31, మార్చి 2022, గురువారం

​ఆ నలుగురితో..!!

మౌనం 

పయనం

మనసుతో


మాటల

యుద్ధం

బంధాలతో


మనిషి

గమనం

కాలంతో


విధి

రాతలు

కలంతో


అక్షరాల

సహవాసం

భావాలతో


ఏడుపు

ముగింపు

మరణంతో


కడలి

కల’వరం

తీరంతో


విశ్వ

రహస్యం

శూన్యంతో


ఏదారెటైనా

చివరి నడక కర్మభూమికి

ఆ నలుగురితో..!!

29, మార్చి 2022, మంగళవారం

మనస్తత్వాలు..!!

  నేస్తం,

    కొందరి మనస్తత్వాలు ఎలా వుంటాయంటే ఎంత తిన్నా మేం ఏమి తినలేదు. మాదే పెట్టాము. మమ్మల్ని, మా వాళ్ళని ముఖ్యంగా మా అమ్మని ఒక్కదాన్ని చేసి అందరు బాధ పెట్టారు. మా అమ్మానాన్న మాకు ఏది చెప్పలేదు. చూసినవాళ్ళు చెప్పారని చెప్తారు. అది సరే మరి పెద్దావిడ సంతకం పెట్టమంటేనే కదా మిగతావాళ్ళు సంతకం పెట్టారని ఎలా మర్చిపోయారు. పెద్దావిడకి విభజించి పాలించడం రాదు. అలా వస్తే అల్లుడయిన తన తమ్ముడికే రాయించేది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా! ఇప్పటికి పెద్దావిడ అందరు కావాలనే అనుకుంటుంది కాని వద్దనుకోదు.

     వారిది మధ్య చోటని, తమ్ముడిది అమ్మితే తప్ప తనది కొనరని, తనదేమో ఇంటితో బేరం ఇచ్చి, తమ్ముడిది ఉత్త చోటు బేరం ఇచ్చి, అదీ నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నా చోటులో ఇస్తానని మాట ఇచ్చి, ఇంటి కలప అంతా తీసుకోవడం, కనీసం వాటా వచ్చిన సామాను కూడా ఇవ్వడం తెలియదని సరిపెట్టుకోవడం మంచిదే. ఆ లెక్కల ఈ లెక్కల చెప్పి మరికొంత చోటు తీసుకోవడమూ సబబే మరి.  తర్వాత చోటు అడిగితే ఇవ్వడానికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని అన్నా పర్లేదు. 

    తమ్ముడు పొలం కొనుక్కుంటే, తన పొలమూ అమ్ముతానంటే ఇంట్లో అందరికి చెప్పావా అని అడిగితే చెప్పానని చెప్పి, ఇప్పుడు కాస్త, పంట వచ్చాకా ఆ పక్కది ఇస్తానని చెప్పి, అంతకు ముందు వారం క్రిందట తమ్ముడు బయానా ఇచ్చిన పొలం కన్నా రేటు ఎక్కువ చెప్పి, ఎవరికి చెప్పకు రేటు ఇంకా ఆ పొలం రిజిస్ట్రేషన్ అవలేదు అన్నా అందరికి చెప్పి ఎక్కువ రేటుకి అమ్మి కనీసం ఇస్తానన్నది అవడం పక్కనబెట్టి , కొన్నదానికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పటి వరకు. అది దేనికి పనికి రాదు. అసలు కొనడం తమ్ముడి తప్పు. ఎన్ని జరిగినా ఆ తమ్ముడికి ఇప్పటికి బుద్ధి రాదు. ఆ కాస్త కొన్నందుకు చాలా గొడవలు చేసారప్పుడు.         

        మన పిల్లలు, మనం బావుండాలి నిజమే. కాని బయటివారు సరే, తోడబుట్టినవారిని ఇలా చేయడం సరైన పనేనా! పక్క పొలంలో పంట మన పొలంలో వేసుకుంటే అది మన పొలంలో పండినట్టు కాదు. ఆడపిల్లకు పెట్టకపోయినా పర్లేదు. ఆడపిల్ల మీ చెడు కోరదు కాబట్టి మీరెన్ని చేసినా తోబుట్టువులు బావుండాలనే నూటికి తొంభైమంది ఆడపిల్లలు కోరుకుంటారు. ఆడపిల్ల సొమ్ము తినాలో, కూడదో అది మీకే వదిలేస్తున్నాం. 

        ఎవరి అమ్మాబాబు వాళ్ళకు మంచివారే. అలా అనుకోవడమూ మంచిదే. మనం రేపు పోతూ ఏమి పట్టుకుపోము. మాటా మంచే మిగిలేది. ఓ మాట ఎవరినైనా అనేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి. మనకు తెలిసిందే నిజం కాదు. 

     కాలం వెంబడి కలంలో నేను రాసింది ఒక వంతే. ఇలాంటి చాలా నిజాలు నాకు బాగా గుర్తున్నాయి. ఏదీ మర్చిపోలేదు. అన్ని వివరాలు, అందరి సంగతులు తెలుసు కాని రక్త సంబంధాలను చులకన చేయడం ఇష్టం లేదు. రేపు పోయినప్పుడు నాకు సొమ్ము లేదని కట్టె పుల్లలు వేస్తారు. మహా అయితే ఈ కోటీశ్వరులకు నాలుగు గంధం ముక్కలేస్తారు. అంతే కదా తేడా…😊 అది సంగతి.

21, మార్చి 2022, సోమవారం

ఆత్మీయబంధం..!!


కొన్ని పరిచయాలింతే_చిత్రంగా చేరికవుతూ..!!


ఈ మాట ఎందుకు చెప్పానో ఇప్పుడు చెప్తా.చదివి మీరూ నిజమో కాదో చెప్పండి. 


నేస్తాలు, 


          నాకున్న పుస్తకాలు చదివే అలవాటే, ఈరోజు ఇలా నా రాతలకు , తద్వారా మీ అందరికి నేను పరిచయమవ్వడానికి కారణం అని మీ అందరికి తెలుసు. నా రాతలు అనుకోకుండా మెుదలైనట్లే నా పుస్తకాలు కూడా అచ్చు వేయడం జరిగింది. ఇంటికి వచ్చిన ఆత్మీయులకు ఆ పుస్తకాలను ఇవ్వడమూ జరిగింది. చాలామంది అడిగితే కొరియర్, పోస్ట్ ల ద్వారా పంపడం జరిగింది గత కొన్నేళ్ళుగా. మనకు నచ్చనప్పుడు బలవంతంగా ఏదీ చేయకూడదు. అలాగే నా పుస్తకాలు తీసుకున్న కొందరు వాటిని పాత పుస్తకాల షాపులకు అమ్మేసారు. ఆ పాత పుస్తకాల షాపుల నుండి నా పుస్తకాలు మరికొందరి చేతులకు చేరి వారిని నా ఆత్మీయులుగా మార్చాయి. చెడు జరిగినా అది మన మంచికే అన్నట్టుగా. 

             అలా నా పుస్తకం చేరి బిడ్డగా మారిన ఓ ఆత్మీయబంధం నిన్న ఇంటికి వచ్చి తన ప్రేమను ఇలా పంచారు. ఈ అభిమానానికి ఆత్మీయతాశీస్సులు అందించడం తప్ప మరేం చేయలేను.

సాగర యాత్ర..!!

అతడో నిశ్శబ్ద యాత్రికుడు

భూమంతా నిదురోయే వేళ

మెలకువ ప్రాణి

మనసు గోలను

సద్దుమణిగించ లేక

(కా)లానికి 

అప్పగించిన పంపకాలను

అక్షరాల వరుసలో పేర్చే

నిరంతర అక్షరకుక్షి


పాత తరానికి

కొత్త ఆలోచనలద్ది

సాహితీ సమరాంగణంలో

సరికొత్త ఒరవడికి

ఊపిరి పోసిన

ఉద్యమకారుడితడు


పదాలకు అర్థాలను 

వెదుక్కుంటూ మనముంటే

వాక్యాలను 

పుంఖానుపుంఖాలుగా

పేర్చుకుపోయే 

చేయితిరిగిన రాతగాడితడు


రాతలకు 

విభిన్న తలరాతలను రాసే

అక్షరబ్రహ్మ

సిద్ధాంతాలకే సుద్దులు నేర్పే

సుశిక్షణ

అక్షర సైనికుడు


చీకటి బతుకులకు

వేకువపొద్దు చూపే

అర్ధరాత్రి సూర్యోదయానికి

వెలుగు గీతం పాడే

రాతిరి చుక్కల గాయకుడితడు


ఏడు దశాబ్దాల జీవనంలో

ఆటుపోట్లకు ఎదురు నిలిచి

మనసు లోతులను మార్మికంగా

ప్రపంచానికి పరిచయం చేసిన

అలుపెరగని సాగరుడు..!!  

15, మార్చి 2022, మంగళవారం

అనుకోని అవకాశం..!!



     చిన్నప్పుడు అవనిగడ్డ శిశువిద్యామందిరంలో శ్రీలత టీచర్ గారు నేర్పిన పాటలతో పాటుగా, రేడియోలో పాటలు వినడమంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం విజయనగరం వెళ్ళిన తర్వాత విశాఖపట్టణం రేడియోలో బుధవారం వచ్చే లలిత సంగీతం,  ఆదివారం చిత్తరంజన్ గారు నేర్పే సామూహిక గేయాలు నేర్చుకోవడం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు టివిలో, యుట్యూబులు వచ్చాక రేడియో దాదాపు కను(విన)మరుగైపోయింది. 

     అనుకోని అవకాశం కలిమిశ్రీ గారి ద్వారా విజయవాడ రేడియో స్టేషన్ లో కాలుమోపే అవకాశంతో పాటుగా ఓ పది నిమిషాలు కవితలు చదివే అవకాశం కూడా దొరికింది. కృష్ణకుమారి గారి ఓపికకు మనఃపూర్వక ధన్యవాదాలు. రాంగోపాల్ గారికి నా కవిత నచ్చకపోయినా చదివే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు. 

     మెుత్తానికి నేనూ రేడియోలో చదివేశాను…ఎవరెలా అనుకున్నా నా సంతోషం నాదే…నా ఫోటోలు బాగా తీసిన కలిమిశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner