29, జనవరి 2022, శనివారం

త్రిపదలు..!!

​1.  అప్పుడప్పుడూ కొన్ని జ్ఞాపకాలు 

పలకరించి వెళుతుంటాయలా

కాలాన్ని మన గుప్పెట్లో దాచేసి..!!

2.  మనసందుకే

ముడుచుకు పోయింది

మాటల గారడిని మరువలేక..!!

3.  మౌనం గుట్టు విప్పేది 

మనసు తెలుసుకుంటావని

మాటలు వింటావని కాదు..!!

4.  నాన్నింతే

బాధ్యతల నడుమ

బంధాలను దాచేస్తూ..!!

5.  మనసెందుకో

మారాడకుంది

మన అన్నది కాదని తెలిసాక..!!

16, జనవరి 2022, ఆదివారం

జీవన ‘మంజూ’ష ఫిబ్రవరి22

నేస్తం, 
        ప్రశ్నలడిగే ప్రతోడు సమాజోద్ధారకుడూ కాదు. అలాగని ప్రశ్నించని వాళ్ళందరూ బాధ్యత లేనివారు కాదు. కులం మన పుట్టుకతో వస్తుంది. దానిని మార్చలేం. ఇక మతం అంటారా అది మనిష్టం. మనమెంత మేధావులమైనా మరో కులం మీద పడి ఏడవడం మన దౌర్భాగ్యం. ఏ మతం మరో మతాన్ని అవహేళన చేయమని చెప్పలేదు. మనసులో మీకున్న అసంతృప్తిని ఇలా పరాయి కులమతాల మీద విషం చిమ్మి, అవహేళన చేసి మీ దుగ్ధ తీర్చుకోవడం సరే, దానికి మహా మహా మేతావులందరూ ఆహా ఓహో అనడం కొసమెరుపు. విశృంఖలత్వాన్ని స్వేచ్ఛగా పరిగణనలోనికి తీసుకోవడమన్నట్టుగా అన్నమాట. 
              పరమత సంప్రదాయాలను కించపరచడం, పురాణ ఇతిహాసాలను గేలి చేయడం, అలా చేసిన మేధావులను సమర్థించడం కొందరు చేసే పని. జన్మతః వచ్చిన కులాన్ని కాదనుకోలేం కదా ఎవరమైనా. ఎంత మనం మన కులాన్ని దాచినా నిజం దాగదు. రాత్రికి రాత్రి సెలబ్రిటి అయిపోదామని అడ్డదారుల్లో పోతే నడవడానికి కాళ్ళు లేకుండా పోతాయి. తప్పుడు కూతలు కూస్తే పర్యవసానం కఠినంగానే ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మన కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే. 
           కొందరి చావుని హేళన చేసారని వాపోతున్న జాలిగుండెలన్నీ, తన స్వార్థం కోసం నోటిని అదుపు చేసుకోని తనాన్ని ప్రశ్నించలేదెందుకో? నిజాయితీ, నిక్కచ్చితనం అన్నింట్లో ఉండాలి కదా. పథకాలు, పదవులు, పురస్కారాల కోసం, రిజర్వేషన్లు అనుభవించడానికి కులాలను అడ్డం పెట్టుకునే తెలివిగల వారికి ఈ విషయం గుర్తులేదా? సంస్కారం మనకుందో లేదో మన తీరుతెన్నులు చెప్పకనే చెప్తాయి. గొప్పదనం మనం ఆపాదించుకుంటేనో, మన కులం, మతం చూసో, లేక మన వెనుక డబ్బు, హోదా ఉంటేనో రాదు. స్వతహాగా రావాలి. అప్పుడే వాటికి విలువ.
      బాధ ఎవరిదైనా ఒకటేనని ప్రతి మనిషి గుర్తెరగాలి. వెక్కిరింతలు మనకే కాదు ఎదుటివారికి కూడా బాగా వచ్చని తెలుసుకుని మసలాలి. అక్షరాలను, మాటలను వాడే నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. మన వ్యక్తిత్వం, మనకు మన తల్లిదండ్రులు, గురువులు నేర్పిన సంస్కారం మన నడవడిలో ఉండాలి. సూక్తిసుధలు వల్లించే నీతిమంతులందరూ ఈ విషయాన్ని కాస్త గుర్తెట్టుకోండి. మనిషన్నాక చావుపుట్టుకలు సహజం. రేపటి మన చావుని చూసి నలుగురు నవ్వుకోకుండా బతకగలిగితే చాలు. మనిషిగా మనం విజయం సాధించినట్లే...!! 


10, జనవరి 2022, సోమవారం

నవభూమిలో నా గురించి..

​షైక్ అబ్దుల్ అజీద్ గారికి , నవభూమి పత్రిక యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు

6, జనవరి 2022, గురువారం

రెక్కలు

1.  అక్కరకు రాని

బంధాలు

మక్కువ తీరని

పాశాలు


బుుణానుబంధాలు

గతజన్మ కర్మ ఫలితాలు..!!


2.   నేతల
పాలన
చేనేతల
జీవితాలు

సృష్టికర్త
చిద్విలాసాలు..!!

3.   అర్థమేదైనా
పరమార్థమిదే
బంధమేదైనా
అనుబంధం ధనాత్మకమే

నేటి నిజం
రేపటి చరిత్ర ఇదే..!!

4.  ప్రారబ్ధమూ
మన వెంటే
అదృష్ట దురదృష్టాలతో
సంబంధం లేకుండా

కాలం వదిలేసే భారమంతా
మనసుదేనంటూ..!!

5.   చందమామయ్యతో
చల్లదనం
సూరయ్యతో
చలిమంట వేసుకోవడం

అనుభూతుల ఆస్వాదనే
అనంత విశ్వంలో ఆనందం..!!

6.  రెండిళ్ళ మధ్య
దూరం
ఇరు మనసుల నడుమన
అంతరం

భవిష్యత్ తరాలకు మిగిలే
వారసత్వ సంపద..!!

7.   నిజమైన బంధానికి
బాధ్యతెక్కువ
చేతగానితనానికి
అసహనమెక్కువ

ముడేదైనా నిలబడటానికి
నిబద్ధత అవసరం..!!

8.  రెప్పల మాటున
కడలి
మబ్బుల చాటున
ఆకాశం

మనిషిలో కనబడని
మనసు..!!

9.   మనసు భారాన్ని
బట్వాడా చేసింది
మోయలేని కనులు
కన్నీటిని ఒంపేస్తున్నాయి

గాయమైనా జ్ఞాపకమైనా
ఓపలేని బరువే..!!

10.   వెలుతురింటి
వాకిలేదో తెరుచుకుంది
రాతిరి కలలకు
వేకువ మెరుపులద్దుతూ

ఆశ జీవితాలను
బతికిస్తుంది బలి తీసుకుంటుంది..!!

11.  నిరంతర గమనం
జీవితం
నిత్య పోరాటం
బతుకుబాటలో

అలుపెరగని అడుగుల పయనం 
ఆశలనే ఒయాసిస్సుల వైపు..!! 

12.   విన్నపాలు
మనసుకి
వీడుకోలు
గతానికి

 ఓటమి
విజయానికి తొలిమెట్టు..!!

13.   (అ)సహనం
ఆంక్షలపై
గమనం
గెలుపుకై

అవసరార్థం
అనుభవపాఠాలు..!!

14.  బంధం 
మిగలడానికి
మనసు 
విరిచేయడానికి

ఒక్క
మాట చాలు..!!

15.   అడగడం
సుళువే
చెప్పడమే
కష్టం

అహం
తృప్తి పడదు..!!

16.   నదిలా సాగే
ఓర్పు
సంద్రమంటి
మనసు

వెరసి ధరిత్రి
మగువ..!!

17.   మనిషి
బలహీనత
మనసు
బంధం

కాలానుగుణంగా మార్పు
అవసరమే..!!

18.   మనిషో
యంత్రం
మనసో
దర్పణం

యాంత్రికతే
జీవితమిప్పుడు..!!

19.   కాలానికి
పని లేదు
మనిషి
అనుభవాలతో

కర్మసాక్షి
నిమిత్తమాత్రుడు..!!

20.   రాసి రాసి
పడేసిన కాగితాలు
నిండిన
చెత్తబుట్ట

నిజమైన
ప్రేమ..!!

21.  మార్పు 
అవసరమే
మాటకో
మనసుకో

కాలానుగుణంగా
మనిషి..!!

22.   తట్టుకోవడం
చాతకాదు
తప్పుల తక్కెడ
బరువు

మూల్యాంకనం
తెలియదు..!!

23.   రెక్కలు

మెులిచాయి

ఎగరడమే

తరువాయి


గాలివాటం

తెలియాలి..!!


24.   యుద్ధం

తప్పదు

సమస్యతోనైనా

సామరస్యంతోనైనా


కాలానికి

అనుగుణంగా..!!


25.   చతురత

అవసరం

జీవితంలో

నెగ్గాలంటే


ఓటమి పాఠం

మెుదటి మెట్టు..!!


26.   దాయాదుల పోరు

ధర్మ యుద్ధం ఆనాడు

అధికారమే

అహంకారమీనాడు


రక్త చరితలే

చరిత్ర పుటలన్నీ..!!



27.   మనిషైనా

దైవమైనా

తప్పదు

కర్మ ఫలితం


కాలానికి

కాదెవరూ అతీతం..!!


28.  దుస్తులు మార్చినంత

సుళువు కాదు

చేసిన బాసలు

నిలుపుకోవడం


హావభావాలతోనే

రాజకీయ చతురతంతా..!! 


29.   ఓటమి

అలవాటే

బంధాల

చదరంగంలో


అమ్మ 

మనసంతే..!!


30.   వెదుకులాటలో

సంతోషం

మౌనంతో

మాటలు


దూరాన్ని 

తరిమే యత్నం..!!


నా గురించి వివిధలో

 మాది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. పుట్టింది పెరిగింది అంతా పల్లెటూరులోనే. కాకపోతే నాన్న ఆ రోజుల్లోనే B Sc చదువుకుని కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా చేసి, ఉద్యోగం వదిలేసి వ్యవసాయం, వ్యాపారాలు చేసారు. చిన్నతనం నుండి నాన్నకు నాటకాలు రాసిన, వేసిన అనుభవం ఉంది. ఆ పుస్తకం ఈ పుస్తకం అని లేకుండా అన్ని పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు చేసారు. బహుశా ఆ అలవాటు నా ఈ రాతలకు మూలకారణం అయి వుంటుంది. నేను చదువుకున్న అవనిగడ్డ శిశు విద్యామందిరంలో మాకు చదువుతో పాటుగా ఆటపాటలు, నీతి కథలు, పెద్ద బాలశిక్ష, సుమతి, వేమన, కృష్ణ శతకాలు, భగవద్గీత, గజేంద్ర మోక్షం, హనుమాన్ చాలీసా, పంచతంత్రం వంటి పుస్తకాలన్ని వల్లె వేయించేవారు. అప్పటికే సహజంగానే పుస్తకాలు చదివే అలవాటున్న నాకు, పుస్తకాలతో, తెలుగుభాషతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఆ రోజుల్లోనే గ్రంథాలయాల్లో పుస్తకాలతో పాటుగా మరిన్ని పుస్తకాలు కొని చదవడం వ్యాపకంగా మారిపోయింది. 2వ తరగతి నుండి ఆంధ్రజోతిలో రాధాకృష్ణ సీరియల్ చదవడంతో మెుదలైన నా పుస్తక ప్రయాణం ఈనాటికి నిరంతరాయంగా కొనసాగుతోంది.

      అనుకోనివి జరగడమే జీవితంలో వింత అని అన్నట్టుగా పుస్తకాలు చదవడం మాత్రమే తెలిసిన నాకు, జరిగిన సంఘటనలకు మనసు బాధ పడినప్పుడు ఆ సంఘటనను 6వ తరగతిలో కథగా రాసిన గుర్తు. తర్వాత స్నేహితులకు ఉత్తరాలు రాయడంతో మెుదలైన నా రాతలు ఈ రోజు నన్నిలా మీ అందరి ముందు నిలబెడతాయని కలలో కూడా ఊహించలేదు. ఇంటరు వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంజనీరింగ్ కర్నాటకలోని బళ్ళారి, ఆ తర్వాత మద్రాసులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, అమెరికా ఉద్యోగ ప్రయాణం, మళ్లీ స్వదేశంలో ఉద్యోగం. ఆ సమయంలోనే ఎవరు లేని పిల్లల కోసం ఏదైనా చేయాలన్న ప్రయత్నంలో ట్రస్ట్ పెట్టడం, దాని కోసం ఫ్రీ వెబ్ సైట్లు వెదుకుతూ, బ్లాగ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటికే టెంత్, ఇంజనీరింగ్ లలో రాసిన కొన్ని కవితలు (కవితల్ని నేననుకున్నా లెండి) మాత్రమే నా రాతలు.

      2009లో ఏదో రాద్దామని కబుర్లు కాకరకాయలు బ్లాగ్ మెుదలుబెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 2000కు పైచిలుకే పోస్టులు రాశాను. కవితలు, ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు, రెక్కలు, వ్యాసాలు ఇలా కొన్ని సాహితీ ప్రక్రియల్లో నా రాతలు సాగాయి. మనసుకి అనిపించింది రాయడం మాత్రమే తెలుసు. ఎవరో మెచ్చుకోవాలనో, అవార్డులు, రివార్డులు రావాలనో రాయలేదు. రాయను కూడా. మన రాతలు పదిమందికి కాకపోయినా కనీసం ఒక్కరికయినా మంచి చేయగలిగితో చాలన్న ఆశ మాత్రమే నాది. నా రాతలు పుస్తకాలుగా చూడాలన్న కోరిక అస్సలు లేదు. అనుకోకుండానే ముద్రిత పుస్తకాలుగా నా రాతలు వెలువడ్డాయి. ఎందరో పెద్దలు, పిన్నలు నా రాతల మూలంగా పరిచయమై ఆత్మీయులుగా మారారు. అవార్డులు, రివార్డులు కాసిని వచ్చాయి కాని వాటికన్నా నాకు ఘనమైన పురస్కారం, సత్కారం ఎంతోమంది నుండి “ మా సమస్యలకు సమాధానం మీ రాతల్లో దొరికింది, మీ రాతలు చదివి నేను చాలా మారాను, నా మనసులోనిది మీరు రాశారు..” ఇలాంటి స్పందనలు చాలా సంతోషాన్నిచ్చాయి. 

         ఏ కళైనా భగవదనుగ్రమే అని నమ్ముతాను. రాసేది రాయించేది ఆ పై వాడే. నేను నిమిత్తమాత్రురాలిని. అక్షరాన్ని మనం చెడుపై ఆయుధంగా వాడవచ్చు. అమ్మ నేర్పిన అక్షరాన్ని అమ్మంత విలువగా చూసుకోవాలి. కులమతాలను హేళన చేసే విధంగా మన రాతలు ఉండకూడదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వాలి కాని అవహేళన చేయకూడదు. మన అమ్మ నేర్పించిన సంస్కారం మన రాతల్లో ప్రతిబింబించాలి. మనం ఆచరించినదే మన రాతల్లో కనబడాలి. అప్పుడే మన రాతలకు అర్థము పరమార్థమూ. నా ఈ రాతలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.


నా ముద్రిత రచనలు

అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు (కవిత్వం)

సడిచేయని (అ)ముద్రితాక్షరాలు ( మంజు మనసు ముచ్చట్లు)

చెదరని శి(థి)లాక్షరాలు ( కవిత్వం)

గుప్పెడు గుండె సవ్వడులు (జంట కవిత్వం) (మంజు వాణి)

5.   అంతర్లోచనాలు ( మంజు మనసు ముచ్చట్లు)

6.   ఏ’కాంతా’క్షరాలు ( ఏక్ తారలు)

7.   అక్షర స(వి)న్యాసం (కవిత్వం)


రాబోతున్న రచనలు


8.   కాలం వెంబడి కలం..అక్షరాలతో అనుబంధం (స్వగతం)

9.   అక్షర విహంగాలు (రెక్కలు)

10.  రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు (రెక్కలు) ( మంజు వాణి విజయ)

మరో రెండు పుస్తకాలు కూడా…

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner