29, మార్చి 2022, మంగళవారం

మనస్తత్వాలు..!!

  నేస్తం,

    కొందరి మనస్తత్వాలు ఎలా వుంటాయంటే ఎంత తిన్నా మేం ఏమి తినలేదు. మాదే పెట్టాము. మమ్మల్ని, మా వాళ్ళని ముఖ్యంగా మా అమ్మని ఒక్కదాన్ని చేసి అందరు బాధ పెట్టారు. మా అమ్మానాన్న మాకు ఏది చెప్పలేదు. చూసినవాళ్ళు చెప్పారని చెప్తారు. అది సరే మరి పెద్దావిడ సంతకం పెట్టమంటేనే కదా మిగతావాళ్ళు సంతకం పెట్టారని ఎలా మర్చిపోయారు. పెద్దావిడకి విభజించి పాలించడం రాదు. అలా వస్తే అల్లుడయిన తన తమ్ముడికే రాయించేది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా! ఇప్పటికి పెద్దావిడ అందరు కావాలనే అనుకుంటుంది కాని వద్దనుకోదు.

     వారిది మధ్య చోటని, తమ్ముడిది అమ్మితే తప్ప తనది కొనరని, తనదేమో ఇంటితో బేరం ఇచ్చి, తమ్ముడిది ఉత్త చోటు బేరం ఇచ్చి, అదీ నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు నా చోటులో ఇస్తానని మాట ఇచ్చి, ఇంటి కలప అంతా తీసుకోవడం, కనీసం వాటా వచ్చిన సామాను కూడా ఇవ్వడం తెలియదని సరిపెట్టుకోవడం మంచిదే. ఆ లెక్కల ఈ లెక్కల చెప్పి మరికొంత చోటు తీసుకోవడమూ సబబే మరి.  తర్వాత చోటు అడిగితే ఇవ్వడానికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని అన్నా పర్లేదు. 

    తమ్ముడు పొలం కొనుక్కుంటే, తన పొలమూ అమ్ముతానంటే ఇంట్లో అందరికి చెప్పావా అని అడిగితే చెప్పానని చెప్పి, ఇప్పుడు కాస్త, పంట వచ్చాకా ఆ పక్కది ఇస్తానని చెప్పి, అంతకు ముందు వారం క్రిందట తమ్ముడు బయానా ఇచ్చిన పొలం కన్నా రేటు ఎక్కువ చెప్పి, ఎవరికి చెప్పకు రేటు ఇంకా ఆ పొలం రిజిస్ట్రేషన్ అవలేదు అన్నా అందరికి చెప్పి ఎక్కువ రేటుకి అమ్మి కనీసం ఇస్తానన్నది అవడం పక్కనబెట్టి , కొన్నదానికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పటి వరకు. అది దేనికి పనికి రాదు. అసలు కొనడం తమ్ముడి తప్పు. ఎన్ని జరిగినా ఆ తమ్ముడికి ఇప్పటికి బుద్ధి రాదు. ఆ కాస్త కొన్నందుకు చాలా గొడవలు చేసారప్పుడు.         

        మన పిల్లలు, మనం బావుండాలి నిజమే. కాని బయటివారు సరే, తోడబుట్టినవారిని ఇలా చేయడం సరైన పనేనా! పక్క పొలంలో పంట మన పొలంలో వేసుకుంటే అది మన పొలంలో పండినట్టు కాదు. ఆడపిల్లకు పెట్టకపోయినా పర్లేదు. ఆడపిల్ల మీ చెడు కోరదు కాబట్టి మీరెన్ని చేసినా తోబుట్టువులు బావుండాలనే నూటికి తొంభైమంది ఆడపిల్లలు కోరుకుంటారు. ఆడపిల్ల సొమ్ము తినాలో, కూడదో అది మీకే వదిలేస్తున్నాం. 

        ఎవరి అమ్మాబాబు వాళ్ళకు మంచివారే. అలా అనుకోవడమూ మంచిదే. మనం రేపు పోతూ ఏమి పట్టుకుపోము. మాటా మంచే మిగిలేది. ఓ మాట ఎవరినైనా అనేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి. మనకు తెలిసిందే నిజం కాదు. 

     కాలం వెంబడి కలంలో నేను రాసింది ఒక వంతే. ఇలాంటి చాలా నిజాలు నాకు బాగా గుర్తున్నాయి. ఏదీ మర్చిపోలేదు. అన్ని వివరాలు, అందరి సంగతులు తెలుసు కాని రక్త సంబంధాలను చులకన చేయడం ఇష్టం లేదు. రేపు పోయినప్పుడు నాకు సొమ్ము లేదని కట్టె పుల్లలు వేస్తారు. మహా అయితే ఈ కోటీశ్వరులకు నాలుగు గంధం ముక్కలేస్తారు. అంతే కదా తేడా…😊 అది సంగతి.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner