడలలో మెదలాడే వేదనలెన్నో
నిస్పృహల నీరవంలో కదలాడే వేదనలెన్నో
కరిగిపోతున్న కాలంలో జారిపోతున్న క్షణాల్లో
గాయాలను గురుతుజేస్తూ తిరుగాడే వేదనలెన్నో
జ్ఞాపకాల కదలికలతో ఊపిరందుతున్న వేళల్లో
జాలిగొలిపే కథనాలలో చొరబడే వేదనలెన్నో
కన్నీటి కలువల కోనేటి ప్రవాహాల్లో
కొట్టుమిట్టాడే మనసుకు చేరబడే వేదనలెన్నో
అనుబంధాల ఆశల పాశాల మాయాజూదాల్లో
పలుకరించని ఆత్మీయతల్లో కొరవడే వేదనలెన్నో
మృదు మంజుల పద నాట్యం లయతప్పని రాతల్లో
మౌన విపంచి విధిరాతల్లో వెలువడే వేదనలెన్నో
పల్లవించే పాటల రాగం మూగబోయిన గొంతుల్లో
మౌనగానం మరిచిన మమతలలో రాలిపడే వేదనలెన్నో...!!
వర్గము
గజల్
18, జనవరి 2021, సోమవారం
సిద్ధాంతం - రాద్ధాంతం..!!
మానవ మనుగడకు ఆధారం సైన్స్. సిద్దాంతాలు, రాద్ధాంతాలు లేకుండా ఏ ప్రతిపాదనకు విలువ లేదు. క్రీస్తు శకం పూర్వం వదిలేసినా, క్రీస్తు శకం ఆరంభంలో తీసుకుంటే ఆడమ్, ఈవ్, ఆపిల్ తో మెుదలైన సృష్టి ప్రారంభం మనకందరికి తెలిసిన విషయమే. అదే ఆపిల్ తో మెుదలుబెడితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆపిల్ పైకి విసిరితే క్రిందికే పడుతుందని అందరికి తెలుసు. కాని న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం రాకమునుపు, వచ్చిన తరువాత కూడా ఆపిల్ పైకి విసిరితే క్రిందికే పడుతోంది. ఆపిల్ పైకి విసిరితే క్రిందికి పడటమనేది పాత విషయమే. అయినా ఎవరూ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ కన్నా ముందు ప్రతిపాదించనూ లేదు. అది ఎప్పటినుండో ఉన్న విషయమే అని న్యూటన్ సిద్ధాంతాన్ని కొట్టిపారవేయనూ లేదు. అదే జరిగుంటే ఈనాడు మనకు గురుత్వాకర్షణ శక్తి అన్న పదము కాని, ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం కాని లేదు.
ఇదే ప్రాతిపదికన రచనలో ప్రధాన పాత్రధారులైన వస్తుశిల్పాల గురించి రచయితకు అవగాహన ఉండటంలో వింతేమీ లేదు. కాని ఆ వస్తువు, శిల్పము విచ్ఛేదన చెంది రచనలో ప్రముఖపాత్రను పోషిస్తాయన్నది ఎంతమందికి తెలుసు? ఓ రచన సంపూర్ణం కావడానికి ఐదు నిమిషాలు పట్టవచ్చు. అదే రచన పూర్తి కావడానికి ఐదు రోజులు కాని, ఐదు నెలలు కాని పట్టవచ్చు. అది ఆ రచయితకు, తీసుకున్న వస్తువుకి, శిల్పానికి మధ్యన జరిగే ప్రచ్ఛన్న యుద్ధంపై ఆధారపడి ఉంటుంది. రచయితకు రచన పూర్తయ్యాక కాని ఆ మధనం తెలియదు.మన ప్రమేయం లేకుండానే రచన జరిగిపోతుంది. ఇది నిజంగా నిజం. నాలాంటి వారికి రచన వెనుక ఇంత పరోక్ష సంఘర్షణ ఉంటుందని తెలియదు. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రభ, నవ మల్లెతీగ వంటి వివిధ పత్రికలలో వస్తున్న సాగర్ శ్రీరామ కవచం గారి ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు వ్యాసాలు చదివిన తరువాతనే రచనలో వస్తుశిల్పాలు రూపాంతరం చెందే క్రమంలో శకలాలుగా మారడం, అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు అని తెలిసింది.
సిద్ధాంత పరమైన పుస్తకాలకు మరో సిద్ధాంతకర్తలే ముందు మాటలు రాయాలన్న నిబంధనలు ఉండాలనడం సబబు కాదు. రచనలో తాదాత్మ్యం చెందే రచయిత తన స్వీయ అనుభూతిని గురించి చెప్పగలిగితే చాలన్నది నా అభిప్రాయం. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సాగర్ శ్రీరామ కవచం గారు చెప్పిన ప్రతిమాటా అక్షరసత్యం. సామాన్యులమైన నాలాంటి ఎందరికో ఈ పుస్తకం ఓ దిక్సూచి వంటిది. సాగర్ గారు చెప్పిన ప్రతి విషయము మేము రాసే ప్రతి చిన్న రచనలోనూ మాకు అనుభవమే.
సాగర్ గారు చెప్పిన ప్రతిమాటా ఇంతకు మునుపు ఉన్న విషయమే అయినప్పుడు గత మూడు సంవత్సరాలుగా ఆయన రాస్తున్న వ్యాసాలు ఎవరూ ఎందుకు ఖండించలేదు? పోనీ మీకందరికి తెలిసిన విషయమే కదా ఇదంతా. మరి మీరెందుకు ముందుగా చెప్పలేదీ విషయాన్ని. విమర్శకులు ఎందరో ఉన్నారు కదా. ఎవరూ స్పందించలేదెందుకు? ఆపిల్ పైకి విసిరితే క్రిందికి పడటమెలా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతమైందో, అలాగే వస్తుశిల్పాలు శకలాలుగా రచనలో చేరడం కూడా అంతే. అదే సాగర్ గారి ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సిద్ధాంతం.
వర్గము
కబుర్లు
కాలం వెంబడి కలం...37
అమ్మాయ్ ఎన్ని డబ్బులు తెచ్చుకున్నావని అడిగితే 200ల డాలర్లు తెచ్చుకున్నానన్నయ్యా అన్నాను. సరిపోతాయిలే అమ్మాయ్ అంటే సరిపోతాయన్నయ్యా అన్నాను. తర్వాత రెండు రోజులకి అన్నయ్య పారాడైమ్ కంపెనీ గెస్ట్ హౌస్ కి తీసుకెళుతూ దారిలో షాప్ కి తీసుకెళ్ళి తినడానికి, వండుకోవడానికి కావాల్సిన సరుకులన్నీ కొనిపెట్టి గెస్ట్ హౌస్ లో దించి అమ్మాయ్ అమెరికాలో నీ కొత్త కాపురం మెుదలయ్యింది అని నవ్వుతూ...
అయ్యెా అన్నీ కొన్నాం కాని బియ్యం మర్చిపోయామన్నాడు. కంపెనీ అతను నాకు పేరు గుర్తు లేదు తనకి అన్నయ్య చెప్పాడు బియ్యం తెచ్చి ఇవ్వమని. వాళ్ళతో కూడా నా గురించి జాగ్రత్తలు చెప్పి, అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు. రెండు రోజులలో మరొకామె వస్తారు గెస్ట్ హౌస్ కి, భయం లేదని చెప్పి, రేపు బియ్యం తెచ్చిస్తానని చెప్పి అతను వెళుతూ, తలుపు ఎవరు కొట్టినా వెంటనే తీయకండి, కీ హోల్ నుండి చూసి, విషయం అడిగి తీయండి. అయినా ఎవరైనా వచ్చేముందు మేము మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వెళిపోయాడు.
మెుదటిరోజు ఒంటరిగా అమెరికాలో జీవితం మెుదలయ్యింది. రూమ్ లో బెడ్ ఉంది పరుపుతో సహా. నేను తెచ్చుకున్న దుప్పటి, దిండు కవర్ వేసుకున్నా. ఏమీ తినబుద్ది కాలేదు. గెస్ట్ హౌస్ లో లాండ్ ఫోన్, డెస్క్ టాప్ కంప్యూటర్ ఉన్నాయి. రూమ్ లో పడుకున్నా. ఎందుకో చాలా భయం వేసింది. ఎటు నుండి ఎవరు వస్తారో అని. అస్సలు ఇక రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు నిన్నటి అతనే బాసుమతి బియ్యం బాగ్ తెచ్చిచ్చాడు. 20 డాలర్లు అన్నాడు. అలా నేను ఇండియా నుండి తీసుకువెళ్ళిన 200 డాలర్లలో 20 డాలర్లు మొదటి ఖర్చన్న మాట. గెస్ట్ హౌస్ లో రెండోరోజు నుండి హాల్లో సోఫాలో పడుకోవడం, గ్లాస్ కి ఉన్న బ్లైండ్స్ కొద్దిగా ఓపెన్ చేసి బయటకి చూడటంతోనే సరిపోయేది రాత్రంతా. పొద్దున్నే ఎండ చూడగానే భలే సంతోషం వేసేది. ఏదో ఎప్పుడో దూరమైన నేస్తం మళ్లీ దొరికినట్లుగా. ఆ ఎండ చూసి బయటకి వెళ్ళాలనిపించేది. వెళితే చలి బాగా వేసి ఉండలేకపోయేదాన్ని. ఏదో వండుకోవడం, తినడం, చదువుకోవడం, మా కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ ఫోన్లు చేయడంతో అలా కంపెనీ గెస్ట్ హౌస్ జీవితం గడుస్తోంది. ఈ లోపల ఒకావిడ గెస్ట్ హౌస్ కి వచ్చింది. హమ్మయ్య నాకు కంపెని దొరికింది అనుకున్నా. అంతలోనే వీకెండ్ వచ్చేసింది.
కాలేజ్ టైమ్ లో పెద్దగా మాట్లాడని సతీష్ రోజూ ఫోన్ చేస్తూ, నాకు హోమ్ సిక్ లేకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు. అమెరికాలో జాబ్స్ ఎలా ఉంటాయెా, ఎలా మాట్లాడాలో ఇలా అన్ని చెప్తుా ఉండేవాడు. నేనున్న బాల్టిమెార్ కి కాస్త దగ్గరలో ఉన్న కళ్యాణ్ కి ఫోన్ చేసి నన్ను వీకెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళమని సతీష్ చెప్తే కళ్యాణ్, వాళ్ళావిడా వచ్చి వాళ్ళింటికి తీసుకువెళుతూ, దారిలో డ్రైవింగ్ కబుర్లు..బ్లైండ్ స్పాట్, లేన్స్ ఛేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ వేయడము, స్పీడ్ లిమిట్స్ లాంటివి చెప్పాడు. టన్నెల్ లోపల నుండి వెళ్ళేటప్పుడు పైన నీళ్ళుంటాయి, నీళ్ళలోనుండి సొరంగం ఇది అని చెప్తుంటే భలే ఆశ్చర్యంగా ఆ వింతలను, లైటింగ్ లను చూడటం నావంతైంది. కళ్యాణ్ మాట్లాడుతూ చూసావా మంజూ ప్రపంచం చాలా చిన్నది, మనల్ని ఇలా కలిపింది. అదే ఇండియాలో ఉంటే కలిసేవాళ్ళం కాదేమెానంటూ..మన క్లాస్ మేట్స్ ఫణి ఇంకా కొందరు వర్జీనియాలోనే ఉన్నారని చెప్తూ, కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం కళ్యాణ్ వాళ్ళింటికి చేరాం.
కళ్యాణ్ వాళ్ళింట్లో ఆ రాత్రి భోజనాలయ్యాక మా కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ, ఆ మాటల్లోనే నా పెళ్ళి కబుర్లు చెప్తే, అంతా విని కళ్యాణ్ బాధ పడుతుంటే వాళ్ళావిడ వింతగా చూస్తుంటే...తనకేమీ తెలియదు, మేమందరం బాగా చూసుకునేవాళ్ళం, చాలా అమాయకురాలని కళ్యాణ్ చెప్పడం..ఇలా ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాం చాలాసేపు. మరుసటి రోజు జమ్ షో ఉందని చూద్దామని వెళ్ళాం. అక్కడికే ఫణి వాళ్ళు కూడా వచ్చారు. నేను ఏమీ కొనలేదు. నాకు షాపింగ్ చేయడం పెద్దగా ఇష్టం కూడా ఉండదు. అలా వీకెండ్ గడిచిపోయింది. నన్ను మళ్ళీ గెస్ట్ హౌస్ లో దించేసారు. మరో వారం మెుదలయ్యింది.
నాతోపాటు గెస్ట్ హౌస్ లో మరొక తెలుగావిడ ఉంది. హైదరాబాదు ఆమెది. తన ఫామిలి వేరే చోట ఉన్నారు. ఆవిడ అమెరికా వచ్చి చాలా రోజులయింది. ఆమెను మార్కెటింగ్ చేయడం మెుదలుపెట్టారు పారాడైమ్ కంపెనీ వాళ్ళు. ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి ఆమెకు, లేదా ఆమె ఫోన్ లో బిజీగా ఉండేది. నాకు ఫోన్, కంప్యూటర్ కూడా సరిగా ఇచ్చేది కాదు. ఆవిడ దయదలచి ఇస్తేనేనన్న మాట. ఆవిడ మంచి మాటకారి, గడసరి కూడానూ.
ఈలోపల మరొక కన్నడ ఫామిలీ పరమేశ్వరన్ వాళ్ళు ఇండియా నుండి వచ్చారు. కాస్త సందడిగానే ఉంది నాకు. పరమేశ్వరన్ వాళ్ళ ఫ్రెండ్ సీతారాం తన వైఫ్ శిరీషతో వీళ్ళని కలవడానికి వచ్చి నాకు కూడా బాగా దగ్గరైపోయారు. వీకెండ్ వాళ్ళింటికి మమ్మల్ని ముగ్గురిని భోజనానికి పిలిచారు. హైదరాబాదు ఆవిడ రాలేదు. అలా శిరీష నాకు బాగా దగ్గరైంది. తర్వాత పరమేశ్వరన్ కు జాబ్ వచ్చి వేరే చోటికి వెళిపోయారు. ఈవిడ నన్ను బాగా టార్చర్ పెడుతూనే ఉంది. సతీష్ ఫోన్ చేసినా మాట్లాడటానికి వీలయ్యేది కాదు. ఆమెకు సెల్ ఫోన్ ఉన్నా కూడా లాండ్ లైన్ ఇచ్చేది కాదు. అప్పట్లో కంప్యూటర్ లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే ఉండేది.
నరసరాజు అంకుల్ ఫోన్ చేసినప్పుడు డబ్బుల గురించి అడిగారు. ఉన్నాయి నా దగ్గర అంటే ఎంత తెచ్చుకున్నావన్నారు. చెప్తే వెంటనే అడ్రస్ తీసుకుని 1000 డాలర్స్ పంపించారు. ఇంతలో థాంక్స్ గివింగ్ వచ్చింది. నరసరాజు అంకుల్ ఫోన్ చేసి రాజగోపాలరావు వాళ్ళింటికి వెళుతున్నావా అంటే అన్నయ్య పండగ గురించి ఇంకా ఫోన్ చేయలేదని చెప్పాను. టికెట్ బుక్ చేస్తాను సెయింట్ లూయీస్ రమ్మంటే, శిరీష ఫోన్ చేసి వాళ్ళింటికి రమ్మందని చెప్పాను. సరే నీ ఇష్టమన్నారు. నేను శిరీష వాళ్ళింటికి బయలుదేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడు. అమ్మాయ్ నేను వస్తున్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి అని. నేను చెప్పాను, శిరీష వాళ్ళింటికి వెళుతున్నానని. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన సీతారాంతో మాట్లాడి, వాళ్ళింటికి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు అన్నయ్య. టర్కీని చూడటం అప్పుడే. వదినని ఇదేంటని అడిగితే టర్కీ అని చెప్తూ, అమెరికన్స్ కు టైమ్ ఉండదు కదా అందుకే సంవత్సరంలో ఓ రోజు దేవుడికి థాంక్స్ చెప్పడానికి ఈ థాంక్స్ గివింగ్ ని కేటాయించారని చెప్పింది. అన్నయ్య వాళ్ళిల్లంతా ఫ్రెండ్స్ తో నిండిపోయింది. మా ఊరమ్మాయి మరొకామెను అన్నయ్య తన ఫ్రెండ్స్ కి పరిచయం చేసాడు. నా మనసు కాస్త చిన్నబోయిన మాట నిజం. కాని నేను ఇంట్లో అమ్మాయినేగా అని వేసుకున్నాను. అందరు తలొక వంటా చేసుకుని వచ్చారు. సందడిగా థాంక్స్ గివింగ్ అమెరికాలో మెుదటి పండుగ గడిచిపోయింది.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
11, జనవరి 2021, సోమవారం
కాలం వెంబడి కలం..36
అమెరికాలో మెుదటిరోజు నిద్ర గురించి..అన్నయ్య వాళ్ళ అమ్మాయి సుమి రూమ్ లో పడుకున్నా. జట్ లాగ్ కదా నిద్ర రాలేదు. అదీనూ అంతా కొత్త కొత్తగా ఉంది. ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పోయా. పొద్దున్నే నిద్ర లేచే సరికే వదిన వర్క్ కి వెళిపోయింది. అన్నయ్య కాఫీ కలిపిస్తూ ఎలా కలుపుకోవాలో చూపించాడు. మైక్రోవేవ్ ఎలా వాడాలో చూపించాడు. టిఫిన్ గురించి చెప్తూ సిరియల్స్ (cereals) ఎలా పాలల్లో కలుపుకుని తినాలో చెప్పాడు. తర్వాత సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయడానికి తీసుకువెళ్ళి, అక్కడే స్టేట్ ఐడికి కూడా అప్లై చేయించాడు. స్టేట్ ఐడి ఉంటే ప్రతిసారి పాస్ పోర్ట్ చూపించనక్కర్లేదు ఫోటో ఐడెంటిటి కోసం. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా అందుకన్న మాట స్టేట్ ఐడి.
ఫోన్ ఇండియాకి ఎలా చేయాలో చెప్పాడు. అమ్మా వాళ్ళతో మాట్లాడించాడు. అమెరికాలో నా ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ చాలామంది అప్పటికే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి అందరికి అన్నయ్య వాళ్ళ ఇంటి నెంబరు పెట్టి ఈ మెయిల్ చేసాను. అలా అమెరికాలో కమ్యూనికేషన్ మెుదలైంది.
నేను అమెరికాకి వెళ్ళింది GIS కంపెనీ H1B తో. వాళ్ళు జాబ్ చూడాలంటే డబ్బులు అడిగారని నరసరాజు అంకుల్ జాబ్ మేం చూసుకుంటాం, H1B చేయండి చాలు అన్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి పారాడైమ్ ఇన్ఫోటెక్ కంపెనీ శ్రీధర్ ని జాబ్ అడిగితే సరే చూస్తామన్నారు. నేను ఇండియా నుండి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు VC++ కూడా నేర్చుకుని రండి అని చెప్పారు.
అన్నయ్య బాల్టిమెార్ లో ఉన్న పారాడైమ్ కంపెనీ ఆఫీస్ కి తీసుకువెళ్ళాడు. అప్పుడే ఓ క్లయింట్ వస్తే ఇంటర్వూ ఎరేంజ్ చేసారు. నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలెండి అప్పటికే. దానిలో 6 నెలల ఎక్స్పీరియన్స్ పెట్టమన్నారు కూడా. క్లయింట్ అడిగితే ఫ్యూ డేస్ అయింది వచ్చి అని చెప్పాను. తను నవ్వి మరి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా అంటే.. అలా పెట్టకపోతే మీరు ఇంటర్వూకి పిలవరు కదా అన్నా. క్లయింట్ నవ్వేసి గుడ్ లక్ చెప్పాడు. బయటికి వచ్చాక వీళ్ళని అడిగితే మీకు అలవాటు అవుతుందని ఇలా చేసామన్నారు. గెస్ట్ హౌస్ ఉంది కంపెనీది, మీరు వచ్చేయండి అన్నారు. 2 రోజులలో పంపిస్తాను చెప్పి అన్నయ్య ఇంటికి తీసుకువచ్చాడు.
కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలన్న సత్యానికి అలవాటు పడటం నేర్చుకోవడం మెుదలయ్యింది కాస్త కాస్త.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
8, జనవరి 2021, శుక్రవారం
వెసులుబాటు...!!
ఏకాంతమూ వరమే అయ్యింది
నిశ్శబ్ధంతో స్నేహం చేసినప్పుడు
మౌనం మాటాడుతునే ఉంటుంది
మనసున్న మనుష్యులతో మనమున్నప్పుడు
చీకటీ చిత్రాలు గీస్తుంది
ఆశల వెలుగురవ్వలను గుప్పిస్తూ
మమకారమూ మైమరిచిపోతుంది
అల్ప సంతోషాల మాయల వలయంలో పడి
అహంకారమూ తల ఎగరేస్తుంది
ఆత్మాభిమానాన్ని తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం లేక
కొన్ని జీవితాలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి
సమాధానాలు తెలిసినా చెప్పే వెసులుబాటు లేక...!!
వర్గము
కవితలు
4, జనవరి 2021, సోమవారం
కాలం వెంబడి కలం...35
ఒకప్పుడు అమెరికా అంటే భూతల స్వర్గమన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అమెరికా నుండి ఎవరైనా వచ్చారంటే, వారిని ఎంత అపురూపంగా చూసేవారో మనందరికి తెలుసు. నా వరకు నాకు మూడేళ్ళప్పుడు అమెరికా పేరు పరిచయం. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనే నాకు పానాసానిక్ బ్లూ కలర్ రౌండ్ షేప్ రేడియో మా గోపాలరావు అన్నయ్య ఇవ్వడం బాగా గుర్తు. వాళ్ళ పాప మమతతో ఆడుకోవడమూ బాగా జ్ఞాపకమే. మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన అమెరికా నుండి వస్తే ఎంత గొప్పగా ఉండేదో. చిన్నప్పుడు మా ఆటల్లో కూడా వాళ్ళలా అమెరికా వెళ్ళినట్లుగా, డాక్టర్ గా వారిని అనుకరిస్తూ ఆడుకునేవాళ్ళం. బహుశా నా అమెరికా ప్రయాణానికి బీజం అక్కడే పడి ఉండవచ్చు.
సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, ఆ రోజుల్లో ఆడపిల్ల అదీ పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవడమే ఓ సాహసం. ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో ఎమ్ ఎస్ చేయాలన్న కోరికతో జి ఆర్ ఈ, టోఫెల్ రాసి క్వాలిఫై అయ్యి కూడా ఆర్థిక వెసులుబాటు లేక అమెరికా కలకు తాత్కాలిక విరామం ఇచ్చినా...అమెరికా వెళ్ళాలన్న నా కోరికను తీర్చడానికి మా రాధ పెదనాన్న తన చుట్టాన్ని అడిగితే, వాళ్ళు AS/400 చేయమనండి తీసుకువెళతాం అని చెప్తే.. అప్పట్లో అందరు IBM Mainframes చేస్తుంటే..ఎలక్ట్రానిక్స్ చదివిన నేను బెంగుళూరులో CMC లో ఈ కోర్స్ చేసి, అనుకోని కారణాల వలన పెళ్ళి, తర్వాత మద్రాస్ లో ఉద్యోగం, బాబు పుట్టడం, లెక్చరర్ గా కొన్ని నెలలు, తర్వాత నా అమెరికా సన్నాహాలకి నాన్న ఫ్రెండ్ మంతెన నరసరాజు అంకుల్ సాయం చేయడం, H1 రావడం, టికెట్ కూడ అంకుల్ తీసుకోవడంతో సంవత్సరం నర్ర బాబుని, అందరిని వదిలి అమెరికా ప్రయాణం డాలర్ల కోసం మెుదలయ్యింది.
ఇక్కడ మరో నాలుగు మాటలు చెప్పాలి. H1B వీసా కోసం నా మార్క్స్ లిస్ట్లన్నీ.. 10, ఇంటర్, ఇంజనీరింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ పేపర్స్ అమెరికాకి విజయవాడలో పోస్టాఫీసు లో పోస్ట్ చేయడం. ఆ తర్వాత హైదరాబాదులో 6 నెలలు JAVA, ASP, VC++ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ కూడ నేర్చుకున్నా. ఓ రోజు వీసా పేపర్స్ వచ్చాయని కబురు వస్తే అమీర్పేట్ లో ఆఫీస్ కి వెళ్ళి పేపర్స్ తీసుకున్నా. తర్వాత 4,5 రోజుల్లోనే వీసా స్టాంపిగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్, ఒరిజినల్ పేపర్స్ అన్నీ తీసుకుని మద్రాస్ వెళ్ళాం నేను, మావారు. బాంక్లో 2 డి డి లు తీసుకున్నాం.
హోటల్ నుండి రాత్రి రెండింటికి వెళ్ళి క్యూలో నించోవడం, తర్వాత నేను లోపలికి వెళ్ళడం, అప్లికేషన్ పూర్తి చేయడం, వీసా వస్తుందో, రాదోనన్న టెన్షన్ ఓ పక్క.. ఇలా ఎవరి గొడవలో వాళ్ళం ఉన్నాం. నా టోకెన్ నెంబర్ పిలవగానే వాళ్ళు చెప్పిన విండో దగ్గరకు వెళ్ళాను. లేడి ఉన్నారు కౌంటర్లో. వాళ్ళు ముందే చెప్పిన పేపర్స్ అన్నీ వాళ్ళిచ్చిన ఫైల్ లో పెట్టి ఇచ్చాను. వర్క్ చేయడానికి వెళుతున్నారా అని అడిగారు. అవునని చెప్పాను. ఫీజ్ కట్టి వెళ్ళండి అని చెప్పారు. నిజమా కాదా అని మరోసారి అడిగాను. ఆవిడ నవ్వి కౌంటర్లో ఫీజ్ కట్టండి. పాస్పోర్ట్ మీరిచ్చిన అడ్రెస్ కి పంపిస్తామన్నారు. భలే సంతోషం వేసింది. ఎందుకంటే పాపం నా ముందు వాళ్ళకి ఇవ్వలేదు. కౌంటర్లో లేడి ఉంటే వీసా ఇవ్వడంలేదావిడ అని బయట భయపెట్టారు. మెుత్తానికి మరుసటిరోజు నేనిచ్చిన మా పాతింటి అడ్రస్ కి నా పాస్పోర్ట్ వచ్చింది. మేం అది తీసుకుని మా ఆఫీస్కెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి తిరిగి మా ఊరు వచ్చేసాము.
మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బట్టల షాపింగ్, కావాల్సిన పుస్తకాలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా. ప్రయాణం దగ్గర పడే సమయానికి బాగా జ్వరం వచ్చి ఓ వారం టికెట్ పోస్ట్ పోన్ చేయించుకున్నా. రెండు పెద్ద సూట్కేస్ లు, ఓ చిన్న సూట్కేస్, హాండ్ బాగ్ లలో లగేజ్ సర్ధాలింక. 5,6 జతలు పాంట్, షర్ట్ లు, 4 చూడీదార్లు, 7,8 చీరలు, నైటీలు, లెదర్ జాకెట్...ఇలా అవసరమైన బట్టలు, దుప్పట్లు అన్నీ కలిపి 22 కేజీలు ఒక సూట్కేస్లో, చిన్న చిన్న వంట సామాన్లు, పచ్చళ్ళు, కారాలు, పుస్తకాలు మరోదానిలో 22 కేజీలు సర్ది, ఓ రెండు జతలు, డాక్యుమెంట్స్ అన్నీ హాండ్ లగేజ్ లో 4,5 కేజీలు సర్ధేశాం. హాండ్ బాగ్ లో వీసా పేపర్స్, పాస్పోర్ట్, ఫోన్ నెంబర్ బుక్, సోప్, బ్రష్, పేస్ట్ ఇలా అవసరమైనవి పెట్టుకున్నా. ఇక ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉన్నా తప్పని ప్రయాణమాయే.
వర్షంలో ఇంటి నుండి బయలుదేరి పినాకినిలో మద్రాస్ చేరుకున్నాము. హోటల్ లో ఉండి ఫ్లైట్ టైమ్ కి ఓ 3 గంటల ముందు మద్రాస్ ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్ళగానే ముందు బాగేజ్ అంతా స్కాన్ చేసాక, రూపాయలను డాలర్లుగా మార్చుకుని, అది పాస్పోర్ట్ లో ఎంటర్ చేయించుకున్నా. మనం లగేజ్ సర్దుకునేటప్పుడే మన టికెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని మన లగేజ్ సర్దుకోవాలి. మనం బాగేజ్ లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, హాండ్ లగేజ్ లో ఏం తీసుకువెళ్ళాలన్నది, ఎంత వెయిట్ తీసుకువెళ్ళాలన్నది క్లియర్ గా రాసి ఉంటుంది. నిబంధనలకు మించి ఉన్న లగేజ్ కాని, తీసుకు వెళ్ళకూడని వస్తువులు కాని తీసేస్తారు. మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే కాస్త తక్కువ వెయిట్ తో సర్దుకోవాలి. మెుదటిసారి కదా..నాకు కాస్త భయం అనిపించినా అన్ని సరిగానే ఉండటంతో లగేజ్ తీయాల్సిన ఇబ్బంది రాలేదు. మనం వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్ళనక్కరలేదు.
బ్రిటీష్ ఎయిర్ వేస్ లో బాగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని, చివరిసారి అందరికి వీడ్కోలు చెప్పి ఇమ్మిగ్రేషన్ చెక్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళడం, బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ చూసుకుని లాంజ్ లో కూర్చున్నా. మా హాస్టల్ అమ్మాయి కనబడితే పలకరించా. తను కూడా అదే ఫ్లయిట్ లో లండన్ వరకు అంది. కాస్త ఎగ్జయిట్ మెంట్, కొద్దిగా బెరుకుతో, అందరిని వదిలి వెళుతున్న దిగులుతో చిన్నప్పుడు ఆకాశంలోనూ, హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనూ చూసిన విమానం నేనూ ఎక్కబోతున్నానన్న ఆనందం కాస్త...ఇలా ఆలోచిస్తుండగానే ఎనౌన్స్ మెంట్ వినబడింది..
గేట్ లో నుండి లోపలికి వెళ్ళడం, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళగానే ఫ్లైట్ లోపలకి చేరడం..ఎయిర్ హోస్టెస్ స్వాగతంతో అప్పుడే ఫ్లైట్ లోనికి తెలియకుండానే వచ్చేసాన్న సంబరం. సీట్ చూపెట్టడం, హాండ్ లగేజ్ పైన సర్ది, కూర్చోవడం జరిగిపోయాయి. టేకాఫ్ ముందు జాగ్రత్తలు చెప్తూ, సీట్ బెల్ట్ పెట్టుకోమనడం చకచక జరిగిపోయాయి. నా పక్కన ఓ వైపు తమిళ్ అమ్మాయనుకుంటా తను కూడా నేను వెళ్ళాల్సిన వాషింగ్టన్ డిసి కే అని చెప్పింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మరోవైపు ఎవరో పలకరించారు.. ఆ అబ్బాయి లండన్ అని చెప్పాడు. నార్త్ ఇండియన్ అనుకుంటా.
కాసేపయ్యాక ముందు నాకు టిఫిన్ తెచ్చింది ఎయిర్ హోస్టెస్. అదేంటబ్బా ఎవరికి పెట్టకుండా నాకే ముందు పెడుతోంది అనుకున్నా. సగం కాలిన ఆమ్లెట్ ,అది చూడగానే నచ్చలేదు...టిఫిన్ మార్చమంటే మార్చి, తర్వాత చెప్పింది "మీరు హిందూ మీల్ అని పెట్టారు, ఈసారి నుండి ఇండియన్ మీల్ అని పెట్టండి”.
నాకు విండో పక్క సీట్ రాలేదు.. ఆకాశంలో వెళుతూ ఆకాశాన్ని, కింద సముద్రాన్ని చూడలేకపోయానే అనుకున్నా.. ఏదో కాస్త అప్పుడప్పుడూ దూరంగా పక్కవాళ్ళ విండోలో నుండి చూసేసాను. నా సంతోషాన్ని చూసి పక్కమ్మాయి... ఫస్ట్ టైమ్ కదా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జైట్మెంట్ అని నవ్వింది. నేనూ నవ్వేసి తెచ్చుకున్న పుస్తకం "ది ఫ్యూచర్" నవల్లో తలదూర్చాను కాసేపు. తర్వాత నిద్రపోయా.
మధ్యలో లంచ్. అదీ నచ్చలేదు హాఫ్ బాయిల్డ్ చికెన్.ఏదో కాస్త తిన్నాననిపించి జూస్ తాగేసా. తర్వాత లండన్ ఎయిర్ పోర్ట్ లో దిగడము, ఫ్లైట్ క్లీనింగ్, మళ్ళీ విమాన ప్రయాణం. అమెరికాలో లాండ్ అయ్యే ముందు ఫ్లైట్ లో ఓ ఫామ్ ఇచ్చారు. అది ఫిల్ చేసి ఉంచుకోవాలి. తెలియకపోతే పక్కవారిని, లేదా ఎయిర్హోస్టెస్ ని అడిగితే చాలు. దానిని I -94 అంటారు.
మెుత్తానికి భూతల స్వర్గమనే అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో దిగడం, అందరితోపాటు నేనూ బస్ ఎక్కడం, ఇమ్మిగ్రేషన్ చెక్ లో I -94 మీద, మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇవ్వడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, అక్కడి నుండి బయటబడి, లగేజ్ ఎక్కడా అని వెదుక్కుంటూ, నా లగేజ్ గుర్తు పట్టగలనో, లేదో అని అనుమానంగా అనుకుంటూ... అయినా పెద్ద అక్షరాలతో ప్రింట్ తీసి మరీ అంటించిన నా లగేజ్ కదా..గుర్తు పట్టేసా.
మెుత్తానికి నా 2 సూట్కేస్ లు, హాండ్ లగేజ్ తో బయటకు రాగానే అమ్మాయ్ మంజూ అంటూ చిరపరిచితమైన గోపాలరావు అన్నయ్య పిలుపు. గుర్తు పడతావో లేదో అనుకున్నానన్నయ్యా అంటే.. నన్ను నువ్వు గుర్తు పట్టకుండా ఉంటావా అని అన్నయ్య అనడం.. నేనెందుకు గుర్తు పట్టనూ అంటే.. నేను అంతేనమ్మాయ్ అని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి లగేజ్ కార్ లో సర్ది ముందు సీట్ లో కూర్చున్న తర్వాత ముందుగా కార్ లో కూర్చున్న వెంటనే చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకోవడం అని చెప్పి చూపించాడు.
సిరివెన్నెల పాటలు పెట్టి, నేనేమి మారలేదమ్మాయ్, మీరెందుకలా అనుకున్నారని అంటూ, అందరి కబుర్లు అడుగుతూ, తనూ కబుర్లు చెప్తూ, మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి తీసుకువెళ్ళి, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి వాష్ రూమ్ లో వేడి, చన్నీళ్ళు ఎలా వస్తాయెా చూపించాడు. తర్వాత ఇంటికి వచ్చాం. రాగానే వదిన అలసిపోయి ఉంటారు ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోమని, బాత్ టబ్ అవి చూపించి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రూమ్ చూపించి నిద్ర పొమ్మంది. వాళ్ళిద్దరు బాగా బిజీ డాక్టర్స్. పిల్లలు చదువు కుంటున్నారు అప్పుడు.
మనం కాదన్నా మనల్ని కాదనలేని వారే పుట్టింటివారు. పది రోజుల పసిగుడ్డుతో బయటికి పంపినవారికి, అవసరానికి అన్నీ తామై ఆదుకున్న పుట్టింటి వారికి తేడా ఇదే. పెళ్లి చేసి లెక్క చెప్పినదొకరైతే, నేను నిలదొక్కుకోవడానికి ఖర్చు ఎంతైందో లెక్క చూడనివారొకరు. మా ఖర్చులు భరించడమే కాకుండా, నా బిడ్డను, మా వారిని జాగ్రత్తగా చూసుకున్నది ఎవరనేది అందరికి తెలిసినదే. నా బిడ్డలు ఈరోజుకి కూడా వారి చేతుల మీదుగా ఓ జుబ్బా కూడా ఎరుగరు. అమ్మ తన గొలుసు చెడగొట్టి మౌర్యకు వత్తులు, గొలుసులు చేయించింది. అది తేడా అమ్మకు, అవతలి వారికి.
మనం కష్టపెట్టినా, మన కోపాన్ని కూడా ప్రేమగా భరించేవారే మనవారు.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో.....
వర్గము
ముచ్చట్లు
3, జనవరి 2021, ఆదివారం
మరువకు...!!
నేను
నా
అని నువ్వనుకుంటూ
మేము
మన
అనుకోవాలందరూ అంటే ఎలా?
గుర్తింపు
నీది
గౌరవప్రదమని
డబ్బుతోనో
సిఫార్సులతోనో
ఎదుటివారిదని అనుకుంటే ఎలా?
బంధం
బాధ్యత
విలువ తెలియాలంటే
అమ్మ
దిద్దించిన
అక్షరజ్ఞానం గుర్తుండాలంతే
మనిషిని
మనసును
గుర్తించాలంటే
నిజాయితీ గల
వ్యక్తిత్వం
మనకుండాలంతే
దూరం
దగ్గర
ఎవరికయినా ఒకటే
మనమేదిస్తే
అదే తిరిగి వస్తుందని
మర్చిపోతే జ్ఞాపకం చేసుకో
లెక్క
సరిజేయడానికి
తలరాత రాసే విధాత ఉన్నాడని మరువకు...!!
వర్గము
కవితలు
2, జనవరి 2021, శనివారం
వరాల జల్లు..!!
చేజారిన స్వప్నం
కాలం నవ్వుల్లో
కలవలేక వెలితి పడింది
మనిషితనం
మర్చిపోయిన వితండవాదం
వింత పోకడలు పోతోంది
మనసు రాల్చే కన్నీరు
కనుకొలుకులను దాటలేని
నిస్సహాయతతో మిగిలింది
అక్కున చేర్చుకోవడానికి
అక్కరకు రాని బంధాలన్నీ
ఆమడ దూరంలోనే ఆగిపోయాయి
అహం విదిల్చిన
విషం చిమ్మిన వికృతాకారం
వికటాట్టహాసం చేస్తోంది
పరిహసించిన తలరాత
పర్యవసానం తెలియక
తల్లడిల్లుతూ తలపోస్తోంది
కలానికి కాలానికి
కుదిరిన లంకెతో
అక్షరం వరాల జల్లు కురిపించింది...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)