అతడో నిశ్శబ్ద యాత్రికుడు
భూమంతా నిదురోయే వేళ
ఓ మెలకువ ప్రాణి
మనసు గోలను
సద్దుమణిగించ లేక
క(కా)లానికి
అప్పగించిన పంపకాలను
అక్షరాల వరుసలో పేర్చే
నిరంతర అక్షరకుక్షి
పాత తరానికి
కొత్త ఆలోచనలద్ది
సాహితీ సమరాంగణంలో
సరికొత్త ఒరవడికి
ఊపిరి పోసిన
ఉద్యమకారుడితడు
పదాలకు అర్థాలను
వెదుక్కుంటూ మనముంటే
వాక్యాలను
పుంఖానుపుంఖాలుగా
పేర్చుకుపోయే
చేయితిరిగిన రాతగాడితడు
రాతలకు
విభిన్న తలరాతలను రాసే
అక్షరబ్రహ్మ
సిద్ధాంతాలకే సుద్దులు నేర్పే
సుశిక్షణ
అక్షర సైనికుడు
చీకటి బతుకులకు
వేకువపొద్దు చూపే
అర్ధరాత్రి సూర్యోదయానికి
వెలుగు గీతం పాడే
రాతిరి చుక్కల గాయకుడితడు
ఏడు దశాబ్దాల జీవనంలో
ఆటుపోట్లకు ఎదురు నిలిచి
మనసు లోతులను మార్మికంగా
ప్రపంచానికి పరిచయం చేసిన
అలుపెరగని సాగరుడు..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి