4, జనవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం...35

  
      ఒకప్పుడు అమెరికా అంటే భూతల స్వర్గమన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అమెరికా నుండి ఎవరైనా వచ్చారంటే, వారిని ఎంత అపురూపంగా చూసేవారో మనందరికి తెలుసు. నా వరకు నాకు మూడేళ్ళప్పుడు అమెరికా పేరు పరిచయం. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనే నాకు పానాసానిక్ బ్లూ కలర్ రౌండ్ షేప్ రేడియో మా గోపాలరావు అన్నయ్య ఇవ్వడం బాగా గుర్తు. వాళ్ళ పాప మమతతో ఆడుకోవడమూ బాగా జ్ఞాపకమే. మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన అమెరికా నుండి వస్తే ఎంత గొప్పగా ఉండేదో. చిన్నప్పుడు మా ఆటల్లో కూడా వాళ్ళలా అమెరికా వెళ్ళినట్లుగా, డాక్టర్ గా  వారిని అనుకరిస్తూ ఆడుకునేవాళ్ళం. బహుశా నా అమెరికా ప్రయాణానికి బీజం అక్కడే పడి ఉండవచ్చు.

            సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, ఆ రోజుల్లో ఆడపిల్ల అదీ పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవడమే ఓ సాహసం. ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో ఎమ్ ఎస్ చేయాలన్న కోరికతో జి ఆర్ ఈ, టోఫెల్ రాసి క్వాలిఫై అయ్యి కూడా ఆర్థిక వెసులుబాటు లేక అమెరికా కలకు తాత్కాలిక విరామం ఇచ్చినా...అమెరికా వెళ్ళాలన్న నా కోరికను తీర్చడానికి మా రాధ పెదనాన్న తన చుట్టాన్ని అడిగితే, వాళ్ళు AS/400 చేయమనండి తీసుకువెళతాం అని చెప్తే.. అప్పట్లో అందరు IBM Mainframes చేస్తుంటే..ఎలక్ట్రానిక్స్ చదివిన నేను బెంగుళూరులో CMC లో ఈ కోర్స్ చేసి, అనుకోని కారణాల వలన పెళ్ళి, తర్వాత మద్రాస్ లో ఉద్యోగం, బాబు పుట్టడం, లెక్చరర్ గా కొన్ని నెలలు, తర్వాత నా అమెరికా సన్నాహాలకి నాన్న ఫ్రెండ్ మంతెన నరసరాజు అంకుల్ సాయం చేయడం, H1 రావడం, టికెట్ కూడ అంకుల్ తీసుకోవడంతో సంవత్సరం నర్ర బాబుని, అందరిని వదిలి అమెరికా ప్రయాణం డాలర్ల కోసం మెుదలయ్యింది. 
           ఇక్కడ మరో నాలుగు మాటలు చెప్పాలి. H1B వీసా కోసం నా మార్క్స్ లిస్ట్లన్నీ.. 10, ఇంటర్, ఇంజనీరింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ పేపర్స్ అమెరికాకి విజయవాడలో పోస్టాఫీసు లో పోస్ట్ చేయడం. ఆ తర్వాత హైదరాబాదులో 6 నెలలు JAVA, ASP, VC++ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ కూడ నేర్చుకున్నా. ఓ రోజు వీసా పేపర్స్ వచ్చాయని కబురు వస్తే అమీర్పేట్ లో ఆఫీస్ కి వెళ్ళి పేపర్స్ తీసుకున్నా. తర్వాత 4,5 రోజుల్లోనే వీసా స్టాంపిగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్, ఒరిజినల్ పేపర్స్ అన్నీ తీసుకుని మద్రాస్ వెళ్ళాం నేను, మావారు. బాంక్లో 2 డి డి లు తీసుకున్నాం. 

          హోటల్ నుండి రాత్రి రెండింటికి వెళ్ళి క్యూలో నించోవడం, తర్వాత నేను లోపలికి వెళ్ళడం, అప్లికేషన్ పూర్తి చేయడం, వీసా వస్తుందో, రాదోనన్న టెన్షన్ ఓ పక్క.. ఇలా ఎవరి గొడవలో వాళ్ళం ఉన్నాం. నా టోకెన్ నెంబర్ పిలవగానే వాళ్ళు చెప్పిన విండో దగ్గరకు వెళ్ళాను. లేడి ఉన్నారు కౌంటర్లో. వాళ్ళు ముందే చెప్పిన  పేపర్స్ అన్నీ వాళ్ళిచ్చిన ఫైల్ లో పెట్టి ఇచ్చాను. వర్క్ చేయడానికి వెళుతున్నారా అని అడిగారు. అవునని చెప్పాను. ఫీజ్ కట్టి వెళ్ళండి అని చెప్పారు. నిజమా కాదా అని మరోసారి అడిగాను. ఆవిడ నవ్వి కౌంటర్లో ఫీజ్ కట్టండి. పాస్పోర్ట్ మీరిచ్చిన అడ్రెస్ కి పంపిస్తామన్నారు. భలే సంతోషం వేసింది. ఎందుకంటే పాపం నా ముందు వాళ్ళకి ఇవ్వలేదు. కౌంటర్లో లేడి ఉంటే వీసా ఇవ్వడంలేదావిడ అని బయట భయపెట్టారు. మెుత్తానికి మరుసటిరోజు నేనిచ్చిన మా పాతింటి అడ్రస్ కి నా పాస్పోర్ట్ వచ్చింది. మేం అది తీసుకుని మా ఆఫీస్కెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి తిరిగి మా ఊరు వచ్చేసాము.

          మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బట్టల షాపింగ్, కావాల్సిన పుస్తకాలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా. ప్రయాణం దగ్గర పడే సమయానికి బాగా జ్వరం వచ్చి ఓ వారం టికెట్ పోస్ట్ పోన్ చేయించుకున్నా. రెండు పెద్ద సూట్కేస్ లు, ఓ చిన్న సూట్కేస్, హాండ్ బాగ్ లలో లగేజ్ సర్ధాలింక. 5,6 జతలు పాంట్, షర్ట్ లు, 4 చూడీదార్లు, 7,8 చీరలు, నైటీలు, లెదర్ జాకెట్...ఇలా అవసరమైన బట్టలు, దుప్పట్లు అన్నీ కలిపి 22 కేజీలు ఒక సూట్కేస్లో, చిన్న చిన్న వంట సామాన్లు, పచ్చళ్ళు, కారాలు, పుస్తకాలు మరోదానిలో 22 కేజీలు సర్ది, ఓ రెండు జతలు, డాక్యుమెంట్స్ అన్నీ హాండ్ లగేజ్ లో 4,5 కేజీలు సర్ధేశాం. హాండ్ బాగ్ లో వీసా పేపర్స్, పాస్పోర్ట్, ఫోన్ నెంబర్ బుక్, సోప్, బ్రష్, పేస్ట్ ఇలా అవసరమైనవి పెట్టుకున్నా. ఇక ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉన్నా తప్పని ప్రయాణమాయే.

              వర్షంలో ఇంటి నుండి బయలుదేరి పినాకినిలో మద్రాస్ చేరుకున్నాము. హోటల్ లో ఉండి ఫ్లైట్ టైమ్ కి ఓ 3 గంటల ముందు మద్రాస్ ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్ళగానే ముందు బాగేజ్ అంతా స్కాన్ చేసాక, రూపాయలను డాలర్లుగా మార్చుకుని, అది పాస్పోర్ట్ లో ఎంటర్ చేయించుకున్నా. మనం లగేజ్ సర్దుకునేటప్పుడే మన టికెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని మన లగేజ్ సర్దుకోవాలి. మనం బాగేజ్ లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, హాండ్ లగేజ్ లో ఏం తీసుకువెళ్ళాలన్నది, ఎంత వెయిట్ తీసుకువెళ్ళాలన్నది క్లియర్ గా రాసి ఉంటుంది. నిబంధనలకు మించి ఉన్న లగేజ్ కాని, తీసుకు వెళ్ళకూడని వస్తువులు కాని తీసేస్తారు. మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే కాస్త తక్కువ వెయిట్ తో సర్దుకోవాలి. మెుదటిసారి కదా..నాకు కాస్త భయం అనిపించినా అన్ని సరిగానే ఉండటంతో లగేజ్ తీయాల్సిన ఇబ్బంది రాలేదు. మనం వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్ళనక్కరలేదు.

       బ్రిటీష్ ఎయిర్ వేస్ లో బాగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని, చివరిసారి అందరికి వీడ్కోలు చెప్పి ఇమ్మిగ్రేషన్ చెక్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళడం, బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ చూసుకుని లాంజ్ లో కూర్చున్నా. మా హాస్టల్ అమ్మాయి కనబడితే పలకరించా.  తను కూడా అదే ఫ్లయిట్ లో లండన్ వరకు అంది. కాస్త ఎగ్జయిట్ మెంట్, కొద్దిగా బెరుకుతో, అందరిని వదిలి వెళుతున్న దిగులుతో చిన్నప్పుడు ఆకాశంలోనూ,  హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లోనూ చూసిన విమానం నేనూ ఎక్కబోతున్నానన్న ఆనందం కాస్త...ఇలా ఆలోచిస్తుండగానే ఎనౌన్స్ మెంట్ వినబడింది..

         గేట్ లో నుండి లోపలికి వెళ్ళడం, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళగానే ఫ్లైట్ లోపలకి చేరడం..ఎయిర్ హోస్టెస్ స్వాగతంతో అప్పుడే ఫ్లైట్ లోనికి తెలియకుండానే వచ్చేసాన్న సంబరం. సీట్ చూపెట్టడం, హాండ్ లగేజ్ పైన సర్ది, కూర్చోవడం జరిగిపోయాయి. టేకాఫ్ ముందు జాగ్రత్తలు చెప్తూ, సీట్ బెల్ట్ పెట్టుకోమనడం చకచక జరిగిపోయాయి. నా పక్కన ఓ వైపు తమిళ్ అమ్మాయనుకుంటా తను కూడా నేను వెళ్ళాల్సిన వాషింగ్టన్ డిసి కే అని చెప్పింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మరోవైపు ఎవరో పలకరించారు.. ఆ అబ్బాయి లండన్ అని చెప్పాడు.  నార్త్ ఇండియన్ అనుకుంటా.  

       కాసేపయ్యాక ముందు నాకు టిఫిన్ తెచ్చింది ఎయిర్ హోస్టెస్. అదేంటబ్బా ఎవరికి పెట్టకుండా నాకే ముందు పెడుతోంది అనుకున్నా. సగం కాలిన ఆమ్లెట్ ,అది చూడగానే నచ్చలేదు...టిఫిన్ మార్చమంటే మార్చి, తర్వాత చెప్పింది "మీరు హిందూ మీల్ అని పెట్టారు, ఈసారి నుండి ఇండియన్ మీల్ అని పెట్టండి”.

        నాకు విండో పక్క సీట్ రాలేదు.. ఆకాశంలో వెళుతూ ఆకాశాన్ని, కింద సముద్రాన్ని చూడలేకపోయానే అనుకున్నా.. ఏదో కాస్త అప్పుడప్పుడూ దూరంగా పక్కవాళ్ళ విండోలో నుండి చూసేసాను. నా సంతోషాన్ని చూసి పక్కమ్మాయి... ఫస్ట్ టైమ్ కదా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జైట్మెంట్ అని నవ్వింది.  నేనూ నవ్వేసి తెచ్చుకున్న పుస్తకం "ది ఫ్యూచర్"  నవల్లో తలదూర్చాను కాసేపు. తర్వాత నిద్రపోయా.

మధ్యలో లంచ్. అదీ నచ్చలేదు హాఫ్ బాయిల్డ్ చికెన్.ఏదో కాస్త తిన్నాననిపించి జూస్ తాగేసా.  తర్వాత లండన్ ఎయిర్ పోర్ట్ లో దిగడము, ఫ్లైట్ క్లీనింగ్, మళ్ళీ విమాన ప్రయాణం. అమెరికాలో లాండ్ అయ్యే ముందు ఫ్లైట్ లో ఓ ఫామ్ ఇచ్చారు. అది ఫిల్ చేసి ఉంచుకోవాలి. తెలియకపోతే పక్కవారిని, లేదా ఎయిర్హోస్టెస్ ని అడిగితే చాలు. దానిని I -94 అంటారు.

      మెుత్తానికి భూతల స్వర్గమనే అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో దిగడం, అందరితోపాటు నేనూ బస్ ఎక్కడం, ఇమ్మిగ్రేషన్ చెక్ లో I -94 మీద, మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇవ్వడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని,  అక్కడి నుండి బయటబడి, లగేజ్ ఎక్కడా అని వెదుక్కుంటూ, నా లగేజ్ గుర్తు పట్టగలనో, లేదో అని అనుమానంగా అనుకుంటూ... అయినా పెద్ద అక్షరాలతో ప్రింట్ తీసి మరీ అంటించిన నా లగేజ్ కదా..గుర్తు పట్టేసా.

    మెుత్తానికి నా 2 సూట్కేస్ లు, హాండ్ లగేజ్ తో బయటకు రాగానే అమ్మాయ్ మంజూ అంటూ చిరపరిచితమైన గోపాలరావు అన్నయ్య పిలుపు. గుర్తు పడతావో లేదో అనుకున్నానన్నయ్యా అంటే.. నన్ను నువ్వు గుర్తు పట్టకుండా ఉంటావా అని అన్నయ్య అనడం.. నేనెందుకు గుర్తు పట్టనూ అంటే.. నేను అంతేనమ్మాయ్ అని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి లగేజ్ కార్ లో సర్ది ముందు సీట్ లో కూర్చున్న తర్వాత ముందుగా కార్ లో కూర్చున్న వెంటనే చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకోవడం అని చెప్పి చూపించాడు.

        సిరివెన్నెల పాటలు పెట్టి, నేనేమి మారలేదమ్మాయ్, మీరెందుకలా అనుకున్నారని అంటూ, అందరి కబుర్లు అడుగుతూ, తనూ కబుర్లు చెప్తూ, మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి తీసుకువెళ్ళి, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి వాష్ రూమ్ లో వేడి, చన్నీళ్ళు ఎలా వస్తాయెా చూపించాడు. తర్వాత ఇంటికి వచ్చాం. రాగానే వదిన అలసిపోయి ఉంటారు ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోమని, బాత్ టబ్ అవి చూపించి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రూమ్ చూపించి నిద్ర పొమ్మంది. వాళ్ళిద్దరు బాగా బిజీ డాక్టర్స్. పిల్లలు చదువు కుంటున్నారు అప్పుడు.

     మనం కాదన్నా మనల్ని కాదనలేని వారే పుట్టింటివారు. పది రోజుల పసిగుడ్డుతో బయటికి పంపినవారికి, అవసరానికి అన్నీ తామై ఆదుకున్న పుట్టింటి వారికి తేడా ఇదే. పెళ్లి చేసి లెక్క చెప్పినదొకరైతే, నేను నిలదొక్కుకోవడానికి ఖర్చు ఎంతైందో లెక్క చూడనివారొకరు. మా ఖర్చులు భరించడమే కాకుండా, నా బిడ్డను, మా వారిని జాగ్రత్తగా చూసుకున్నది ఎవరనేది అందరికి తెలిసినదే. నా బిడ్డలు ఈరోజుకి కూడా వారి చేతుల మీదుగా ఓ జుబ్బా కూడా ఎరుగరు. అమ్మ తన గొలుసు చెడగొట్టి మౌర్యకు వత్తులు, గొలుసులు చేయించింది. అది తేడా అమ్మకు, అవతలి వారికి. 

    మనం కష్టపెట్టినా, మన కోపాన్ని కూడా ప్రేమగా భరించేవారే మనవారు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..... 


 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Law of Nature చెప్పారు...

చాలా బావుంది. చాన్నాల్ల తర్వాత పాత రోజులు గుర్తొస్తున్నాయి

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner